వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు

వేలిముద్రల మార్పిడి ముఠా
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఒక మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ప‌లు నేరాల‌కు పాల్ప‌డి ప్రవాసంలోకి పారిపోవాల‌నుకుంటే సాధ్య‌మ‌వుతుందా?

ఏదో ఒక కేసులో ఇరుక్కుని, పోలీసు రికార్డుల్లో పేరున్న కారణంగా విదేశీయానానికి అన‌ర్హుడిగా ఉన్న వ్య‌క్తి ఆ అడ్డంకులను దాటుకుని నేరుగా ప‌ర‌దేశం వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంటుందా?

ఇమ్మిగ్రేష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇది సాధ్యం కాదు.

కానీ, తాజాగా ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోలీసులు ఛేదించిన ఓ రాకెట్ గ‌మ‌నిస్తే విస్మ‌య‌క‌ర వాస్త‌వం బ‌య‌ట‌ప‌డింది.

న‌క‌ిలీ పాస్‌పోర్ట్ ముఠాలు కొత్త కాదు. ఇప్ప‌టికే వివిధ సంద‌ర్భాల్లో న‌కిలీ పాస్‌పోర్టులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

కానీ, ఒకే మ‌నిషికి వివిధ పేర్లతో ఒకటి కన్నా ఎక్కువ పాస్ పోర్టులు ఉండడం, వాటికి సంబంధించి వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ వివరాలు కూడా వేర్వేరుగా ఉండటం పోలీసులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నకిలీ పాస్‌పోర్టుల సాయంతో దేశం దాటిపోయిన వారి సంఖ్య 50 వ‌ర‌కూ ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు. వారిలో ఎవరు ఏ స్థాయి నేరాల‌కు పాల్ప‌డ్డారో, ఎవ‌రికి ఎవ‌రితో సంబంధాలున్నాయో స్ప‌ష్ట‌త లేద‌ు.

వేలిముద్రల మార్పిడి ముఠా

పాస్‌పోర్టుల జారీని ప్ర‌భావితం చేసేలా...

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ దేశ‌స్తుడైనా మ‌రో దేశం వెళ్లి రావాలంటే అనేక నిబంధ‌న‌లున్నాయి. దీనికి పాస్‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రి. భార‌తీయులకు నేపాల్ వంటి దేశాలకు మిన‌హాయింపులున్న‌ప్ప‌టికీ సాధారణంగా విదేశీయానానికి పాస్‌పోర్ట్ అనివార్యం.

ఈ పాస్‌పోర్ట్ జారీ పాస్‌పోర్ట్ యాక్ట్ 1967, పాస్‌పోర్ట్ జారీ నిబంధ‌న‌లు 1980కి అనుగుణంగా జరుగుతుంది. 2000 సంవ‌త్స‌రంలో ప్రారంభించిన త‌త్కాల్ స్కీమ్‌లో కూడా పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. పాస్‌పోర్ట్ జారీ చేసిన త‌ర్వాత కూడా అవసరమనుకుంటే దానిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

పాస్ట్‌పోర్ట్ జారీకి సంబంధిత వ్య‌క్తులకు చెందిన అనేక అంశాలు ప‌రిగ‌ణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పోలీస్ విచారణలో వారి వ్య‌క్తిగ‌త రికార్డులు ప‌రిశీలిస్తారు. తీవ్ర‌మైన నేరాలు లేదా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డిన వారికి పాస్‌పోర్ట్ జారీని నిరాక‌రించే వీలుంటుంది.

అంతేకాకుండా, పాస్‌పోర్ట్ జారీ చేసిన త‌ర్వాత ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. దాన్ని ర‌ద్దు చేయ‌డం లేదా తాత్కాలికంగా నిలుపుద‌ల చేయ‌డం వంటి చ‌ర్య‌లుంటాయి. విదేశాల‌కు వెళ్లి చ‌ట్ట విరుద్ధ‌మైన కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములైన వారికి సంబంధించిన పాస్‌పోర్టులు సీజ్ చేసే వీలుంది.

ఇలాంటి నిబంధ‌న‌ల‌ను అధిగ‌మించి, కొంద‌రిని దేశం దాటిస్తున్న ముఠా వ్య‌వ‌హార‌మే ఇప్పుడు విస్మ‌య‌క‌రంగా మారింది.

వేలిముద్రల మార్పిడి ముఠా

వేలిముద్రలు మార్చేస్తూ.. కొత్త రికార్డుల‌తో

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకి చెందిన నెల్స‌న్ గ‌ల్ఫ్ దేశాలకు ఉపాధికోసం వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయ‌న‌కు పాస్‌పోర్ట్ జారీ అయ్యే అవ‌కాశం లేదు. దాంతో ఆయ‌న బ‌ల‌హీన‌త‌ల‌ను సొమ్ము చేసుకునేందుకు ఓ ముఠా స‌భ్యులు నెల్స‌న్‌ని సంప్ర‌దించారు. త‌మ ప్ర‌ణాళిక‌ను వివ‌రించారు.

