మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముళ్ల సింహాసనంపై కూర్చోబోతున్నారా?

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర ఫడణవీస్
    • రచయిత, అభిజిత్ కాంబ్లే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేవేంద్ర ఫడణవీస్ గత 40 ఏళ్లలో పూర్తిగా ఐదేళ్లు పదవిలో ఉన్న మొట్టమొదటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించుకున్నారు.

ఇప్పుడు నాటకీయ పరిణామాల మధ్య ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో ఆయన మరో ఐదేళ్లు బీజేపీ పాలనను కొనసాగించేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన అసలు ముఖ్యమంత్రి పదవి వరకూ ఎలా చేరుకున్నారు? ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా సాగాయి? పార్టీలోనే ఉన్న ప్రత్యర్థులపై ఆయన పైచేయి సాధించగలిగారా?

మీడియాపై అవగాహన ఉన్న రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఫడణవీస్, ఇప్పుడు అదే మీడియాను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారా?

ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో గెలుచుకున్న స్థానాల కంటే తక్కువ సీట్లు సాధించి, అజిత్ పవార్ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫడణవీస్‌ వచ్చే ఐదేళ్లలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది?

ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నమే ఇది.

మహారాష్ట్ర రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

2014 జులై 29న ధంగర్ సమాజం తమను ఎస్టీల్లో చేర్చాలంటూ శరద్ పవార్ స్వస్థలం బారామతిలో నిరాహారదీక్షకు దిగింది.

ఈ సమస్యను చక్కదిద్దేందుకు బారామతి వచ్చిన అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ బీజేపీ అధికారంలోకి వస్తే తమ తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే ధంగర్ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

తర్వాత ఐదేళ్లు అయిపోయాయి. కానీ ధంగర్ల రిజర్వేషన్ల అంశం మాత్రం ఇంకా అలాగే ఉంది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాని గురించి ప్రస్తావించలేదు. బదులుగా ధంగర్ సమాజంలో కీలక నేత గోపీచంద్ పడల్కర్ బీజేపీలో చేరారు. బారామతిలో అజిత్ పవార్‌పైనే పోటీకి దిగారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ తన దౌత్య పటిమ చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అన్నిటినీ మించి ఆయన కీలకమైన అంశాలను ఎలా చక్కబెట్టగలరు అనేదానికి బారామతి ఘటన ఉదాహరణగా నిలిచింది.

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Twitter/@Dev_Fadnavis

కుటుంబ వారసత్వాన్ని కొనసాగించిన దేవేంద్ర ఫడణవీస్ 90లలో రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి జన్‌సంఘ్ నేత, ఆయన అత్త శోభా ఫడణవీస్ బీజేపీ-శివసేన మొట్టమొదటి ప్రభుత్వంలో మంత్రిగా పనిశారు.

90లలో దేవేంద్ర ఫడణవీస్ నాగపూర్ మేయర్‌గా ఉన్నారు. 1999లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆసక్తికరంగా ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయనకున్న పాలనానుభవం మేయర్ పదవి మాత్రమే. అప్పటివరకూ ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు.

దేవేంద్ర ఫడణవీస్ పొలిటికల్ కెరీర్ నాగపూర్‌లో మొదలైంది. అప్పటికి విదర్భ, నాగపూర్‌లలో బీజేపీకి ఉన్న ఏకైక కీలక నేత నితిన్ గడ్కరీ. ఆయన మార్గదర్శత్వంలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఫడణవీస్, తన ప్రత్యర్థి గోపీనాథ్ ముండేను అడ్డుకోగలిగారు. క్యాంపులో ఎప్పుడూ ముందంజలో ఉంటూ రాష్ట్ర అధ్యక్షుడి స్థానాన్ని కూడా సొంతం చేసుకోగలికారు.

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Twitter/Dev_Fadnavis

ముఖ్యమంత్రి పదవిలోకి ఎలా వచ్చారు?

ఫడణవీస్ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, ఆయన ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసింది. ఆయన నేతృత్వంలో 2014 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ముఖ్యమంత్రి కావడానికి మరికొన్ని అంశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. దేవేంద్ర ఫడణవీస్ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నారు. సంఘ్ నాయకత్వం కూడా ఆయనపై అపార విశ్వాసం ఉంచింది.

