మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు? : అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నసీరుద్దీన్, సీనియర్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
'దేవుడి బందీలను దేవుడి మసీదులోకి వెళ్లకుండా అడ్డుకోకు'
'ఒక మహిళ మసీదులోకి వెళ్లాలని మీలో ఎవరినైనా అనుమతి కోరితే, దానిని తిరస్కరించకు'
'మసీదులో స్త్రీలకు ఏ భాగం ఉందో, దాని నుంచి ఆమెను అడ్డుకోకు'
'మీ మహిళలు మసీదులోకి వెళ్లడాన్ని నిరాకరించకు'
'మీ మహిళలు రాత్రి మసీదులోకి వెళ్లడానికి అనుమతి అడిగినా, వారిని వెళ్లనివ్వు'
ఇది ఎవరు, ఎవరితో, ఎప్పుడు, ఎందుకు చెప్పారు?
ఈ మాటలు 1450 సంవత్సరాల ముందు చెప్పినవి. ఇస్లాం ప్రవక్త హజరత్ మొహమ్మద్ ఇవి చెప్పారు. ఈ ఆదేశాలు పురుషులకు ఇచ్చారు. మసీదులోకి మహిళల ప్రవేశం గురించి ఆయన ఈ మాటలు చెప్పినట్లు దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ఇది మతపరమైన సమస్యేనా?
ఈ అంశం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, దీనిపై ఇప్పుడు ఎలాంటి చర్చా జరగకూడదు. కానీ మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశం, నమాజు చదవడం గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశం ఎలాంటి రంగు పులుముకుందంటే, ఇస్లాం మూలాల్లోనే మహిళలు మసీదులోకి ప్రవేశించడానికి వ్యతిరేకంగా ఉన్నట్టు చాలా మందికి అనిపిస్తోంది.
కొన్ని నెలల క్రితం మసీదులో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు.
ఇక్కడ సమస్య ఉంది. కానీ ఏ మతం మహిళైనా తన ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లిరావడంపై నిషేధం ఉండడమే ఆ సమస్య.
వాళ్ల రాకపోకలపై పురుషులు నియంత్రణ కోరుకుంటారు. మహిళలు ఎప్పుడు, ఎక్కడకు, ఎలా, ఎంత సేపు వెళ్లాలనేది వారే నిర్ణయిస్తున్నారు.
అందుకే, మన పితృస్వామ్య సమాజంలో జనాభాను బట్టి చూస్తే, బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఉనికి, మగవాళ్ల కంటే చాలా తక్కువే కనిపిస్తుంది.
మసీదుల్లో కూడా అదే అమలవుతోంది. అవును, ఇక్కడ మహిళలను నియంత్రించడానికి చాలాసార్లు మతం సాయం కూడా తీసుకుంటూ ఉంటారు.
మహిళలు ఒంటరిగా, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లిరావడాన్ని వ్యతిరేకిస్తూ వాదించినట్లే, మహిళలు మసీదుల్లోకి కూడా ప్రవేశించకూడదని వాదనలు వినిపిస్తారు.
సమస్య మసీదులోకి వెళ్లిరావడం మాత్రమే కాదు. అంటే, కేవలం మసీదుల్లోకి వెళ్లివచ్చినంత మాత్రాన ఈ సమస్య అంతం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లిం మహిళల మతపరమైన హక్కు
అంటే దీనికి అర్థం ఏంటి.. మహిళలు ఇంకా వేచిచూస్తూనే ఉండాలా?
అస్సలు అవసరం లేదు.
మిగతా ప్రాంతాల్లో ఆమె ఎలా తన చోటును దక్కించుకుందో, ఇక్కడ కూడా ఆమె అలాగే తన చోటు సంపాదించుకోవాలి. అది ఆమె మతపరమైన హక్కు. ముస్లిం పురుషులకు ఈ హక్కు ఎంత ఉంటుందో, అంతే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉంటుంది.
ఇస్లాం ఈ మతాన్ని విశ్వసించేవారికి మతపరమైన ఐదింటిని అనుమతించింది. అవే షహాదత్ (దేవుడి ఉనికిపై విశ్వాసం), నమాజ్, రోజా, జకాత్, హజ్. వీటిలో స్త్రీలు, పురుషులనే వ్యత్యాసం ఉండదు.
పురుషులైనా స్త్రీలైనా ఇక్కడ ఎలాంటి మినహాయింపు ఉండదు. పురుషుడు మతపరమైన తన విధిని నిర్వహించడానికి, నమాజు చదవడానికి మసీదులోకి వెళ్లినపుడు, మహిళలు అక్కడికి ఎందుకు వెళ్లకూడదు అనేదే ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
హజరత్ మొహమ్మద్ కాలంలో ఏం జరిగింది
మనం హజరత్ మొహమ్మద్ కాలం అని చెప్పుకునే సమయంలో జరిగింది గమనిస్తే, ఆయన సహచరులు, ఆయన భార్యలు, ముఖ్యంగా హజరత్ ఆయేషా లాంటి వారు ఆ కాలం గురించి చాలా వివరించారు. వారి సమాచారం ప్రకారం ఆ కాలంలో మహిళలు కూడా మసీదులోకి వెళ్లేవారని, హజరత్ మొహమ్మద్ భవనంలో నమాజు చదివేవారని తెలుస్తుంది.
