జార్జి రెడ్డి - 'ది ఫైటర్' - సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, facebook/georgereddymovie
- రచయిత, శతపత్రి మంజరి
- హోదా, బీబీసీ కోసం
మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే ట్యాగ్ లైన్ చూసి ఆచరణను దాని సారాంశంలో చూపిస్తారేమో అనుకుంటాం. కానీ మాస్ సినిమా పరిభాషలో యాక్షన్ అంటే ఫైట్ అని చూపించదల్చుకున్నారని అర్థమవుతుంది జార్జి రెడ్డి సినిమా చూస్తే. జార్జి రెడ్డిలో ఆవేశం పాలు ఎక్కువ అని దూకుడుగా ఉండేవాడని ప్రత్యర్థులతో పాటు మిత్రులు కూడా చెప్పే మాట వాస్తవమే. ఏ సందర్భాల్లో ఆవేశం వచ్చేదో ఎక్కడెక్కడ దూకుడుగా ఉండేవాడో అనే వాటి వెనుక కొన్ని విశ్వాసాలు, విలువలు ఉన్నాయి. ఆవేశం, దూకుడు ఉన్నవాళ్లు క్యాంపసుల్లో చాలామంది దొరుకుతారు. గోల్డ్ మెడలిస్టులు కూడా ఉండొచ్చు. అందరూ జార్జి రెడ్డిలు కాలేరు. దర్శకుడు ఈ ఫైన్ లైన్ని సరిగ్గా పట్టుకోలేకపోయారేమో అనిపిస్తుంది జార్జి రెడ్డి సినిమా చూస్తే.
'జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లాడ్నా సీఖో' అన్నది ఒక సమర నినాదం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణగారిన విద్యార్ధుల హక్కులను కాపాడడానికి, మరో ప్రపంచ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని, దోపిడీ వ్యవస్థను కూల్చి సమ సమాజ స్థాపన జరపాలని ఉవ్విళ్లూరిన ఆశావాది జార్జి రెడ్డి. విప్లవ విద్యార్థి సంఘానికి బీజరూపం జార్జి రెడ్డి. ముందుండి నడిపించి, ఎందరో విద్యార్థులకు ప్రేరణగా నిలిచి, చివరకు అదే యూనివర్శిటీలో దారుణంగా హత్యచేయబడ్డ విద్యార్థి నాయకుడు. తాను ముందుండి నడవడం కాదు, తనలాంటి వాళ్లను అనేకమందిని తయారుచేయాలని అందరూ కలిసి సమాజాన్ని మార్చాలని కలలు కని ఆ కలలను సాకారం చేసుకోవడానికి తనవంతు శ్రమించిన మనిషి. సినిమాటిక్ ఎలిమెంట్స్ అర్థం చేసుకోవచ్చుగానీ ఎంతసేపూ ముందుండి నడవడమే ప్రధానమై నడిపించడానికి పడిన శ్రమ వెనక్కుపోయిందేమో అనిపిస్తుంది.
తల్లిపెంపకంలో బాల్యం నుండే సైంటిఫిక్ టెంపర్ తో పాటు ఆవేశం బాగా ఉన్న జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. అయితే అతడికి హాస్టల్లో భోజనం దగ్గరి నుండి విద్యార్దులను కుల, మత ప్రాతిపదికగా రాజకీయాలు చేసే యూనియన్ లీడర్స్ వరకు అడుగడుగునా సమస్యలు కనిపిస్తాయి. జార్జి రెడ్డి ఆ సమస్యల పట్ల ఆకర్షితుడు అవుతాడు.చూస్తుండగానే నాయకుడిగా ఇంతింతై అన్నట్లుగా మారిపోతాడు. ఆధిపత్యానికి అనువంశిక వారసులం అనుకునే వారికి శత్రువుగా మారతాడు. మెరుపు వేగంతో తాను కేంద్రంగా మారతాడు. రాజకీయ పార్టీల రాడార్ లోకి వస్తాడు. విద్యార్థి నాయకుల హిట్ లిస్టులో చేరుతాడు. ఆ ఇరువర్గాలు జార్జి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెడతారు.ఈ క్రమంలో జార్జి రెడ్డి వారిని ఎలా ఎదుర్కొన్నాడు..చివరికి అతడి కథకు ముగింపు ఏంటి అన్నది స్థూలంగా సినిమా సారాంశం.

