వాషింగ్ మెషీన్లను వాడకూడదా? అసలు బట్టలు ఉతకడం అనవసరమా?

వాషింగ్ మెషీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అశితా నగేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బట్టలు ఉతకడం అంటే చాలామందికి చిరాకు పుట్టుకొస్తుంటుంది. అందుకే, రేపు.. మాపు అంటూ వేసిన జీన్స్‌నే వారం పదిరోజులపాటు వేసుకునే బ్యాచిలర్లు భారీగానే ఉంటారు.

అలాంటి వారికి ఒక చక్కని ఉపాయం చెబుతున్నారు లండన్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా మెక్‌కార్ట్‌నీ.

వారానికోసారి, రెండు వారాలకోసారి ఉతకడం కాదు... అసలు బట్టలను ఉతకాల్సిన అవసరమే లేదని ఆమె ఇటీవల 'ది అబ్జర్వర్' వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"మీరు బట్టలను తప్పనిసరిగా శుభ్రం చేయాల్సిన అవసరం లేనప్పుడు, వాటిని అసలు శుభ్రం చేయకండి" అని ఆమె సూచించారు.

బట్టలను ఎందుకు ఉతకొద్దన్న దానికి ఆమె రెండు కారణాలు చెబుతున్నారు.

  • ఉతకడం వల్ల బట్టల మన్నిక తగ్గిపోతుంది.
  • బట్టలు ఉతికినప్పుడు లక్షల సంఖ్యలో విడుదలయ్యే సూక్ష్మ రేణువుల వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది.

బట్టలను ఉతకొద్దని మెక్‌కార్ట్‌నీ చెప్పడం ఇదే తొలిసారి కాదు. బట్టల మన్నిక తగ్గకుండా ఉండేందుకు, వాటివల్ల పర్యావరణంపై ప్రభావం పడకుండా ఉండేందుకు వాషింగ్ మెషీన్ల వాడకాన్ని ఆపేయాలని ఆమె చాలాకాలంగా సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ సూప్ ఫౌండేషన్‌కు చెందిన లారా డియాజ్ శాంచెజ్ కూడా మెక్‌కార్ట్‌నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. రోజువారీగా ధరించే దుస్తుల్లో పాలిస్టర్, అక్రీలిక్ లాంటి సింథటిక్ పదార్థాలు అధికంగా ఉంటాయని ఆమె చెప్పారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా మెక్‌కార్ట్‌నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టెల్లా మెక్‌కార్ట్‌నీ

సూక్ష్మ రేణువులతో పర్యావరణానికి చేటు

"మనం బట్టలను ఉతికిన ప్రతిసారీ సగటున 90 లక్షల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు పర్యావరణంలోకి విడుదలవుతాయి. ఉతికే పద్ధతి, బట్టల తయారీ విధానం మీద ఆ రేణువుల విడుదల ఆధారపడి ఉంటుంది. బట్టలను ఎంత ఎక్కువగా ఉతికితే అంత ఎక్కువ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు వాతావరణంలోకి వెళ్తాయి." అని లారా డియాజ్ వివరించారు.

కొన్ని వాషింగ్ మెషీన్లలో వేడి నీటిలో బట్టలను ఉతికే సదుపాయం ఉంటుంది. అయితే, వేడి నీళ్లతో బట్టలను ఉతకడం మంచిది కాదని లారా అంటున్నారు. వాషింగ్ మెషీన్‌లో తక్కువ టెంపరేచర్ సెట్ చేసి, ద్రవరూప డిటర్జెంట్లను వాడాలని ఆమె సూచిస్తున్నారు.

"పౌడర్ రూపంలో ఉండే డిటర్జెంట్ల వల్ల బట్టల మధ్య రాపిడి అధికమవుతుంది [ఉతికే సమయంలో], దాంతో బట్టల నుంచి అధిక మొత్తంలో సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి. ద్రవరూప డిటర్జెంట్లు వాడితే బట్టల మధ్య రాపిడి చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో రేణువులు విడుదలవుతాయి" అని లారా డియాజ్ వివరించారు.

అలాగే, వాషింగ్ మెషీన్‌లో పరిమితికి మించి బట్టలు వేయడం వల్ల కూడా అందులో రాపిడి అధికమవుతుందని, తక్కువ బట్టలు వేస్తే రాపిడి తగ్గుతుందని ఆమె చెప్పారు.

లోదుస్తులు, బ్రాలు

ఫొటో సోర్స్, Getty Images

లోదుస్తులు

"నేను ప్రతిరోజూ బ్రా మార్చుకోను" అని స్టెల్లా మెక్‌కార్ట్‌నీ ది అబ్జర్వర్‌ పత్రికకు చెప్పారు. అయితే, మెక్‌కార్ట్‌నీతో మహిళల లోదుస్తుల డిజైనర్ నావోమీ డే హాన్ కూడా ఏకీభవిస్తున్నారు.

