హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’ - దేవి

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న ఘటనపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని 15 మంది పౌర హక్కుల కార్యకర్తలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
'దిశ'పై అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువకులు షాద్‌నగర్ 'ఎన్‌కౌంటర్'లో చనిపోయిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటల వరకూ భద్రపరచాలని, పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీసి, తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలోనే ఈ 'ఎన్‌కౌంటర్' జరిగింది.
పోలీసు కాల్పుల్లో ఆ నలుగురు నిందితులు మృతిచెందడం పట్ల సమాజంలోని అధిక భాగం తెలంగాణ పోలీసులను అభినందించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులను, సైబరాబాద్ కమిషనర్‌ను అభినందిస్తూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ప్రముఖులు కూడా వారిలో ఉన్నారు.
పౌర హక్కుల కార్యకర్తలు కొందరు మాత్రం నిందితులను పోలీసులు కాల్చిచంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు చెబుతున్న 'ఎన్‌కౌంటర్' కథనంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై హైకోర్టులో వేసిన పిటిషన్‌లో సంతకం పెట్టిన వాళ్లల్లో ఒకరైన దేవి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు. పోలీసులు చేపట్టిన ప్రక్రియలో ఎన్నో తప్పులున్నాయని ఆమె అన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
షాద్‌నగర్‌లో నేరం జరిగిన ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లిన సమయం, అందుకు పోలీసులు చెప్పిన కారణంపై దేవి సందేహాలు వ్యక్తం చేశారు.
''నిందితులను పగలు కూడా తీసుకువెళ్లొచ్చు. పగలు తీసుకెళ్తే ప్రజల నుంచి ముప్పు ఉంది కాబట్టి తెల్లవారుజామున తీసుకువెళ్లామని పోలీసులు చెబుతున్నారు. ఇది ప్రశ్నించాల్సిన విషయం'' అని దేవి అన్నారు.
ఘటనా స్థలంలో బాధితురాలి ఫోన్, ఇతర వస్తువులు దాచినట్లు నిందితులు చెప్పారని, వాటిని సేకరించేందుకే వాళ్లను అక్కడకు తీసుకెళ్లామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఘటన తరువాత జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
బాధితురాలి ఫోన్ కూడా నిందితులు మంటల్లో కాల్చేసినట్లు ముందుగా పోలీసులు చెప్పారని, ఆ తర్వాతేమో ఫోన్ తీసుకోవడానికి వెళ్లామని అన్నారని దేవి అన్నారు. ఇందులో ఏది నిజం అని ఆమె ప్రశ్నించారు.
రిమాండ్ రిపోర్టులో 'దిశ' సిమ్ కార్డులు మంటల్లో వేశారు కానీ, ఫోన్‌ను మాత్రం నిందితులు తీసుకెళ్లారని ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
''నిందితులు కరడుగట్టిన నేరస్తులని పోలీసులు అంటున్నారు. అలాంటప్పుడు వాళ్లకు సంకెళ్లు ఎందుకు వేయలేదు? చోటును కచ్చితంగా చూపించడానికి వీలుగా సంకెళ్లు వేయలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు, వాళ్లకు అందేలా ఏవీ ఉండకూడదన్న విషయం తెలియదా? అందుకు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు?'' అని దేవి ప్రశ్నించారు.
పోలీసుల దగ్గర నుంచి నిందితులు ఆయుధాలు తీసుకోవడానికి ప్రయత్నించారన్న దానిపైనా తమకు సందేహాలున్నాయని చెప్పారు దేవి.
''వాళ్లు చెబుతున్నట్లుగా.. నిందితులు ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 50 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఆ నిందితులు ఎందుకు చనిపోవాలి? ఆయుధాలు ఎందుకు అన్‌లాక్ చేసి ఉన్నాయి? ఖాళీ పొలాల్లో 50 మంది పోలీసులు ఉండగా, వాళ్లు ఎంత దూరం పారిపోగలరు? ఎంత దూరం వెళ్లగలరు?'' అని ఆమె ప్రశ్నించారు.
అయితే, ఘటనాస్థలానికి నిందితులతోపాటు పది మంది పోలీసుల బృందం వెళ్లినట్లు సజ్జనార్ మీడియా సమావేశంలో చెప్పారు.
‘ఎన్‌కౌంటర్’ అంటూ పోలీసులు వినిపిస్తున్న కథనం చిన్న పిల్లలు కూడా నమ్మేలా లేదని దేవి అన్నారు.
''నిందితులు కరుడుగట్టిన నేరస్తులని పోలీసులు చెబుతున్న విషయం నిజమే అయితే, వారి విషయంలో పాటించాల్సిన ప్రక్రియలను పోలీసులు ఎందుకు పాటించలేదు? ఈ అంశంపై విచారణ జరగాలి. ఒకవేళ పోలీసులు చెబుతున్నట్టుగా నిందితులు నిజంగానే పోలీసుల కంటే తెలివైన వారై, వెంటనే దాడి చేసి ఉండుంటే, అప్పుడు ఈ ఘటనలో భాగస్వాములైన పోలీసుల సామర్థ్యం మీద కూడా విచారణ జరగాలి'' అని ఆమె అన్నారు.
దేవి వ్యక్తం చేసిన సందేహాలనే మరో 15 మంది పౌర హక్కుల నేతలు లేవనెత్తారు. వీటిని కోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో పొందుపరిచారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
'ఎన్‌కౌంటర్'ను ప్రశ్నిస్తూ కూడా కొందరు ప్రముఖులు స్పందించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వారిలో ఒకరు.
చావులపై ఓ ఉత్సవంలా సంబరం చేసుకోవడం తనను కలచివేసిందని ఆమె ‘బీబీసీ తెలుగు’తో అన్నారు.
''వేడుకలు, పూలు చల్లడం, నినాదాలు, డాన్సులు, పాటలు నన్ను భయపెట్టాయి. ఒక చావును పండుగలా చేసుకునే సమాజానికి నేను చెందుతానని అనుకోవడం లేదు. నిందితులు నేరస్తులా కాదా అన్నది మాట్లాడడం లేదు. కానీ వాళ్లను కోర్టులో విచారించలేదు. న్యాయవ్యవస్థ ఉన్న దేశంలో నేను ఉన్నా'' అని జ్వాలా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు
- దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్
- హైదరాబాద్ అత్యాచారం, ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"
- జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?
- విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








