కారులో ఊపిరాడక చిన్నారుల మృతి.. తల్లిపై మర్డర్ కేసు పెట్టిన ఆస్ట్రేలియా పోలీసులు

కెర్రీ-ఆన్ కాన్లీ

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, కెర్రీ-ఆన్ కాన్లీ

ఆస్ట్రేలియాలో వేడిగా ఉన్న ఒక కారులో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించటంతో.. ఆ పసిపిల్లల తల్లి మీద హత్యా నేరం నమోదు చేశారు.

ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరి వయసు ఏడాది అయితే, మరొకరి వయసు రెండేళ్లు. వీళ్లద్దరూ కారులో విగతజీవులుగా పడి ఉండటాన్ని క్వీన్స్‌ల్యాండ్ అధికారులు గుర్తించారు. ఈ పిల్లలు ఆ కారు లోపల ఎంతసేపటి నుంచి ఉన్నారనేది తెలియదు.

ఈ ఇద్దరు బాలికలూ విపరీతమైన వేడిబారిన పడ్డట్లు తెలుస్తోందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

బ్రిస్బేన్ సమీపంలోని ఒక పట్టణం దగ్గర కారులో వీరిని గుర్తించినపుడు అక్కడ ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉంది.

ఈ పిల్లల తల్లి కెర్రీ-ఆన్ కాన్లీ (27) మీద హత్యానేరం నమోదు చేశారు. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో హత్యకు నిర్వచనాన్ని ఇటీవల విస్తరించారు. ''మానవ జీవితం పట్ల నిర్లక్ష్యపూరిత ఉదాసీనత''ను కూడా ఈ నిర్వచనంలో చేర్చారు. ఈ నిర్వచనం కింద మొదటిగా హత్య అభియోగం ఈ పిల్లల తల్లి మీద నమోదయింది.

మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారని కూడా ఆమె మీద అభియోగాలు నమోదైనట్లు ఏబీసీ ఒక కథనంలో తెలిపింది.

ఈ పిల్లల మరణం ఓ ఘోర విషాదమని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర ప్రధానమంత్రి అనాస్టాషియా పాలాస్జుజుక్ వర్ణించారు. ఈ కేసును చిన్నారుల భద్రత విభాగం సమీక్షిస్తుందని చెప్పారు.

''ఈ విషయం తెలిసినపుడు నా గుండె బద్దలైంది'' అని ఆమె పేర్కొన్నారు. ఈ పిల్లలు చిన్నారుల భద్రత విభాగానికి తెలుసునని కూడా ఆమె చెప్పారు.

line

కారులో పిల్లల భద్రత ఇలా...

  • కారు సీటు ఖాళీగా ఉన్నపుడు అందులో ఒక టెడ్డీ బేర్‌ను ఉంచండి. మీ చిన్నారిని ఆ సీటులో కూర్చోబెట్టినపుడు ఆ బొమ్మను ముందు సీటులోకి మార్చండి
  • చిన్నారితో పాటు సీటులో మీ మొబైల్ ఫోన్ లేదా, షూ ఉంచండి
  • చిన్నారిని డ్రైవింగ్ సీటు వెనక ఉన్న సీటులో కాకుండా దాని పక్క సీటులో కుర్చోపెట్టండి
  • కారును లాక్ చేసేటపుడు ముందు, వెనుక సీట్లను తనిఖీ చేయండి
  • మీరు మీ చిన్నారిని నర్సరీలో దించారో లేదో నిర్ధారించుకోవటానికి మీకు ఫోన్ చేయాలని మీ భాగస్వామికి చెప్పండి.

(ఆధారం:కిడ్స్ సేఫ్ వరల్డ్‌వైడ్ )

line

ఆ కారులో చిన్నారులను గుర్తించినపుడు క్వీన్స్‌లాండ్ పోలీసులను, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే పిలిపించారు. ఇద్దరు బాలికలకు శ్వాస అందించటానికి పారామెడికల్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే.. వారు అక్కడే చనిపోయారని ప్రకటించారు.

బ్రిస్బేన్ దక్షిణ ప్రాంతంలో గల లోగన్‌లో ఈ చిన్నారుల ఇంటి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

ఈ కేసు దర్యాప్తులో సాయం చేయటానికి ఒక సాక్షి ముందుకు వచ్చారని డిటెక్టివ్ మార్క్ వైట్ చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)