ఇవన్నీ పక్కనపెడితే, 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం మోదీ, షా చేతుల్లోకి వెళ్లిపోయింది. వారు కూడా నితిన్ గడ్కరీ పట్ల అంత అనుకూలంగా లేరు. మిగతా రాష్ట్రాలలో కూడా బీజేపీ మైనారిటీ సమాజాల్లో వారినే ముఖ్యమంత్రులుగా నియమించింది. హర్యానాలో ఝాట్ కాని మనోహర్ ఖట్టర్‌, జార్ఖండ్‌లో గిరిజనేతర నేత రఘుబర్ దాస్, మహారాష్ట్రలో మరాఠీ కాని దేవేంద్ర ఫడణవీస్‌ను ముఖ్యమంత్రులుగా చేసింది. అది మరాఠీయేతర సమాజాలు బీజేపీకి మరింత దగ్గరయ్యేలా చేసింది.

దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అయాక ప్రధాని నరేంద్ర మోదీ వర్కింగ్ స్టైల్‌ను అందిపుచ్చుకున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో కొందరు ముఖ్యమంత్రులు మాత్రమే తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయగలిగారు. ఫడణవీస్‌కు కూడా అస్థిర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆయన తన పదవీకాలం పూర్తి చేయగలిగేలా పార్టీలోని అంతర్గత శత్రువులను, నిరంతరం విభేదించే మిత్రపక్షం శివసేనను సమర్థంగా హాండిల్ చేయగలిగారు.

అంతర్గత ప్రత్యర్థులపై పైచేయి

ఫొటో సోర్స్, facebook/Devendra Fadnavis

అంతర్గత ప్రత్యర్థులపై పైచేయి

ఫడణవీస్ సొంత పార్టీలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొన్నారు. నితిన్ గడ్కరీ, ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డే, చంద్రకాంత్ పాటిల్ లాంటి వారిని ఫడణవీస్ ప్రత్యర్థులుగా భావిస్తారు.

వీరిలో ఒకరైన గడ్కరీకి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడంతో, ఆయన ఆటోమేటిగ్గా రాష్ట్ర స్థాయి రాజకీయాల నుంచి సైడైపోయారు. మరోవైపు ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ తవాడే, వినోద్ తవాడే లాంటి మంత్రులు అప్పుడప్పుడూ ఇబ్బందుల్లో పడుతూ వివాదాల్లో మునిగిపోతూ వచ్చారు.

ఖడ్సేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన్ను తర్వాత ఎప్పుడూ క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా ఇవ్వలేదు. ఇక, వినోద్ తవాడే నకిలీ డిగ్రీ వివాదం, పాఠశాల ఉపకరణాల్లో జరిగిన అవకతవకల వివాదాల్లో చిక్కుకున్నారు.

పంకజ ముండే కూడా చిక్కీ సేకరణ అంశంలో వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.

ఇవన్నీ దేవేంద్ర ఫడణవీస్‌కు కలిసివచ్చాయి. ఈ నేతలు ఇక ఎప్పటికీ పైకి రాకుండా ప్రత్యామ్నాయంగా ఆయన కొందరు నేతలను బలోపేతం చేశారని కూడా చెబుతారు. ఖడ్సేకు బదులు గిరీష్ మహాజన్‌, వినోద్ తవాడేకు ప్రత్యామ్నాయంగా ఆశిష్ షేలర్‌ను ఆయన ముందుకు తీసుకొచ్చారు.

కానీ ఫడణవీస్‌కు చంద్రకాంత్ పాటిల్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్‌లో నంబర్ టూగా ఉన్న ఆయనకు దిల్లీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను అమిత్ షాకు నమ్మకస్తుడుగా చెబుతారు. మరాఠీ కావడం ఆయనకు అనుకూలం అయ్యింది. ముందు ముందు ఫడణవీస్‌కు చంద్రకాంత్ పాటిల్ ప్రధాన ప్రత్యర్థిగా మారవచ్చు. పార్టీలోని మిగతా ప్రత్యర్థులు కూడా ఫడణవీస్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో ఫడణవీస్ నేతృత్వంలో బరిలోకి దిగిన బీజేపీకి ఊహించినన్ని సీట్లు రాకపోవడం కూడా ఆయనకు ఒక ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టాయి. దాంతో, పార్టీలో ఆయన ప్రత్యర్థులందరూ సరైన అవకాశం కోసం కాచుకుని కూచున్నారు.

