నేపాల్ గదిమాయీ పండగ: లక్షల జంతువులను బలి ఇచ్చే 'అత్యంత రక్తసిక్త జాతర' మళ్ళీ మొదలు

ఫొటో సోర్స్, AFP
ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్తమైన పండగగా పేరుపడ్డ నేపాల్ పండగ అది. ఇందులో జంతుబలులకు తెర పడిందని దాదాపు అయిదేళ్ల కిందట జంతు హక్కుల సంస్థలు చెప్పాయి. కానీ, ఇప్పుడు పెద్దయెత్తున జంతుబలులు మళ్లీ మొదలయ్యాయి.
నేపాల్ మారుమూల ప్రాంతంలో మంగళవారం ఒక మేక, ఎలుక, కోడి, పంది, పావురం బలితో ఈ హిందూ పండగ ప్రారంభమైంది. తర్వాత కొన్ని వేల బర్రెలను బలి ఇచ్చినట్లు అక్కడికి వెళ్లిన జంతు హక్కుల కార్యకర్తలు చెప్పారు.
ఐదేళ్ల క్రితం 2014లో జాతర జరిగినప్పుడు సుమారు రెండు లక్షల జంతువులను బలి ఇచ్చారు. దీనిని 'గదిమాయీ' పండగ అంటారు. పండగ జరిగే ఆలయం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకు దక్షిణాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని బరియార్‌పూర్‌లో ఉంది.
హెచ్చరిక: ఈ వార్తలోని చిత్రాలు కొందరు పాఠకులకు కలవరం కలిగించవచ్చు.
ఈ సంప్రదాయం దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట మొదలైంది.
రక్తం చిందితే గదిమాయీ (శక్తి దేవత) తనకు బంధ విముక్తి కల్పిస్తుందని, అలా అని తనకు కలలో చెప్పిందని అప్పట్లో ఓ పూజారి చెప్పాడు.
కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో భారత్, నేపాల్ నుంచి లక్షల మంది ఈ ఉత్సవం జరిగే గుడికి వస్తారు.

ఫొటో సోర్స్, AFP
"నాకు నలుగురు సోదరీమణులు ఉన్నారు. మాకో తమ్ముడిని ఇవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం కోరుకున్నాను. దేవత మమ్మల్ని దీవించి మాకో తమ్ముణ్ని ఇచ్చింది" అని జనక్‌పుర్‌కు చెందిన ప్రియాంక యాదవ్ బీబీసీతో చెప్పారు.
ఈ ఉత్సవం క్రూరమని జంతుహక్కుల కార్యకర్తలు చాలా కాలంగా నిరసిస్తూ వస్తున్నారు.
జంతుబలులపై నిషేధం విధించారని, పోరాటం విజయవంతమైందని 2015లో హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్‌ఎస్‌ఐ), యానిమల్ వెల్ఫేర్ నెట్‌వర్క్ నేపాల్(ఏడబ్ల్యూఎన్‌ఎన్) ప్రకటించాయి.
ఆలయం అప్పటి చైర్మన్ రామ్ చంద్ర షా నాడు బీబీసీతో మాట్లాడుతూ- జంతుబలుల నిషేధం విధించలేదన్నారు.
"దేవతకు జంతువులను బలి ఇవ్వొద్దని హిందూ భక్తులకు విజ్ఞప్తి చేయవచ్చు. కానీ, బలులను నిలిపివేసేలా వారిని బలవంతపెట్టరాదు. సంప్రదాయాన్ని నిషేధించడమో పూర్తిగా నిలిపివేయడమో చేయకూడదు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు జంతువులను తరలించకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి.
అనుమతి లేని వ్యాపారులు సరిహద్దు దాటించి నేపాల్లోకి తరలించేందుకు యత్నిస్తున్న జంతువులను భారత అధికారులు పట్టుకొన్నారు.
ఉత్సవానికి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటూ అందించలేదని ఉత్సవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మోతీలాల్ కుశ్వాహా చెప్పారు.
అధికార యంత్రాంగం చర్యలు ఎలా ఉన్నప్పటికీ, ఉత్సవం కోసం బరియార్‌పూర్‌కు జంతువుల తరలింపు కొనసాగుతోంది.
జంతువులను వధించడానికి మంగళవారం ఉదయం దాదాపు 200 మంది సిద్ధంగా ఉన్నారు.
ఉచిత భోజనాలు, శిబిరాల ఏర్పాటు లాంటి ఉత్సవ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు మోతీలాల్ కుశ్వాహా బీబీసీతో చెప్పారు.
జంతువధకు మద్దతివ్వకుండా ఉండేందుకు ప్రయత్నించామని, కానీ ఈ సంప్రదాయంపై ప్రజల్లో విశ్వాసం ఉందని, బలిచ్చేందుకు వాళ్లు జంతువులను తీసుకొచ్చారని ఉత్సవ నిర్వహణ కమిటీకి చెందిన వీరేంద్ర ప్రసాద్ యాదవ్ వార్తాసంస్థ ఏఎఫ్‌పీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఒకవైపు బలులు మొదలవగా, మరోవైపు జంతువధకు వ్యతిరేకంగా తమ సందేశం జనంలోకి వెళ్తోందని జంతుహక్కుల కార్యకర్తలు ఆశాభావం వ్యక్తంచేశారు.
బలులపై ఆలయ పూజారిని హ్యుమేన్ సొసైటీ ఇండియా డైరెక్టర్ అలోక్‌పర్ణ సేన్‌గుప్తా నేరుగా నిలదీశారని ఆ సంస్థ చెప్పింది.
బలికి వ్యతిరేకంగా ఆమె చేసిన అభ్యర్థనలను నిర్వాహకులు పట్టించుకోలేదు.
జాతరకు వచ్చిన కొందరు- తాము ఈ ఏడాది ఏ జంతువునూ బలి ఇవ్వట్లేదన్నారు. పరిస్థితులు మారుతున్నాయనేందుకు ఇవి సంకేతాలని జంతుహక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
తమ ఉద్యమంతో ఆలయ కమిటీ, ప్రభుత్వం వెనకడుగు వేశాయని, బలిచ్చే జంతువుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని యానిమల్ ఈక్వాలిటీ ఇండియాకు చెందిన అమృతా ఉబాలే వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- మలేషియాలోని ఏకైక సుమత్రన్ ఖడ్గమృగం మృతి
- అమ్మకానికి గున్న ఏనుగులు
- "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"
- బొడ్డుతాడు ఎప్పుడు కత్తిరించాలి
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- చక్కెర తినడం మంచిదా, కాదా? ప్రపంచంలో చక్కెర ఎక్కువగా తినే ప్రజలు ఎవరు?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత
- చంద్రయాన్-2: ‘విక్రమ్ ల్యాండర్ దొరికింది.. కనిపెట్టింది నేనే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








