వితంతువులపై దురాచారాలు: "చనిపోయిన భర్త జుట్టు, గోళ్లతో చేసే సూప్ తాగిస్తారు"

ఘనాలోని కొన్ని ప్రాంతాల్లో వితంతువులతో చనిపోయిన తమ భర్తల జుట్టు, గోళ్లతో చేసిన సూప్ తాగిస్తారు.

ఫొటో సోర్స్, Katie Horwich

ఫొటో క్యాప్షన్, ఘనాలోని కొన్ని ప్రాంతాల్లో వితంతువులతో చనిపోయిన తమ భర్తల జుట్టు, గోళ్లతో చేసిన సూప్ తాగిస్తారు.

జీవిత భాగస్వామి మరణాన్ని జీర్ణించుకోవడం అంత తేలికకాదు. అనుక్షణం వారి స్మృతులు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా బాధను దిగమింగుతూ వితంతువులు జీవన పోరాటమే చేస్తుంటారు.

వితంతువుల పాలిట కొన్ని దురాచారాలు, సంప్రదాయాలు శాపంగా మారుతున్నాయి. ఇలాంటి అనాగరిక సంప్రదాయాలపై ఎమిలీ థామస్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కొన్ని ప్రాంతాల్లో వితంతువులను అందరితో కలిసి భోజనం తిననివ్వరు. పోషకాహారాన్ని వారికి దూరం చేస్తారు. దారుణమైన, ప్రమాదకర దురాచారాలు పాటించేలా ఒత్తిడి చేస్తుంటారు.

ఘనాలో పేద వితంతువులు ఇలాంటి సంప్రదాయాలకు ఎక్కువగా గురవుతుంటారు. వీరికి అండగా నిలిచేందుకు ఆఫ్రికా ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ కొందరు వితంతువులకు పోషకాహారం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.

చనిపోయిన భర్త శరీరం నుంచి సేకరించిన గోళ్లు, జుట్టుతో చేసిన సూప్‌ తాగాలని ఇక్కడ వితంతువులపై ఒత్తిడి చేస్తారు.

శ్మశానంలో మహిళ

శవం జుట్టు, గోళ్లతో సూప్

''శవానికి స్నానం చేయించిన నీళ్లలో గోళ్లు, జుట్టు కలిపి తాగమంటారు'' అని ఉత్తర ఘనాలో వితంతువులు, అనాథల కోసం ఉద్యమిస్తున్న విడోస్ అండ్ ఆర్ఫన్స్ మూవ్‌మెంట్ డైరెక్టర్ ఫాతి అబ్దులై తెలిపారు.

కొంత మంది ఇలాంటి ఆచారాలకు ఎదురు నిలుస్తున్నారు. అయితే చాలామంది పేద వితంతువులు మాత్రం వీటిని ఇంకా భరిస్తున్నారు.

సాధారణంగా ఇక్కడ భర్త చనిపోయిన అనంతరం ఆస్తిపై హక్కు అతడి కుటుంబానికి వెళ్లిపోతుంది. దీంతో చాలామంది వితంతువులను తమ భర్తకు చెందిన పొలాల్లో కూడా అడుగు పెట్టనివ్వడంలేదు. భర్త కుటుంబంలో మరొకరిని పెళ్లి చేసుకుంటేనే వారికి మళ్లీ ఆస్తి హక్కులు వస్తున్నాయి.

ప్రపంచవాప్తంగా 28.5 కోట్ల మందికిపైగా వితంతువులు జీవిస్తున్నట్లు అంచనా. వీరిలో ప్రతి 10 మందిలో ఒకరు కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. చాలా దేశాల్లో పేదరికాన్ని శాపంగా భావిస్తుంటారు. వితంతువులు ఎదుర్కొంటున్న వేధింపులను తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలుగా ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

చిత్ర తల్లి, అమ్మమ్మ

ఫొటో సోర్స్, Chitrita Banger Gee

ఫొటో క్యాప్షన్, చిత్రిత తల్లి, అమ్మమ్మ

చేపలు, మాంసం, గుడ్లు వారికి దూరం

కొన్ని దేశాల్లోని ఉన్నత సామాజిక వర్గాల్లోనూ వితంతువులు దురాచారాలను ఎదుర్కొంటున్నారు.

''కొన్ని దశాబ్దాల ముందువరకూ పశ్చిమ బెంగాల్‌లోని ఉన్నత కులాలకు చెందిన హిందూ మహిళలు భర్త మరణానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది'' అని బెంగాలీ చరిత్రకారిణి, నవలా రచయిత్రి చిత్రిత బంజెర్‌జీ తెలిపారు.

''వారికి చేపలు, మాంసం, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లిలను దూరం చేసేవారు. చిన్నప్పటి నుంచీ తినే వీటిని ఒక్కసారిగా లాగేసుకునేవారు'' అని చిత్రిత వివరించారు.

