గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

గద్దర్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నా పేరు గద్దర్. నేనొక గాయపడ్డ గీతాన్ని. చిన్నప్పటి నుంచీ పాడి ఆడుతున్నాను. రాయడం, పాడడం, ఆడడం నా వృత్తి. ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్లు ఏమీ లేవు. కళాకారుడిగా నన్ను నియమించగలరు.’’

ఇది ప్రజా యుద్ధ నౌక అంటూ అభిమానులు పిలుచుకునే కవి, గాయకుడు గద్దర్ తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సారథికి పెట్టుకున్న దరఖాస్తు. ‘‘నేను తెలంగాణ ప్రభుత్వంలో కళాకారుడు అనే టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’’ అని గద్దర్ బీబీసీతో చెప్పారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ కళకారులకు ఆ విభాగం నుంచి నెలనెలా కొంత మొత్తం అందిస్తున్నారు. గతంలో ఈ ఎంపిక ప్రక్రియ వివాదాస్పదం అయింది. తరువాత కొత్త ప్రక్రియతో మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించారు. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో గద్దర్ కూడా స్వయంగా ఆ కార్యాలయానికి వెళ్లి, అక్కడ సిబ్బందికి తన అప్లికేషన్ అందించారు.

ఈ ప్రజాస్వామ్యం బూటకం అంటూ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గద్దర్, క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై తన వైఖరి మార్చుకుంటూ వచ్చారు. గతంలో ఆయన ఓటు వేశారు. ఇప్పుడు ప్రభుత్వ భత్యం వచ్చే ఒక పోస్టుకు అప్లికేషన్ పెట్టుకోవడం, ఆయన భావజాలం గురించి తెలిసిన వారిని ఆశ్చర్యపరిచింది. గద్దర్ మాత్రం ఈ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు బీబీసీతో చెప్పారు. ఉద్యోగానికి అప్లై చేయడంలో తప్పేముందంటూ తన అప్లికేషన్ గురించి ఇలా వివరించారు.

గద్దర్

ఫొటో సోర్స్, ugc

‘‘కొంత కాలం నుంచి మిత్రులు నా దగ్గరకు వచ్చి సాంస్కృతిక సారథి గురించి చెప్పారు. నేను కూడా కళకారుడినే. తెలంగాణ పోరాటంలో ఉన్నాను. అందుకని నాకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వమని దరఖాస్తు పెట్టుకున్నాను. అంతే.’’

‘‘నేను మొన్న అప్లికేషన్ ఇచ్చాను. వాళ్లు నా అప్లికేషన్ తిరస్కరించినట్టు తెలిసింది. ఇంకా నాకు అధికారిక సమాచారం రాలేదు. ఆన్లైన్లో పంపనందున నా అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు ఒక పత్రికలో చదివాను. నాకు సమాచారం వచ్చిన తరువాత ఏం చేయాలో చూస్తాను. దేనికైనా పద్ధతి పాటించాలి. ముందుగా మంత్రి దగ్గరకు వెళ్తాను. కాదంటే ముఖ్యమంత్రిని అడుగుతాను. ఆయనా కాదంటే, ప్రజల దగ్గరకే వెళ్లి అడుగుతాను’’ అన్నారు గద్దర్.

‘‘ఎందరో కవులు రాజుల దగ్గరకు వెళ్లారు. తుకారాం.. రామదాసు.. ఇలా ఎందరో వెళ్లారు. నేనూ అలానే కొలువు కోసం వెళ్లాను. ఉద్యోగం ఇస్తే పథకాలు ప్రచారం చేస్తాను. గద్దర్ కి దమ్ముంది కాబట్టే అంత మంది కవులు ఉన్నా నన్నే శాంతి చర్చలకు పంపారు. అడవులకు వెళ్లాను. అన్నలకు లేఖ ఇచ్చాను. బుల్లెట్ గాయం తిన్నాను. ఇంకెవరికి ఉంది దమ్ము. నన్ను మళ్లీ కేసుల్లో ఇరికించారు. ఇప్పుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాను. నాకు ప్రభుత్వం యాడ్ అయితే ప్లస్ అయితాను. లేదంటే మరోటి అవుతాను. కానీ నేనెప్పుడూ పీడిత ప్రజల పాటనే. ఆరు నెలలు నేను సెమీ యూజ్ లో ఉన్నాను’’ అంటూ తన వాదనను వినిపించారు ఆయన.

గద్దర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వంలో ఎందరో మంత్రులు ఉన్నారు. ఉద్యమంలో లేని వారు కూడా మంత్రులు అయ్యారు అని వ్యాఖ్యానించారు గద్దర్.

‘‘నా దగ్గర సర్టిఫికేట్లు లేవు. నా ఆధార్ కార్డ్ సరిగా లేదు. నా ఇంజినీరింగ్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అవన్నీ లేవు. గద్దర్ కి ఇవ్వరా చిన్న కొలువు. నాకు ఐడెంటిటీ ఏముంది? ఒకవేళ నాకు ఉద్యోగం ఈయలేదనుకో ఇదేనా పాటకు, తూటాకు, గాయకుడికి నువ్విచ్చే గౌరవం అని రాస్తాను.’’

జిల్లాల్లో సాంస్కృతిక సారథికి 500 ఉద్యోగాలు ఇస్తున్నారు. వాటిని వెయ్యికి పెంచాలి అని డిమాండ్ చేశారు గద్దర్. ‘‘చిన్న జాబ్ కదా, దాని వల్ల ఏం సమస్య, నష్టం ఉండదు. దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు గద్దర్.

దీనిపై తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగం స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)