షాద్ నగర్: చుట్టూ ఉన్న లారీ డ్రైవర్లు దయ్యాల్లా చూస్తున్నారని చెప్పింది, తర్వాత శవమై కనిపించింది - ప్రెస్ రివ్యూ

తెలంగాణలో రెండు నగరాల్లో ఒకే రోజు ఇద్దరు యువతులను అత్యాచారం చేసి, హతమార్చారని ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.
తెలంగాణలోని రెండు ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, వరంగల్‌లో ఒకే రోజున దారుణాలు జరిగాయి. షీటీమ్‌లు, పెట్రోలింగ్‌లు ఎన్ని ఉన్నా ఆడపిల్లలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అని ఈనాడు రాసింది.
మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కొల్లూరులో పశువైద్యురాలి(అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్)గా విధులు నిర్వర్తిస్తున్న యువతి(28) బుధవారం రాత్రి శంషాబాద్‌లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఆమెను అపహరించిన ఆగంతుకులు అత్యాచారం చేసి ఆపై దహనం చేశారు.
షాద్ నగర్ సమీపంలోని చటాన్‌పల్లి గ్రామ శివారు రోడ్డు వంతెన దగ్గర గురువారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసిన ప్రాథమిక వివరాల ప్రకారం ఒక పోలీసు అధికారి ధ్రువీకరించారు అని ఈనాడు చెప్పింది.
బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె సాయంత్రం ఒక వైద్యుడిని కలిసేందుకు తన స్కూటీపై బయల్దేరారు. తొండుపల్లి కూడలిలో స్కూటీని పార్కు చేసి వెళ్లారు.
రాత్రి 9.22 గంటలకు వాహనం పంక్చర్ అయ్యిందంటూ సోదరికి ఫోన్ చేశారు. వద్దన్నా వినకుండా ఇద్దరు పంక్చర్ వేసుకుని వస్తామంటూ వాహనం తీసుకెళ్లారని, చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, భయమేస్తోందని ఏడుపొస్తోందంటూ చెప్పారు.
ఆమె మాట్లాడుతుండగానే సోదరి ఫోన్ కట్ చేసింది. తర్వాత రాత్రి 9.44కు ఫోన్ చేస్తే అది స్విచాఫ్ వచ్చినట్లు ఆమె పోలీసులకు చెప్పారు. స్కూటీ పార్క్ చేసిన ప్రాంతానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు అక్కడ స్కూటీ కనిపించలేదు.
గురువారం తెల్లవారుజామున పోలీసులకు చటాన్ పల్లికి చెందిన వ్యక్తి వంతెన కింద కాలుతున్న మృతదేహం ఉందని ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న షాద్ నగర్ పోలీసులు కాలిపోయిన మృతదేహం గుర్తించారు.

ఫొటో సోర్స్, UGC
వార్తల ద్వారా ఆ విషయం తెలుసుకున్న ప్రియాంక తండ్రి, సోదరి అక్కడికి చేరుకుని అది ప్రియాంక మృతదేహం అని గుర్తించినట్లు ఈనాడు రాసింది.
స్కూటీ నిలిపిన ప్రాంతంలో ప్రియాంక వస్తువులు, మద్యం సీసాలు దొరికాయి. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత హతమార్చి, మృతదేహాన్ని షాద్ నగర్ వైపు తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నట్లు కథనంలో చెప్పారు.
స్కూటీకి పంక్చర్ వేయిస్తానని ఇద్దరు వచ్చారని ప్రియాంక తన సోదరికి చెప్పిందని, వారే వారే ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
వరంగల్‌లో మరో యువతి హత్య
వరంగల్ నగరంలో కూడా అత్యాచారానికి గురైన మరో యువతి బలైనదని ఈనాడులో మరో కథనంలో రాశారు.
హన్మకొండ దీనదయాళ్ నగర్‌కు చెందిన గాదం మానస(19)ను ఆమె పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడు నెమలిగొండకు చెందిన పులిసాయి గౌడ్ అలియాస్ సాయికుమార్(21) బయటకు తీసుకెళ్తానని చెప్పాడు.
దీంతో ఆమె కాజీపేటకు వెళ్లి అతడిని కలిసింది. అక్కడి నుంచి కారులో ఇద్దరూ చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతడు మానసపై అత్యాచారం చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో మానస చనిపోయింది. ఈ విషయం స్నేహితులకు చెప్పిన సాయి, వారు సాయం చేయలేనని చెప్పడంతో మానస మృతదేహాన్ని అలాగే కారు ముందు సీటులో కూర్చోపెటుకుని చీకటి పడే వరకూ తిరిగాడు.
హన్మకొండలో కొత్త దుస్తులు కొని న్యూశాయంపేట రైల్వే గేటు దగ్గర మృతదేహం దుస్తులు మార్చి హంటర్ రోడ్డులో దానిని వదిలి వెళ్లిపోయాడు.
