విపిన్ సాహు పారాగ్లైడింగ్: ‘రూ.500 ఎక్కువ ఇస్తా, కిందకు దించు బాబోయ్’

ఫొటో సోర్స్, VIRAL GRAB
'ఆ... నేను ఆకాశంలో ఎత్తులో ఉన్నాను. చాలా ఎత్తులో ఉన్నా. అంతా మంచు కమ్మేసింది. నా చుట్టూ మంచు మాత్రమే ఉంది. ఆహ్.. చాలా ఎత్తున ఉన్నా.'
ఆకాశంలో మంచు ఉంటుందా, మేఘాలు ఉంటాయి. కానీ, ఒక పారాగ్లైడర్ దానిని మంచే అనుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పారాగ్లైడింగ్ వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి పేరు విపిన్ సాహు.
పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు అరుస్తూ, ల్యాండ్ చేయమని వేడుకుంటున్న విపిన్ వీడియోను మీరు ఇప్పటికే చూసే ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ బాందాలో పని చేసే విపిన్ సోషల్ మీడియాలో ఎలా ఫేమస్ అయ్యాడు.
అది తెలుసుకోడానికి మేం విపిన్‌తో ఫోన్లో మాట్లాడాం. బీబీసీతో మాట్లాడిన అతడు "నేను ఇంతకు ముందెప్పుడూ పారాగ్లైడింగ్ చేయలేదు. నాకు ఎత్తులంటే భయం. నా స్నేహితులు.. చూడు ఆ అమ్మాయి ఇప్పుడే చేసి వెళ్లింది. నువ్వు చేయనంటున్నావ్ అని ఎక్కించేశారు. దాంతో నేను కూడా వెళ్లాను" అని చెప్పాడు.

ఫొటో సోర్స్, VIRAL GRAB
స్నేహితులే ఎక్కించారు
విపిన్ ఉన్న ఈ వీడియోను హిమాచల్ ప్రదేశ్ మనాలీలోని దోభీలో తీశారు. విపిన్ తన ఐదుగురు స్నేహితులతో జులైలో మనాలీ వెళ్లాడు. అప్పుడే ఈ వీడియో తీశాడు.
ఇది జరిగిన రోజు విపిన్ కంటే ముందు తన ముగ్గురు స్నేహితులు పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్లారు.
తనవంతు వచ్చాక పారాగ్లైడింగ్ చేసిన విపిన్ దాని గురించి చెబుతూ, "నేను కూడా ఉత్సాహంగా పైకి వెళ్లాను. తర్వాత పైకి చేరేసరికి అక్కడంతా మంచుంది. తర్వాత జరిగిందంతా ఆరు నిమిషాల వీడియోగా అందరి ముందుకూ వచ్చింది" అన్నాడు.
వీడియోలో విపిన్‌తో ఒక ట్రైనర్ కూడా కనిపిస్తుంటాడు.
"కాళ్లు పైకి పెట్టు, కాళ్లు పైకి పెట్టు.. లేదంటే కాళ్లు విరిగిపోతాయి. ల్యాండ్ అవుదాం భయ్యా. కాళ్లు పైకి పెట్టుకో... నీకూ విరుగుతాయ్, నాకూ విరుగుతాయ్. నువ్వు అసలు మనిషివేనా " అని ఆ ట్రైనర్ అరుస్తుంటాడు.
ఆ ట్రైనర్ పేరు జగ్గా. అతడిది పుణె. జగ్గా 20 ఏళ్ల నుంచీ పారాగ్లైడింగ్ చేయిస్తున్నాడు.
విపిన్, జగ్గా మధ్య గాల్లో జరిగిన గొడవంతా మీరు చూసే ఉంటారు. కానీ, ల్యాండ్ అయిన తర్వాత ఏమైంది?
దానికి విపిన్ నవ్వుతూ, "అయ్యో అది అడక్కండి. నేను కూచున్న సీటు అసలు కంఫర్టబుల్‌గా లేదు. దాంతో సరిగా కూచోలేకపోయా. కాళ్లు జారిపోతున్నాయి. ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో జగ్గాకు చెమటలు పడుతున్నాయి. నా 20 ఏళ్ల చరిత్రలో మొదటిసారి నీలాంటి వాడిని చూస్తున్నానని ఆయన తిట్టారు కూడా. నేను కూడా భయపడి చస్తుంటే, కాళ్లు పైకి లేపమని నీ గొడవేంటని అడిగాను" అన్నాడు.

