మియన్మార్‌లోని రోహింజ్యా ముస్లిం గ్రామాలను ధ్వంసం చేసిన ప్రభుత్వం.. వాటి స్థానంలో బ్యారక్‌లు, శిబిరాలు.

మియన్మార్‌లోని ముస్లిం రోహింజ్యా గ్రామాలను కూల్చివేసి వాటి స్థానంలో పోలీసు బ్యారక్‌లు, ప్రభుత్వ భవనాలు, శరణార్థుల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు బీబీసీ గుర్తించింది.
ప్రభుత్వ ఆహ్వానం మేరకు బీబీసీ అక్కడ ఉన్న నాలుగు శిబిరాలను పరిశీలించింది. ఒకప్పుడు అవి ముస్లిం రోహింజ్యా గ్రామాలని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. అయితే, రఖైన్ రాష్ట్రంలోని వివిధ గ్రామాలను ధ్వంసం చేసిన నిర్మాణాలు చేపట్టారనే అంశాన్ని అధికారులు ఖండించారు.
మియన్మార్‌లో 2017లో నిర్వహించిన సైనిక చర్య వల్ల దాదాపు ఏడు లక్షల మంది రోహింజ్యాలు ఆ దేశం నుంచి పారిపోయారు.
ఐక్యరాజ్యసమితి ఈ ఘటనను 'సమూల జాతి ప్రక్షాళన'గా అభివర్ణించింది. మియన్మార్‌లో లక్షలాది మంది రోహింజ్యాలను సైన్యం చంపిందనే వాదనలను అక్కడి ప్రభుత్వం ఖండించింది.
బౌద్ధులు మెజారిటీగా ఉన్న మియన్మార్‌లో సైన్యం ముస్లిం రోహింజ్యా జాతుల ప్రక్షాళన, మారణహోమం చేసిందనే వాదనలను ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. దేశం నుంచి పారిపోయిన శరణార్థులను తిరిగి తాము తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఇటీవల ప్రకటించింది.
గత నెల, మియన్మార్ తిరిగి రావడానికి అంగీకరించిన 3,450 మంది రోహింజ్యా ముస్లింలు తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. దీంతో రోహింజ్యా శరణార్థులను స్వదేశానికి రప్పించడానికి చేసిన రెండో ప్రయత్నం విఫలమైంది.
2017లో జరిగిన దురాగతాలకు బాధ్యత వహించకపోవడం, అలాగే, తిరిగి వచ్చిన వారికి స్వేచ్ఛ, పౌరసత్వం లభిస్తుందా అనే అంశాలపై స్పష్టత లేదని వారు అంటున్నారు.
తమ దేశానికి వచ్చేవారిని బంగ్లాదేశ్ రాకుండా చేస్తోందని వియన్మార్ విమర్శించింది. తమ దేశానికి తిరిగొచ్చేవారికి కల్పించిన సౌకర్యాలను ప్రపంచానికి చూపెట్టేందుకు ప్రభుత్వం జర్నలిస్టులను ఆహ్వానించింది.
సాధారణంగా రఖైన్‌లో పర్యటించడంపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో బయలుదేరాం. పోలీసుల పర్యవేక్షణ లేకుండా అక్కడ వీడియో తీయడానికి, ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కూడా అనుమతి లేదు.
అయితే, రోహింజ్యాలను ఉద్దేశపూర్వకంగా నిర్మూలించారనడానికి స్పష్టమైన ఆధారాలను మేం సంపాదించాం.
2017 హింసాకాండ తర్వాత రోహింజ్యా గ్రామాలలో దాదాపు 40 శాతం ఇళ్లు కూల్చివేసినట్లు శాటిలైట్ చిత్రాలను విశ్లేషించిన అనంతరం ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ సంస్థ వెల్లడించింది.

మియన్మార్‌లో బీబీసీ ఏం కనుగొంది?
ప్రభుత్వం మమ్మల్ని హ్లా పోయి కౌంగ్ శరణార్థ శిబిరానికి తీసుకెళ్లింది. దేశానికి తిరిగొచ్చేవారి కోసం ఇక్కడ దాదాపు 25 వేల తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇక్కడ వారిని రెండు నెలలు ఉంచిన అనంతరం శాశ్వత నివాస గృహాలకు తరలిస్తామని వెల్లడించింది.