అయితే అనుమానం వ‌చ్చిన నెల్స‌న్.. వెంట‌నే పాల‌కొల్లు పోలీసుల‌కు వివ‌రాలు అందించ‌డంతో గుట్టు ర‌ట్టు చేయ‌గ‌లిగామ‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఎస్పీ న‌వ్‌జీత్ సింగ్ గ్రేవాల్ బీబీసీకి తెలిపారు.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి గ‌ల్ఫ్ దేశాల‌కు ఎక్కువ‌గా వ‌ల‌స‌లు వెళుతున్న‌ట్టుగా రికార్డులు చెబుతున్నాయి. అందులో గోదావ‌రి జిల్లాల్లోని రాజోలు, న‌ర్సాపురం ప‌రిస‌రాలు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాలవారు అత్య‌ధికంగా ఉంటున్నారు. దాంతో ఈ ప్రాంతాల‌పై ఈ ముఠాపై దృష్టి సారించింది.

వేలిముద్రల మార్పిడి ముఠా

వేలి ముద్ర‌ల మార్పిడి పెద్ద స‌మ‌స్య కాదు..

పాస్ట్‌పోర్ట్ జారీ చేసేందుకు ప్ర‌స్తుతం ఆధార్ కార్డ్ కీల‌కంగా భావిస్తున్నారు. బ‌యోమెట్రిక్ ఆధారంగా రూపొందిస్తున్న ఆధార్ కార్డులు సృష్టిస్తే పాస్‌పోర్ట్ సంపాదించే మార్గం సుగ‌మం అవుతుంది.

స‌రిగ్గా ఈ అంశంపైనే దృష్టిపెట్టి, వేలిముద్ర‌ల‌ను మార్పిడి చేసే ప‌ద్ధ‌తికి ఈ ముఠా శ్రీకారం చుట్టిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

"వేలిముద్ర‌ల విష‌యంలో క‌నీసంగా 10 నుంచి 15 శాతం మార్చేందుకు త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. చిన్న‌గా మ‌త్తు ఇచ్చి స‌ర్జిక‌ల్ ప‌ద్ధ‌తిలో పాత‌ వేలి ముద్ర‌ల‌ను తొల‌గించి, మ‌ళ్లీ కుట్లు వేస్తున్నారు.

చాలా సింపుల్‌గా ఈ ప్ర‌క్రియ జ‌రిగిపోతోంది. ఒక చిన్న గ‌దిలో గానీ, లాడ్జిలో గానీ ఈ ప‌ని పూర్తి చేస్తున్నారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా జ‌రిగిపోతోంది. దాంతో పాత రికార్డుల‌ను గ‌మ‌నించే అవ‌కాశం లేకుండా పోతోంది. కొత్త ముద్రల ఆధారంగా కొత్త పేర్ల‌తో ఆధార్ కార్డు, ఇత‌ర స్థానిక ఆధారాలు సంపాదిస్తున్నారు. వాటిని ఉప‌యోగించి పాస్‌పోర్ట్ కోసం వ‌స్తున్నారు. పాస్‌పోర్ట్ జారీ చేసే స‌మ‌యంలో జ‌ర‌గాల్సిన పోలీస్ వెరిఫికేష‌న్ కూడా త‌ప్పించుకునేందుకు చిరునామా వంటి వివరాలు కూడా కొత్తవి ఇస్తున్నారు.

ఈ ప‌ద్ధ‌తిలో ఇప్ప‌టికే అనేక మందిని దేశం దాటించిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది" అని ఎస్పీ గ్రేవాల్ బీబీసీకి తెలిపారు.

వేలిముద్రల మార్పిడి ముఠా

శ్రీలంక‌కు చెందిన బ‌స్సు కండ‌క్ట‌ర్‌దే కీల‌క పాత్ర‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఈ పాస్‌పోర్ట్ కోసం వేలిముద్ర‌లు మార్చేసే ముఠాలో శ్రీలంకకు చెందిన జాకీర్ హుస్సేన్ కీల‌క పాత్ర‌ధారిగా పోలీసులు చెబుతున్నారు. శ్రీలంకలోని క్యాండీ ప‌ట్ట‌ణంలో బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న జాకీర్.. బ‌ట్ట‌ల వ్యాపారం పేరుతో ప‌దేప‌దే ఇండియాకు వ‌చ్చి, నెల్లూరుకి చెందిన ర‌మేష్ రెడ్డి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన బొక్కా రాంబాబు వంటి వారితో క‌లిసి వేలి ముద్ర‌ల మార్పిడిలో ముఖ్య‌పాత్ర పోషించిన‌ట్టుగా వెల్ల‌డించారు.

గ‌తంలో కువైట్ వెళ్లి అక్క‌డ అక్ర‌మంగా మ‌ద్యం విక్ర‌యించిన కేసులో బొక్కా రాంబాబు అరెస్టు కావ‌డంతో ఆయ‌న పాస్ట్‌పోర్ట్ సీజ్ చేశారు. ఆ త‌ర్వాత బొక్కా రాజేష్ అనే పేరుతో కొత్త పాస్ట్‌పోర్ట్ కూడా సంపాదించిన‌ట్టు పోలీసుల రికార్డులో ఉంది. ఒకే ఫొటోతో రెండు పేర్ల‌తో పాస్‌పోర్టులున్న‌ట్టు గ‌మ‌నించారు.