ఫొటో సోర్స్, VIRAL GRAB
వందో, రెండు వందలో ఇస్తానన్న విపిన్ సంపాదన ఎంత
భయ్యా వందో, రెండు వందలో ఇస్తా... నన్ను ల్యాండ్ చెయ్, భయ్యా... 500 ఎక్కువ తీసుకో ప్లీజ్ ల్యాండ్ చేయవా...
పారాగ్లైడర్ తనను త్వరగా ల్యాండ్ చేసేందుకు డబ్బు కూడా ఆఫర్ చేసిన విపిన్ ఎంత సంపాదిస్తుంటాడు.
మొదట మాట్లాడని విపిన్ కాసేపటి తర్వాత "నేను గాల్లో ఆఫర్ చేసిన డబ్బును ఆయన ఫీజును బట్టి పెంచాను. కానీ, ఆయన మరీ నిజాయితీపరుడుగా ఉన్నాడు. నా సంపాదన బాగానే ఉంటుంది. సరిగ్గా చెప్పలేనుగానీ, నెలలో ఒక్కోసారి లక్ష దాటితే, ఒక్కోసారి 60-70 వేలు వస్తాయి" అన్నాడు.
100 నుంచి 500 వరకూ ఆఫర్ చేసిన విపిన్ పనిపై కూడా ఆర్థికమాంద్యం ప్రభావం పడింది. తన సంపాదన గురించి మాట్లాడిన అతడు "ఈ ఆర్థికమాంద్యం కూడా త్వరలోనే ల్యాండ్ అవుతుందిలే. మోదీ ఉంటే అది సాధ్యమే" అన్నాడు.
కొంతమంది మాత్రం విపిన్ సాహు పూర్తి వీడియో 'స్టేజ్‌డ్' అంటే కావాలనే తీసిందని చెబుతున్నారు. విపిన్ సెల్ఫీ స్టిక్ వదలకపోవడం, అన్ని తిట్లు ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడమే దానికి కారణం.
దానికి జవాబిచ్చిన విపిన్ "సెల్ఫీ స్టిక్ నా నడుముకు కట్టుంది. చేతులకు ఏం కాలేదు. కాళ్లు చాపుకోవడం కష్టం అయ్యింది. అసలు ఏం చేయాలో అర్థ కాలేదు. చచ్చిపోకుంటా ఉంటే బాగుండు అనిపించింది. నాకు కాస్త హైట్ ఫోబియా ఉంది. ఇంతకు ముందు కూడా ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాను. ఈసారీ ఎత్తు కాస్త ఎక్కువైంది" అన్నాడు.

ఫొటో సోర్స్, FACEBOOK/VIPIN
అయితే ఈ వీడియో వైరల్ ఎలా అయ్యింది
ఈ వీడియోలో విపిన్ తనను తానే చాలా తిట్టుకుంటూ ఉంటాడు. విపిన్ కుటుంబ సభ్యులు దాన్ని చూళ్లేదా?
దానికి విపిన్, "అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నా నోట్లోంచి ఆ తిట్లన్నీ వచ్చేశాయి. ఇంట్లో వాళ్లు దాన్ని చూసి నువ్వు ఇంట్లో ఇలా, బయట అలా ఉంటావా అని పిచ్చిపిచ్చిగా తిట్టారు" అన్నాడు.
ఈ వీడియోలో విపిన్ అన్ని అన్నప్పుడు, అందరూ దాన్ని చూసి అంత ఎగతాళి చేస్తున్నప్పుడు అతడు దాన్ని డిలిట్ ఎందుకు చేయలేదు.
దానికి విపిన్ "నాకు ఈ వీడియోపై ఎలాంటి ఆసక్తి లేదు. ఎందుకంటే ఈ వీడియోలో అసలేం లేదు. కానీ, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారుగా. వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. నా తమ్ముడు పవన్ యూట్యూబ్ చానల్లో జులైలో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. తర్వాత ఇది సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యింది" అన్నాడు.
తన ఫొటోలతో మీమ్ వచ్చాక విపిన్ చాలా సంతోషంగా ఉన్నారు. "వీడియో వచ్చాక ఎవరైనా రాత్రికిరాత్రే ఫేమస్ అయితే ఇంకేం కావాలి" అన్నాడు.

ఫొటో సోర్స్, CHANDNITRIPATHI
భార్యాభర్తల గొడవకు తెర
విపిన్ ఒక ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "తన వీడియో చూసి భార్యాభర్తల మధ్య గొడవ కూడా తీరిపోయిందని" చెప్పాడు.
దాని గురించి బీబీసీతో మాట్లాడిన విపిన్, "భార్యాభర్తలు ఇద్దరి మధ్యా గొడవ ఉండేది. వీడియో చూసి ఇద్దరూ నవ్వుతూ అదంతా మర్చిపోయారు. వాళ్లు కూడా 'వందో, రెండు వందలో తీసుకుని గొడవను ముగించెయ్' అనుకున్నారు" అన్నాడు.
అయితే విపిన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తను సింగిల్‌గానే ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల్లో సోషల్ సంఘర్షణ
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