వాస్తవానికి ఈ శిబిరాలను ఏడాది కిందటే నిర్మించారు. ఆవాసాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. సామూహిక మరుగుదొడ్లు పాడైపోయాయి. ఈ శిబిరాన్ని మౌ రి టూ లార్, థార్ జే కోన్ అనే రెండు రోహింజ్యా గ్రామాలలో నిర్మించారు. 2017లో ఈ రెండు గ్రామాలలో హింస చెలరేగింది.
ఈ గ్రామాలను ఎందుకు ధ్వంసం చేశారని మేం శిబిర పాలనాధికారి సోయి శ్వే ఆంగ్‌ను ప్రశ్నించగా, ఆయన మా వాదనను ఖండించారు. అయితే, నేను శాటిలైట్ చిత్రాలను రుజువులుగా చూపగా, ఈ మధ్యనే తాను క్యాంపు బాధ్యతలు స్వీకరించానని, దీనికి సమాధానం చెప్పలేనని మాకు తెలిపారు.
మమ్మల్ని కెయిన్ చాయింగ్ అనే మరో శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ శరణార్థుల శాశ్వత నివాసం కోసం భారత్, జపాన్ ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇళ్లు నిర్మించారు. ఈ శిబిర నిర్మాణం కోసం మైర్ జిన్ అనే రోహింజ్యా గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. అధికారులు ఈ విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించారు.
ప్రధాన పట్టణానికి వెలుపల మౌంగ్‌డ్వా, మై థో గ్యీ గ్రామాలలో 8 వేల మంది రోహింజ్యాలు ఉండేవారు.
మై థో గ్యీ గ్రామాన్ని సెప్టెంబర్ 2017లో నేను ఒక ప్రభుత్వ వాహనంలో వెళ్లి చిత్రీకరించాను. అక్కడ చాలా ఇళ్లు కాలిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామం ఉన్న చోట పర్యటిస్తుంటే అక్కడ పెద్దపెద్ద ప్రభుత్వ, పోలీసు సముదాయాలు కనిపించాయి. అప్పుడు ఉన్న చెట్లు కనిపించలేదు.
ఇన్ దిన్ అనే మరో రోహింజ్యా గ్రామానికి కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. 2017 సెప్టెంబరులో పట్టుబడిన 10 మంది ముస్లింలను ఇక్కడే ఊచకోత కోశారు. మియన్మార్ మిలిటరీ అంగీకరించిన అతికొద్ది దారుణాలలో ఇదీ ఒకటి.
ఇన్ దిన్ జనాభాలో మూడొంతుల మంది ముస్లింలు. మిగిలినవారు రఖైన్ బౌద్ధులు.
ఇప్పుడు ఇక్కడ ముస్లింలున్న ఆనవాళ్లు ఏమాత్రం లేవు. మేం రోహింజ్యాలు ఉన్న ఇళ్లను పరిశీలించగా అక్కడ ఒకప్పుడు ఉన్న చెట్లు ఇప్పుడు కనిపించలేదు. వాటి స్థానంలో ముళ్ల కంచెలు, పోలీసు బ్యారక్‌లు దర్శనమిచ్చాయి.
ఒకప్పుడు తమతో కలసి జీవించిన ముస్లింలను ఇప్పుడు తిరిగి రావడానికి అంగీకరించమని రఖైన్ బౌద్ధులు చెప్పారు.

శరణార్థుల కోసం చేస్తున్నదేమిటి?
2017లో రోహింజ్యాలు మియన్మార్‌ను వదిలి వెళ్లిన తర్వాత అందులో కొంతమంది తిరిగి తమ పాత జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. తిరిగి స్వదేశానికి రావాలనుకున్నారు.
వెళ్లిపోయిన శరణార్థులు తిరిగి వచ్చాక వారికి సౌకర్యాలు కలిపించేందుకు హ్లా పో కాంగ్, కైన్ చౌంగ్ తదితర ప్రాంతాలలో పునరావాస శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కొద్దిమంది శరణార్థులు భవిష్యత్తు కోసం రెండేళ్ల కిందట వారు అనుభవించిన బాధను దిగమింగి ఈ శిబిరాల్లో తలదాచుకునే అవకాశం ఉంది.