మహిళలు, ఫజ్ర్ నమాజులో ఆయనతో పాటు జమాత్ నమాజ్ చేసేవారని హజరత్ ఆయేషా ద్వారా తెలిసింది. నమాజు అయిన తర్వాత, మహిళలు అక్కడ నుంచి నెమ్మదిగా బయటకు వెళ్లేలా, హజరత్ మొహమ్మద్ మసీదులో కాసేపు ఆగేవారని హజరత్ ఉమ్ సల్మా తెలిపారు.
అప్పట్లో మహిళలు మసీదుకు రావడాన్ని ప్రోత్సహించేవారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. వారి ఇబ్బందుల గురించి చాలా సున్నితంగా వ్యవహరించేవారు. "నమాజు ప్రారంభిస్తాను, సుదీర్ఘంగా చేయాలనుకుంటాను. కానీ, ఎవరైనా పిల్లల ఏడుపు వినిపిస్తే, దానిని కాసేపట్లో ముగిస్తాను" అని హజరత్ మొహమ్మద్ చెప్పినట్లు ఒక ప్రస్తావన ఉంది.
తర్వాత, "పిల్లలు ఏడవడం వల్ల వారి తల్లులకు కష్టంగా, అసౌకర్యంగా ఉంటుంది. అందుకే అలా చేస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.
దీనిని బట్టి మహిళలు మసీదులో నమాజు చేసేవారనేది స్పష్టమవుతుంది. ఇప్పటిలాగే, అప్పుడు కూడా పిల్లల పెంపకం బాధ్యతలను తల్లులే చూసుకునేవారు.

ఫొటో సోర్స్, Reuters
మసీదుకు రావాలంటూ మహిళలకు ఆదేశం
హజరత్ మొహమ్మద్ అలా అనుకోవడమే కాకుండా, ఆయన దానిని గట్టిగా సమర్థించారు. ముస్లిం మహిళలకు పిల్లల వల్ల అసౌకర్యం కలగకుండా, వారి ప్రార్థనలు కూడా పూర్తయ్యేలా చూసుకున్నారు. ఆయన అలా చేసేందుకు ఒక దారి కూడా చూపించారు. కానీ, ఈ కాలంలో ముస్లిం మహిళల పట్ల ఆ సున్నితత్వం కనిపిస్తోందా?
అంతే కాదు, మహిళలకు మసీదు ప్రవేశం ఉన్నట్లు ఎన్నో ఉదాహరణలు కూడా లభిస్తాయి. అక్కడ మహిళలు జుమా, ఈద్, బక్రీద్ నమాజుల్లో పాల్గొనాలనే ఆదేశాలు కూడా కనిపిస్తాయి. మహిళలు ఎవరికైనా నమాజుకు రావడానికి అసౌకర్యంగా ఉంటే, వారు పరిష్కారం కూడా చూపించేవారు. ఉదాహరణకు.. ఒక మహిళకు నమాజు చేసేందుకు తలపై కప్పుకునే వస్త్రం లేకుంటే, అలాంటి వారు తమ సోదరి వస్త్రాన్ని కప్పుకోవచ్చని చెప్పారు.
అంతే కాదు, మహిళలు రావడాన్ని ఆయన ఎందుకు ప్రోత్సహించేవారంటే, ఈ నమాజులతో ఖుతబా జరిగేది. అందులో శిక్షణ, సాకేతికత గురించి మాట్లాడేవారు. ఆ విషయాలు మహిళల వరకూ చేరేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఈ బోధనల్లో కేవలం పురుషులకే కాక, మహిళలకు కూడా భాగస్వామ్యం ఉండేది.
మహిళలు విడిగా కూడా ఖుతబా చేసేవారు. అవన్నీ మసీదుల్లోనే జరిగేవి అనడానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి.
అంతే కాదు, మహిళలు కూడా నమాజు పఠించేవారు. దానికి వారికి మసీదుల్లో ప్రత్యేక ప్రాంతం కేటాయించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు ముఖ్యమైన మసీదులు-మహిళలు
ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ముస్లింలకు మక్కాలోని అల్-హరామ్ మసీదు, మదీనాలోని నబావీ మసీదు, జెరూసలెంలోని అక్సా మసీదు అత్యంత పవిత్రమైనవి. వీటిలో ఇస్లాం ప్రారంభంలో కూడా మహిళలు నమాజు చేయడానికి వెళ్లేవారు.
