అరెస్టుకు ముందు ఓ తండ్రి ప్రేమ సందేశం.. చైనాలో సోషల్ సంచలనం!

ఫొటో సోర్స్, @HuaYong798
చైనాలో ఓ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అది ఓ వ్యక్తి కథ! తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి కొన్ని క్షణాల ముందు తన రెండేళ్ల కూతురికి తండ్రి పంపిన ఓ ప్రేమ సందేశం.
కమ్యూనిస్ట్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ చైనా చిత్రకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి కొన్ని క్షణాల ముందు ఆ వ్యక్తి చిత్రీకరించిన సెల్ఫీ వీడియోకు సోషల్ మీడియాలో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది.
హువా యోంగ్ అనే వ్యక్తి.. తన రెండేళ్ల కూతురి పుట్టినరోజున ఆమెతో గడపలేకపోతున్నానంటూ తీసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
తనను అరెస్ట్ చేసేందుకు చైనా పోలీసులు తన ఇంటి తలుపులు పగులగొట్టడానికి ప్రయత్నించారని హువా యోంగ్ అన్నారు.
బీజింగ్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పునర్నిర్మాణం, విస్తరణ కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు పేదల ఇళ్లను ఖాళీ చేయించడాన్ని వీడియో తీయడమే హువా యోంగ్ చేసిన నేరం!
ఆ వీడియోలో హువా యోంగ్ పేదలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించడాన్ని చిత్రీకరిస్తూ ఆన్‌లైన్‌లో వ్యక్తిగత స్వేచ్ఛ గురించిన సందేశాలను పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ నేపథ్యంలో హువా యోంగ్‌కు పోలీసుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఇక తనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో హువా యోంగ్ అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ చివరికి పోలీసులకు చిక్కారు. కానీ సరిగ్గా అప్పుడే, తన కూతురికోసం ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు.
ఆ వీడియోలో ''నేనేం చేసినా అది నీకోసమే! మీ నాన్న, తాతల తరంలోలాగ నువ్వు బాధపడకూడదనే నా ఆరాటం. స్వేచ్ఛగా మాట్లాడ్డానికి, మనుషుల్లా జీవించడానికి జీవితాంతం పోరాడుతూనే ఉంటాను'' అని హువా యోంగ్ మాట్లాడారు.
తాను దాక్కున్న ఇంట్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించడానికి ముందే తన కూతురి పుట్టినరోజుకు హాజరు కాలేకపోతున్నానంటూ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లి నుంచి ఇంగ్లిష్ నేర్చుకోవాలంటూ ఆ వీడియోలో హువా యోంగ్ తన కూతురిని కోరారు.
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని చూపిస్తానంటూ హువా యోంగ్ తన కూతురిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను కొన్ని వేల మంది చూశారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








