దిల్లీ: రోగి శరీరంలోంచి 7.4 కేజీల కిడ్నీని తొలగించిన వైద్యులు.. భారత్‌లో అతిపెద్ద కిడ్నీ ఇదే

వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో వైద్యులు ఒక రోగి శరీరంలోంచి 7.4 కేజీల బరువున్న మూత్రపిండాన్ని తొలగించారు. ఇది దాదాపు ఇద్దరు నవజాత శిశువుల బరువుతో సమానం.

భారత్‌లో తొలగించిన అత్యంత బరువైన కిడ్నీ ఇదేనని భావిస్తున్నారు.

సాధారణంగా మూత్రపిండం బరువు 120 నుంచి 150 గ్రాములు ఉంటుంది.

ఈ రోగి 'ఆటోసోమల్ డామినంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్' అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉంటే మూత్రపిండం అంతటా తిత్తులు ఏర్పడతాయి.

బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ(‌ఎన్‌హెచ్‌ఎస్) వెబ్‌సైట్ ప్రకారం- ఇది వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య సమస్య. 30 నుంచి 60 ఏళ్ల మధ్యవారికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది.

ఈ వ్యాధి వల్ల మూత్రపిండం పనితీరు క్షీణిస్తూపోయి, చివరకు అది విఫలమవుతుంది.

కిడ్నీ (ఇలస్ట్రేషన్)

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌ఫెక్షన్ లక్షణాలు, అంతర్గత రక్తస్రావం ఉంటే తప్ప సాధారణంగా మూత్రపిండాన్ని తొలగించబోమని దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సచిన్ కథూరియా తెలిపారు.

ఈ రోగికి సోకిన్ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైనదని, యాంటీబయాటిక్స్‌కు ఇది లొంగడం లేదని, మూత్రపిండం భారీగా ఉండటంతో ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తొలగించడం తప్ప మార్గం లేదని సచిన్ వివరించారు.

ఈ రోగి శరీరంలో మూత్రపిండం సాధారణ పరిమాణం కంటే పెద్దగానే ఉంటుందని శస్త్రచికిత్స సమయంలో తాము అనుకున్నామని, ఇంత పెద్దగా ఉంటుందనుకోలేదని, దీనిని చూసి ఆశ్చర్యపోయామని ఆయన తెలిపారు.

వైద్యులు తొలగించిన మూత్ర పిండం ఇదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైద్యులు తొలగించిన మూత్ర పిండం ఇదే

రోగి మరో మూత్రపిండం దీనికంటే పెద్దగా ఉందని డాక్టర్ చెప్పారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యంత పెద్ద మూత్రపిండం బరువు నాలుగున్నర కేజీలని సచిన్ ప్రస్తావించారు. యూరాలజీ పత్రికల ప్రకారమైతే ఇంతకన్నా బరువైన మూత్రపిండాలను ఇంతకుముందు గుర్తించారని, అమెరికాలో తొమ్మిది కేజీల కిడ్నీని, నెదర్లాండ్స్‌లో 8.7 కేజీల కిడ్నీని గుర్తించారని వివరించారు.

తాము తొలగించిన 7.4 కేజీల మూత్రపిండాన్ని ప్రపంచ రికార్డుగా నమోదు చేయాలంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు దరఖాస్తు చేయాలా, వద్దా అన్నది ఇంకా నిర్ణయించలేదని సచిన్ తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)