దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

ఫొటో సోర్స్, Social media
దిశపై అత్యాచారం, హత్య కేసులో మరికొన్ని అరెస్టులు జరిగాయి. అయితే, అవి ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళవి కాదు.
బాధితురాలి మీద, ఆమె గురించి మాట్లాడుతున్న మహిళా సంఘాల వారిపైనా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో మారు పేర్లతో, వివిధ సంఘాల పేర్లతో ఉన్న ఖాతాలతో వారు ఆ కామెంట్లు చేశారు.
ఒకవైపు లైంగిక దాడి కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. అనేక మంది స్పందించారు. సంతాపం తెలిపారు. రోడ్ల మీదికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. కానీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది యువకులు ఆ బాధితురాలిపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కొన్ని పోస్టులు ఆమె అందం గురించి, మరికొన్ని పోస్టులు జరిగిన ఘటనలో నిందితులను సమర్థించేలా, ఇంకొన్ని అసలు రేప్ తప్పు కాదు అనేలా ఉన్నాయి.
దీంతో అలా కామెంట్లు పెట్టిన కొందరి మీద కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు... మొదట చవన్ శ్రీరాం అనే 22 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్‌కు చెందిన శ్రీరాం ఫేస్‌బుక్‌లో దిశపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, అతడి మీద నవంబర్ 30న సైబర్ క్రైం విభాగం పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు.
వేరే వాళ్లు పెట్టిన ఫోటోలపై 'స్టాలిన్ శ్రీరామ్' అనే పేరుతో ఉన్న తన ఖాతా నుంచి అతడు ఆ కామెంట్లు చేశారు. దిశ అందం గురించి అతడు కామెంట్లు చేశారు.
అంతేకాదు, గుంటూరు జిల్లాకు చెందిన సాయినాథ్ అలియాస్ నాని అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను ఈ అంశంపై ప్రత్యేకంగా ఓ గ్రూపు కూడా ఏర్పాటు చేశాడు.
ఇక నల్లగొండకు జిల్లా చిట్యాలకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తిని కూడా దిశపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

మహిళా హక్కుల కార్యకర్తలపై కూడా
కొందరు మహిళా హక్కుల కార్యకర్తలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
హక్కుల కార్యకర్త దేవి ఫోటో పెట్టి, "ఆమెకు ఒక కూతురు ఉందని విన్నాను. ఆమె అడ్రస్ చెప్పండి" అంటూ, "ఆమె ఇంట్లో కానీ, ఆమెకు కానీ ఏదో ఒకటి జరగాలి" అంటూ హిందూ శ్రీరాజ్, మంత్రి రవీందర్ పేర్లతో కామెంట్లు ఉన్నాయి.
మరో హక్కుల కార్యకర్త కొండవీటి సత్యవతి మోహన్ కిషోర్ నిమ్మా, భారతీయ వైదిక సనాతన హిందూ సంస్కృతీ వేదిక పేర్లను కూడా షేర్ చేశారు.
ఆ పోస్టులపై హక్కుల కార్యకర్తలు దేవి, సంధ్యలతో పాటూ మహిళా, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల, సంఘాల ఐక్య కార్యాచరణ తరఫున కూడా హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు.

"అగ్రవర్ణ హిందువులపై దాడులు జరిగితే మీరు స్పందిచరా" అంటూ ఓ వ్యక్తి పోస్ట్ పెట్టారు.
"అందులో నా నంబర్, సంధ్య నంబర్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టినప్పటి నుంచి మాకు వందల ఫోన్లు వచ్చాయి. ఫలానా వారు చనిపోతే స్పందిస్తారు. మీరు ఇప్పుడు ఎందుకు స్పందించరు అని మాట్లాడారు. ఇక సోషల్ మీడియా పోస్టుల్లో అయితే రేప్ చేస్తామంటూ బూతులు తిట్టారు. దీనిపై ఫిర్యాదు చేశాం. మాపై విమర్శలు చేస్తే ఎప్పుడూ ఫిర్యాదు చేయం. విమర్శ చేసే హక్కు ఉంటుంది. కానీ బెదిరించడం, బూతులు తిట్టడం, వారి అమ్మాయిలను రేప్ చేయండి అంటున్నారు. అందుకే మేం ఫిర్యాదు చేశాం. దీనిపై పోలీసులు స్పందించారు. వాస్తవానికి మేము షాద్‌నగర్ ఘటనపై స్పందించాం. మీడియాలో ఎన్నో చర్చల్లో కూడా పాల్గొన్నాం. మాకు ఫోన్లు చేసిన వారికి ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తిట్టారు. ఇది కొన్ని హిందుత్వ గ్రూపులు కావాలని చేస్తున్నాయని మేం భావిస్తున్నాం" అని బీబీసీతో దేవి చెప్పారు.
గురువారం వరకు మొత్తం నలుగురు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- షాద్ నగర్ బాధితురాలి సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్‌నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








