ఆంధ్రప్రదేశ్: హిందూ, ముస్లిం, క్రైస్తవుల తీర్థయాత్రలకు ప్రభుత్వం ఎలా ఆర్థిక సహాయం అందిస్తోంది?

ఫొటో సోర్స్, I&PR ANDHRAPRADESH
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెరూసలేం, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుని ఇటీవలే జీవో జారీ చేసింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేసే హిందువుల కోసం 'దివ్యదర్శనం' పథకం ప్రారంభించారు. అయితే, మతపరమైన యాత్రలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దివ్యదర్శనం ఎవరికోసం?
ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతాచారాలు పాటిస్తున్న వారికి తీర్థయాత్రలకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం 'దివ్యదర్శనం' ప్రారంభించింది. 2016 జూన్ 9న జీవో ఎం.ఎస్. నెంబర్ 243 ప్రకారం దివ్యదర్శనం ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రవాణ సదుపాయాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనం కల్పిస్తుంది. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తారు. ఆలయాల్లోనే ఉచిత వసతి, ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
దివ్యదర్శనం ద్వారా వచ్చే యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, సింహాచలం వంటి ప్రధాన ఆలయాల్లో దర్శనాలు చేసుకోవడానికి తగ్గట్టుగా దివ్యదర్శనం పథకం రూపొందించారు.
ఎవరు దర్శనాలు చేసుకున్నారు?
దివ్యదర్శనం పథకం మొన్నటి సాధారణ ఎన్నికల ముందు వరకూ అమలులో ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా 70,757 మంది భక్తులు ఆలయాల్లో దర్శనాలు చేసుకున్నారు.
వారిలో ఎస్సీలు 18,457, ఎస్టీలు 18,812, బీసీలు 15,046 మంది ఉన్నట్టు దేవాదాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 396 ప్రత్యేక బస్సులలో వీరందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో దర్శనాలకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం కోసం దేవాదాయ శాఖ , టీటీడీ చెరో 50 శాతం చొప్పున ఖర్చు భరించేలా ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దానికి అనుగుణంగా దేవాదాయ శాఖ తరఫున రూ.16.59 కోట్లు వ్యయం చేసినట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎమ్.రత్నరాజు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిలిపివేతకు కారణం ఏంటి?
ఏపీలో దివ్యదర్శనం కార్యక్రమం నిలిపివేయడానికి గల కారణాలపై అధికారుల దగ్గర సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్‌ను బీబీసీ సంప్రతించింది. అంతా ప్రభుత్వ నిర్ణయమే అని ఆయన అన్నారు.
"గత ఆర్థిక సంవత్సరం వరకూ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. దానికి అనుగుణంగా దివ్యదర్శనాలు కల్పించాం. కానీ, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం ప్రస్తావన రాలేదు. దేవాదాయ శాఖ తరఫున తెలియజేశాం. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే ప్రస్తుతానికి నిలిచిపోయింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హజ్ యాత్ర మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన ముస్లింలకు హజ్ యాత్ర కోసం ఏపీ ప్రభుత్వం సహాయం అందిస్తోంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎం.ఎస్ నెంబర్ 75 ప్రకారం, హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం పెంచుతూ నిర్ణయం వెలువడింది.
కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండే వారికి ఏపీ ప్రభుత్వం రూ. 60 వేలు అందించనుంది. దానికి మించిన వార్షికాదాయం ఉన్న యాత్రికులకు రూ. 30 వేల చొప్పున అందిస్తారు. హజ్ యాత్రకు ఆసక్తి ఉన్న వారి డిసెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ హజ్ కమిటీ ప్రకటించింది.
హజ్ యాత్రికులకు రాష్ట్రం తరఫున సహాయం చాలాకాలంగా అందిస్తున్నారు. అది క్రమంగా పెరుగుతూ వస్తోంది. యాత్రికుల రవాణా ఖర్చులు సొంతంగా భరించగలిగితే వసతి, ఆహారానికి సంబంధించిన ఖర్చుల కోసం హజ్ కమిటీ ద్వారా మైనార్టీ సంక్షేమ శాఖ ఈ నిధులను అందిస్తుంది.
గడిచిన మూడు నాలుగు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రికుల సంఖ్య తగ్గుతోంది. గతంలో 2017లో హజ్ యాత్ర కోసం 2,878 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అది 2018 నాటికి 2,335కి తగ్గిపోయింది. గత ఏడాది 2019లో 2,138 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యలో వివిధ కారణాలతో పలువురు విరమించుకుంటారు. ఆ రీతిలో గత ఏడాది ఏపీ నుంచి హజ్ యాత్రకు ప్రభుత్వ సహాయం అందుకుని వెళ్లిన వారి సంఖ్య 1,848గా ఉంది.
