పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులతో గర్భిణిపై దాడి

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల్ని ఎత్తుకుపోతోందన్న అనుమానంతో ఓ గర్భిణిపై దాడిచేసిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది.
బాధితురాలి(25) పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని, ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు బీబీసీకి తెలిపారు.
దిల్లీతోపాటు పొరుగునున్న రాష్ట్రాల్లో పిల్లల్ని అపహరిస్తున్నారనే వదంతులపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి.
గతేడాది కూడా ఇలాంటి వదంతులపై పలువురు అమాయకుల్ని జనాలు తీవ్రంగా కొట్టారు. దీంతో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది.
దిల్లీతో సరిహద్దు కలిగిన ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
‘వదంతులు నమ్మొద్దు’
తాజా ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వీటిలో బాధిత మహిళ చుట్టూ కొందరు గుమిగూడి.. పిల్లల్ని ఎత్తుకెళ్తోందని ఆరోపిస్తూ కొడుతున్నారు.
''ఆగస్టు 29 వరకు 46 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో కేవలం వదంతులే దాడులకు కారణం. ఎక్కడా పిల్లల్ని ఎత్తుకుపోయినట్లు ఆధారాలు కనిపించలేదు''అని డీజీపీ ఓపీ సింగ్ ట్వీట్‌చేశారు.
''దయచేసి ఎవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 100 నంబరుకు ఫోన్ చేయండి. లేదా సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని సంప్రదించండి''అని సింగ్ వివరించారు.
దిల్లీ శివార్లలోనున్న గాజియాబాద్‌లో ఇలాంటి కేసులు ఆగస్టులో ఆరు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
''ఓ బామ్మ తన మనవరాలితో బయటకు వెళ్తున్నప్పడు కూడా ఇలాంటి వదంతులపై దాడి జరిగింది. బామ్మ, మనవరాలి శరీరం రంగు వేర్వేరుగా ఉండటంతో జనాలు అనుమానంతో దాడి చేశారు''అని సీనియర్ పోలీసు అధికారి నీరజ్ జాదౌన్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను అరెస్టుచేశామని తెలిపారు.
వదంతులపై జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నప్పటికీ.. కిడ్నాప్‌లు నిజంగా పెరుగుతున్నాయా? అనేది తెలియడంలేదు.
ముఖ్యంగా వాట్సాప్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కిడ్నాప్ వదంతులు వేగంగా వ్యాపిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి వదంతులను గుప్పుమనిపిస్తున్న మెసేజ్‌లను నమ్మొద్దని అధికారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- సైబీరియన్ కొంగలు... చింతపల్లి వారి చుట్టాలు
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన మహిళలు
- కళ తప్పుతున్న గుజరాత్ నల్సరోవర్ సరస్సు
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