వేలిముద్రల మార్పిడి ముఠా

వేలిముద్ర‌లు మార్చి, విదేశీల‌కు పంపించ‌డంలో ఎవ‌రి పాత్ర ఏమిటి

బొక్కా రాంబాబు కువైట్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో జాకీర్ హుస్సేన్ తండ్రి ప‌రిచ‌యం కావ‌డం, వారితో పాటుగా మేరీ అనే మ‌హిళ కూడా తోడు కావ‌డంతో గ‌డిచిన కొన్ని నెల‌ల్లోనే వేలిముద్ర‌లు మార్చ‌ి కొత్త పాస్‌పోర్టులు సంపాదించి, సుమారు 40మందికి పైగా వివిధ దేశాల‌కు వెళ్లేందుకు స‌హ‌క‌రించ‌గ‌లిగార‌ని పోలీసులు అంటున్నారు.

  • కువైట్‌లో ఉన్న జాకీర్ తండ్రి, మేరీ అక్క‌డి వ్య‌వ‌హారాలు చూస్తారు.
  • నెల్లూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ర‌మేష్ రెడ్డి.. రాక‌పోక‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం చ‌క్క‌బెడ‌తారు.
  • జాకీర్ హుస్సేన్ వేలిముద్ర‌ల మార్పిడి వ్య‌వ‌హారం సాగిస్తారు.
  • బొక్కా రాంబాబు స్థానికంగా అలాంటి వారిని గుర్తించి వారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తారు.

వీరితోపాటు ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో క‌డ‌ప జిల్లాకు చెందిన కొంద‌రు ఈ వ్య‌వ‌హారంలో భాగ‌స్వాములుగా ఉన్నార‌ని ఎస్పీ చెబుతున్నారు.

ప‌రారీలో ఉన్న ముఠా సభ్యులతోపాటు కొంద‌రు పోలీస్ సిబ్బంది పాత్రపైనా అనుమానాలు ఉన్నాయ‌ని, అన్నింటిపైనా విచార‌ణ‌ చేస్తామ‌ని ఎస్పీ చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గ్రేవాల్
ఫొటో క్యాప్షన్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గ్రేవాల్

ఈ త‌ర‌హా నేరాలు దేశంంలోనే తొలిసారి...శిక్ష‌ణ కూడా ఇప్పించి

వేలిముద్ర‌లు మార్చేసి, కొత్త పాస్‌పోర్టులు సంపాదిస్తున్న నేరాలు గ‌తంలో ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని ఎస్పీ గ్రేవాల్ చెబుతున్నారు.

"బొక్కా రాంబాబు గ‌ల్ఫ్‌లో ఉన్న స‌మ‌యంలో బంగ్లాదేశ్, శ్రీలంక‌కు చెందిన కొంద‌రు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు గ‌మ‌నించారు. కానీ అత‌నికి అంత సామర్థ్యం లేక‌పోవ‌డంతో జాకీర్ హుస్సేన్‌తో స్నేహం చేసి, ర‌మేష్ రెడ్డి స‌హాయంతో ముఠాగా ఏర్పడి కార్యకలాపాలు ప్రారంభించారు.

దిల్లీ, చెన్నై స‌హా వివిధ‌ ప్రాంతాల్లో ఈ ప్ర‌క్రియ సాగించారు. అంతేకాకుండా జాకీర్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ కూడా తీసుకుని స్థానికంగా త‌న ఇంట్లోనే ఐదుగురికి వేలిముద్ర‌లు మార్పించాడు. పాల‌కొల్లు మండ‌లంలోని భ‌గ్గేశ్వ‌రంలో ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్న వీరా త్రిమూర్తులు ఈ వేలిముద్ర‌ల మార్పిడిలో శిక్ష‌ణ తీసుకుని ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామి అయ్యారు. ఇంకా ఎవ‌రెవ‌రి పాత్ర ఉంద‌నేది తేలాల్సి ఉంది" అంటూ ఎస్పీ వివ‌రించారు.

వీసాలు కూడా సృష్టించి ఉంటార‌నే అనుమానాలు

పాస్‌పోర్టుల‌తో పాటు వివిధ దేశాల‌కు సంబంధించిన న‌కిలీ వీసాల‌ను కూడా ఈ ముఠా సిద్ధం చేసింద‌నే ప్ర‌చారం ఉంది. పోలీసులు మాత్రం వాటికి సంబంధించిన ఆధారాలు లేవ‌ని చెబుతున్నారు. ద‌ర్యాప్తు సాగుతోంద‌ని, ఇంకా అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మాత్రం భావిస్తున్నారు.

ఇప్ప‌టికే దేశం నుంచి వేలిముద్ర‌లు మార్చుకుని విదేశాల‌కు వెళ్లిన వారిలో ఎలాంటి నేర‌గాళ్లు ఉన్నారు, ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారోన‌నే విష‌యం ప్రస్తుతం తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)