తన బ్రాండ్ బ్రాలను ఐదు సార్లు వాడిన తర్వాత గోరువెచ్చని నీటిలో, కొద్దిగా బేబీ షాంపూ వేసి చేతితో ఉతకాలని నావోమీ తన వినియోగదారులకు సూచిస్తున్నారు. ఖరీదైనవాటితో పాటు, సాధారణ లోదుస్తులకు కూడా ఇది వర్తిస్తుందని ఆమె అంటున్నారు. అయితే, క్రీడాకారులు ధరించే బ్రాలను మాత్రం తరచుగా ఉతకాలని ఆమె చెప్పారు.

లివైస్ సంస్థ సీఈవో చిప్ బర్గ్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లివైస్ సంస్థ సీఈవో చిప్ బర్గ్

నేను జీన్స్‌ ఉతకను

"జీన్స్‌ను మధ్యమధ్యలో గాలిలో ఆరేస్తే సరిపోద్ది, ఉతకాల్సిన అవసరం లేదు. జీన్స్ మీద ఒకచోట మరక పడితే మొత్తం వస్త్రాన్ని ఉతకుండా, ఆ మరకను మాత్రమే నీటితో శుభ్రం చేయడం మంచిది" అని పర్యావరణ పరిక్షణ సంస్థ వ్రాప్‌ చేపట్టిన 'లవ్ యువర్ క్లోత్స్' క్యాంపెయిన్ నిర్వాహకుడు సారా క్లేటన్ సూచిస్తున్నారు.

బట్టలు ఉతకాల్సిన పనిలేదు అంటే చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, నిజంగానే ఓ బిజినెస్‌మ్యాన్ అలాగే చేస్తున్నారు. ఆయన లివైస్ సంస్థ సీఈవో చిప్ బర్గ్.

తాను వేసుకున్న జీన్స్‌ను అయిదేళ్లుగా ఎన్నడూ ఉతకలేదని 2014లో చిప్ బర్గ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రకటన చేసి ఇప్పటికి అయిదేళ్లు దాటింది. ఆ జత బట్టలను ఇప్పటికీ ఉతకలేదని ఈ ఏడాది మార్చిలో సీఎన్‌ఎన్‌ టీవీ చానెల్‌కు చెప్పారు.

చిప్ బర్గ్‌తో వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ డిజైనింగ్ విభాగం బాధ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ ఆండ్రూ గ్రోవ్స్ కూడా ఏకీభవిస్తున్నారు. జీన్స్‌ను ఉతకకుండా ఫ్రీజర్‌లో పెట్టడం ద్వారా ఆ బట్టల్లోని క్రిములను నశింపజేయొచ్చని ప్రొఫెసర్ ఆండ్రూ గ్రోవ్స్ చెబుతున్నారు.

చిప్ బర్గ్ మాత్రమే కాదు, జీన్స్‌ను ఏళ్లతరబడి ఉతకనివారు చాలామంది ఉన్నారని ఆయన చెప్పారు.

"నాకు తెలిసినవారిలో చాలామంది వారి జీన్స్‌ను ఎన్నడూ ఉతకరు. అది కొందరికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ, బట్టల మన్నిక తగ్గకుండా, రంగు చెడిపోకుండా ఉండాలంటే ఉతకకుండా ఉండటమే మంచిది. ఇది జీన్స్‌కు మాత్రమే కాదు, అన్ని రకాల వస్త్రాలకూ వర్తిస్తుంది" అని గ్రోవ్స్ చెబుతున్నారు.

జీన్స్

ఫొటో సోర్స్, SAITEX

దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరలేదు

తరచూ ఉతకడం వల్ల బట్టల మన్నిక భారీగా తగ్గిపోతుంది. అంటే, తొందరగా వాటిని చెత్తబుట్టలో పడేసి, కొత్త బట్టలు కొనాల్సి వస్తుందన్నమాట.

"వాషింగ్ మెషీన్లలో రాపిడి వల్ల బట్టల మీద మరకలు తొలగిపోతాయి. అదే సమయంలో ఆ రాపిడి వల్ల వస్త్రాల ఆకృతి, రంగు చెడిపోతుంది" అని ప్రొఫెసర్ గ్రోవ్స్ అంటున్నారు.

"నేను కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న బట్టలు నా వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఎందుకంటే వాటిని ఎలా భద్రంగా చూసుకోవాలో నాకు తెలుసు. ఖరీదైన దుస్తులైనా, రోజువారీగా వేసుకునే సాధారణ బట్టలైనా.. ఎంత భద్రంగా చూసుకుంటే, అవి అంత ఎక్కువ కాలం పనికొస్తాయి" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)