వాస్తవానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీకి చెందిన 2,602 మందికి ఏటా హజ్ యాత్రకు అవకాశం ఉంది. కానీ, కోటా కన్నా చాలా తక్కువగా ఏపీ నుంచి హజ్ యాత్రికులు బయలుదేరుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
హజ్ యాత్రికులు తగ్గడానికి కారణం
ఏపీ నుంచి హజ్ యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గడానికి గడచిన నాలుగైదేళ్లుగా రాష్ట్రంలో కరవు కొనసాగడం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పు ప్రధాన కారణాలు కావచ్చని ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్. అబ్దుల్ ఖాదిర్ అభిప్రాయపడ్డారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ఏపీకి చెందిన వారిలో చిత్తూరు, అనంతపురం జిల్లాల యాత్రికులు బెంగళూరు నుంచి హజ్‌కు వెళతారు. మిగిలిన జిల్లాల వారు హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా భోజనం ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వమే మిగిలిన వ్యయం భరిస్తుంది. ఈ ఏడాది యాత్రికుల సంఖ్యలో కూడా పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని అనిపిస్తోంది. ఇప్పటి వరకూ 2013 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి" అని వివరించారు.

జెరూసలేం యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున క్రైస్తవ మైనార్టీలకు కూడా జెరుసలేం యాత్రకు సహాయం అందిస్తున్నారు. 2016లోనే దీన్ని ప్రారంభించారు. తొలి ఏడాది 500 మంది మాత్రమే జెరూసలేం వెళ్లగా, గత ఏడాది 780 మంది వెళ్లినట్లు ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ యేసురత్నం తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 1,450 దరఖాస్తులు వచ్చాయి. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు ప్రాధాన్యత ఉంటుంది. ముస్లీం మైనార్టీల మాదిరిగానే జెరూసలేం యాత్రికులకు కూడా రూ.60 వేలు, రూ.30 వేలు చొప్పున సహాయం అందిస్తాం. అది గతంలో రూ.40వేలు, రూ.20 వేలుగా ఉండేది" అని ఆయన తెలిపారు.
బీజేపీ విమర్శలు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ పెంపుదల నిర్ణయాలను బీజేపీ తప్పుబడుతోంది. ఆ పార్టీ ధార్మిక సెల్ టి. కృష్ణ చైతన్య దీనిపై స్పందిస్తూ "ఇది రాజ్యాంగ విరుద్ధం. హిందువులలో అత్యధికులు కైలాసగిరి, అమర్ నాథ్ వంటి యాత్రలకు వెళుతుంటారు. వారికి కూడా 80 శాతం సబ్సిడీ అందించాలి. దివ్యదర్శనం ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం చెప్పాలి. లేదంటే ఆందోళన చేపడతాం" అని అన్నారు.
మంత్రి ఏమంటున్నారు?
హజ్, జెరుసలేం యాత్రికులకు సహాయం పెంచడంపై కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని, కానీ తమకు అన్ని మతాలు సమానమేనంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ "కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేయాలంటే ఇక చెల్లవు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని సహించం. గత 5 నెలల కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో వస్తున్న స్పందనతో ఇలాంటి పన్నాగాలకు దిగుతున్నారు. పేదలు దర్శనం కోసం వెళుతున్నప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మార్పులు చేయడాన్ని కూడా కొందరు విమర్శలు చేయడం తగదు" అని అన్నారు.
తాజాకలం
దివ్యదర్శనం కొనసాగిస్తాం: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి వివరణ
బీబీసీ తెలుగు ఈ కథనాన్ని తొలుత నవంబర్ 22న ప్రచురించింది. దివ్యదర్శనం పథకానికి సంబంధించి అధికారుల వివరణను ప్రచురించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ ప్రస్తావనే రాలేదని ప్రస్తుతం నిలిపివేశామని వారు చెప్పిన విషయాన్ని ప్రచురించింది. అయితే ప్రభుత్వంలో చర్చ జరిగాక ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నవంబర్ 25న దీనిపై వివరణ ఇచ్చారు . పథకం కొనసాగిస్తామని చెప్పారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. మరింత మెరుగ్గా అమలు చేయడం గురించి ఆలోచిస్తున్నామని బీబీసీ ప్రతినిధికి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