అయితే, పారిపోయిన ముస్లిం రోహింజ్యాలను మయన్మార్ ప్రజలు ఆదరిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
యాంగూన్‌కు తిరిగి వెళ్లేటప్పుడు నేను శరణార్థిగా ఉన్న ఒక యువ రోహింజ్యాను కలవగలిగాను. అయితే, అనుమతి లేకుండా రోహింజ్యాలను కలవడానికి విదేశీయులకు అనుమతి లేదు. నేను కలిసిన ఈ యువ రోహింజ్యా కుటుంబాన్ని కొన్నాళ్ల కిందట సిట్వే నుంచి తరిమేశారు. ఏడేళ్లుగా అతను కుటుంబంతో సహా ఒక శిబిరంలో తలదాచుకుంటున్నారు.
2012లో జరిగిన హింసాకాండలో నిరాశ్రయులైన 1.30 లక్షల మంది రోహింజ్యాలలో ఇతనూ ఒకరు. ఇప్పటికీ ఈయన అనుమతి లేకుండా శిబిరం బయటకు రాలేరు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?
రఖైన్‌లో మా పరిశీలనకు వచ్చిన అంశాలపై ప్రతిస్పందన కోసం మేం మియన్మార్ ప్రభుత్వ ప్రతినిధిని సంప్రదించాం. కానీ, ఆయన స్పందించలేదు.
బంగ్లాదేశ్ సహకారంతో శరణార్థులను దశలవారీగా తిరిగి స్వదేశానికి తీసుకరావడానికి అధికారికంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, రోహింజ్యాలు బంగ్లాదేశ్ వాసులని, 70 ఏళ్ల నుంచి వారు అక్రమంగా తమ దేశంలోకి వలస వస్తున్నారని మంత్రులు ఇప్పటికీ చెబుతున్నారు. వాళ్లు వలస వచ్చిన వాళ్లే అనడానికి కొన్ని ఆధారాలున్నాయి. తమకు పౌరసత్వం ఇవ్వాలన్న రోహింజ్యాల అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. దానికి బదులుగా నేషనల్ వెరిఫికేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కానీ, ఈ కార్డులను తీసుకుంటే తమను బంగ్లాదేశీయులుగా గుర్తిస్తారని
చాలా మంది రోహింజ్యాలు ఈ కార్డుల ప్రతిపాదనను తిరస్కరించారు.
రోహింజ్యాలకు వ్యతిరేకంగా 2017 సెప్టెంబర్ ప్రారంభంలో మొదలైన సైనిక చర్య సమయంలో మియన్మార్ సాయుధ దళాల కమాండర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లింగ్ మాట్లాడుతూ, 1942 నుంచి "అసంపూర్తిగా ఉన్న వ్యాపారం''ను ఇప్పుడు పూర్తి చేస్తామని ప్రకటించారు.
రఖైన్‌లో జపాన్, బ్రిటిష్ దళాల మధ్య జరిగిన పోరాటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పోరాటంలో స్థానికంగా ఉన్న రోహింజ్యాలు, రఖైన్ బౌద్ధులు వేర్వేరు దళాలకు మద్దతిచ్చి ఒకరినొకరు చంపుకున్నారు. ఈ యుద్ధం మూలంగా భారీ స్థాయిలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉన్న ఉత్తర రఖైన్ రాష్ట్రంలోకి ఒకప్పుడు ముస్లింలు వరదలా వలస వచ్చారని ఆ కమాండర్ చెప్పారు.
సరిహద్దులోని మౌంగ్‌డావ్, బుతిడాంగ్ అనే రెండు జిల్లాల్లోని అనేక గ్రామాలు 2017 నుంచి ధ్వంసం అయ్యాయి. మియన్మార్‌లో ఒకప్పుడు ముస్లిం మెజారిటీ ఉన్నఏకైక ప్రాంతం ఇది.
ప్రస్తుతం ఇక్కడున్న బౌద్ధలు, ముస్లింలను బహిష్కరించడంతో వారి జనాభా 10 శాతానికి తగ్గింది. బహుశా ఇప్పుడు వారు ఇక్కడ మైనారిటీలై ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది...
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- చంద్రయాన్ 2: మోదీ కెమెరాలను చూసే ఇస్రో చీఫ్ శివన్‌ను ఓదార్చారా.. అసలు నిజం ఏమిటి – Fact Check
- విశాఖపై ఆర్థిక మాంద్యం ప్రభావం: ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి
- న్యాయవాదికి బేడీలు వేసిన ఈ పాకిస్తానీ మహిళా కానిస్టేబుల్ వీడియో ఎందుకు వైరల్‌గా మారింది
- ‘శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది’
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ ప్రాంతంతో చిక్కులు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








