నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

ఫొటో సోర్స్, Dr Ravi Khanna
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు రెండు నెలల క్రితం భూమిలో మూడు అడుగుల లోతులో ఒక మట్టికుండలో బయటపడ్డ పసిపాప ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
హానికర బ్యాక్టీరియా వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం(సెప్టిసీమియా), కీలకమైన ప్లేట్‌లెట్లు ప్రమాదకరస్థాయిలో పడిపోవడంతో విషమ పరిస్థితిలో ఉన్న ఈ శిశువును అక్టోబరు మధ్యలో ఆస్పత్రికి తీసుకొచ్చారు.
నెలలు నిండకుండానే పుట్టిన ఈ శిశువు ఇప్పుడు బరువు పెరిగిందని, శ్వాస తీసుకోవడం, ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణంగా ఉన్నాయని ఆమెకు చికిత్స అందించిన పీడియాట్రిషన్ రవి ఖన్నా బీబీసీతో చెప్పారు.
ఆమె తల్లిదండ్రులెవరో ఇప్పటికీ తెలియదు. నిర్దేశిత వ్యవధి తర్వాత చిన్నారిని ఎవరైనా దత్తత తీసుకొనేందుకు అధికార యంత్రాంగం అనుమతించనుంది.
చిన్నారి ప్రస్తుతం యూపీలోని బరేలీ జిల్లాలో పిల్లల సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంది.
ప్రసవ సమయంలో మరణించిన తన ఆడశిశువును ఒక గ్రామస్థుడు పూడ్చిపెడుతుండగా, ఈ శిశువు బయటపడింది.
మూడు అడుగులు తవ్విన తర్వాత తన పార తగిలి భూమి లోపలున్న ఓ మట్టి కుండ పగిలిపోయి, శిశువు ఏడుపు వినిపించిందని గ్రామస్థుడు చెప్పారు. కుండను బయటకు తీసి చూస్తే లోపల పసిపాప కనిపించిందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Dr Ravi Khanna
శిశువును మొదట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత మెరుగైన సదుపాయాలున్న డాక్టర్ రవి ఖన్నా చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు.
30 వారాలకే ఈ శిశువు పుట్టి ఉండొచ్చని, ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు 1.1 కేజీ బరువే ఉందని ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు శిశువు శరీరం ముడతలు పడినట్లుగా కనిపించింది. త్వరగా వేడిని కోల్పోయేది. రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉండింది.
ఈ నెల 3న బరేలీ జిల్లా అధికారులకు చిన్నారిని అప్పజెప్పామని, అప్పుడు 2.57 కేజీల బరువు ఉందని డాక్టర్ రవి ఖన్నా గురువారం తెలిపారు.
ఇప్పుడు తను డబ్బాపాలు తాగుతోందని, పూర్తి ఆరోగ్యంతో ఉందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.
అక్టోబర్లో ఈ శిశువును భూమిలోపల మట్టిపాత్రలో ఎంతసేపు లేదా ఎన్ని రోజులు పూడ్చిపెట్టారనేది తెలియదు. ఆమె ఎలా ప్రాణాలు నిలబెట్టుకొని ఉండొచ్చనేది మాత్రమే తాము అంచనా వేయగలమని వైద్యులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Anoop Kumar Mishra
మూడు, నాలుగు రోజుల ముందు శిశువును పూడ్చిపెట్టి ఉండొచ్చని, ఆమె తన 'బ్రౌన్ ఫ్యాట్'తో ప్రాణాలు నిలుపుకొని ఉండొచ్చని డాక్టర్ రవి ఖన్నా చెప్పారు. పిల్లలు పుట్టినప్పుడు వారి ఉదరం, తొడ, చెంప భాగాల్లో కొవ్వు ఉంటుంది. దీని సాయంతో అత్యవసర పరిస్థితుల్లో కొంత సమయం వారు ప్రాణాలు నిలబెట్టుకోగలరు.
మరికొందరు నిపుణులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు, మూడు గంటలపాటు శిశువును పూడ్చి పెట్టి ఉండొచ్చని, కాపాడకపోతే మరో గంట లేదా రెండు గంటలు మాత్రమే ఆమె బతికేదని వారు చెప్పారు.
శిశువుకు మట్టికుండ లోపలి 'ఎయిర్ పాకెట్' నుంచి ఆక్సిజన్ లభించి ఉండొచ్చని లేదా వదులుగా ఉన్న భూమి పొరల గుండా కొంత ఆక్సిజన్ అంది ఉండొచ్చని, ఈ కుండ ఎక్కువ సాంద్రతతో కూడిన మట్టితో తయారుకాకపోవడం కూడా కలసివచ్చి ఉండొచ్చని వారు అంచనా వేశారు.
పసిపాపను సజీవంగా పూడ్చిపెట్టిన కేసులో పోలీసులు అక్టోబరులో గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం చూస్తున్నారు. ఈ నేరంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండొచ్చని, ఈ కేసు గురించి బాగా ప్రచారం జరిగినా, శిశువు తమ సంతానమేనంటూ ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు.
శిశువును సజీవంగా పూడ్చిపెట్టడానికి కారణాలపై అధికారులు ఎలాంటి ఊహాగానాలూ చెయ్యలేదు. స్త్రీ-పురుష నిష్పత్తిలో అత్యధిక వ్యత్యాసమున్న దేశాల్లో భారత్ ఒకటి. సామాజికంగా మహిళలు చాలాసార్లు వివక్షను ఎదుర్కొంటుంటారు. ఆడపిల్లలు ఆర్థికంగా భారమని అనుకొనేవారు ఉంటారు. ఇలాంటి వారు ప్రత్యేకించి పేద వర్గాల్లో ఎక్కువగా ఉంటారు.
చట్టవిరుద్ధంగా పనిచేసే లింగ నిర్ధరణ కేంద్రాల్లో పరీక్షలు చేయించి గర్భస్థ శిశువు ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయించడం, లేదా పుట్టిన తర్వాత చంపేయడం చాలాసార్లు జరుగుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- సరోగసీ నియంత్రణ బిల్లు: ఈ బిల్లు ఎందుకు అవసరం?
- టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'
- పిల్లల కోపాన్ని పెద్దలు తక్కువగా అంచనా వేస్తున్నారు - గ్రెటా థన్‌బర్గ్
- ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- తెలంగాణ: పసిబిడ్డను సజీవ సమాధి చేసే ప్రయత్నం... అడ్డుకున్న పోలీసులు
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- పునరావాస శిబిరాల్లో అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకెళ్లదీస్తున్న కశ్మీరీ పండిట్లు
- గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
- స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ
- హైదరాబాద్ ఎన్కౌంటర్: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- 'దిశ' నిందితుల ఎన్కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