''భర్త చనిపోవడం పాపమని భావించేవారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే దీని నుంచి బయట పడగలమని నమ్మేవారు. చేపలు, మాంసం లాంటి ఆహారాన్ని వారికి దూరం చేయడమే దీనికి ఏకైక మార్గమని విశ్వసించేవారు. అసలు ఇదే ప్రధాన సమస్య'' అని ఆమె చెప్పారు.

''మా బామ్మ వితంతువుగా మారినప్పుడు ఈ తంతును నేను కళ్లారా చూశాను. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి. రంగురంగుల చీరలు, నగలు ధరించే ఆమె తెల్లని వస్త్రాలకు పరిమితమైంది. అందరితో కలిసి భోజనం చేయడం కూడా మానేసింది. అన్ని తినేది కాదు'' అని చిత్రిత వివరించారు.

''ఆమె వండుకునే వంటల్లో కొన్ని మాత్రమే బావుండేవి. తినకుండా నిషేధం విధించిన ఆహార పదార్థాల స్థానంలో కొన్ని ప్రత్యామ్నాయ పదార్థాలను ఆమె వాడేది. ఆమె ఉల్లిపాయలు తినేది కాదు. అలాంటి రుచి కోసం ఇంగువ ఉపయోగించేది'' అని చిత్రిత చెప్పారు.

మహిళ, కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే.. బాధలో ఉన్నప్పుడు మనకు మరింత ఆదరణ, పోషకాహారం అవసరం. ఆప్తులతోపాటు ఇష్టమైన ఆహారమూ దూరమైతే మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యమూ పూర్తిగా దెబ్బతింటుంది.

ఆహారంలో నాణ్యత లోపించడం, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలు వృద్ధ వితంతువులను ఎక్కువగా వేధిస్తున్నట్లు చైనా, ఐరోపా దేశాలు, అమెరికాల్లో చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.

70, 80ల వయసున్న వృద్ధ వితంతువులపై పోషకాహార నిపుణురాలు ఎలిజబెత్ వాస్నెవెర్ లోతైన అధ్యయనం చేశారు.

''దాదాపుగా ఒకే గీతకు అటువైపు, ఇటువైపు నిలబడే ఇద్దరు బామ్మలు ఉండేవారు నాకు. వారిలో ఒకరు భర్త మరణించిన రెండేళ్లలోనే ఎలాంటి జబ్బూ లేకుండా చనిపోయారు. అనారోగ్యంతో ఉండే భర్త ఆహారపు అలవాట్లకు తగిన విధంగా ఆమె తన అలవాట్లనూ మార్చుకున్నారు. రెండో బామ్మ ఆహారాన్ని వైద్యంలా భావించేది. తన ఆరోగ్య సంరక్షణలో ఆహారానికి ఆమె పెద్ద పీట వేసేది'' అని ఎలిజబెత్ వివరించారు.

మైఖేల్ ఫ్రీడ్లాండ్ తన భార్య సారాతో పెళ్లి రోజు, 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిగిన ఫొటోలు

ఫొటో సోర్స్, Jonathan Freedland

ఫొటో క్యాప్షన్, మైఖేల్ ఫ్రీడ్లాండ్ తన భార్య సారాతో పెళ్లి రోజు, 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిగిన ఫొటోలు

మరణ ప్రభావమెంత?

జీవిత భాగస్వామిని కోల్పోయిన అనంతరం రెండేళ్లలో మరణించే ముప్పు మహిళలతోపాటు పురుషుల్లోనూ ఉంటుందని ఎలిజబెత్ గుర్తించారు. ఈ ముప్పులో ఆహారానికి ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆమె భావిస్తున్నారు.

''వితంతు జీవితాలపై పోషకాహారం, ఆహారపు అలవాట్లు గట్టి ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో తేలింది'' అని ఎలిజబెత్ వివరించారు.

''పోషకాహారాన్ని తక్కువగా తీసుకోవడం, తెలియకుండానే బరువు తగ్గిపోవడం, సంతోష లేమి.. ఇలాంటివి వితంతువుల్లో కనిపిస్తున్నాయి'' అని ఆమె చెప్పారు.

''వయసు పైబడిన పురుషులకు తమకు అవసరమైన ఆహారాన్ని వండుకోవడం రావడంలేదు. అయితే ఈ సమస్య కేవలం వంటచేసే నైపుణ్యాలతో ముడిపడిలేదు. ఎందుకంటే దశాబ్దాలుగా ఇంటిలో అందరికీ వండివార్చే మహిళల్లోనూ ఇలాంటి ఫలితాలే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది'' అని ఎలిజబెత్ అన్నారు.

''భర్త చనిపోయిన తర్వాత తెల్లవారుజామున లేవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఓ మహిళ చెప్పింది. తను మధ్యాహ్నం 11 గంటల వరకు, ఒక్కోసారి మూడు గంటల వరకు నిద్రపోయేదాన్నని, ఫలితంగా భోజన వేళల్లో మార్పులు వచ్చేవని తెలిపింది'' అని ఎలిజబెత్ వివరించారు.