ఇప్పటికీ హజ్ యాత్రలో ముస్లిం మహిళలు, పురుషులు కలిసి తమ మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నారు. కలిసి నమాజు చదువుతున్నారు. వీరిలో స్వదేశంలో ఎప్పుడూ మసీదుల్లోకి వెళ్లనివారు లేదా వెళ్లడానికి అనుమతి లభించని వారు, మహిళలు కూడా మసీదుల్లోకి వెళ్లవచ్చని తెలియనివారు ఉంటున్నారు.
కానీ, మసీదులో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నవారు, దానికి వాటికి ఒక వాక్యాన్ని జోడించారు... "మహిళలు ఇంట్లోనే నమాజు చేయడం మంచిది" అని చెప్పారు.

ప్రార్థన, విద్య, భక్తి కలిసుండే స్థలం మసీదు
ఇస్లాం ప్రారంభం నుంచీ మసీదు అనే ఆలోచన కేవలం నమాజు చదవడం కోసమే కాదు. మసీదులను ఎన్నో ఉద్దేశాలతో రూపొందించారు. నమాజు, ప్రార్థించడం, విద్య, సలహాలు, సమావేశాలు, బదిలీ, సంరక్షణ, సామాజిక భద్రత లాంటి అన్నీ ఇందులో ఉండేవి. తమ ఆలోచలనకు మసీదు ఒక బహిరంగ ప్రాంతంలా ఉండేది. అందుకే మసీదుల్లో చాలా పెద్దగా ఉండే హాలు తప్ప ఇంకేం కనిపించదు. ఆ బహిరంగ ప్రాంతం చాలా ముఖ్యమైనది.
అంటే, మసీదులో అందరూ ఒకేసారి ఏదో ఒక సమూహంలో చేరవచ్చు. ఇక్కడ సామాజిక, ఆర్థిక అసమానత్వానికి చోటిచ్చే ఎలాంటి మతపరమైన వ్యవస్థ లేదు.
"మసీదులు ప్రార్థించే స్థలాలే కాదు, అవి దర్శాగాహే, తబియత్‌గాహే( విద్య, ఆరోగ్యం అందించే ప్రాంతాలు) కూడా" అని మౌలానా ఉమర్ అహ్మద్ ఉస్మానీ తన 'ఫిక్హుల్ ఖురాన్'లో చెప్పారు.
అంటే ఇస్లాం ప్రారంభమైన, హజరత్ మొహమ్మద్ కాలంలో మహిళలను మసీదులోకి వెళ్లడానికి, ప్రార్థించడానికి, అందరితో కలిసి జమాత్‌లో నమాజు చదవడానికి వ్యతిరేకంగా నియమాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదు.
అంటే, మనం ఆ కాలం నుంచి ఏదైనా ఎందుకు నేర్చుకోకూడదు? అప్పటి విలువలు, సిద్ధాంతాలు లేకుండానే ముందుకు వెళ్లడం ఎందుకు? మహిళలు మసీదులోకి వెళ్లేందుకు మనమే ఒక దారి ఎందుకు చూపించకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లాం మూల గ్రంథమైన ఖురాన్‌లో మహిళలు, పురుషులకు మతపరమైన అనుమతులు గమనిస్తే, అది కూడా వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపించలేదు.
దీనికి ఒక మంచి ఉదాహరణ సురా అల్-అహ్జాబ్ చెప్పిన ఈ మాటలే.
ముస్లిం పురుషులారా, ముస్లిం మహిళలారా,
మత విశ్వాసాలు ఉన్న పురుషులు, మహిళలారా
నిజం చెప్పే పురుషులారా, మహిళలారా
సహనం ఉన్న పురుషులారా, మహిళలారా
వినయం చూపే పురుషులారా, మహిళలారా
అల్లాను గుర్తుచేసుకునే పురుషులారా, మహిళలారా
మీ అందరి కోసం అల్లా చాలా పెద్ద క్షమాపణను, ఒక పెద్ద పగను సిద్ధం చేసి ఉంచారు.
అందుకే, స్త్రీ, పురుషులు ఇద్దరికీ అల్లా ఆదేశం ఒకేలా ఉన్నప్పుడు, మా పట్ల ఇంత వివక్ష ఎందుకు అని ఇప్పుడు ముస్లిం యువతి లేదా మహిళ ప్రశ్నించాలి.
వారి ఈ ప్రశ్నకు అర్థం లేకుండా పోతుందా?
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
(నోట్- సీరతే ఆయ్షా, సయ్ద్ సులేమాన్ నద్వీ/ఫిక్హుల్ ఖురాన్: మౌలానా ఉమర్ అహ్మద్ ఉస్మానీ/ఔరత్ ఔర్ ఇస్లాం: మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమ్రీ లాంటి పుస్తకాల సాయంతో)
ఇవి కూడా చదవండి:
- డిజిటల్ డ్రెస్... ఖరీదు రూ.6.8 లక్షలు.. కానీ మీరు దీనిని ధరించలేరు
- మా అమ్మకు వరుడు కావలెను
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