స్థానికులు మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం సాయంత్రం నెమలిగొండ వెళ్లి సాయికుమార్‌ను అరెస్టు చేశారు అని ఈనాడు కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, I&pr andhrapradesh
ఇంటి స్థలాల అమ్మకంపై కీలక నిర్ణయం
అసైన్డ్ ఇంటిస్థలాల అమ్మకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ప్రభుత్వం కొత్తగా కేటాయించే, ఇప్పటి కే క్రమబద్ధీకరించిన ఇంటిస్థలాలను ఐదేళ్ల తర్వాత నిరభ్యంతరంగా అమ్ముకునేలా వెసులుబాటు కల్పించనుంది.
అయితే, ఇప్పటికే ఇంటిస్థలాలు పొంది ఉండి, గడు వు తీరకముందే లబ్ధిదారులు వాటిని అమ్ముకుంటే, రెండేళ్ల తర్వాత సహేతుకమైన ధర వసూలు చేసి ఆ భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించాలని భావిస్తోంది.
ఈ రెండింటినీ అమలు చేయాలంటే ఇప్పుడున్న అసైన్డ్ చట్టాన్ని సవరించాల్సిందే. అయితే, ఐదేళ్ల లాక్ పీరియడ్ కు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లు ఇప్పటికే రూపొందించిన రెవెన్యూశాఖ రెండో అంశాన్ని కూడా అందులో చేర్చాలి.
రెండో అంశంపై కొన్ని న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని అధిగమించేందుకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి చెప్పింది.
ప్రభుత్వం పేదలకు సాగు భూములతోపాటు ఇంటిస్థలాలు ఇస్తోంది. ఏపీ అసైన్‌మెంట్ చట్టం- 1977(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్-పీవోటీ) ప్రకారమే ఆ భూములను కేటాయిస్తోంది.
సాగు భూములను ఇతరులకు అమ్మడానికి, హక్కులను బదలాయించడానికి, ఇం కా ఒప్పందాలు చేసుకోవడానికి వీల్లేదు. ఆ భూమి లబ్ధిదారుల వద్దే ఉండాలి. ఒక వేళ వద్దనుకుంటే తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి.
అయితే, ఇంటికోసం కేటాయించిన స్థలం విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. ఇంటిస్థలం కేటాయించిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారుడికి యాజమాన్య హక్కులు వచ్చేలా పీవోటీ చట్టంలో పొందుపరిచారు.
ఆ స్థలాలపై 20 ఏళ్లపాటు లావాదేవీలు జరగకుండా నిరోధిస్తూ, నిషేధ భూముల జాబితాలో చేర్చారు. కాబట్టి లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకున్నా అది రిజిస్ట్రేషన్ దాకా వెళ్లదని ఆంధ్రజ్యోతి రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!
మధ్యప్రదేశ్‌లో లారీని ఎత్తుకుపోయిన దొంగలు దానిని వదిలేసి ఉల్లిపాయల లోడ్ ఎత్తుకెళ్లిపోయారని సాక్షి కథనం ప్రచురించింది.
ఉల్లిపాయల లోడ్ ఉన్న లారీని ఎత్తుకుపోయిన దొంగలు, రూ.22లక్షల విలువైన ఉల్లిపాయలు తీసుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జరిగింది.
ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది.
ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్‌చంద్ మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది.
గుజరాత్ సూరత్‌లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిపాయలు కూడా దోచేశారని ఇదే కథనంలో చెప్పారు.
పాలన్పూర్ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. 'ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు' అని దుకాణం ఉద్యోగి చెప్పారని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, Facebook/Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రికార్డు
హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటోందని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.
2017 నవంబర్ 29 నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలు ప్రయాణం జంటనగరాల ప్రజలను మరింత ఆకట్టుకుంటోంది.
ప్రయాణికుల మనసులు చూరగొనడంలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రపంచంలోనే నంబర్‌వన్ ప్రాజెక్టుగా నిలిచిందని కథనంలో రాశారు.
ప్రపంచవ్యాప్తంగా కియోలీస్ ఆపరేట్ చేస్తున్న గ్లోబల్ పవర్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై జరిగిన సర్వేలో 99.8 శాతం సమయపాలనతో హైదరాబాద్ మెట్రోరైలు అగ్రస్థానం సాధించింది.
"ప్రపంచవ్యాప్తంగా కియోలీస్ సంస్థ 30 ప్రాజెక్టులను ఆపరేట్ చేస్తుండగా వీటన్నింటిలో ప్రయాణికుల సంతృప్తిపై చేపట్టిన సర్వేలో.. మన మెట్రో ఉన్నతంగా నిలిచింది" అని ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారాకరామారావు గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు అని పత్రిక రాసింది.
పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్టు(పీపీపీ) విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా, 56 కి.మీ. మేర రాకపోకలతో ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు తర్వాత భారతదేశంలో రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు గత రెండేండ్లలో 12.5 కోట్లమంది ప్రయాణికులకు సేవలందించింది అని ఇందులో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తే డ్రగ్స్ వినియోగం పెరుగుతుందా?
- ప్రపంచ 5జీ నెట్‌వర్క్‌ను చైనా కబ్జా చేస్తోందా?
- "ఆర్టీసీ మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది.. ఉబికివస్తున్న కన్నీటిని నేను ఆపుకున్నాను"
- చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








