తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి విధుల్లోకి చేరవచ్చు, యూనియన్లను నమ్మి మోసపోకండి: కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR
"ఆర్టీసీ కార్మికులు.. యూనియన్ల మాటలు నమ్మి చెడిపోతున్నారు. జీవితాలను పాడుచేసుకుంటున్నారు. అనాలోచిత సమ్మెతో ఇంత వరకూ పరిస్థితి వచ్చేలా చేసినందుకు యూనియన్ల నాయకులదే బాధ్యత" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గురువారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షోభంలో ఉన్న రాష్టం సంక్షేమం దిశగా పయనిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులపై కేబినెట్‌లో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు.
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఏమన్నారంటే...
- ఆర్టీసీపై ప్రభుత్వం బాధ్యతతో ఉంది. ప్రజల పొట్ట నింపాం గానీ పొట్ట కొట్టలేదు.
- అత్యంత ఎక్కువగా వేతనాలు పొందే అంగన్‌వాడీ వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారు. పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మనది. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నాం. ఇవన్నీ దేశంలో ఎక్కడా లేవు.
- కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి చెడిపోతున్నారు. జీవితాలను పాడుచేసుకుంటున్నారు. అనాలోచిత సమ్మెతో ఇంత వరకూ పరిస్థితి వచ్చేలా చేసినందుకు యూనియన్ల నాయకులదే బాధ్యత.
- వాళ్లు బాధ్యత వహించరు అని నేను గతంలోనే చెప్పాను. కానీ వారికి ఆశలు కల్పించారు.
- చట్టప్రకారం వాళ్లు ఇల్లీగల్ సమ్మెలోనే ఉన్నారు.
- యూనియన్ నాయకులు ఆర్చేవారు కాదు, తీర్చేవారు కాదు.
- ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నిధులు తెస్తారా?
- నాలుగేళ్లలో ఒక్కసారే చార్జీలు పెంచాం. ఇప్పుడు నష్టాలను పూడ్చడానికి స్వల్పంగా చార్జీల పెంపుదలకు కూడా ఆదేశాలిస్తాం. వచ్చే సోమవారం నుంచే పెంచుకునేందుకు అనుగుణంగా ఎండీకి ఆదేశాలిస్తాం.
- సంస్థ అవసరాలకోసం రేపే రూ.100 కోట్ల విడుదలకు ఆదేశాలిస్తాం.
- క్రమశిక్షణారాహిత్యంతో మరోసారి ఇలాంటి చర్యలకు దిగొద్దు.
- వారంలోపు ప్రతి డిపోనుంచి ఐదుగురు కార్మికులను పిలిచి నేనే స్వయంగా సమస్యలను తెలుసుకుంటా. యూనియన్ల నాయకులు వారికి సరైన సమాచారం ఇస్తున్నారో లేదో నాకు అనుమానమే. అంతా కలిపి చర్చించి ఆర్టీసీ మనుగడకు అవసరమైన నిర్ణయాలు తీసుకుందాం.
- ఈ చర్చల్లోకి యూనియన్లను మాత్రం రానివ్వం. వారివల్లే 20కి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం.
- క్రమశిక్షణతో పనిచేస్తే సింగరేణి కార్మికులకు ఎన్ని ప్రయోజనాలు కల్పించమో మీరే చూడండి. మిమ్మల్ని కూడా అలాగే తీర్చిదిద్దుతాం.
- యూనియన్లు లేకపోతే ఎలా అనుకోవచ్చు.. దానికి వర్కర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి మీ బాగోగులు చూస్తాం.
- గతంలో 20 ఏళ్ల క్రితం నేను ఈ శాఖకు మంత్రిగా ఉన్నా. అప్పుడు సంస్ధను లాభాల్లోకి తెచ్చాను, ఉద్యోగుల జీతాలు పెంచాం.
కేసీఆర్ వెల్లడించిన కేబినెట్ నిర్ణయాల్లో ఇతర ముఖ్యాంశాలు...
- వర్షాల కారణంగా పాడైన రోడ్ల మరమ్మతుకు రూ.571 కోట్లు మంజూరు చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన రెండు, మూడు నెలల్లో రోడ్లను యథాతథ స్థితికి తీసుకువస్తాం. సరిగా పనిచేయని కాంట్రాక్టర్లను పక్కనపెడుతున్నాం.
- రాష్ట్రంలో అత్యధికంగా పండే పంట పత్తి, వరి, ఆ తర్వాత మొక్కజొన్న. అయితే వరి కొనుగోలులోనే అక్కడక్కడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. పటిష్ట కార్యాచరణ రూపందిస్తాం. ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాం.
- నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనం ముందంజలో ఉన్నాం.
- పాలమూరులో 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. అంతకు ముందు లక్ష ఎకరాలే చాలా కష్టంగా ఉండేది. సూర్యాపేట జిల్లాలో తొలిసారిగా 2.7 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. కాళేశ్వరం కూడా విజయవంతంగా పనిచేస్తోంది.

కేసీఆర్ నిర్ణయం పట్ల ఎన్ఎంయూ సంతోషం
ఎలాంటి షరతులు లేకుండా రేపు ఉదయం ఆర్టీసీ కార్మికులందరూ ఉద్యోగాలలోకి చేరేందుకు అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అని ఎన్ఎంయూ నేతలు కమాల్ రెడ్డి, నరేందర్, అశోక్ అన్నారు. ఛార్జీల పెంపుదలకు అనుమతి, ఉద్యోగ భద్రత సమీక్షకు, రూ.100 కోట్ల రూపాయలు సత్వరమే విడుదలకు ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి.
- తెలంగాణ ఆర్టీసీ సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి? యూనియన్లు, ప్రభుత్వం ఏమంటున్నాయి?
- మహారాష్ట్ర: అజిత్ పవార్ బీజేపీతో 'గేమ్' ఆడారా?
- శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఇప్పుడు ఏమవుతాయి?
- ‘‘అవినీతి పేరు పెట్టి అమరావతిని చంపేస్తారా? అమరావతిపై అన్ని పార్టీలతో సమావేశం’’: చంద్రబాబు
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఆర్టీసీ విలీనం: జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరిగేది ఎవరికి?
- ఆంధ్రప్రదేశ్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమేనా... చట్టం ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




