గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది

గూగుల్

ఫొటో సోర్స్, Google

గూగుల్.. తన సోషల్ మీడియా నెట్‌వర్క్‌'గూగుల్ ప్లస్' సేవలను ఏప్రిల్ 2 మంగళవారంనాడు నిలిపివేసింది.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు పోటీగా 2011లో గూగుల్+ ప్రారంభమైంది. సోషల్ నెట్‌వర్క్‌లో విజయం సాధించడానికి గూగుల్ చేసిన నాలుగో ప్రయత్నమే 'గూగుల్+'. కానీ ఇది ప్రజలను ఆకర్షించలేకపోయింది. యూట్యూబ్‌లో ప్రాచుర్యం కల్పించినా గూగుల్+కు ఫలితం దక్కలేదు.

2011 చివర్లోనే గూగుల్+ అన్నది అంతిమదశలో ఉన్నట్లు విశ్లేషకులు భావించినా, తన సోషల్ మీడియా సేవలను గూగుల్ నిలిపివేయలేదు. కానీ 2018లో సమాచార భద్రత ఉల్లంఘన జరిగిందని గుర్తించాకనే తన సోషల్ నెట్‌వర్క్‌ను నిలిపేయాలని గూగుల్ భావించింది.

గూగుల్ ప్లస్ అంటే ఏమిటి?

గూగుల్ ప్లస్ 2011లో ప్రారంభమైన సోషల్ నెట్‌వర్క్ వేదిక. దీనిలో ఫొటోలను పోస్ట్ చేయొచ్చు, ఇండివిజువల్ ఫీడ్స్‌లో స్టేటస్‌ అప్‌డేట్ కూడా చేయొచ్చు. తమ ఇతర సర్వీసులకు అనుగుణంగా ఒక 'సోషల్ లేయర్'గా దీన్ని డిజైన్ చేశామని గూగుల్ అంటోంది.

ఇందులో.. స్నేహితులను 'సర్కిల్స్'(గ్రూపు)గా ఏర్పాటుచేసుకుని, 'హ్యాంగౌట్స్' ద్వారా వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. ఈ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన కొన్ని వారాల్లోనే లక్షలాదిమంది తమ ఖాతాలను రిజిస్టర్ చేసుకున్నారని గూగుల్ చెబుతోంది. కానీ చాలా తక్కువమంది మాత్రమే ఈ నెట్‌వర్క్‌ను వాడారు.

''నా గూగుల్+ ఖాతా ఓపెన్ చేసి, న్యూస్‌ఫీడ్‌పై క్లిక్ చేస్తే, బ్లాంక్ పేజ్ కనిపించింది. ఎక్కువమంది తమ ఖాతాలను రిజిస్టర్ చేసుకున్నారు కానీ, ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందోనని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయారు'' అంటూ, ఈ నెట్‌వర్క్ ప్రారంభమైన కొన్ని వారాలకు పాల్ టస్సీ అనే వ్యక్తి ఫోర్బ్స్‌ కోసం రాసిన వ్యాసంలో ప్రస్తావించారు.

గూగుల్+ పేజ్

ఫొటో సోర్స్, Google

పొరపాటు ఎక్కడ జరిగింది?

''ప్రారంభమైన మొదటిరోజు నుంచి గూగుల్+ విఫలమైంది'' అని సోషల్ మీడియా కన్సల్టంట్ మాట్ నవారా అన్నారు.

''యూజర్ ఇంటర్‌ఫేస్ అంత అనుకూలంగా లేకపోవడం, ఫేస్‌బుక్‌తో పోలిస్తే, సోషల్ మీడియా రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టడం, ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించగలదా అన్న అంశాల్లో అంతర్గతంగా ఏర్పడిన భిన్నాభిప్రాయాలు.. లాంటి కారణాలు గూగుల్+ మీద ప్రభావం చూపాయి.

వినియోగదారులు మారుపేర్లతో అకౌంట్లు తెరవడం పట్ల గూగుల్+ విధానాలు కఠినంగా ఉన్నాయి. మారుపేర్లు, లేదా స్క్రీన్ నేమ్స్‌ ఉన్న వినియోగదారులను జీమెయిల్ లాంటి తమ ఇతర సర్వీసుల్లో కూడా లాక్ చేసింది.

గూగుల్+ మాధ్యమంగా వ్యాపారం చేస్తున్న పేజ్‌లను కూడా డిలీట్ చేస్తూపోయింది. తర్వాత ఈ విషయమై స్పందిస్తూ, పొరపాటు జరిగిందని, గూగుల్+ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ చేసుకోవచ్చని తెలిపింది.

''ఖాతా తెరిచి, లోపలేముందో చూద్దామని ప్రయత్నించి, చాలామంది అయోమయానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌లో 'లైక్స్', ట్విటర్‌లో 'ఫేవరెట్స్' ఉన్నట్లుగానే గూగుల్ ప్లస్ లోకూడా 'ప్లస్ వన్' ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ ఆప్షన్‌తో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు.

