హైదరాబాద్ ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు" - కల్పనా కన్నబీరన్ అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కల్పనా కన్నబీరన్
- హోదా, బీబీసీ కోసం
'దిశ' సామూహిక అత్యాచారం, హత్య కేసు అనుమానితులు నలుగురిని 'క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్' కోసం నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లగా అక్కడి నుంచి 'పారిపోవడానికి' యత్నించారని, అప్పుడు జరిగిన కాల్పుల్లో వాళ్లు చనిపోయారని, శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.
పశువైద్యురాలైన 'దిశ' కుటుంబ సభ్యులకు, 'దిశ' ఉదంతానికి మూడు రోజుల ముందు ఆసిఫాబాద్‌లో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన వివాహిత కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
'దిశ' కన్నా ఆసిఫాబాద్ బాధితురాలు మూడేళ్లు పెద్దవారు. చిన్నచిన్న వస్తువులు అమ్ముకుంటూ బతికే ఈ వివాహిత దళితురాలు. కఠినమైన అత్యాచార చట్టం, వేగవంతమైన న్యాయ ప్రక్రియలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు అత్యంత దారుణంగా అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారు.
'దిశ' కేసులో అనుమానితులను బహిరంగంగా కొట్టి చంపాలని ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు జయా బచ్చన్, మాయావతి డిమాండ్ చేశారు.
'ఎన్‌కౌంటర్లో' ఈ అనుమానితులు చనిపోవడంపై వారు సంతోషం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయమంటే ఏది?
అధికార బలం, శిక్షలు పడవనే ధీమా మహిళల ఉద్యమానికి అతిపెద్ద ముప్పు. ఈ స్వేచ్ఛా దేశంలో పౌరులుగా మనం ఈ అంశాలను దాటి ఆలోచించాల్సి ఉంది.
తమ వారి చావుకు కారణమైన వారిని చంపాలని కొన్నిసార్లు బాధిత కుటుంబ సభ్యులు కోరుతుంటారు. వారి శోకాన్ని, భావోద్వేగ స్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. కానీ బాధితులందరూ అలా కోరుకోరనే విషయాన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టాలని సోనియా గాంధీ కోరడాన్ని మనం మర్చిపోలేం.
తమ మనిషి చనిపోయిన దుఃఖంలో ఉన్నప్పుడు బాధితులు భిన్న రకాలుగా స్పందిస్తారు. ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. లైంగిక దాడి, హత్య, కులపరమైన దురాగతం, పిల్లలను పెల్లెట్లు, తుపాకులతో కాల్చడం, మనుషులను తీవ్రంగా గాయపరచడం- ఇవి చాలా దారుణమైనవి. ఇలాంటి సందర్భాల్లో పడే బాధ, కోలుకునే తీరు గురించి మనం ఆలోచించాల్సి ఉంది.
2012లో దిల్లీలో నిర్భయ అత్యాచారం తర్వాత, దేశంలో అత్యాచారాల నియంత్రణకు మరింత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని మనమందరం కోరాం. నాటి అత్యాచారంపై ప్రజాగ్రహం, జస్టిస్ వర్మ కమిటీ విస్తృత సంప్రదింపుల ఫలితంగా 2013లో చాలా కఠినమైన చట్టమే వచ్చింది. దీనిని బట్టి చూస్తే, దిల్లీ బాధితురాలి కుటుంబ సభ్యుల వేదన వృథా కాలేదని చెప్పొచ్చు. 'నిర్భయ' స్ఫూర్తి ఎంత బలమైనదో ఈ చట్టం చాటుతోంది. దారుణమైన హింస వల్ల 'నిర్భయ' కుటుంబం, ఈ దేశం 'నిర్భయ'ను కోల్పోయాయని కూడా ఇది చెబుతోంది.
హింసకు మనం కోరుకునే సమాధానం- చట్టమంటే ఏ మాత్రం లెక్కచేయని దుందుడుకుతనమున్న పోలీసులు చేసే పని కాదు. న్యాయమనేది మనుషుల్ని దారుణంగా చంపేయడం, రక్తం పారించడం వల్ల జరగదు. న్యాయం అందించే ప్రక్రియకు బాధిత కుటుంబాల వేదన ప్రాతిపదిక కాదు. అంతులేని బాధ, దుఃఖంలో కూరుకుపోయిన బాధితులకు అండగా నిలవడం, అత్యంత సమర్థవంతమైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌తో అనుమానితులను, నిందితులను కోర్టు ముందు నిలబెట్టేలా చేయడంలో న్యాయం ఇమిడి ఉంది.

ఫొటో సోర్స్, UGC
పటిష్ఠ భద్రత ఉండే పోలీసు కస్టడీలో నలుగురు నిరాయుధులైన అనుమానితులను చంపేయడం వల్ల ఏ ప్రయోజనం ఒనగూరుతుంది?
ఒకరి మరణంతో ఏర్పడే లోటు ఆ మరణానికి ప్రతిగా మరింత మంది ప్రాణాలు తీయడంతో పూడదు. వీరిని చంపేయడంలో ఏకపక్ష ధోరణి, ముందస్తు ప్రణాళిక, వీరిని చంపితే శిక్ష పడదనే భరోసా ఉన్నాయి. ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమైనది.
చట్టం నిర్దేశించిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తికీ జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను దూరం చేయకూడదనే భారత రాజ్యాంగ అధికరణ 21ని ఇది పూర్తిగా ఉల్లంఘిస్తోంది.
చివరకు వచ్చే సరికి, 'దిశ' కేసులో మన ముందు ఎన్ని మృతదేహాలున్నాయి?

