కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక మ్యాప్ నేపాల్‌లో భారీ నిరసనలకు దారితీసింది. 'కాలాపానీ' అనే ప్రాంతాన్ని భారత్‌లో భాగంగా చూపించడమే ఆ నిరసనలకు కారణం.
దీనిపైన నేపాల్ ప్రధాని మాట్లాడుతూ.. 'మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఇతరుల ఆక్రమణలో ఉండటానికి మేం అనుమతించం. భారత సైనికులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి' అన్నారు.
మరోపక్క కొత్త మ్యాప్‌లో సరిహద్దులకు సంబంధించి ఎలాంటి సవరణలూ చేయలేదని, కేవలం జమ్మూకశ్మీర్ విషయంలో వచ్చిన మార్పులను మాత్రమే చూపించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
ఇంతకు ముందున్న మ్యాప్‌లలో కూడా కాలాపానీ భారత్‌లో భాగంగానే ఉందని భారత్ చెబుతోంది. నేపాల్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు. ఇంతకీ ఈ కాలాపాని వివాదం ఏంటి?

భారత్ - చైనా యుద్ధం తరువాత ఏం జరిగింది?
నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దును ఉత్తరాఖండ్ రాష్ట్రం పంచుకుంటోంది. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతమే కాలాపానీ. దీని విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు.
అండమాన్‌లో ఉన్న సెల్యులర్ జైలును కూడా కాలాపానీ అనే అంటారు. కానీ, దానికీ, ఈ ప్రాంతానికీ ఎలాంటి సంబంధం లేదు. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ కాలాపానీ ప్రాంతంలోనే మహాకాలీ నది పుడుతుంది.
ఈ ప్రాంతం భారత్‌లోనే ఉందని తాజాగా విడుదల చేసిన మ్యాప్ చెబుతోంది. కానీ, కాలాపానీ తమ దేశంలోని దార్చులా జిల్లాలో ఉందని, అది భారత్‌లో ఉన్నట్లు చూపించడం సరికాదని నేపాల్ అంటోంది. సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది.
భారతీయ యాత్రికులు కైలాశ్ మానసరోవర్ సందర్శనకు ఈ కాలాపానీ మార్గం గుండానే వెళ్తారు. 1962లో భారత్ - చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో యుద్ధం జరిగిన సమయంలో వ్యూహాత్మకంగా కాలాపానీని సైనిక స్థావరంగా చేసుకోవడానికి భారత్‌కు తాము సహకరించినట్లు నేపాల్ చెబుతోంది. ఆ ప్రాంతంలో సైనిక పోస్ట్ ఉండటం వల్ల చైనా సైనికులు దిగువకు రాకుండా భారత సైన్యం అడ్డుకోగలిగింది.
ఆ యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించిందని, కానీ అక్కడి నుంచి మాత్రం భారత సైన్యం వెనక్కు వెళ్లలేదని నేపాల్ అధికారులు అంటున్నారు.
ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో తాము జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఈ కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ చెప్పడానికి బలమైన కారణం సుగౌలీ ఒప్పందం.
నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం కాలీ నది భారత్‌తో నేపాల్ సరిహద్దుగా ఉందని ఆ దేశం అంటోంది. కాలాపానీ భారత్‌లో ఉండటమంటే సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వాజపేయి ఇచ్చిన మాట
2000 సంవత్సరంలోనే రెండు దేశాల ప్రధానుల మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. నేపాల్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఆక్రమించదని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హామీ ఇచ్చారు. తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులూ ఆ అంశాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది కొలిక్కి రాలేదు.
ఇప్పటి భారత, నేపాల్ విదేశాంగ శాఖ అధికారులు కూడా స్నేహపూర్వక వాతావరణంలో చర్చల ద్వారానే దీనికి ముగింపు పలకడానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు.
2014లో మోదీ నేపాల్‌లో పర్యటించినప్పుడు కూడా ఈ అంశానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం కొత్త మ్యాప్ విడుదల చేయడంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది.

అయితే, ఈ మ్యాప్‌లో నేపాల్‌తో సరిహద్దుల విషయంలో ఒక్క మిల్లీమీటర్ కూడా మార్పులు చేయలేదని, కేవలం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపించామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ కుమార్ చెప్పారు.
సరిహద్దు దగ్గర చైనా సాగించే కార్యకలాపాలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ భారత నియంత్రణలో ఉండటం ఎంతో కీలకం అని భారత్ నేపాల్ సరిహద్దు వ్యవహారాల నిపుణుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఎస్ పంగ్తీ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'
- "రామాలయ నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతాయి"
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- అయోధ్య తీర్పు: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు ఇప్పుడు ఏమవుతాయి...
- రూ. 2.5 కోట్లు చెల్లించలేదని బాలుడి మృతదేహాన్ని ఇవ్వని హాస్పిటల్‌పై ట్యాక్సీ డ్రైవర్ల దాడి
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- నిత్యానంద: కోతులకు సంస్కృతం నేర్పించానంటారు... సూర్యుడిని ఆపేశానని చెబుతారు
- అమ్మకానికి గ్రామాలు.. ధర రూ.39 లక్షల నుంచి ప్రారంభం
- "ఏటైనా సేయండి.. నా కొడుకుని తీసుకురండి" - ఈజిప్టులో మరణశిక్ష పడ్డ శ్రీకాకుళం కార్మికుడి తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








