పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫైసల్ మహమ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో తేనెతుట్టెను కదిలించేందుకు సిద్ధమైంది.
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంటులో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
అయితే, ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టొచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. అయితే, బిల్లు ముసాయిదాలో ఉన్న అంశాల వివరాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, న్యాయం వైపు ఉంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ ప్రభుత్వ తొలి హయాంలోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర (హిందూ, సిక్కు, పార్సీ, జైనులు, తదితర మతాల) వలసదారులకు కొన్ని షరతుల ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు.
అప్పుడు లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే, రాజ్యసభ ఆమెదం పొందకముందే ఎన్నికలు వచ్చాయి.
రెండు సభల ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం వరకూ వెళ్లలేకపోయింది కాబట్టి ఈ బిల్లు వీగిపోయింది. అందుకే, మోదీ ప్రభుత్వం దీన్ని మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
అక్కడి నాయకులు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇదివరకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. బయటి దేశాలవారికి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇస్తే, తమ ప్రాంతాల్లో జనాభా స్వరూపం మారిపోతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై బుధవారం కూడా అసోంలో చాలా చోట్ల ఆందోళన ప్రదర్శనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ''ఈ బిల్లులోని అంశాలను చూశాక.. అసోం, ఈశాన్య రాష్ట్రాలు సహా మొత్తం దేశం స్వాగతిస్తుంది'' అని ప్రకాశ్ జావడేకర్ అన్నారు.
కొత్త బిల్లులో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2014, డిసెంబర్ 31 నాటి వరకూ భారత్‌కు వచ్చినవారికే పౌరసత్వం ఇవ్వొచ్చని, కనీసం ఆరేళ్లుగా వారు భారత్‌లోనే ఉంటున్నవారై ఉండాలని ఆ బిల్లులో నిబంధనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతాలకు (అసోం, మేఘాలయా, త్రిపుర, మిజోరాంల్లోని కొన్ని ప్రాంతాలకు), ఇన్నర్‌లైన్ పర్మిట్ రిజీమ్ (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం) రాష్ట్రాలకు వర్తించకుండా ఈ బిల్లులో మినహాయింపును ఇస్తున్నారని హిందుస్థాన్ టైమ్స్ వార్తా వెబ్‌సైట్ పేర్కొంది.

అయితే, పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కూడా గొంతు విప్పుతున్నాయి.
''పౌరసత్వాన్ని మతం నిర్ణయించకూడదు. మన దేశం అందరిదీ. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఈ బిల్లు విరుద్ధం'' అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.
ఈ బిల్లు భారత్‌ను ఇజ్రాయెల్ తరహాలో ప్రత్యేకంగా ఓ మతం కోసం ఉన్న దేశంలా మార్చుతుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అభిప్రాయపడ్డారు.
ఇదివరకటి బిల్లును సీపీఐ కూడా వ్యతిరేకించింది. భారత్ మతపరమైన దేశం కాకూడదని అంబేడ్కర్ గట్టిగా వాదించారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గుర్తుచేశారు.
1971కి ముందు భారత్‌కు వచ్చినవారికి పౌరసత్వం ఇచ్చే విషయంలో తాము సానుకూలంగా ఉన్నామని.. కానీ, ఈ బిల్లులో 2014 వరకూ వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారని అసోంకు చెందిన ఓ ఎంపీ అన్నారు.
ఎవరు పౌరులు అనేది నిర్ణయించేందుకు అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ని ఇటీవలే విడుదల చేశారు. ఇందులో 19 లక్షల మందికి స్థానం దక్కలేదు. అసోంలోని బీజేపీ ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఎన్‌ఆర్‌సీని అంగీకరించడం లేదు.
ఎన్ఆర్‌సీలో చోటు దక్కనివారిలో మిగతా మతాలవారితో పోలిస్తే, హిందువులే ఎక్కువగా ఉండటం దీనికి కారణమని జనాల్లో ఓ అభిప్రాయం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
90వ దశకంలో అసోంలో అక్రమ పౌరుల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వాటికి నేతృత్వం మహించిన అసోం గణ్ పరిషద్ ఇప్పుడు బీజేపీతో కలిసి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పక్షం కూడా కొత్త బిల్లును వ్యతిరేకిస్తోంది.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అసోం మాజీ సీఎం ప్రఫుల్ కుమార్ మహంత్ దేశంలోని మిగతా పార్టీల వారినీ కలుస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ నాయకులతోనూ ఆయన భేటీ అయ్యారు.
ఈ బిల్లు మత వివక్షపూరితంగా ఉందని జేడీయూ కూడా అభిప్రాయపడింది.
అమిత్ షా ఎన్ఆర్‌సీని దేశవ్యాప్తంగా తీసుకువస్తామని అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును ఎన్ఆర్సీ కొనసాగింపుగా చాలా ప్రాంతాల్ల చూస్తున్నారు.
దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని వెనక్కి పంపించడం ఎన్ఆర్‌సీ లక్ష్యమైతే. అలాంటివారిలో ముస్లింలు తప్ప మిగతా మతాలవారికి పౌరసత్వం ఇవ్వడం పౌరసత్వ సవరణ బిల్లు ఉద్దేశం.
ఇవి కూడా చదవండి:
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- ఎన్ఆర్సీ: వారు భారతీయులు కాదు - కేంద్ర ప్రభుత్వం
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- ఆండ్రాయిడ్‌లో 'స్పూఫింగ్' బగ్.. బ్యాంకు ఖాతాల మీద సైబర్ దొంగల దాడి
- మియన్మార్‌లోని రోహింజ్యా ముస్లిం గ్రామాల విధ్వంసం
- టాటూలతో అర్ధనగ్న ప్రదర్శనలు, విచారణకు ఆదేశించిన మలేషియా ప్రభుత్వం
- జీసస్ మాంజర్: క్రిస్టమస్ కోసం వెయ్యేళ్ల తర్వాత బెత్లెహాం చేరిన ‘జీసస్ ఉయ్యాల తొట్టి చెక్క ముక్క’
- లక్షల జంతువులను బలి ఇచ్చే 'అత్యంత రక్తసిక్త జాతర' మళ్ళీ మొదలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








