పింక్ బాల్ మ్యాచ్: డే- నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఈ రంగు బాల్‌ ఎందుకు వాడతారు? ఇది ఆటను మార్చేస్తుందా?

పింక్ బాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శివ కుమార్ ఉళగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టెస్ట్ మ్యాచ్‌లు అంటే... క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘమైనవిగా పరిగణిస్తారు. సంప్రదాయ, పాత కాలపు ఫార్మాట్‌ అని, అసలైన క్రికెట్ అంటే టెస్ట్ క్రికెటేనని క్రీడాభిమానులు అంటుంటారు.

తెల్ల దుస్తుల్లో, రెడ్ బాల్‌తో... 5 రోజుల పాటు (గరిష్టంగా) మ్యాచ్ ఆడటం... టెస్ట్ క్రికెట్ ప్రత్యేకత. క్రికెటర్‌‌కు అసలైన పరీక్ష టెస్ట్ క్రికెట్‌లోనే ఉంటుందని క్రీడా నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు.

టెస్ట్ క్రికెట్‌లో చూపించే ప్రతిభ ఆధారంగానే బ్యాట్స్‌మెన్, బౌలర్ల పనితనాన్ని అంచనా వేస్తుంటారు.

అయితే, దీనిని సంప్రదాయ ఫార్మాట్‌గా పరిగణిస్తున్నప్పటికీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కారణంగా దీనికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

1970 నుంచి వన్డే క్రికెట్ మొదలైంది, 2000 సంవత్సరం తరువాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. కొద్ది కాలంలోనే టీ20 ఫార్మాట్ చాలా ఆదరణ పొందింది.

ఇటీవలి కాలంలో టీ10, వంద బంతుల క్రికెట్ లాంటి పొట్టి ఫార్మాట్లతో సుదీర్ఘ ఫార్మాట్లకు సవాళ్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. భారత్ లాంటి కొన్ని దేశాలలో టెస్ట్ క్రికెట్‌కు ప్రేక్షకులు తగ్గిపోతున్నారు.

పింక్ బాల్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, (పాత చిత్రం)

కాలం మారే కొద్దీ క్రికెట్ కూడా మారుతోంది. 2015 నుంచి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అడిలైడ్ ఓవల్‌ మైదానంలో ఆడిన తొలి డే అండ్ నైట్ టెస్ట్‌లో న్యూజీలాండ్‌పై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పటివరకు 11 డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి.

ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 22) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు పింక్ బాల్‌తో ఆడతారు. భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ మైదానం
ఫొటో క్యాప్షన్, ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ మైదానం

పింక్ బాల్ ఎందుకు?

టెస్ట్ మ్యాచ్‌లు సాధారణంగా ఎరుపు రంగు బంతితో ఆడతారు. కానీ, డే-నైట్ మ్యాచ్‌లలో రాత్రి సహజమైన వెలుగు ఉండదు, ఫ్లడ్‌లైట్ల కింద ఆడాల్సి ఉంటుంది.

ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఎరుపు బంతిని బ్యాట్‌మెన్ గుర్తించడం కష్టం. కానీ, పింక్ బాల్‌ను గుర్తించవచ్చు. అందుకే, పింక్ బాల్‌ను ఎంచుకుంటారు.

భారత గడ్డపై జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో పింక్ బాల్ వినియోగించడం ఇదే మొదటిసారి కావడంతో పలు ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో, పింక్ బాల్ పాత్ర గురించి, డే-నైట్ మ్యాచ్ తరువాత టెస్ట్ క్రికెట్ స్వరూపం, దానికుండే ప్రాముఖ్యతలో ఏమైనా మార్పులొస్తాయా? అన్న అంశాలపై నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, TWITTER/BCCI

టెస్ట్ క్రికెట్ మారుతుందా?

"అనేక ఏళ్లుగా తెల్లని దుస్తుల్లో, రెడ్ బాల్‌తో, ఉదయం అవుట్ స్వింగర్స్, సాయంత్రం ఇన్ స్వింగర్స్, రివర్స్ స్వింగ్‌లతో టెస్ట్ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతుంటే చూడటం ఒక అనుభూతి. కానీ, అన్నింటి లాగే క్రికెట్ కూడా మారుతోంది. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ ముగిశాక, టెస్ట్ క్రికెట్‌‌లో వచ్చిన ఈ కొత్త మార్పును భారత అభిమానులు స్వాగతిస్తారో లేదో మనకు తెలుస్తుంది" అని ప్రముఖ జర్నలిస్టు విజయ్ లోక్‌పల్లి అన్నారు.

