స్పెయిన్: అమ్మకానికి గ్రామాలు.. ధర రూ.39 లక్షల నుంచి ప్రారంభం

స్పెయిన్ గ్రామం
    • రచయిత, ఈస్తర్ కోస్తా
    • హోదా, బీబీసీ వర్క్‌లైఫ్

స్పెయిన్‌లోని గలీసియా ప్రాంతంలో గ్రామీణ జనాభా భారీగా తగ్గిపోతోంది. ప్రజలు గ్రామాలను వదిలిపెట్టి, పట్టణాలు, నగరాలకు వెళ్లిపోతున్నారు. ఇలా, ప్రజలు వదిలేసిన గ్రామాలను ఇప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.

''నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊరంటే నాకు చాలా ఇష్టం'' అని యాభై ఏళ్ల రోసీ కోస్తోయా అన్నారు.

ఆమె జంతు వైద్యురాలు, వ్యాపారవేత్త. తాను 'మీగా'నని కూడా ఆమె చెబుతుంటారు. స్పానిష్‌ ప్రాంతమైన గలీసియాలో మీగా అంటే.. అతీంద్రీయ శక్తులు ఉన్న ఒక మహిళ లేదంటే తెలివితేటలు కలిగిన మహిళ, ముఖ్యంగా స్థానికంగా లభించే మూలికలు, ద్రావణాల గురించి బాగా అవగాహన ఉన్న గ్రామీణ మహిళ.

గలీసియాలోని అడవుల్ని ఆనుకుని ఉన్న కోస్తా తీరం, గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చని అందాలంటే కోస్తోయాకు ఇష్టం. గలీసియా స్పెయిన్‌కు వాయవ్య కోస్తా తీరంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు గ్రామాలను వదిలిపెట్టేస్తున్నారు. ''మా నాన్న ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించేవారు. చిన్నప్పుడు నేను ఆయనతో కలసి ఇక్కడి చిన్నచిన్న గ్రామాల గుండా నడుస్తూ వెళ్లేదాన్ని. అప్పటికే ఈ గ్రామాలకు ఆదరణ తగ్గిపోతోంది'' అని ఆమె అన్నారు.

స్పెయిన్ గ్రామంలోని ఒక ఇల్లు

ఇప్పుడు.. స్పెయిన్‌లో ప్రజల సగటు వయసు పెరుగుతోంది. జననాల రేటు తగ్గుతోంది. మౌలిక సదుపాయాల కొరత ఎక్కువవుతోంది. ఈ కారణాలన్నీ గలీసియాను దెబ్బతీశాయి. స్పెయిన్ జాతీయ గణాంక సంస్థ ఐఎన్ఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. గలీసియాలో ప్రజలు వదిలేసిన గ్రామాలు 3562. ప్రతివారం వీటికి మరొక గ్రామం తోడవుతోంది.

ఈ నేపథ్యంలో కొస్తోయా, ఆమె భర్త.. బ్రిటన్‌లో పుట్టిన మార్క్ అడ్కిన్‌సన్ ఇద్దరూ కలసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గలీసియాలో మూతపడ్డ శివారు గ్రామాలకు తిరిగి ప్రజల్ని తీసుకువచ్చేందుకు వీరు మొత్తం గ్రామాలను అమ్మకానికి పెడుతున్నారు.

కొస్తోయా తన వృత్తి జీవితంలో మొదటి భాగాన్ని రైతులు, వాళ్ల పశువులతో గడిపారు. 2005లో ఆమె, మార్క్ ఇద్దరూ కలసి గ్రామీణ ఆస్తులను కొనేందుకు, అమ్మేందుకు సొంతంగా ఒక కంపెనీ పెట్టారు. తొలినాళ్లలో తన ఇద్దరు కూతుళ్లతో కలసి అందమైన ఇళ్లను వెదికేందుకు రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్లమని, ఆ తర్వాత గూగుల్ ఎర్త్‌పై ఆధారపడటం ప్రారంభించామని ఆమె గుర్తు చేసుకున్నారు.

స్పెయిన్ గ్రామంలోని బీచ్

ఇళ్లను, గ్రామాలను అమ్మేందుకు ఇప్పుడు వాళ్లకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది. అవకాశాల కోసం వెతకాల్సిన పనిలేనంతగా వాళ్లు ప్రాచుర్యం పొందారు. కొనుగోలుదారులే నేరుగా వారి వద్దకు వస్తున్నారు. బ్రిటన్, అమెరికా, స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాల నుంచే కస్టమర్లు వస్తున్నారు. (గతేడాది హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్‌త్రో తన క్రిస్ట్‌మస్ బహుమతుల జాబితాలో గలీసియాలోని లుగో నగరానికి దగ్గర్లో ఉన్న ఒక పాడుబడ్డ గ్రామాన్ని చేర్చడంతో ఇంటర్నెట్‌లో ఈ వ్యాపారానికి ప్రాచుర్యం లభించింది.)

