బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నివాసాలున్న కుబేరుల నగరం మెడీనాకు ఆర్థిక కష్టాలు

ఫొటో సోర్స్, Getty Images
మెడీనా- ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరులైన బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నివసించే అమెరికా నగరం. వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ నగరం దగ్గర్లో ఉంటుంది.
'ఫోర్బ్స్' సంస్థ అంచనా ప్రకారం- ప్రపంచ సంపన్నుల్లో తొలి రెండు స్థానాల్లోని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెజాన్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈవో) జెఫ్ బెజోస్‌లకు ఇద్దరికీ కలిపి 20 వేల 960 కోట్ల డాలర్ల సంపద ఉంది.
మెడీనాలో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌లకు ఇంద్రభవనం లాంటి ఇళ్లున్నాయి. వీరిద్దరే కాదు, ప్రపంచ కుబేరుల్లో మరికొంత మంది ఇక్కడ నివసిస్తున్నారు.
నగరంలోని లేక్ వాషింగ్టన్ ఒడ్డున పచ్చని పరిసరాల మధ్య ప్రపంచంలోనే అత్యంత గొప్ప భవంతులు కొన్ని ఉన్నాయి. బిల్ గేట్స్ నివాసానికి వికీపీడియాలో పేజీ కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
స్థానిక మీడియా కథనాల ప్రకారం- మెడీనాలోని బిల్ గేట్స్ ఇంట్లో 24 స్నానాలగదులు, 200 మంది అతిథులకు సరిపోయే సువిశాల రిసెప్షన్ హాల్ ఉన్నాయి. ఈ ఇంటి విలువ 12.8 కోట్ల డాలర్లని అంచనా.
నగరంలో ఒక్కో ఇల్లు సగటున 28 లక్షల డాలర్ల ఖరీదు చేస్తుంది. కుబేరులున్న నగరమైనా మెడీనా అధికార యంత్రాంగం, ప్రజలకు కావాల్సిన సేవలు అందించేందుకు తగినంత పన్ను రాబడి లేక సతమతమవుతోంది.
ఇటీవలి వరకు అత్యవసర వైద్యసేవలు, పోలీసు, అగ్నిమాపక సేవలు, ఉద్యానవనాలు, ప్రజా మౌలిక సదుపాయాల నిర్వహణ లాంటి ప్రాథమిక సేవలు అందించడానికి సరిపడా పన్ను ఆదాయం రాలేదు.
మెడీనాలో కుటుంబాల సగటు వేతనం 1.86 లక్షల డాలర్లు. ఇది సియాటిల్‌లో 80 వేల డాలర్లు. అమెరికా వ్యాప్తంగా అయితే 60 వేల డాలర్లు.

ఫొటో సోర్స్, City of Medina
ఆ పన్ను నిబంధన ఏమిటి?
నగరంలో ఎంతో సంపద ఉన్నా, గత నెల వరకు మెడీనా ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 2020లో మెడీనా ఆర్థిక లోటు ఐదు లక్షల డాలర్లు ఉంటుందని, ఐదేళ్లలో 33 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు.
పన్నుల్లో వార్షిక పెంపు ఒక్క శాతానికి మించకూడదని చట్టం చెబుతోంది. గత 17 సంవత్సరాల్లో నిధుల కొరతను అధిగమించేందుకు నగర యంత్రాంగం పొదుపు చేసిన నిధుల నుంచి డబ్బు వాడింది. వ్యయాలను తగ్గించింది.
ఈ ఏడాది ఆస్తిపన్ను రూపంలో 28 లక్షల డాలర్లు వసూలు చేయనున్నట్లు నగర ప్రజలకు జూన్లో పంపిన న్యూస్‌లెటర్లో అధికార యంత్రాంగం తెలిపింది. ఆస్తుల విలువ నిరంతరాయంగా పెరుగుతున్నా, పన్ను వసూళ్లు అందుకు తగినట్లుగా పెరగడం లేదని విచారం వ్యక్తంచేసింది.
పన్ను ఒక్క శాతం పెరిగితే 2020లో అదనంగా వచ్చే రాబడి కేవలం 28 వేల డాలర్లు. ప్రాథమిక సేవలకు ఇది సరిపోదు.
మెడీనా అధికారులు నిస్సహాయ స్థితిలో ఈ నెల్లో కొన్ని చర్యలు చేపట్టారు. వచ్చే ఆరేళ్లు అమల్లో ఉండేలా ఆస్తిపన్నుపై లెవీ విధించాలని స్థానిక ఓటర్లను అధికారులు కోరారు.
ఈ ప్రతిపాదనకు 'బ్యాలట్' ద్వారా ఈ నెల్లో ఆమోదం లభించింది. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నిర్ణయం ప్రకారం- 20 లక్షల డాలర్ల విలువైన ఆస్తి యజమానులు నెలకు 34 డాలర్ల చొప్పున అదనంగా చెల్లిస్తారని న్యూస్‌లెటర్లో రాశారు.
మెడీనాలో మూడు వేల మందికి పైగా నివసిస్తున్నారు. ఈ చర్యతో నిధుల లభ్యత కాస్త పెరుగుతుంది. వీటితో పెద్దగా కోతల్లేకుండా సేవలు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆలెన్ కన్నుమూత
- నరేంద్ర మోదీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?
- అజీమ్ ప్రేమ్‌జీ: విప్రో బాధ్యతలు చేపట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతా లోపాన్ని చూపిస్తే భారీ బహుమతి
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లు: లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు ఎలా కొంటున్నారు
- మహారాష్ట్ర: శరద్ పవార్‌ది అంతా అనుకుంటున్నట్లు ‘స్క్రిప్టెడ్ డ్రామా’నా?
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