ఇది మైదానంలో ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందా అని అడిగినప్పుడు, "పింక్ బాల్, డే-నైట్ ఫార్మాట్ లాంటి మార్పులు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాయని ఒక చర్చ నడిచింది. కానీ, ఈ విషయంలో నాకు అనుమానంగా ఉంది. ఈ మార్పుల వల్ల టీవీ ప్రేక్షకుల సంఖ్య పెరగొచ్చు కానీ, మైదానానికి వచ్చేవారి సంఖ్య పెరగకపోవచ్చు. కొన్ని దేశాలలో టెస్ట్ మ్యాచ్‌లకు మైదానానికి వచ్చే ప్రేక్షకులు తగ్గడానికి ప్రధాన కారణం టీవీల్లో చూసేవారి సంఖ్య పెరగడమే" అని ఆయన వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్, భారత్- ఇంగ్లండ్ సిరీస్‌లు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాయి. ఏ జట్లు ఆడుతున్నాయి? వాటి మధ్య పోటీ ఎలా ఉంది? అన్న అంశాలు జనాలను మైదానానికి రప్పిస్తాయి. కానీ, మ్యాచ్ వ్యవధిలోను, బంతి రంగులోను మార్పులు చేయడం వల్ల అది ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు" అని విజయ్ అభిప్రాయపడ్డారు.

"మార్పుల వల్ల అదనపు ప్రయోజనం ఉందంటే, అప్పుడు ఆ మార్పులను స్వాగతించాలి. అంతేకానీ, టెస్ట్ క్రికెట్ సంప్రదాయాన్ని కాదని, కొత్తగా ప్రాచుర్యం కల్పించేందుకు ఆరాటపడటం బాధాకరం" అని ఆయన వ్యాఖ్యానించారు. గులాబి బంతికి కుట్లు నల్లని దళసరి దారంతో (సీమ్) ఉంటాయి. ఆ బంతితో ఆడటం బ్యాట్స్‌మెన్‌కు కాస్త ఇబ్బందేనని విజయ్ లోక్‌పల్లి అభిప్రాయపడ్డారు.

పింక్ బాల్

'బ్లాక్ సీమ్ వల్ల బంతిని గుర్తించడం కష్టం'

సంప్రదాయ టెస్ట్ క్రికెట్ యుగంలో... భారత్ తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్ ఈ కొత్త మార్పుల గురించి మాట్లాడారు.

''భారత్‌లో మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు మంచి ఫాంలో ఉన్నారు. వాళ్లకు ఈ బంతి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అప్పుడు, బంతి బ్లాక్ సీమ్‌ను గుర్తించడం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌కు కష్టమవుతుంది'' అని మదన్ లాల్ అన్నారు.

''మంచు కారణంగా స్పిన్నర్లు సాయంత్రం ఇబ్బందిపడొచ్చు. అయితే, అశ్విన్ లాంటి నైపుణ్యమున్న స్పిన్నర్లకు అది సమస్య కాకపోవచ్చు'' అని ఆయన చెప్పారు.

టెస్ట్ క్రికెట్‌లో కొత్త మార్పులపై మాట్లాడుతూ, ''2015 నుంచి డే-నైట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. డే క్రికెట్ స్థానాన్ని పూరించాలంటే చాలా సమయం పడుతుంది. మార్పులు అనివార్యం. కానీ, ప్రజాదరణ కోసం అంటూ మార్పులు చేయడం సరికాదు'' అని మదన్ లాల్ అభిప్రాయపడ్డారు.

పింక్ బాల్‌తో ఆడే ఈ టెస్ట్ మ్యాచ్ జట్టుకు సవాలుగా మారుతుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో వ్యాఖ్యానించాడు. డై-నైట్ మ్యాచ్ ఒక మైలురాయి సందర్భం అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)