గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో భద్రతా లోపాన్ని కనిపెట్టండి.. రూ.10 కోట్ల వరకు బహుమతిని గెలుచుకోండి

ఫొటో సోర్స్, EPA
గూగుల్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు కొన్నింటిలో భద్రతా లోపాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించేవారికి ఇచ్చే బహుమానాన్ని పెంచుతోంది. దీనిని రెండు లక్షల డాలర్ల నుంచి గరిష్ఠంగా 15 లక్షల డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు)కు పెంచుతోంది.
అత్యధిక బహుమానం 'పిక్సెల్' స్మార్ట్‌ఫోన్లలోని టైటాన్ ఎం చిప్‌లో భద్రతా లోపాలను గుర్తించేవారికి దక్కుతుంది. నిర్దేశిత విధానానికి లోబడి లోపాలను సంస్థ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
2015 నుంచి భద్రతా పరిశోధకులకు 40 లక్షల డాలర్లకు పైగా సొమ్ము చెల్లించామని గూగుల్ తెలిపింది.
తమ ఉత్పత్తులు, సేవల్లో భద్రతా లోపాలను గుర్తిస్తే యాపిల్, బజ్‌ఫీడ్, ఫేస్‌బుక్, శాంసంగ్, ఇతర సంస్థలు కూడా బహుమానాలు ఇస్తాయి.
భద్రతా లోపాలను తమ దృష్టికి తీసుకొస్తే సరిచేయగలమని, తద్వారా లోపాలను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు మోసానికి పాల్పడటాన్ని నివారించగలమని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే లోపాలను గుర్తించేవారిని ప్రోత్సహించేందుకు నజరానాలు అందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లలోని టైటానియం ఎం భద్రతా చిప్‌ను ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను పటిష్ఠంగా ఉంచేందుకు, ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వాడే బయోమెట్రిక్ డేటాను నిక్షిప్తం చేయడానికి అనువుగా డిజైన్ చేశారు.
డెవలపర్ల కోసం విడుదల చేసిన ప్రివ్యూ ఎడిషన్లతో నడిచే డివైస్‌లలోని టైటానియం ఎం చిప్‌లో లోపాన్ని గుర్తిస్తే పరిశోధకులకు 15 లక్షల డాలర్ల బహుమతి లభిస్తుంది.
భద్రతాలోపాలను నివారించడానికి గూగుల్ లాంటి సంస్థల్లో సాధారణంగా నిపుణులు ఉంటారు.
ఈ లోపాలను కనిపెట్టే బయటి వ్యక్తులకు భారీ పారితోషికం ఇవ్వడమనేది సంస్థాగత నిపుణుల నియామకం, వారు కొనసాగే తీరుపై ప్రశ్నలకు తావిస్తుందని లుటా సెక్యూరిటీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, భద్రతా నిపుణురాలు కేటీ మౌసోరిస్ అభిప్రాయపడ్డారు.
తమ ప్లాట్‌ఫామ్స్, సర్వీసెస్‌లో భద్రతా లోపాలను గుర్తించి తమ దృష్టికి తీసుకొచ్చే పరిశోధకులను బీబీసీ కూడా సముచిత రీతిలో గౌరవిస్తుంది. అయితే బీబీసీ నగదు కాకుండా ప్రత్యేకమైన బీబీసీ రివార్డును అందజేస్తుంది.
ఇవి కూడా చదవండి.
- మీ మొబైల్లో ఈ యాప్ ఉంటే అంతే సంగతులు.. గూగుల్ హెచ్చరిక
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- క్యామ్ స్కానర్ యాప్ వాడుతున్నారా... తస్మాత్ జాగ్రత్త
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లు: లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు ఎలా కొంటున్నారు
- ఫేస్‌బుక్ లోగోలో మార్పులు... వాటిలో మాత్రమే కనిపిస్తుంది
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








