మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆలెన్ కన్నుమూత

పాల్ ఆల్లెన్

ఫొటో సోర్స్, Getty Images

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆలెన్ తన 65వ ఏట క్యాన్సర్‌తో మరణించారు.

2009లో నయమైనట్లు కనిపించిన వ్యాధి మళ్లీ తిరగబెట్టిందని, అయినా తాను కోలుకుంటానని ఆశిస్తున్నట్లు రెండు వారాల క్రితమే పాల్ ఆలెన్ ప్రకటించారు. కానీ ఇంతలోనే నాన్-హాడ్జ్‌కిన్స్ లింఫోమా క్యాన్సర్‌తో ఆయన మరణించారు.

''నా చిరకాల మిత్రుడు, అత్యంత సన్నిహితుడు అయిన పాల్ ఆలెన్ మరణం నన్ను కుదిపివేసింది. అతనే లేకుంటే 'పర్సనల్ కంప్యూటింగ్' అన్నదే ఉండేది కాదు'' అని బిల్ గేట్స్ అన్నారు.

ఆల్లెన్ మరణ వార్తను ధృవీకరిస్తూ.. ''పాల్ ఆలెన్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. అతని మంచితనాన్ని, ప్రేమను చవిచూసిన కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ అదృష్టవంతులు..'' అని ఆయన సోదరి తెలిపారు.

తన బాల్యమిత్రుడు బిల్‌గేట్స్‌తో కలిసి సాంకేతిక దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్‌’ను 1975లో ప్రారంభించారు.

''నా బాల్యంలో, మైక్రోసాఫ్ట్ స్థాపించడంలో, ఆ తర్వాత మేం చేసిన ప్రజోపకార కార్యక్రమాల్లో ఆలెన్ నాకు తోడుగా నిలబడ్డాడు. అతడు నాకు నిజమైన భాగస్వామి, నిజమైన స్నేహితుడు. ఆయన లేకపోయినా, సాంకేతిక రంగంలో ఆయన ఆవిష్కరణలను, ఆయన దాతృత్వాన్ని భవిష్యత్ తరాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి..'' అని బిల్ గేట్స్ అన్నారు.

ఇంతవరకూ పాల్ ఆలెన్ దాదాపు 200కోట్ల డాలర్లను సైన్స్, విద్య, వన్యప్రాణి సంరక్షణ లాంటి కార్యక్రమాలకు విరాళం ఇచ్చినట్లు 'అసోసియేట్ ప్రెస్' తెలిపింది.

తన మరణానంతరం, తన సంపదలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు చెందాలని 2010లో ఆయన నిర్ణయం తీసుకున్నారు.

పాల్ ఆలెన్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ ఉత్తర అమెరికా టెక్నాలజీ రంగ విలేకరి డేవ్ లీ విశ్లేషణ:

టెక్నాలజీ మేగజీన్ 'వైర్డ్' తన 25వ వార్షికోత్సవంలో నేను పాల్గొన్నాను. వార్షికోత్సవం ఆ సంచికకు మాత్రమే కాదు.. సాంకేతిక రంగానికే అది వార్షికోత్సవం అని చెప్పొచ్చు.

వైర్డ్ సంచికలో పాల్ ఆలెన్ పేరు ఎన్నోసార్లు ప్రస్తావనకు వచ్చింది.

పాల్ ఆలెన్ గతంలోనే క్యాన్సర్‌తో పోరాడి నిలబడ్డారు. ఆయన చాలా ధైర్యంగా కనిపించేవారు. చివరివరకూ ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తూ చురుకుగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పారు.

బిల్ గేట్స్, పాల్ ఆలెన్ స్నేహం వారి వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితం కాలేదు. టెక్నాలజీ రంగం, సేవా కార్యక్రమాల్లో కూడా వీరి స్నేహం కొనసాగింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)