అయితే, వాళ్లు తమ వ్యాపారాన్ని చాలా కష్టపడి పెంచుకున్నారు. మొత్తం గ్రామాన్ని విక్రయించడంలో చాలా కష్టమైన పని దానికి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్లను సంపాదించడమేనని రోసీ చెప్పారు. ''సరైన కొత్త యజమానిని ఎంపిక చేయడం కూడా నాకు ముఖ్యమే. నేను నా భూమిలో కొంత భాగాన్ని, గలీసియన్ చరిత్రలో కొంత భాగాన్ని అమ్ముతున్నాను'' అని ఆమె అన్నారు. ఈ మధ్యనే ఆమె ఒక ఆస్తిని లండన్‌కు చెందిన ఒక కస్టమర్‌కు విక్రయించారు. 200 మందిని పరిశీలించిన తర్వాత ఈ కస్టమర్‌ను ఆమె ఎంపిక చేశారు.

స్పెయిన్‌లో అమ్మకనికి గ్రామాలు

''మేం విక్రయించే గ్రామాలు.. వాటి లక్షణాలను బట్టి ఒక్కో రేటు పలుకుతుంటాయి. 50 వేల యూరోలు (రూ.39 లక్షల) కంటే తక్కువ ధర ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. 20 లక్షల యూరోలు (రూ.15 కోట్లకు పైగా) వరకూ ధర పలికేవి కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని నివాస స్థలాల ఆధారంగానే ధర ఉంటుంది. అవి ఎక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంటి? నివాసానికి అనుకూలంగా ఉన్నాయా? లేక రిపేర్లు ఉన్నాయా? అన్నవి చూసి నిర్ణయిస్తాం'' అని కొస్తోయా వివరించారు.

ఇప్పటికీ తన జంతు వైద్య వృత్తిని కొనసాగిస్తున్న కొస్తోయా ఈ మధ్యనే ఒక గ్రామాన్ని విక్రయించారు. అందులో మూడు ఇళ్లే ఉన్నాయి. అయితే, వాటి చుట్టూ విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇది వివీరో పట్టణానికి సమీపంలోని బీచ్‌కు దగ్గరగా ఉంది. దీంతో 3 లక్షల యూరోలు (రూ. 2.38 కోట్లు)కు ఈ చిన్న గ్రామాన్ని సెరెనా ఇవాన్స్‌కు విక్రయించారు.

స్పెయిన్ గ్రామం

సెరెనా ఇవాన్స్, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు ఈ చిన్న గ్రామాన్ని కొనుగోలు చేయటం పట్ల సంతోషంగా ఉన్నారు.

''మేం గలీసియాలో ఒక చిన్న ముక్కను సొంతం చేసుకున్నాం. మేం అక్కడ ఉండాలని, సమయం గడపాలని, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం'' అని బ్రిటన్‌కు చెందిన ఇవాన్స్ చెప్పారు.

మిగతా గ్రామాలు తమ కొత్త యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయి. ''మాకు ఇరుగుపొరుగున 30 నుంచి 40 మంది ఉండేవాళ్లు. ఇప్పుడు ఈ గ్రామాన్ని ఇలా చూస్తుండటం బాధగా ఉంది'' అని ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉన్న ఒ పెన్సొ గ్రామంలో నివశించే బెనిట ఫెల్గూర పాడుబడ్డ ఇళ్లను చూపిస్తూ అన్నారు.

తన పెద్ద కుమార్తె సుసానా అడ్కిన్సన్‌తో రోసీ కొస్తోయా
ఫొటో క్యాప్షన్, తన పెద్ద కుమార్తె సుసానా అడ్కిన్సన్‌తో రోసీ కొస్తోయా

గ్రామాల్లో జనాభా తగ్గిపోతుండటంపై 'ల ఎస్పన్న వసియ'.. 'స్పెయిన్ ఖాళీ' వంటి స్థానిక ఉద్యమాలతో స్పెయిన్‌లో చర్చ జరుగుతోంది. ఈ ఉద్యమాలు స్థానిక రాజకీయ నాయకుల దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. విదేశాల్లోని గలీసియన్లు తిరిగి వచ్చేందుకు గలీసియా ప్రాంతీయ అధ్యక్షుడు ఆల్బెర్టో నునెజ్ ఫీజూ.. రాయితీలను ప్రవేశపెట్టారు.

గలీసియాలోని ఒంటరి గ్రామాల విషయంలో రోసీ కొస్తోయా ఆశాభావంతో ఉన్నారు. ''ఈ రోజుల్లో, శివారు ప్రాంతాల్లో నివసిస్తూ కూడా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో అనుసంధానమై ఉండొచ్చు. పాడుబడ్డ ఈ గ్రామాల్లో జనాభాను పెంచడం, స్పెయిన్‌లో జనాభాను పెంచడం.. అందమైన అనుభూతి'' అని కొస్తోయా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)