‘ఆర్థిక మాంద్యమే ఆదాయం తగ్గుదలకు కారణం’ – అభిప్రాయం

తెలంగాణ బడ్జెట్

ఫొటో సోర్స్, KCR/FB

    • రచయిత, డి. పాపారావు
    • హోదా, ఆర్థిక విశ్లేషకులు, బీబీసీ కోసం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూ.1,46,492 కోట్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ప్రవేశపెట్టారు.

సాగు నీరు, సంక్షేమ రంగానికి బడ్జెట్‌ పెద్దపీఠ వేసింది. అయితే, 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థాయి అయిన రూ. 1,82,017 కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కేటాయింపుల మొత్తం గణనీయమైన కుదింపే. దీనికి కారణాల అనేకం.

దేశవ్యాప్త ఆర్థికమాంద్యం వలన ప్రభుత్వాల ఆదాయాలు పడిపోవడం ప్రధాన కారణం.

నేటి తన బడ్జెట్ ఉపన్యాసంలో కేసీఆర్ ఈ అంశాన్ని గురించి మాట్లాడేందుకు చాలా సమయమే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టాలని కేసీఆర్ ఈ బడ్జెట్ తయారీ దశ నుంచే చెబుతున్నారు.

బడ్జెట్

కాగా, తనవంతుగా ఈ పూర్థిస్థాయి బడ్జెట్‌లో కేటాయింపుల కోతకు- దేశంలో ఆర్థికమాంద్యం స్థితి కారణమని చెబుతూనే రాష్ట్రం తన పాలనలో రూ. 2.50 లక్షల కోట్ల మేరకు అప్పుల పాలవడం, పాలనలోని నిర్లిప్తత, అవకతవకల వలన కూడా రాష్ట్ర ఆదాయానికి గండిపడిందనే విషయాలను తన ప్రస్తావనల నుంచి ఆయన మినహాయించారు. అంటే , దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం వలన అందరి ఆదాయాలు తగ్గుతాయనే దానికే ఆయన పరిమితమయ్యారు.

కాగా, దేశంలోని ఇతర రాష్ట్రాల స్థితితో పోల్చితే తెలంగాణ పరిస్థితి కొంత మెరుగేనన్నది నిజం. ఉదాహరణకు ఆటోమొబైల్ అమ్మకాల పతనం దేశంలో సుమారు 30 శాతం ఉండగా, తెలంగాణలో అది 12 శాతంగానే ఉంది. కానీ, తెలంగాణలో పన్నుల వసూళ్లు అనేక మాసాలుగా దిగజారుతున్నాయి.

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్టీ ఆదాయ పెరుగుదల 2018-19లో 17శాతంగా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఆ పెరుగుదల కేవలం 5 శాతానికి పడిపోయింది.

అలాగే, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వీటి మీద లభించే పన్నుల ఆదాయం తగ్గిపోయింది. ఇక కాస్తంత మెరుగ్గా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా 2019 ఏప్రిల్/ జులై నాలుగు నెలల కాలంలో 10 శాతం మేర తగ్గిపోయింది. దీంతో పాటుగా నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్రం నుంచి ఆశించిన 19,500 కోట్ల రూపాయిల రాష్ట్ర పన్నుల వాటా తాలుకూ పంపిణీని 16,500 కోట్లకు తగ్గించుకోవాల్సి వస్తోంది. కేంద్రానికి లభించే పన్నుల ఆదాయంలో భారీ పతనమే దానికి కారణం. ఈ విధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయనికి భారీ గండి పడింది.

కాగా, రాష్ట్రం ఏర్పడిన అనంతర ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 159శాతం పెరిగిపోవడంతో ఆ అప్పులపై నెలకు 1000 నుంచి 1500 కోట్ల రూపాయిలు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది.

తగ్గిన అమ్మకాలు

ఫొటో సోర్స్, PTI

2018 చివర్లో జరిగిన శాసన సభ ఎన్నికల కాలంలో ఇచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాల వ్యయం ఈ రోజు భారంగా మారిపోనుంది.

ఫలితంగా నేడు ఈ పథకాల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోంది. ముందుముందు ఆర్థిక సంక్షోభం మరింత ముదిరిపోనుండటం కూడా అగ్నికి ఆజ్యంలా తోడవ్వనుంది. అదీ విషయం.

ఆదాయం తగ్గుదల .. అప్పుల భారం... లెక్కకు మించిన సంక్షేమ పథకాలు.. నీటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు- నేడు ప్రభుత్వాన్ని కృంగదీసేవిగా మారాయి.

తెలంగాణ బడ్జెట్

ఫొటో సోర్స్, KCR/FB

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక స్థితి దృష్ట్యా రోజుకు 50 కోట్ల రూపాయిలకు మించి బిల్లుల చెల్లింపులను అంగీకరించడం లేదట. దీని వలన ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు 27,000 కోట్ల రూపాయిలకు పైబడి పేరుకుపోయి ఉన్నాయి.

కాబట్టి, నిన్నటి దాకా తమది ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న కేసీఆర్- కొంత దేశ ఆర్థిక స్థితి మందగమనం వలనా, మరింతగా తన స్వీయ తప్పిదాల వలన నేడు దేశంలో తెలంగాణ స్థితే కాస్తంత ''గుడ్డిలో మెల్లలా'' ఉందంటూ, బేల పలుకులతో తన 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)