మహారాష్ట్ర గవర్నర్‌కు 5 ప్రశ్నలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ ప్రియదర్శి
- హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ హిందీ
మహారాష్ట్ర గవర్నర్ సాయంతో చీకట్లోనే హఠాత్తుగా అధికారమనే పక్షి బీజేపీ చేతుల్లో పడింది.
చడీచప్పుడు లేకుండా జరిగిన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత... నైతికత, విలువలు, ఆదర్శాలు, నియమాలు, సిద్ధాంతాలు, వ్యవస్థ, విధానం, రాజ్యాంగం, నిబంధనలు, మర్యాద, సంప్రదాయం, నిజాయతీ, పారదర్శకత, ఔచిత్యం, క్రమశిక్షణ.. ఇలాంటి ఎన్నో మాటలపై చర్చ జరిగుండాలి. కానీ అలా జరగడం లేదు.
దానిని మించి పైన ఎన్ని మాటలు ఉన్నాయో వాటిని రాజకీయ నాయకులు ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కానీ మీడియా హంగామా చేస్తుందనే వారి మనసులో కచ్చితంగా ఉండే ఒక భయం, ఇప్పుడు చాలావరకూ ముగిసిపోయింది.
టీవీ చానళ్లలో చాణక్య వ్యూహం, కోశ్యారీ హోషియారీ (గవర్నర్ కోశ్యారీ చాతుర్యం) లాంటి మాటలను వాడుతున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై రకరకాల వాదనలు, కామెంట్స్, మీమ్స్ షేర్ అవుతున్నాయి.
మహారాష్ట్ర రాజకీయ టగ్ ఆఫ్ వార్ ఇంకా కొనసాగుతుంది. చాలా ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముందు కూడా వస్తుంటాయి. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. అధికారం దక్కించుకోలేకపోయిన మహాకూటమి పిటిషన్‌పై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వినిపిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
ఆదర్శం.. అవుట్ ఆఫ్ ఫ్యాషన్
రాజకీయాల్లో ఆదర్శవాదాన్ని ఆశించేవారిని ఎమోషనల్ లేదా బుద్ధిహీనులుగా భావిస్తారు. నేతలు అధికారం చేజిక్కించుకోడానకి ఎప్పుడూ అంతకు ముందుకంటే ఎక్కువ ధైర్యం చూపిస్తారు. మీడియా, అవగాహన ఉన్న పౌరులు మౌనంగా ఉంటారు లేదంటే తీవ్ర చర్చను అన్యాయం అంటారు. అంటే మర్యాదను ఉల్లంఘించిన వారి మనోబలం పెంచుతారు.
విభజన రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత కాలంలో తప్పు-ఒప్పులను కొత్తగా నిర్వచించినట్లుంది. మన వాళ్లు చేసేదంతా ఒప్పే, అవతలి వారు ఏం చేసినా తప్పే.
ఇప్పుడు ప్రజాస్వామ్య అస్థిత్వానికి సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చ ఎంత తగ్గిపోయిందో, దాని అవసరం అంత పెరిగిపోయింది.
రామ్‌మనోహర్ లోహియా చెప్పినట్లు బతికున్న జీవులు ఐదేళ్ల వరకూ వేచిచూడలేవు. కానీ ప్రజాతీర్పునకు జరిగే అవమానం చూసి కూడా జనాలకు కోపం రానట్టు ఇప్పుడు అనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా గోవా, మణిపూర్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాతీర్పును నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు గమనించారు. కానీ స్పందన రాలేదు.
బలమైన, అధికార పార్టీ ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. తను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేసింది. కానీ అంతమాత్రాన ఇప్పుడు బీజేపీ చేస్తున్నది సరైనది అని కాదు. అప్పుడూ ప్రశ్నించాలి, ఇప్పుడు కూడా ప్రశ్నించాలి.
మణిపూర్, గోవాలో కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని జనం గగ్గోలు పెట్టారు. కానీ కర్ణాటకలో తారుమారు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా అదే ప్రయత్నం చేసింది.