గూగుల్

ఫొటో సోర్స్, Google

గూగుల్ ఏం చేయబోతోంది?

వినియోగదారులకు చేరువయ్యేందుకు ఈ సోషల్ నెట్‌వర్క్‌ను జీ-మెయిల్ లాంటి ఇతర సర్వీసులక్కూడా అనుసంధానం చేసింది.

2013లో యూట్యూబ్‌తో అనుసంధానం చేశారు. యూట్యూబ్‌తో కలిశాక, వీక్షకులు ఎవరైనా యూట్యూబ్ వీడియోలకు కామెంట్ చేయాలంటే వారికి గూగుల్+ ఖాతా తప్పనిసరి చేశారు.

ఈ పరిణామాలతో, తమ విజయాన్ని గూగుల్ సోషల్ నెట్‌వర్క్ కోసం ఉపయోగించుకుంటున్నారని వీడియోలను తయారు చేసే ప్రముఖుల నుంచి ఆగ్రహం వ్యక్తమయింది.

'గూగుల్ ప్లే స్టోర్'లో యాప్స్‌ను రివ్యూ చేయాలన్నాకూడా సదరు వ్యక్తులకు గూగుల్+ ఖాతా కలిగివుండాలన్న నిబంధన తీసుకువచ్చారు. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేసినా, కామెంట్ చేసినా, చివరకు ప్లేస్టోర్‌లో రివ్యూ చేసినా, ఈ యాక్టివిటీల్లో క్రాస్‌పోస్టింగ్ జరిగినట్లు గమనించారు.

తమ నెట్‌వర్క్‌లో 50కోట్ల మంది వినియోగదారులున్నారని గూగుల్ చెబుతోంది. కానీ ఎంతమంది ఈ నెట్‌వర్క్‌తో ఎంగేజ్(గడిపే సమయం) అవుతున్నారన్నదే సమస్య.

''గూగుల్+లో జాయిన్ అవ్వమని నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేశాను. కానీ వారు ఎక్కువసేపు ఈ నెట్‌వర్క్‌తో ఎంగేజ్ కాలేకపోయారు'' అని బీబీసీ న్యూస్ టెక్నాలజీ ప్రతినిధి రారీ సెల్లన్-జోన్స్ 2011సం.లో రాశారు.

గూగుల్ సెమెటరీ

ఫొటో సోర్స్, GOOGLE CEMETARY

గూగుల్ ప్లస్ నష్టానికి కారణం ఏమిటి?

2014 ఏప్రిల్‌లో గూగుల్+ వ్యవస్థాపకుడు విక్ గన్డోట్రా కంపెనీని వీడారు. అప్పటి నుంచి సంస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

హ్యాంగౌట్స్, ఫొటోస్‌లాంటి విజయవంతమైన సర్వీసులు గూగుల్+ నుంచి వేరుపడి, స్వతంత్ర సర్వీసులుగా పనిచేయడం ప్రారంభమైంది.

గతంలో అనుసంధానించిన యూట్యూబ్, ప్లేస్టోర్‌ల నుంచి గూగుల్‌+ను విరమించుకోవడంతో వీడియో, యాప్స్ తయారీదారుల నుంచి హర్షం వ్యక్తమైంది.

2015సం.లో కొన్ని మార్పులు చేసి, కమ్యూనిటీస్ మీద దృష్టిసారించినా ఫలితం దక్కలేదు. చివరగా.. సమాచార భద్రత ఉల్లంఘన వెలుగుచూడటంతో, గూగుల్ ప్లస్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ కారణంగా దాదాపు 5.2 కోట్లమందికి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్‌పార్టీలు పొందగలిగాయని 2018లో గూగుల్ అంగీకరించింది.

''వినియోగదారులు గూగుల్+ను చాలా తక్కువ సమయం వాడుతున్నారు. 90%మంది వినియోగదారులు కేవలం 5 సెకన్లు మాత్రమే గూగుల్+తో గడుపుతున్నారు'' అని ఆ సంస్థ తన బ్లాగ్‌లో ప్రస్తావించింది.

ప్రస్తుతం 'గూగుల్ సెమెటరీ' వెబ్‌సైట్‌లో గూగుల్+కు స్థానం దక్కింది. విఫలమైన ఇలాంటి ప్రాజెక్టుల రికార్డులను ఇక్కడ భద్రపరుస్తారు. ఈ వెబ్‌సైట్‌ను నయీమ్ నర్ అనే వ్యక్తి తయారుచేశారు.

''మా మిత్రులు విఫలమైనాసరే.. తమ ఐడియాలపై మరింత అధ్యయనం చేయాలని ఈ వెబ్‌సైట్ ప్రారంభించాం'' అని నయీమ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)