ఫొటో సోర్స్, facebook/georgereddymovie
60ల ఆఖరి రోజుల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జార్జి రెడ్డిని చేగువేరా జీవితం, వియత్నం తెగువ ఎంతగానో ప్రభావితం చేశాయి. జార్జిని అంతా 'హైదరాబాద్ చేగువేరా' అని పిలిచేవారు. 1967నుంచి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో జార్జి రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. ఆనాటి విద్యార్థి రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఉస్మానియా యూనివర్శిటీ పరిణామాలకు వ్యతిరేకంగా జార్జి పోరాడారు. ముఖ్యంగా మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకంగా దృష్టి సారించారు. వర్గపోరును ఎంచుకున్నారు. విప్లవ విద్యార్థి సంస్థ పిడిఎస్‌యు ఆవిర్భావానికి దారితీశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిమ్నవర్గాలకు చెందిన విద్యార్థుల పట్ల సంపన్న వర్గాల విద్యార్థులు చేసే దాష్టికాల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమాలలో చురుగ్గా ఉండే జార్జి రెడ్డి చదువులోనూ తన ప్రతిభ కనపరిచి ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీజీ చేసి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ముంబై యూనివర్సిటీ నుండి ఆహ్వానం అందుకున్నారు.
జార్జి రెడ్డి గురించి ఏ కొంత అవగాహన ఉన్న ప్రేక్షకుడికి అయినా అతనో ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, మేధావి, గొప్ప ఉద్యమనాయకుడిగానో గుర్తుకొస్తాడు. పరీక్షల్లో అతడి సమాధాన పత్రం చూసి మంబై విశ్వవిద్యాలయం నుండి ఒక ప్రొఫెసర్ వెతుక్కుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తాడు. జార్జి రెడ్డి చరిత్ర చదివిన లేదా విన్నా ఎవరైనా అతని వ్యక్తిత్వం, అతడి రచనలు, ప్రసంగాల గురించి గొప్పగా చెబుతారు. అయితే చదివినప్పటి లేదా విన్నప్పటి ఫీల్ 'జార్జి రెడ్డి' సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలో కలగకపోవడం సినిమాకు గొప్ప వెలితి. అతను ప్రధానంగా ఫైట్లు చేస్తూ ఎదిగిన కమర్షియల్ నాయకుడిగా , యాక్షన్ హీరోగానే సినిమాలో చూపించారు గానీ, అతని జీవితాన్ని వాస్తవిక కోణంలో, ఉద్వేగభరితంగా ఆత్మను పట్టించడంలో దర్శకుడు జీవన్ రెడ్డి తడబడ్డారు.

ఫొటో సోర్స్, facebook/georgereddymovie
'యాక్షన్'అనేది కేవలం కండబలమే కాదు బుద్ధి బలం కూడా అనే విషయాన్ని మరిచారు. నిజానికి మనం చరిత్రలో జార్జి రెడ్డి గురించి చదివితే.. అతనిలో శారీరక బలంతో పాటు మరెన్నో గొప్ప లక్షణాలు కనబడతాయి. దూకుడు ఎక్స్ ప్రెషన్ కావచ్చు. కానీ అదే ఎసెన్స్ కాదు. సినిమా ఏదో రూపంలో ఎసెన్స్ ను కూడా బలంగా పట్టించి ఉండాల్సింది.
అయినప్పటికీ తెలుగులో నడుస్తున్న బయోపిక్ మ్యానియాలో మిగతా సినిమాలతో పోలిస్తే 'జార్జి రెడ్డి' కచ్చితంగా భిన్నమైనదే అని చెప్పవచ్చు.30సంవత్సరాల కిందటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని, అప్పటి రాజకీయ,సామాజిక సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినదే. యూనిర్సిటీ గొడవలు, రాజకీయాలు ఈ రెండు అంశాలు చాలు యువ ప్రేక్షకులను ఆకర్షించడానికి...అయితే అసలు కంటెంట్ వదిలేసి హీరోయిజం చూపించడం మీదే దృష్టి పెట్టడం మూలాన సినిమా ప్రేక్షకుడి అంచనాలకు దూరంగా నిలిచింది. ప్రథమార్ధంలో కథనం వేగంగా సాగినా, కథ ఎప్పుడు మొదలు పెడతాడో అన్న అసహనం కలుగుతుంది. అయితే ద్వితీయార్ధం అలా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం, ఎమోట్ చేయడం అనే రెండు లక్షణాలు కనుక మనం సినిమా అనే కళారూపం నుంచి ఆశిస్తే అవి అంచనాలకు ఆమడ దూరంలోనే ఆగిపోతాయి.
