"ఏటైనా సేయండి.. నా కొడుకుని తీసుకురండి" - ఈజిప్టులో మరణశిక్ష పడ్డ శ్రీకాకుళం కార్మికుడి తల్లి

రమణ తల్లిదండ్రులు
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

శ్రీకాకుళం జిల్లా వలస కార్మికుడికి ఈజిప్టులో మరణ శిక్ష పడింది. ఇరాన్ ఓడలో పనిచేస్తున్న రమణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో పట్టుబడ్డారు.

విశాఖపట్నంలోని, ఉద్యోగాలిప్పించే సంస్థ తప్పిదం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

శ్రీకాకుళం గ్రామీణ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ- అప్పన్న, సత్యవతి దంపతుల కుమారుడు. అప్పన్న వ్యవసాయ కూలీ. రమణ ఇంటర్మీడియట్ చదివాక తాపీ పని ప్రారంభించారు. తర్వాత ఆయనకు విశాఖపట్నానికి చెందిన కపిలవాయి శ్రీహర్ష వర్మతో పరిచయం ఏర్పడింది.

నాలుగు లక్షల రూపాయలు కడితే రమణకు ఓడలో 'సీమ్యాన్' ఉద్యోగం ఇస్తానన్నారని, ఉన్న కొద్దిభూమిని అమ్మి రమణకు డబ్బు ఇచ్చామని అప్పన్న బీబీసీతో చెప్పారు.

రమణ 2016 సెప్టెంబర్లో ముంబయి వెళ్లి, అక్కడి నుంచి ఇరాన్‌కు విమానంలో చేరుకున్నారు. అక్కడ, ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అబ్బాస్ సిరదౌసీ కంపెనీ ఓడలో 'సీమ్యాన్'గా చేరారు.

నౌక ఈజిప్ట్ జలాల్లోకి ప్రవేశించాక ఈజిప్ట్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సోదాలు చేసి మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. రమణ, నౌకలో ఉన్న ఇతర దేశస్థులను అరెస్టు చేశారు. కేసును విచారించిన ఈజిప్ట్ న్యాయస్థానం రమణకు మరణ శిక్ష విధించింది.

బగ్గు రమణ

చెల్లి పెళ్లికీ రాని రమణ

రమణ చెల్లెలు మంగమ్మ, తమ్ముడు ఆనంద్ చంద్రయ్యపేటలోనే ఉంటున్నారు. డబ్బులు సంపాదిద్దామని ఏజంట్‌ను నమ్మి డబ్బంతా ఇచ్చామన్నారు మంగమ్మ.

''మా అన్న మాతో రెండు నెలలకు ఒకసారి మాట్లాడేవాడు. నా పెళ్లికి కూడా రాలేదు. చివరిసారిగా ఈ ఏడాది ఆగస్ట్ 20న మాట్లాడాడు. తర్వాత మాట్లాడలేదు'' అని ఆమె చెప్పారు.

"పాస్‌పోర్ట్, వీసా అన్నీ కలిపి నాలుగు లక్షలవుతుంది. శిక్షణకు లక్షన్నర తీసుకెళ్లాడు. వర్మ ఇచ్చిన చిరునామాకు మొదట ఫోన్ చేసినా అయ్యేది, తరువాత అవ్వడం లేదు. 'ఇదుగో మీవాడు వస్తాడు, అదిగో వస్తాడు, డబ్బులు వేస్తాను' అని వర్మ చెబుతూ వచ్చాడు. అనుమానం కలిగి విశాఖపట్నం వచ్చి వర్మ ఇచ్చిన చిరునామాలో చూస్తే అక్కడ ఆఫీసు లేదు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర మంత్రి (విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్)ని కలిశాం. మా అన్నకు తెలుగు తప్ప వేరే భాష రాదు. మా వాడు తాపీ పని చేసుకునేవాడు. వాడిని 'సీమ్యాన్'గా ఓడ ఎక్కించారు. మా వాడికి అసలు ఏం తెలియదు. ఇందులో ఎలా ఇరుక్కున్నాడో! మా వాడిని విడిపించండి'' అని మంగమ్మ అభ్యర్థించారు.

ఏజెంట్ శ్రీహర్షను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన ఫోన్ పనిచేయడం లేదు.

చంద్రయ్యపేట

నా కొడుకు ఎలా ఉన్నాడో!

రమణ మూడేళ్లకు వస్తాడని ముందు అన్నారని తల్లి సత్యవతి చెప్పారు. "ఆ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకు రాశాడో మాకు తెలియదు. ఆ వర్మకే అంతా తెలుసు. నాలుగు లచ్చలు అతనికి కట్టినాం. ఇలా అయిందనీ మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఆ వర్మనే మా పిల్లాడిని అప్పగించాలి. నా కొడుకుతో ఎవరెవరు ఉన్నారో తెలీదు" అని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రమణ ఎప్పుడు ఫోన్ చేసినా 'అందరూ బాగున్నారా' అని అడిగేవాడని, ఇప్పటికీ తమ పిల్లాడు ఎక్కడున్నాడో తెలియదని సత్యవతి చెప్పారు. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదన్నారు.

