డిజిటల్ డ్రెస్... ఓ భర్త తన భార్య కోసం దీన్ని దాదాపు 7 లక్షలకు కొన్నారు

ఫొటో సోర్స్, SHOGO KIMURA
- రచయిత, కోడీ గాడ్విన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, శాన్‌ఫ్రాన్సిస్కో
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యాపారవేత్త రిచర్డ్ మా తన భార్య డ్రెస్ కోసం 9,500 డాలర్లు (రూ. 6,81,891) ఖర్చు చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ డ్రెస్ అసలు ఉనికిలో లేదు. దానికి భౌతిక రూపం లేదు. అదొక డిజిటల్ డ్రెస్.
దీనిని ది ఫ్యాబ్రికెంట్ అనే ఫ్యాషన్ డిజైన్ సంస్థ రూపొందించి రిచర్డ్ భార్య మేరీ రెన్ ఫొటోకు 'తొడిగింది'. మేరీ ఈ ఫొటోను తన ఫేస్‌బుక్ పేజీలో, వీచాట్ యాప్‌లో షేర్ చేశారు.
"చాలా ఖరీదైనదే, కానీ ఇది కూడా మాకు ఒక పెట్టుబడి లాంటిదే" అని రిచర్డ్ మా అంటున్నారు.
సాధారణంగా తన భార్య ఎప్పుడూ ఖరీదైన దుస్తులు కొనుగోలు చేయదని, అందుకే దీర్ఘకాలం పాటు పనికొచ్చే వస్తువులా దీనిని కొనాలనిపించిందని ఆయన వివరించారు.
"మరో పదేళ్లు దాటితే అందరూ డిజిటల్ దుస్తులు వినియోగిస్తారు. మాకు ఇదొక ప్రత్యేకమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. మారుతున్న కాలానికి ఇదొక సంకేతం లాంటిది" అని రిచర్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, CARLINGS
మరికొన్ని డిజిటల్ డ్రెస్సులు
మరో ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ కార్లింగ్స్ కూడా డిజిటల్ దుస్తులను తయారు చేస్తోంది. నార్వేకు చెందిన ఈ సంస్థ ధర 11 డాలర్ల నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ డ్రెస్సును గత అక్టోబర్‌లో విడుదల చేసింది. అది నెలలోనే 'అమ్ముడుపోయింది'.
"ఒక్క డిజిటల్ డ్రెస్‌ను రూపొందిస్తే, దానికి ఎన్ని కాపీలైనా సృష్టించొచ్చు. కాబట్టి స్టాక్ పూర్తిగా అయిపోయింది, ఇక అమ్మలేం అని అనలేం" అని కార్లింగ్స్ బ్రాండ్ డైరెక్టర్ రోనీ మికల్సెన్ అన్నారు.
డిజిటల్ మార్కెట్‌లో డిజైనర్లు మరింత సృజనాత్మకతతో విభిన్నమైన డిజైన్లను రూపొందించేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, CARLINGS
కార్లింగ్స్ సంస్థ తన నిజమైన వస్త్ర ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా డిజిటల్ డ్రెస్సులను రూపొందించింది. అయితే, భవిష్యత్తులో డిజిటల్ వస్త్రాలకు కూడా మార్కెట్ అవకాశాలు ఉంటాయని ఈ సంస్థ భావిస్తోంది. అందుకే, త్వరలో రెండో దశ డిజిటల్ వస్త్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ది ఫ్యాబ్రికెంట్ సంస్థ ప్రతి నెలా కొత్తవి, ఉచిత డిజిటల్ వస్త్రాలను తన వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. అయితే, వాటిని తమ ఫొటోలకు 'తొడిగేందుకు' వినియోగదారులు ప్రత్యేక నైపుణ్యాలు, సాఫ్ట్‌వేర్ వాడాల్సి ఉంటుంది. అంటే, ఈ డిజిటల్ వస్త్రాలకు ఆదరణ పెరిగేలోగా ఈ సంస్థలు ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆదాయం సంపాదిస్తాయన్నమాట.
అయితే, కార్లింగ్స్ నుంచి, ది ఫ్యాబ్రికెంట్ వెబ్‌సైట్ నుంచి ఈ డిజిటల్ డ్రెస్సులను ఎవరు కొనుగోలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు.
ఇప్పటి వరకు 200 నుంచి 250 డిజిటల్ డ్రెస్సులు అమ్ముడుపోయాయని కార్లింగ్స్ బ్రాండ్ డైరెక్టర్ రోనీ మికల్సెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, THE FABRICANT
ప్రధానంగా ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమలో ఉన్న నిపుణులు, CLO 3D అనే ఫ్యాషన్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను వాడేవారు ఈ డిజిటల్ దుస్తులను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ది ఫ్యాబ్రికెంట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, డిజైనర్ అంబర్ జాయ్ స్లూటెన్ చెప్పారు.
అయితే, "ప్రత్యేకించి.. ఒక డ్రెస్ 9,500 డాలర్లకు అమ్ముడు పోయిన తర్వాత మిగతా వారిలోనూ డిజిటల్ వస్త్రాలపై ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోంది. అవి ఎలా ఉంటాయో చూద్దాం, మనకూ ఒకటి ఉంటే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు" అని ఆయన వివరించారు.
డిజిటల్ ఫ్యాషన్ అనేది అద్భుతమైన విషయమని, ఈ తరహా దుస్తుల గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అమెరికాలోని మార్కెట్ అధ్యయన సంస్థ ఎన్‌పీడీ గ్రూప్‌లో చీఫ్ రిటైల్ అనలిస్టు మార్షల్ కోహెన్ అన్నారు.

ఫొటో సోర్స్, EPIC GAMES
చాలాకాలంగా కంప్యూటర్ గేమ్స్ ఆడేవారు కొందరు ఆటలోని పాత్రల దుస్తులు, మాస్కులను కొనుగోలు చేస్తున్నారు. ఆ వ్యాపార స్ఫూర్తితో డిజిటల్ వస్త్రాలు రూపొందించాలన్న ఆలోచన చేసినట్లు ది ఫ్యాబ్రికెంట్ సంస్థ తెలిపింది.
"టెక్నాలజీ విషయానికొస్తే, అది ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పుల పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి. మన ఆలోచనలు మారాలి" అని అంటున్నారు మికల్సెన్.
కంప్యూటర్ గేమ్స్ ప్రభావంతో వినియోగదారుల అభిరుచులు మారడం, డిజిటల్ వస్త్రాలకు కొంత కలిసొచ్చే విషయమన్న ఆశాభావం ఫ్యాషన్ పరిశ్రమలో పెరిగింది.
డిజిటల్ ఫ్యాషన్ అనేది భవిష్యత్తు ఫ్యాషన్ వ్యాపారంలో కీలకంగా మారుతుందని లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లోని ఫ్యాషన్ ఇన్నొవేషన్ ఏజెన్సీ నిర్వాహకుడు మాథ్యూ డ్రింక్‌వాటర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- ఈ మహిళలు నల్లచీరలు కట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు
- ధనత్రయోదశి: బంగారం కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా
- గూగుల్ ఇమేజెస్ ఆవిష్కరణకు కారణమైన జెన్నిఫర్ లోపెజ్ గౌనుకు కొత్త రూపం
- వాషింగ్ మెషీన్లను వాడకూడదా? అసలు బట్టలు ఉతకడం అనవసరమా...?
- క్యాన్సర్ చికిత్సకు వంటింటి చిట్కాలు మేలు చేస్తాయా? హాని చేస్తాయా?
- 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








