సరోగసీ నియంత్రణ బిల్లు: ఈ బిల్లు ఎందుకు అవసరం?

ఫొటో సోర్స్, Getty Images
సరోగసీ నియంత్రణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తాజాగా ప్రవేశపెట్టింది. దానిని రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపింది. 2019 జూలై 15న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఆగస్టు 5న సభ ఆమోదం తెలిపింది. ఇంకా రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది.
సరోగసీకి సంబంధించి కొత్త నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఒక మహిళ వేరే దంపతుల బిడ్డకు జన్మనివ్వడాన్ని సరోగసీ అంటారు.
ఈ బిల్లు ఎందుకు అవసరం?
సరోగసీ పేరుతో జరిగే వ్యాపారానికి, అంటే 'అద్దె గర్భం' విధానానికి అడ్డుకట్ట వేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నైతికత, నిస్వార్థంతో సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ఈ చట్టం ఎలాంటి అడ్డంకులు సృష్టించదు.
ఈ బిల్లు ప్రకారం, సరోగేట్ తల్లికి అంటే బిడ్డకు జన్మనిచ్చే మహిళకు అయ్యే వైద్య ఖర్చులను చెల్లించాలి, బీమా సదుపాయం కల్పించాలి. కానీ, ఆమె నుంచి ఎలాంటి ఫీజులూ వసూలు చేయకూడదు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
ఈ బిల్లు ఏం చెబుతోంది?
ఒక జంటకు వివాహమై అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తవ్వాలి, ఇద్దరిలో ఒకరు వంధ్యత్వానికి గురై ఉండాలి. అప్పుడు మాత్రమే సంతానం కోసం ఆ జంట సరోగసీని ఎంచుకునే వీలుంటుంది.
ముందుగా, ఆ దంపతులిద్దరూ భారతీయులై ఉండాలి.
భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. తమకు పుట్టిన వారైనా, దత్తత తీసుకున్నవారైనా, వారికి పిల్లలు ఉండకూడదు.
ఒకవేళ పిల్లలు ఉన్నా, వాళ్లు మానసిక లేదా శారీరక వైకల్యంతో లేదా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతుంటే... ఆ దంపతులు సరోగసీని ఎంచుకునేందుకు అనుమతి లభిస్తుంది.
సరోగసీ కోసం ఆ దంపతులు 'సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ' కోసం దరఖాస్తు చేసుకోవాలి.
మేజిస్ట్రేట్ కోర్టు నుంచి బిడ్డ పేరెంటింగ్, కస్టడీ ఆర్డర్ తీసుకోవాలి.
సరోగేట్ తల్లికి 16 నెలల బీమా రక్షణ కల్పించాలి.

ఫొటో సోర్స్, iStock
సరోగేట్ తల్లికీ షరతులు
సరోగేట్ తల్లి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆమె కూడా అర్హత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి. ఆ జంటకు ఆమె దగ్గరి బంధువై ఉండాలి.
అయితే, 'దగ్గరి బంధువు' అంటే ఎవరన్న విషయాన్ని ఈ బిల్లు నిర్వచించడం లేదు.
సరోగేట్ తల్లి వివాహితురాలై ఉండాలి, ఆమెకు కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఒక మహిళ తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి. ఆమె మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి సంతకం కోసం పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేస్తే, అది చట్టంగా మారుతుంది.
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సరోగసీ బోర్డుల ఏర్పాటు గురించి కూడా ఈ బిల్లులో ఉంది.
సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను ఆ దంపతులకు పుట్టిన బిడ్డగానే పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక సరోగేట్ తల్లికి అబార్షన్ చేయాలంటే, ఆ మహిళతో పాటు, సంబంధిత అధికారి నుంచి రాతపూర్వక అనుమతి, అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ అనుమతి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 ప్రకారం ఉండాలి.
సరోగసీతో వ్యాపారం చేయడాన్ని నేరంగా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఏ విధంగానైనా సరోగేట్ తల్లి దోపిడీకి గురైతే, అది కూడా నేరం అవుతుంది. సంబంధిత దంపతులు సరోగేట్ బిడ్డను స్వీకరించేందుకు నిరాకరిస్తే, అది కూడా నేరం అవుతుంది. ఈ నేరాలలో, దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా పడుతుంది.
మరి, ఇలాంటి నియంత్రణ బిల్లు ఎందుకు అవసరం?
కమర్షియల్ సరోగసీని నిషేధించాలని, అందుకోసం ఒక చట్టాన్ని రూపొందించాలని, అప్పుడు సరోగసీని ఒక దాతృత్వంగా పరిగణించి అనుమతి ఇవ్వవచ్చు అని... భారత లా కమిషన్ తన 228వ నివేదికలో సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- ‘‘నాగాలాండ్ దాటి ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు’’
- సిరియా: అసలేం జరుగుతోంది? ఎవరు ఎవరి వైపు?
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- ‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