బాల్యంలో తనను కొట్టిన కుర్రాణ్ణి తిరిగి బ్లేడ్స్ తో గాయపరచడం మొదలు అపోజిట్ బ్యాచ్ ని నిప్పంటించిన ఇనుప బంతితో కొట్టడం వరకు, బస్సులో విద్యార్ధినులను ఏడిపించే గ్యాంగ్ ని కొట్టే ఏంట్రీ సీన్ నుండి కాలేజిలో లెక్చరర్ ను కొట్టాడని తెలుసుకున్న హీరో విలన్ అడ్డాకు వెళ్లి కొట్టే సీన్ వరకు... నోట్లో బ్లేడ్ ఉంచి ఆడడం, ఆయుధాలతో దాడికి దిగిన విలన్ బ్యాచ్ ను ఎదుర్కోవడానికి బ్లేడ్స్ కట్టిన కర్చీఫ్ ఉపయోగించడం..లాంటి దృశ్యాలు నిజాలా కాదా అనేది కూడా సమస్య కాదు. సినిమాటిక్ ఎగ్జాగరేషన్ ఉన్నప్పటికీ ఆ ధోరణి అయితే జార్జిలో ఉండి ఉండొచ్చు. కానీ సినిమా అంటే కొన్ని దృశ్యాలు మాత్రమే కాదు కదా. వాటి కూర్పు- మొత్తంగా అవి మనపై వేసే ముద్ర. వాటిని ఒక క్రమపద్ధతిన ఎలివేట్ చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి అనుకున్న మేర విజయవంతం కాలేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కెమెరా పనితనం బాగున్నప్పుటికీ స్క్రీన్ ప్లే చాలాచోట్ల బలహీనపడి ఏ దృశ్యానికా దృశ్యం ముక్కలుముక్కలుగా విడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ చాలా వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ప్రథమార్ధంలో కలిగిన మంచి ఫీలింగ్ ను కూడా చెడగొడుతుంది. చివరికి ఒక మిశ్రమానుభూతితో థియేటర్ల నుంచి బయటికొస్తాం. 'జార్జి రెడ్డి'ని ఒక క్లాసిక్ గా నిలబెట్టడానికి మంచి అవకాశముండి కూడా ఒక సగటు సినిమాతో సరిపెట్టారన్నది వాస్తవం.
'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ జార్జి రెడ్డి పాత్రలో ఒదిగిపోయాడు.వంగవీటి సినిమాలో అతని నటనకు ఏమాత్రం తగ్గకుండా నటించాడు. కొత్త నటుడు అనే ఫీలింగే అతను కలగనివ్వలేదు. నూటికి నూరు శాతం ఆ పాత్రకు న్యాయం చేసాడు. ఇంటర్వెల్ ముంగిట విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించే ఎపిసోడ్లోనూ, క్లైమాక్సులో సందీప్ నటన చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో స్టార్ హీరోలకు కూడా సందీప్ పాఠాలు నేర్పించాడంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ ముస్కాన్ తన పరిధిలో పర్వాలేదు అనిపించింది. మిగతా నటీనటుల్లో రాజన్నగా అభయ్,లలన్ పాత్రలో నటించిన నటుడు తమదైన ముద్ర వేశారు. సత్యదేవ్ మంచి నటుడు అయినప్పటికీ పాత్ర చెప్పుకోదగిన స్థాయిలో లేదు. కృష్ణచైతన్య, శత్రు, మనోజ్ నందం ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
బహుశా ఎంచుకున్న కథాంశంలో మిస్టరీ పెద్దగా లేకపోవడం దర్శకుడికి ఛాలెంజ్‌గా మారి ఉండొచ్చు. రాజకీయంగా అటూ ఇటూ భిన్నమైన కొసల్లో అభిమానమూ ద్వేషమూ మూటగట్టుకుని ఉన్న నాయకుడి కథ కావడం తప్పితే ఆరంభం నుంచి అంతం దాకా అంతా మనముందే పరుచుకుని ఉన్న కథను గ్రిప్పింగ్ గా నేరేట్ చేయడం ఎట్లా అనేది సవాల్ గా మారి ఉండొచ్చు, అది ఈ యాక్షన్ డామినేటెడ్ రూపం తీసుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడో చిన్న రైడర్. ఇదంతా జార్జి పేరు విన్నటువంటి లేదా ఆ రాజకీయాల గురించి రేఖా మాత్రంగానైనా తెలిసినటువంటివారి సందిగ్ధత. సమాజంలో వీరి సంఖ్య తక్కువ. సగటు ప్రేక్షకుడు ఈ యాక్షన్ సినిమాకు ఎలా స్పందిస్తాడో చెప్పడం కష్టం.
ఇవి కూడా చదవండి:
- కొందరికి మరో చేగువేరా, మరికొందరికి ఆవేశపరుడు.. ఇంతకీ ఎవరీ జార్జి రెడ్డి?
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- ఉద్ధవ్ ఠాక్రే: రాజ్ ఠాక్రేను కాదని బాల్ ఠాక్రే వారసుడిగా ఎలా ఎదిగారు...
- రూ. 2.5 కోట్లు చెల్లించలేదని బాలుడి మృతదేహాన్ని ఇవ్వని హాస్పిటల్‌పై ట్యాక్సీ డ్రైవర్ల దాడి
- డే- నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ ఎందుకు వాడతారు? ఇది ఆటను మార్చేస్తుందా?
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- పీఎస్ కృష్ణన్: ఉద్యోగాన్ని సామాజిక ఉద్యమంలా చేసిన బడుగు వర్గాల బాంధవుడు
- మా అమ్మకు వరుడు కావలెను
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