ఈ హత్యలపై దర్యాప్తు జరపాలి
ఒక మహిళను అత్యాచారం చేసి, హత్య చేసి, దహనం చేశారు. బహుశా అత్యంత హేయమైన నేరమిది.
వారం వ్యవధిలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి, తమ కస్టడీలో ఉండగా చంపేశారు. నేర దర్యాప్తు పెద్దగా జరగకముందే వారు ఈ పని చేశారు.
నేరం ఎలా జరిగిందో ఘటనా స్థలంలో వివరించే (క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్) సమయంలో అనుమానితులు తప్పించుకోవడానికి యత్నించారని, అప్పుడు జరిగిన కాల్పుల్లో చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. 'క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్' నేర దర్యాప్తులో ప్రాథమిక ప్రక్రియ. అది కూడా ఇంకా పూర్తికాలేదు. ఇంతలోనే అనుమానితులను చంపేయడం ద్వారా పోలీసులు అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును దెబ్బతీశారు.
నేరం ఇంకా నిరూపణ కాలేదు. నేరంలో అనుమానితుల పాత్రపై దర్యాప్తు కూడా పూర్తి కాలేదు. ఈ నలుగురి కాల్చివేతతో కేసులో ఇంకో నలుగురు చనిపోయినట్లైంది. 'క్రిమినల్ లా'లో హత్య నిర్వచనం ప్రకారం చూస్తే- ఈ నలుగురూ హత్యకు గురయ్యారు. వీరి హత్యలను దర్యాప్తు చెయ్యాలి.

'దిశ' కేసులో అనుమానితులు పోలీసుల కస్టడీలో అక్కడుండే పరిస్థితుల మధ్య నేరాన్ని ఒప్పుకొన్నారు. అయితే ఈ నలుగురి హత్య విషయంలో- ప్రభుత్వ అధికారులు (ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్) వీరిని తామే చంపామంటూ నేరాన్ని బాహాటంగా అంగీకరించారు.
అనుమానితులు తప్పించుకొనేందుకు యత్నించారని, 'ఆత్మరక్షణ' కోసం తాము కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అవతలి పక్షం చేతిలో ఆయుధం ఉండి, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు 'ఆత్మరక్షణ' అనేది వస్తుంది.
కస్టడీలో ఉంచినందున ఈ నలుగురి వద్ద ఆయుధాలు ఉండి ఉండవు. ఒకవేళ ఆయుధాలు ఉండొచ్చనే అనుకున్నా, 'ఆత్మరక్షణ' అనేది విచారణలో ఆధారాలను పరిశీలించే దశలో పరిశీలనకు వస్తుంది. ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం మనిషి మరణానికి కారణమైనప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 'ఆత్మరక్షణ' అని చెప్పేందుకు వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అంశంపై సమగ్రంగా చర్చ జరిగింది. జస్టిస్ గోడా రఘురామ్ తీర్పు, జస్టిస్ బిలాల్ నజ్కీ 'డిసెంట్'లను పక్కన పెట్టలేం.
చట్టబద్ధ పాలనకు క్రమశిక్షణాయుత పోలీసు వ్యవస్థ తప్పనిసరి
పోలీసులు ప్రభుత్వ అధికారులు. వారు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఆధారాల చట్టం, పీనల్ కోడ్, ఇతర అంశాల్లో శిక్షణ కూడా పొందుతారు. కాపాడటానికి, భద్రత కల్పించడానికి వారికి ఆయుధాలు ఇచ్చారు. అంతేగాని, ఇష్టం వచ్చినట్లు చంపేయడానికి, గాయపరచడానికి కాదు.
చట్టబద్ధ పాలనకు క్రమశిక్షణ కలిగిన పోలీసు వ్యవస్థ తప్పనిసరి. అత్యధిక ప్రజల సెంటిమెంట్‌తో నిమిత్తం లేకుండా, రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని వారు ప్రమాణం కూడా చేస్తారు. డాక్టర్ అంబేడ్కర్‌ను ఎప్పటికైనా మరచిపోగలమా? 'రాజ్యాంగ నైతికత'కు లోబడే 'ప్రజా నైతికత' ఉండాలని ఆయన చెప్పారు. మనల్ని మనం నాగరిక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే పక్షంలో, అందుకు అనుగుణంగా మనం వ్యవహరించాలి. ఇప్పుడు మనకు కావాల్సింది పరిస్థితులను మెరుగుపరచే పోలీసింగ్, అంతేగాని నేరుగా శిక్షలు విధించే పోలీసింగ్ కాదు.
పోలీసుల రక్తదాహాన్ని, రాజ్యం ఏకపక్ష వైఖరిని ఆమోదించడం మహిళలకు చాలా ప్రమాదకరం. మహిళలు న్యాయం, స్వేచ్ఛ, గౌరవం సాధించుకునే మార్గం ఎంతో వేదనతో కూడుకొన్నది. అయినప్పటికీ న్యాయమైన సమాజాన్ని సాధించుకోవడానికి మనకు మరో మార్గం లేదు.
(వ్యాసకర్త హైదరాబాద్‌లోని సామాజిక అభివృద్ధి మండలి- సీఎస్‌డీప్రొఫెసర్, డైరెక్టర్. అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- శ్రీజ డెయిరీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల సంస్థ’.. ఇందులో అంతా మహిళలే
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