మొత్తానికి ప్రజాస్వామ్య విలువల్లో ఎంత విశ్వాసం ఉంది, అనేది గట్టిగా చెప్పలేకపోవడం విషాదకరం.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు
బీజేపీ పవిత్ర జల్లుల్లో శుద్ధి అయిన వారి సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు అజిత్ పవార్ పేరు కూడా చేరింది. అజిత్ పవార్‌ను ఇప్పుడు ఏం చేయలేరు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చట్టపరమైన దర్యాప్తు చేయించిందా?
ఫిరంగి గొట్టం ఇప్పుడు బహుశా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వైపు తిరుగుతుందేమో! అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఇదేనా?
అజిత్ పవార్ త్వరలోనే జైలుకు వెళ్తారని కొన్ని రోజుల ముందు వరకూ దేవేంద్ర ఫడణవీస్ చెప్పేవారు. హఠాత్తుగా శుక్రవారం రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి ఆయన కంటే మంచి డిప్యూటీ సీఎం ఇంకెవరు లేరన్నట్లు పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు అజిత్ పవార్‌పై ఉన్న నీటిపారుదల కుంభకోణం ఆరోపణలు తొలగిపోతాయా?
అవకాశవాదం, తారుమారు, బేరసారాలు అందరూ చేస్తున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన... ఇదెలాంటి కూటమి అవుతుంది?

ఫొటో సోర్స్, FACEBOOK/CMOMAHARASHTRA
ఒకవైపు ముంబయిపై మరాఠీల ఆధిపత్యం గురించి మాట్లాడే శివసేన, తనను తాను సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, సోనియాగాంధీని విదేశీయురాలని చెప్పి హంగామా చేసే శరద్ పవార్, ఈ బంధాన్ని ఏమనాలి?
అయితే విదేశీ మూలాల ఆధారంగా వ్యతిరేకించడం కాస్త పాత విషయమే. ఈసారీ కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. కానీ మాటిమాటికీ వైఖరి మార్చడం శరద్ పవార్ వ్యక్తిత్వంగా మారిపోయింది.
అయినా ప్రజాతీర్పు ప్రశ్న విషయానికి వస్తే, అది ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అందించారు. ఇప్పుడు ఏది జరిగినా ప్రజలకు మోసం చేసిన భావన వస్తుంది.
కానీ చిన్న చిన్న ఆటలకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండడం అవసరం. అలాంటిది.. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య పునాదులకు సంబంధించిన విషయం. అందుకే సీరియస్‌నెస్ ఆశించాలి.

ఫొటో సోర్స్, Getty Images
నియమ నిబంధనల ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తడం కూడా ఇప్పుడు సాహసకార్యంలా చెబుతుంటే, లేదా దానిని సమాజంలో అనవసరం అని భావిస్తుంటే ప్రజాస్వామ్యం అస్థిత్వం గురించి ఆలోచించాల్సుంటుంది.
కొన్ని ప్రాథమిక ప్రశ్నల సమాధానాలు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని అడగాల్సి ఉంటుంది. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త.
ఆయనకు నియమాలను పాటించడం కన్నా ఆదేశాలను పాటించడమే మంచిదని అనిపించి ఉంటుంది.
అయినా నియమాలకు బదులు ఆదేశాలను పాటించిన గవర్నర్లలో కోశ్యారీ మొదటివారు కాదు. గవర్నర్లు కేంద్రం ఆదేశానుసారమే తమ పాత్ర పోషించారనడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కాలంలో రమేష్ భండారీ, బూటా సింగ్ అదే పని చేస్తూ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
పారదర్శకత - రాష్ట్రపతి పాలన తొలగించాలనే సిఫారసు ఆయన ఎప్పుడు చేశారు? దేని ఆధారంగా చేశారు? ఇంత పెద్ద నిర్ణయం ఏ ప్రజాస్వామ్యంలో తీసుకున్నా.. దాని గురించి ప్రజలకు చెబుతారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు.