మరోవైపు భార్యను కోల్పోయిన భర్తలు కూడా కొన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు.

శ్మశానంలో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

జర్నలిస్ట్ మైకేల్ ఫ్రీడ్‌ల్యాండ్ భార్య సారాతో దశాబ్దాలపాటు కలిసి జీవించారు. ఆరేళ్ల క్రితం సారా చనిపోవడంతో మైకేల్‌కు భోజనం తయారుచేసుకోవడం కష్టంగా ఉండేది.

''సారా మరణించిన అనంతరం భారీగా బరువు తగ్గిపోయా. ఇంట్లో తినేటప్పుడు అసలు సంతృప్తే ఉండేది కాదు. మునుపటిలా మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది'' అని మైకేల్ వివరించారు.

''అప్పుడు చాలా తక్కువ తినేవాణ్ని. కానీ గుడ్లతో కూర చేసుకోవడంలో నైపుణ్యం సాధించా'' అని ఆయన అన్నారు.

''చాలా మంది నాపై జాలి చూపించేవారు. భోజనానికి రమ్మని ఆహ్వానించేవారు. కానీ అక్కడకు వెళ్లాలంటే ఏదోలా ఉండేది. ఒక్కోసారి నేనేమైనా ఆశ్రమంలో ఉన్నానా అనిపించేది. నాకు భోజనం పెట్టిన వారిని పిలిచి భోజనం పెట్టాలని అనుకున్నాను'' అని వివరించారు.

''మరోవైపు పిల్లలు కూడా వంట నేర్చుకునే తరగతులకు వెళ్లమని చెప్పారు. దీంతో 80ల వయసులో వాటిలో చేరాను'' అని మైకెల్ చెప్పారు.

తన భర్త ఎరిక్ కోల్బ్‌తో లీసా కోల్బ్

ఫొటో సోర్స్, Lisa Kolb

ఫొటో క్యాప్షన్, తన భర్త ఎరిక్ కోల్బ్‌తో లీసా కోల్బ్

''ఆ వంట తరగతులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కేవలం గుడ్లకే పరిమితమైన నాకు చేపలు, మాంసం.. ఇలా చాలా వంటలు నేర్పించాయి. మరోవైపు నాకు ఇష్టమైనవి ఎలా వండుకోవాలో కుటుంబ సభ్యులు కూడా చెప్పేవారు. ఇది నిజంగా కొత్త అనుభూతి. నా జీవితాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది'' అని బీబీసీకి మైకేల్ వివరించారు.

వితంతువులకు సాయం చేయడమెలా..

ఈ అంశంపై వాషింగ్టన్ డీసీ రచయిత్రి, వంటల నిపుణురాలు లీసా కోల్బ్ కొన్ని సూచనలు చేశారు. వివాహమైన 19 నెలలకే పర్వతారోహణలో భర్త ఎరిక్‌ను ఆమె కోల్పోయింది. అప్పటికి ఆమె వయసు 34ఏళ్లు.

ఆఫ్రికన్ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

''జీవిత భాగస్వామి ఉండేటప్పడు.. కలిసి వండుకుంటాం. కలిసి తింటాం. కలిసి భోజనాలకు వెళ్తుంటాం. అయితే భాగస్వామిని కోల్పోయినప్పడు ఒంటరి అయిపోతాం. ఖాళీగా ఉండే భోజనం బల్లవైపు చూడటం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది'' అని ఆమె వివరించారు.

''ఆహారం బయట నుంచి తెచ్చుకోవచ్చు. తోడు కోసం వేరేవాళ్లనూ రమ్మని పిలవొచ్చు. అయితే భోజనానికి మనమే వేరేవాళ్ల దగ్గరకు వెళ్లాలి, లేదా వేరొకరు మన కోసం ఎందుకు రావాలి? అని ఆలోచించాలి. అందరితో కలిసి ఉండేందుకు, మనకు తోడుగా నిలిచేవారికి దగ్గరగా ఉండేందుకు దొరికిన అవకాశంగా దీన్ని భావించాలి'' అని లీసా చెప్పారు.

''నిస్సహాయంగా ఉండేవారిని చూసేటప్పడు ఏం చేయాలో తోచడం లేదా? అయితే వారికి ఇష్టమైన ఆహారం వండి తీసుకెళ్లండి. లేదా భోజనానికి వారినే ఇంటికి పిలవండి. ఇది అత్యంత ప్రభావవంతమైన, గొప్ప చర్య'' అని ఆమె వివరించారు.

(బీబీసీ వరల్డ్ సర్వీస్‌లోని ''ద ఫుడ్ చైన్ విడోడ్: ఫుడ్ ఆఫ్టర్ లాస్'' ఎపిసోడ్‌లో ఈ ఇంటర్వ్యూలను ప్రసారం చేశారు )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)