మరాఠా సమాజంతో సవాళ్లు ఎలా ఉంటాయి

ఫొటో సోర్స్, facebook/Devendra Fadnavis

మరాఠా సమాజంతో సవాళ్లు

ఆయన ముందున్న కీలక సవాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చూపించే మరాఠాలను ఎదుర్కోవడం, వారి మద్దతు గెలుచుకోవడం.

రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ మరాఠా సమాజం వారు నిశ్శబ్ద ర్యాలీలతో భారీగా వీధుల్లోకి వచ్చారు. ఇది ఫడణవీస్‌కు పెద్ద సమస్య అయ్యుండేది. కానీ, ఆయన ఆ సవాలును విజయవంతంగా అధిగమించారు. మరాఠాలకు వెంటనే రిజర్వేషన్లు ప్రకటించించి వారిని శాంతింపజేశారు.

దేవేంద్ర ఫడణవీస్ మీద కారవాన్ మాగజీన్‌లో ఒక వ్యాసం రాసిన సీనియర్ జర్నలిస్ట్ అనోశ్ మాలేకర్ ఆయనకు మరాఠా సమాజానికి మధ్య బంధాన్ని విశ్లేషించారు.

"మరాఠా ఓట్లు, నాయకత్వం మధ్య 1995 నుంచి విభజన మొదలైంది. ముఖ్యమంత్రి అయ్యాక ఆ విభజనను చాకచక్యంగా వాడుకోవడంలో దేవేంద్ర ఫడణవీస్ విజయవంతం అయ్యారు" అని చెప్పారు.

"2010లో పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయినపుడు మరాఠా సమాజంలో వచ్చిన చీలిక రాజకీయాలను మలుపు తిప్పింది. మరాఠాలు కాంగ్రెస్, ఎన్సీపీగా చీలిపోయారు. 2014లో అధికారంలోకి వచ్చినపుడు ఫడణవీస్ దీనిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కొంతమంది మరాఠా నేతలను చాకచక్యంగా తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు".

ఇక్కడ బీజేపీ నేతలు సృష్టించే పరిస్థితి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా టీవీ తెరలు, మిగతా మీడియాను ఉపయోగించి వారు ప్రజల కళ్ల ముందు సృష్టించే చిత్రం చాలా తెలివిగా ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఛత్రపతి శంభాజీ రాజేను 2016లో బీజేపీ తమ వైపు తిప్పుకుంది. దాంతో, విపక్షంలో ఉన్న మరాఠా సమాజం వారు గందరగోళంలో మునిగిపోయారు. తర్వాత నుంచి వారిలో చాలామంది బీజేపీ వైపు వచ్చేశారు.. వారి కోపం కూడా సద్దుమణిగింది" అని మాలేకర్ రాశారు.

ఫడణవీస్ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించినా, దానికి తగ్గట్టు వచ్చే ఐదేళ్లలో వారికి ఉద్యోగాలు కల్పించడం ఆయనకు మరో సవాలు కాబోతోంది. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత మరాఠా యువతలో అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవడం ఫడణవీస్‌కు కష్టం కాబోతోంది.

మీడియాపై అవగాహన - మీడియాపై అదుపు

ఫొటో సోర్స్, facebook/Devendra Fadnavis

మీడియాను అదుపు చేస్తారా?