రాజ్యాంగ విధానం - రాష్ట్రపతి పాలన అమలు చేయడం, తొలగించడానికి ఒక నిర్ణీత రాజ్యాంగ ఆమోదిత ప్రక్రియ ఉంది. గవర్నర్ తన సిఫారసును రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి దానిని ప్రధానమంత్రికి పంపిస్తారు. ప్రధాన మంత్రి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు. తర్వాత రాష్ట్రపతికి క్యాబినెట్ తన అభిప్రాయం చెబుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనను తొలగించాలనే ఆదేశాలపై ఆయన ముద్ర వేస్తారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది?
దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్.. రూల్ నంబర్ 12 ప్రకారం తీసుకున్న నిర్ణయం. చట్టపరంగా ఇది పూర్తిగా సబబే అన్నారు.
రూల్ నంబర్ 12 ప్రకారం... ఒక ఎక్స్‌ట్రీమ్ ఎమర్జెన్సీ(తక్షణ అత్యవసరం), అన్‌ఫర్గివ్‌నెస్ కంటింజెన్సీ(ఊహించలేని ఆకస్మిక స్థితి)లో ప్రధానమంత్రికి తనంతట తాను నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఇది అలాంటి స్థితేనా?

నిబంధనలు - ఎన్సీపీ తరఫున అధికారిక లేఖ తీసుకురావాలని అజిత్ పవార్‌ను గవర్నర్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఎన్సీపీ సమావేశమై, అధికారిక లేఖ ఇచ్చేవరకూ ఆగలేనంత తొందర ఎందుకు?
నైతికత - గుట్టుచప్పుడు కాకుండా ప్రమాణ స్వీకారం చేయించి నవంబర్ 30న అంటే అధికార పక్షానికి వారం సమయం ఇచ్చారు. ఈ వారంలో ఎన్ని జరగచ్చో గవర్నరుకు తెలీదా? ఇదంతా ప్రజాస్వామ్యానికి ఎంత చేటో కదా?

ఫొటో సోర్స్, CMO
ఔచిత్యం - రాష్ట్రపతి పాలన తొలగించడానికి గుట్టుచప్పుడు కాకుండా సిఫారసు చేయడానికి, రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించడానికి మధ్య ఉన్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అలా పాటించి ఉన్నారనుకుంటే... కేవలం గవర్నర్ మాత్రమే కాదు, దేశంలోని మొత్తం పాలనా వ్యవస్థ.. అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్, ప్రభుత్వ ఉన్నతాధికారులు... ఇలా అందరూ రాత్రంతా మేలుకుని పనిచేస్తూనే ఉన్నారా? దీనికి సమాధానం అందరూ చెప్పాలి. మీలో ఇంత సంసిద్ధత పుల్వామా దాడి తర్వాతైనా కనిపించిందా?
సర్జికల్ స్ట్రైక్స్ దేశ శత్రువులకు వ్యతిరేకంగా చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో విపక్షాల పైన కూడా జరుగుతోందనేది ఇది స్పష్టం చేస్తోంది.
ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలే. వీటికి సమాధానాలు కావాలి. మీరు ఏ పార్టీ మద్దతుదారుడైనా కావచ్చు. కానీ ఈ ప్రశ్నలు అడుగుతారా లేదా అనే దాన్ని బట్టి మీరు ప్రజాస్వామ్య మద్దతుదారుడో కాదో తెలిసిపోతుంది.
విజయానికి, న్యాయానికి మధ్య తేడాను మనస్సాక్షి గుర్తించగలిగితేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
- దేవేంద్ర ఫడణవీస్ ముళ్ల సింహాసనంపై కూర్చోబోతున్నారా?
- మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం... సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్
- మహారాష్ట్ర: శరద్ పవార్‌ది అంతా అనుకుంటున్నట్లు ‘స్క్రిప్టెడ్ డ్రామా’నా?
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- మా అమ్మకు వరుడు కావలెను
- టీఎన్ శేషన్ (1932-2019): ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