"ఆ వర్మే నా కొడుకు జైల్లో ఉన్నట్లు సెప్పాడు. జిల్లా కలెక్టర్‌కు, పోలీసులకు సెప్పాం. ఎవ్వరు ఏటైనా సేయండి. నా కొడుకుని నాకు తీసుకురండి" అని సత్యవతి వేడుకుంటున్నారు.

మీ అబ్బాయి ఈజిప్ట్ జైల్లో ఉన్నాడని పోలీసులు చెప్పారని అప్పన్న తెలిపారు.

"అప్పుడే వర్మ మీ అబ్బాయి జైళ్లో ఉన్నాడని చెప్పాడు. రమణ నెల రోజులు ట్రైనింగ్‌కు వెళ్లాడు. రెండు నెలల తర్వాత నౌక ఎక్కాడని చెప్పాడు. 'సీమ్యాన్' అని చెప్పే పాటికి డబ్బులు ఇచ్చాం.. అంతే" అని ఆయన వివరించారు.

మంత్రి జైశంకర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు
ఫొటో క్యాప్షన్, రమణ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిని కలిసిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు

జైల్లో ఉన్నారని ఎలా తెలిసింది?

రమణ 2016 డిసెంబర్లో అరెస్టయ్యారు.

రమణ అరెస్టయ్యాక కూడా ఫోన్లు వచ్చాయని, ఏజంట్ వర్మే వేరే వాళ్లతో ఫోన్ చేయించి మోసం చేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్ట్ 20 తర్వాత రమణ నుంచి ఫోన్ రాలేదు. ఏజంట్‌కు వారు ఎన్ని సార్లు ఫోన్ చేసినా తగిన స్పందన లేదు.

కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతోపాటు కలెక్టరేట్ 'గ్రీవెన్స్‌'లో వినతిపత్రం అందించారు. ఆచూకీ కనుక్కోవాలని విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించడంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎన్నారై విభాగం ప్రయత్నాలు చేసింది. రమణ ఈజిప్ట్ పోలీసులకు పట్టుబడ్డారని, న్యాయస్థానంలో మరణశిక్ష పడిందని ఆ విభాగం తెలియజేసింది.

ఆయన్ను కాపాడాలని కోరుతూ ఎంపీ రామ్మోహన్ నాయుడిని కుటుంబ సభ్యులు కలిశారు.

రామ్మోహన్ నాయుడు బీబీసీతో మాట్లాడుతూ- తనకు నాలుగు నెలల క్రితమే తెలిసిందని, విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రమణ పనిచేస్తున్న ఓడలో డ్రగ్స్ దొరికాయని అక్కడ మీడియాలో చూపించారని తెలిపారు.

"మనం ఒత్తిడి చేస్తే ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. రమణకు ఏం తెలియదు, భాష తెలియదు. ఏజంట్ మోసం చేశాడు. ఏజంట్ కూడా అందుబాటులో లేడు. మన రాయబార కార్యాలయం ద్వారా న్యాయసహాయం చెయ్యాలని మంత్రిని కోరాం. చేస్తామని ఆయన హామీ ఇచ్చారు'' అని రామ్మోహన్ నాయుడు వివరించారు.

సమాచారం లేని శ్రీకాకుళం అధికారులు

ఇంత జరుగుతున్నా శ్రీకాకుళం జిల్లా అధికారులకు ఎలాంటి సమాచారమూ లేదు. ఆ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి ధృవీకరించారు.

బీబీసీ బృందం ఈ అంశంపై శ్రీకాకుళం కలెక్టర్ నివాస్, శ్రీకాకుళం ఆర్డీవో రమణ, శ్రీకాకుళం పట్టణ తహశీల్దార్ కుమార్, జిల్లా ఎస్‌పీ అమ్మిరెడ్లను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

సిక్కోలు నుంచి రోజు వందల మంది పొట్ట చేతపట్టుకొని వలస వెళ్తుంటారు. పక్కనే విశాఖపట్నం నగరం, గోదావరి జిల్లాలతో పాటు చెన్నై ఎక్కువగా వెళ్తుంటారు. హైదరాబాద్, ముంబయి కూడా వెళతారు. భవన నిర్మాణ ప్రమాదాల్లో శ్రీకాకుళం వలస కార్మికులు బాధితులుగా చాలాసార్లు కనిపించేవారు.

ఇటీవల కాలంలో సిక్కోలు మత్స్యకారులు చేపలవేటకు గుజరాత్ తీరం వెళ్లి పాకిస్థాన్ బలగాలకు చిక్కారు.

మోసపూరిత ఏజెంట్లను నమ్మిన కొందరు శ్రీకాకుళం వాసులు ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)