స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఫొటో సోర్స్, Loksabha TV
దేశంలో మహిళలపై అత్యాచారాలు, మహిళల భద్రత అంశంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్‌సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా గందరగోళం తలెత్తింది.
కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు స్మృతి ఇరానీ వద్దకు వచ్చి, ఆమెపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారని అధికార బీజేపీ సభ్యులు అన్నారు.
ఆ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది.
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులను కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు ఆధిర్ రంజన్ చౌధరి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని, ఆ తర్వాత కూడా మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్టాలో, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో కూడా జరిగాయని తెలిపారు. ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని మంటల్లో పడేశారని, ఆమె శరీరం చాలావరకు కాలిపోయిందని చెప్పారు.
''ఈరోజు డిసెంబర్ 6. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు. ఆలయం కడుతున్నారు. ఒకవైపు హిందుస్తాన్‌లో పురుషోత్తముడైన రాముడికి ఆలయం కడుతున్నారు. మరోవైపు సీతాదేవిని కాల్చేస్తున్నారు. ఇదే దేశంలో జరుగుతోంది. ఇంత ధైర్యం ఎలా వస్తోంది? ఉత్తర ప్రదేశ్ ఉత్తమ ప్రదేశ్ అవుతుందనుకుంటే రోజురోజుకీ అధమ ప్రదేశ్ అవుతోంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హైదరాబాద్ పోలీసులు నిందితుల్ని కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిందితుల్ని వదిలిపెట్టేశారు'' అన్నారు.
స్మృతి ఇరానీ ఈ అంశంపై స్పందిస్తూ.. ''కావాలనే మహిళల భద్రత అంశాన్ని మతంతో ముడిపెట్టి, రాజకీయం చేయాలనే దుస్సాహసాన్ని ఈ సభలో ఎప్పుడూ చూసి ఉండం. బెంగాల్‌కు చెందిన ఒక సభ్యుడు.. హైదరాబాద్, ఉన్నావ్ సంఘటనల గురించి మాట్లాడుతూ మందిరాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ, మాల్దాలో ఏం జరిగింది? దానిపై మాత్రం నోరువిప్పట్లేదు. అత్యాచారాన్ని రాజకీయ అస్త్రంగా పంచాయితీ ఎన్నికల్లో వాడుకున్నారు. వాళ్లు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు'' అన్నారు.
స్మృతి ఇరానీ ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు కొందరు నినాదాలు చేశారు. దీనికి ఆమె ఆగ్రహం ప్రదర్శిస్తూ.. ''ఒక సభ్యురాలిగా నేను నా అభిప్రాయాలను చెప్పుకోవచ్చు. అలా మాట్లాడుతున్నప్పుడు నాపై కేకలు వేయొద్దు. అలా కేకలు వేస్తున్నావంటే ఒక మహిళ తన గొంతెత్తి సమస్యలపై మాట్లాడకూడదని నువ్వు కోరుకున్నట్లే. నీ సీట్లో కూర్చో. పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారాన్ని ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు'' అన్నారు.
హైదరాబాద్‌లో జరిగింది, ఉన్నావ్‌లో జరిగింది తప్పేనని.. అమానవీయంగా ఒక మహిళపై అత్యాచారం చేసి, తగలబెట్టి చంపేస్తే, ఆ నిందితులకు మరణశిక్ష విధించాలా అంటే.. తప్పకుండా విధించాలి. కానీ, ఇలాంటి చర్యలపై రాజకీయం చేస్తే ఏ బాధితురాలికైనా సహాయం లభిస్తుందా? అని స్మృతి ప్రశ్నించారు.
మహిళలు, చిన్నారులకు న్యాయం చేసేందుకు వెయ్యికి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Loksabha TV
కాగా, ఆమె ప్రసంగిస్తున్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఆమె వద్దకు వచ్చి, బెదిరింపు ధోరణిలో ప్లకార్డులు ప్రదర్శించారని, ఈ సంఘటనను ఖండించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి అన్నారు. ఆ ఇద్దరు సభ్యులను పిలిపించి, వారి చేత బేషరతుగా క్షమాపణ చెప్పించాలని ఆధిర్ రంజన్ చౌధరికి సూచించారు.
మహిళా ఎంపీని విపక్ష సభ్యులు పార్లమెంటు సాక్షిగా బెదిరించడం సరికాదని పలువురు అధికార పార్టీకి చెందిన మహిళా సభ్యురాలు సంగీత కుమారి సింగ్ దేవ్ అన్నారు. ఒక సభ్యుడు చొక్కా చేతుల్ని పైకి మడతపెట్టాడని, అతను పైపైకి వచ్చాడని, తామంతా చూశామని చెప్పారు.
ఆధిర్ రంజన్ చౌధరి స్పందిస్తూ.. ఈ చర్చ జరుగుతున్నప్పుడు తాను సభలో లేనని, ఏం జరిగిందో తనకు తెలియదని, కాబట్టి వారితో మాట్లాడి తర్వాత స్పందిస్తానని చెప్పారు.
అయితే, సభను వాయిదా వేద్దామని, ఈలోపు అన్ని అంశాలనూ పరిశీలించి రావాలని స్పీకర్ స్థానంలో కూర్చున్న మీనాక్షి లేఖి సూచించారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమయం ఇచ్చినప్పటికీ ఆ సభ్యులు సభకు రాలేదని, వారు వచ్చి క్షమాపణలు చెప్పకుంటే ఆ ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేయాలని సూచించారు.
అనంతరం పలువురు అధికార పార్టీ సభ్యులు, ఇతర పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడుతూ.. మహిళా సమస్యలపై ఒక మహిళా సభ్యురాలు మాట్లాడుతుంటే ఇద్దరు పురుష సభ్యులు దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు. సీసీటీవీ వీడియోలను చూసి వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సభ్యులు ఇంటికి వెళ్లిపోయి ఉంటే సోమవారం అయినా క్షమాపణలు చెప్పాలని, లేదంటే సస్పెండ్ చేయాలన్నారు. దేశం మొత్తాన్ని రక్షించేందుకు చట్టాలు చేసే సభలో ఒక మహిళ, ఒక మంత్రి మాట్లాడుతుండగా ఇలాంటి పరిస్థితి తలెత్తితే దేశానికి, ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తాం? అని ప్రశ్నించారు. క్షమాపణ చెబితే సరిపోదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. చట్టాలు చేసే సభ్యులే చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా అని అడిగారు.
సభ్యులు మాట్లాడిన తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు.
కాగా, సోమవారం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందో చూస్తానని పార్లమెంటు బయట స్మృతి ఇరానీ విలేకరులతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
- 'దిశ' నిందితుల ఎన్కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- LIVE: హైదరాబాద్ ఎన్కౌంటర్: పోస్టు మార్టం కోసం మహబూబ్ నగర్ ఆస్పత్రికి నిందితుల మృతదేహాలు
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ
- టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