ఫడణవీస్‌కు మీడియాపై మంచి అవగాహన ఉందని చెబుతారు. కానీ, ఇప్పుడు ఆయన మీడియాను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

"దేవేంద్ర ఫడణవీస్ ఇంతకు ముందు మీడియాను చాలా తెలివిగా ఉపయోగించుకునేవారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన వాటిని తనకు అనుకూలంగా ఒక దిశలో నడపడంలో విజయవంతం అయ్యారు. ముఖ్యంగా ఆయన జర్నలిస్టుల్లో సానుభూతిపరులను సృష్టించుకున్నారు. వాళ్లు బీజేపీ అధికార ప్రతినిధుల్లా పనిచేస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే వారు ప్రభుత్వానికి మద్దతిస్తారు. మీడియా ద్వారా ఒక పాజిటివ్ ఇమేజ్ ఎలా సృష్టించుకోవాలో, మీడియాను మేనేజ్ చేసి నెగటివ్ కవరేజీని ఎలా ఆపేయాలో ఫడణవీస్‌కు చాలాబాగా తెలుసు. కానీ ఇది మీడియాకు మంచికి కాదు" అని దీనిపై హఫింగ్‌టన్ పోస్ట్‌లో పవన్ దహత్ రాశారు.

"మీడియాను ఉపయోగించుకోవడం అనే ఈ వ్యూహం ఆయనకు రాజకీయాల్లో చాలా సహకరిస్తుంది. మీడియాపై అదుపు ఉంటే, అసలు సమాచారం ప్రజలకు చేరదు. ఉదాహరణకు, మా పాలనలో ఎలాంటి కుంభకోణాలు, ఆరోపణలు, అవినీతి జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మనం గత ఐదేళ్లలో చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నో ఆరోపణలు కనిపిస్తాయి. మంత్రులు పదవులు కూడా వీడారు. కానీ మీడియాను మేనేజ్ చేసేయడంతో ప్రభుత్వంపై ఆ ప్రభావం పడదు" అని పవన్ అందులో చెప్పారు.

బీజేపీ ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ ఈ ఆరోపణలను ఖండించారు. "ముఖ్యమంత్రి చాలా సమర్థులు. ఆయన రోజుకు 17 నుంచి 18 గంటలు పనిచేస్తారు. అంత సమర్థులైన సీఎం కాబట్టే మీడియాలో ఆయనకు పాజిటివ్ ఇమేజ్ ఉంది. మనమే స్వయంగా మీడియా గురించి సందేహాలు వచ్చేలా చేస్తున్నాం. అది తప్పు" అన్నారు.

లోక్‌మత్‌ సీనియర్ జర్నలిస్ట్ యదు జోషి కూడా.. "పారదర్శకత వల్లే దేవేంద్ర ఫడణవీస్‌కు ఆ ఇమేజ్ వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మంచి రాజకీయవేత్తగా ఆయన ఇమేజ్ సృష్టించుకున్నారు. అధికారంలోకి వచ్చాక మంచి పాలన అందించారు. తన పారదర్శకతను కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ఆ ఇమేజ్ రావడానికి సహకరించాయి. దానికి ఆయన మీడియాతోపాటు సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకున్నారు" అన్నారు.

ఫడణవీస్ ముందున్న సవాళ్లేంటి

ఫొటో సోర్స్, facebook/CMOMaharashtra

ఫడణవీస్ ముందున్న సవాళ్లేంటి?

దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా మరో ఐదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా.. అది ఆయనకు ముళ్ల సింహాసనమే కాబోతోంది. ఎందుకంటే, కూటమిలో ఉన్నప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చిన శివసేనను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఎదుర్కోవడం ఆయనకు కత్తిమీద సామే అవుతుంది. సీఎం కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరి నిమిషంలో చతికిలబడ్డ ఆ పార్టీ నేతలు ఫడణవీస్‌ను కచ్చితంగా ఇబ్బందుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తారు.

దానికి తోడు మరాఠా యువతకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఫడణవీస్ ముందున్న మరో పెద్ద సవాలు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను కూడా ఆయన చక్కదిద్దాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వం ఆర్థిక మందగమన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఎన్సీపీ నేతలు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ధంగర్ సమాజానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. దానిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక రైతుల్లో నమ్మకం ఏర్పరచుకునేందుకు ఫడణవీస్ మరింత కష్టపడాలి. ముఖ్యంగా వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ పనులు చేసి చూపించాలి. పూర్తి చేయాల్సిన చాలా ప్రాజెక్టులు కూడా పెండింగులో ఉన్నాయి. ఈ సవాళ్లన్నీ అధిగమించినప్పుడే.. దేవేంద్ర ఫడణవీస్ మరోసారి తన ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)