టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'

టైఫాయిడ్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, GATES ARCHIVE/SAMANTHA REINDERS

    • రచయిత, జేమ్స్ గళగర్
    • హోదా, ఆరోగ్యం, సైన్స్ ప్రతినిధి

ఓ కొత్త టైఫాయిడ్ వ్యాక్సిన్ 'చాలా అద్భుతంగా' పనిచేస్తోందని.. ఈ ఇన్‌ఫెక్షన్‌లో దాదాపు చికిత్స చేయలేని రకాన్ని నిలువరించటానికి దీనిని ఉపయోగిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు.

ప్రయోగాల్లో ఈ బ్యాక్టీరియా వ్యాధి కేసులు 80 శాతం పైగా పడిపోయాయని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాలు పేర్కొన్నాయి.

ఈ వ్యాక్సిన్ గొప్ప మార్పు తీసుకొస్తుందని.. టైఫాయిడ్ మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెప్పారు.

యాంటీబయోటిక్స్‌ను బలంగా తట్టుకుని మరీ టైఫాయిడ్ విస్తరిస్తున్న పాకిస్తాన్‌లో 90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

టైఫాయిడ్ జ్వరం ఏమిటి?

కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సాల్మొనెలా టైఫీ అనే బ్యాక్టీరియా సోకటం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది.

ఇది పేదరిక వ్యాధి. పారిశుధ్యం అతి తక్కువగా ఉండే, శుభ్రమైన తాగునీటి కొరత ఉండే దేశాల్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు:

  • ఎక్కువ కాలం కొనసాగే జ్వరం
  • తలనొప్పి
  • వాంతులు
  • ఆకలి మందగించటం
  • మలబద్ధకం

టైఫాయిడ్ సోకిన వారిలో సగటున ప్రతి 100 మందిలో ఒకరికి అంతర్గత రక్తస్రావానికి దారితీసి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

టైఫాయిడ్‌కు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు సేకరించటం కష్టం. అయితే.. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల నుంచి 2.1 కోట్ల మందికి ఇది సోకుతోంది. ఏటా 1,28,000 మంది నుంచి 1,61,000 మందిని బలితీసుకుంటోంది.

టైఫాయిడ్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, GATES ARCHIVE/SAMANTHA REINDERS

ప్రయోగాల్లో ఏం జరిగింది?

నేపాల్‌లోని ఖట్మాండు లోయలో తొమ్మిదేళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 20,000 మందికి పైగా చిన్నారులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు.

ఈ ప్రాంతంలో టైఫాయిడ్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య.

ఈ చిన్నారుల్లో సగం మందికి కొత్త వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ అధ్యయనం మొదటి సంవత్సరంలోనే.. వారిలో టైఫాయిడ్ కేసులు 81 శాతం పడిపోయాయి.

''ప్రపంచంలో అత్యంత అధికంగా టైఫాయిడ్ సోకగల చిన్నారులపై ఇది ప్రభావం చూపకుండా ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోంది'' అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ బీబీసీకి చెప్పారు.

''టైఫాయిడ్ భారం చాలా పెద్దది. కుటుంబాలు తమ పిల్లలను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లటం.. వైద్య పరీక్షలు, యాంటీబయోటిక్స్‌ కోసం భారీగా ఖర్చులు పెడుతూ పేదరికంలో కూరుకుపోవటం మనం చూస్తున్నాం. ఈ వ్యాధిని నియంత్రించటానికి ఈ కొత్త వ్యాక్సిన్ రావటం చాలా ఉద్వేగ భరిత సందర్భం'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాక్సిన్ రక్షణ ఎంత కాలం వరకూ కొనసాగుతుందనేది చూడటానికి.. ప్రస్తుతం ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్న నేపాల్ చిన్నారులు, బంగ్లాదేశ్‌లోని మలావీ ప్రాంత పిల్లలను పరిశీలించటం కొనసాగుతుంది.

''ఈ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాధి విస్తృతిని తగ్గించి.. శుభ్రమైన తాగునీటి కొరత, పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడగలదు'' అని టైఫాయిడ్ వాక్సిన్ ఆక్సెలరేషన్ కన్సార్షియం డైరెక్టర్ డాక్టర్ కాథలీన్ న్యూజీల్ చెప్పారు.

టీకాల వాడకం

వ్యాక్సిన్ అవసరం ఏమిటి?

టైఫాయిడ్.. యాంటీబయోటిక్స్‌ను తట్టుకోవటంలో పతాక స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుందని.. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న చికిత్సల పరిమితిని మించిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధిని నివారించటానికి అత్యంత సమర్థవంతమైన మార్గం శుభ్రమైన తాగునీరు, నీటితో ఫ్లష్ చేసే టాయిలెట్లను అందరికీ అందుబాటులోకి తేవటం చాలా దేశాలకు అసాధ్యంగా మారుతోంది.

ఇప్పటికే రెండు టైఫాయిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాకూడా.. రెండు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వటానికి రెండిటిలో దేనికీ అనుమతి లేదు. కాబట్టి అత్యంత ముప్పు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ రక్షణ లేదు.

హెచ్ఐవీ

పాకిస్తాన్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది?

పాకిస్తాన్‌లో మందులను అతి తీవ్రంగా తట్టుకోగల (ఎక్స్‌టెన్సివ్‌లీ డ్రగ్ రెసిస్టెంట్ - ఎక్స్‌డీఆర్) టైఫాయిడ్ జ్వరం విజృంభించింది.

''టైఫాయిడ్‌కు చికిత్స చేయటానికి మనం ఉపయోగించే అన్ని రకాల యాంటీబయోటిక్స్‌లో ఒక్క రకం మినహా మిగతా అన్నిటినీ తట్టుకోగల సామర్థ్యాన్ని ఒక రకం టైఫాయిడ్ సంతరించుకుంది. దానివల్ల.. టైఫాయిడ్ సోకిన వారిలో ఐదో వంతు మందిని బలితీసుకున్న పాత రోజులకు వెళ్లే ప్రమాదం తలెత్తింది'' అని వాక్సిన్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సేత్ బర్కిలీ బీబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు.

ఇది 2016లో సింధ్ ప్రావిన్స్‌లోని హైదర్‌బాద్‌లో మొదలైంది. పది వేల మందికి పైగా ప్రజలకు సోకింది.

సింధ్ ప్రావిన్స్‌లో 90 లక్షల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించటానికి గవీ ఇప్పుడు నిధులు చెల్లిస్తోంది. ప్రపంచంలో చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌ల జాబితాలో ఈ కొత్త టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను చేర్చిన మొదటి ప్రాంతంగా సింధ్ ప్రావిన్స్ మారుతుంది.

''టైఫాయిడ్ మీద పోరాటంలో పరిస్థితులను పూర్తిగా మార్చివేసే వ్యాక్సిన్ ఇది. సరైన సమయంలో ఇది అందుబాటులోకి వచ్చింది'' అని డాక్టర్ బర్కిలీ చెప్పారు.

''ఈ ప్రమాదకర వ్యాధి విజృంభణను నియంత్రించటంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించాలి. మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాల్లో దీనిని చేర్చిన తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా టైఫాయిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది'' అని తెలిపారు.

''చాలా వేగంగా ఓ కొత్త నివారణ అందుబాటులోకి రావటం ఉద్వేగ భరితమైన విషయం. ఇది వ్యాధి నివారణకు సాయపడటమే కాదు.. వ్యాధికారక బ్యాక్టీరియాలు మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకోవటానికి వ్యతిరేక పోరాటంలోనూ దోహదపడుతుంది'' అని ప్రొఫెసర్ పొలార్డ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)