హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

దిశ, ఎన్‌కౌంటర్, తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రశాంత్ చాహల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిశ కేసులోని నలుగురు నిందితుల 'ఎన్‌కౌంటర్' విషయంలో తెలంగాణ పోలీసుల తీరును కొందరు ప్రశంసిస్తుంటే, ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఎస్ఎస్‌పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ బృందం ఈ విచారణ చేపట్టనుంది.

మరోవైపు, ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలకు ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు అంత్యక్రియలు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల కథనాలను నిందితుల కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. కోర్టు విచారణ కూడా మొదలుకాక ముందే నిందితులను ఎలా చంపేస్తారని ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన తీరు ఇదంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం ఓ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఓ కథనం వినిపించారు.

ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని నమ్మశక్యంగా లేవంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ విషయాలేంటో తెలుసుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ శాఖ, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ప్రకాశ్ సింగ్, దిల్లీ మాజీ డీసీపీ మాక్స్‌వెల్ పెరెరా, తెలంగాణకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఎన్. వేణుగోపాల్ రావులతో బీబీసీ మాట్లాడింది. ఎన్‌కౌంటర్‌పై వారు ప్రధానంగా వ్యక్తం చేసిన సందేహాలివి:

దిశ, ఎన్‌కౌంటర్, తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

1. ఆ సమయంలోనే ఎందుకు?

శుక్రవారం తెల్లవారుజామున 5.45 నుంచి 6.15 మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు కమిషనర్ సజ్జనార్ చెప్పారు.

అంతకుముందు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీస్ అధికారి తెల్లవారు జామున నాలుగు గంటలకు సీన్ రీకన్స్ట్రక్షన్‌ కోసం నిందితులను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లినట్లు బీబీసీతో చెప్పారు.

నిందితుల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో, వారికి ప్రమాదమని భావించి తెల్లవారుజామున చీకట్లో వారిని అక్కడికి తీసుకువెళ్లాల్సి వచ్చిందని సజ్జనార్ అన్నారు.

సజ్జనార్ వాదనతో మాక్స్‌వెల్ విభేదించారు.

''పోలీసులు పగటి పూట కూడా సునాయాసంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు. అదనపు బలగాలను మోహరించి, ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా చేయొచ్చు. 'ప్రజల ఆగ్రహ భయంతో' అని సజ్జనార్ అంటున్నదానికి అర్థం ఏంటి? పోలీసుల సమక్షంలోనే ప్రజలు నిందితులపై దాడి చేయగలరని చెబుతున్నారా?'' అని పెరెరా ప్రశ్నించారు.

''నేరస్తులను నేరం చేస్తున్న సమయంలోనే పట్టుకునేందుకు పోలీసులు చీకట్లో వెళ్తే అర్థం ఉంది. కానీ, ఇక్కడ నేరస్తులను పట్టుకునే పని కాదు. సీన్ రీకన్స్ట్రక్షన్ పగటి పూట కూడా ఎంతో సులభంగా చేయొచ్చు. ఇంకా మెరుగ్గా చేయొచ్చు'' అని ప్రకాశ్ సింగ్ అన్నారు.

పోలీసుల 'సీన్ రీకన్స్ట్రక్షన్' అనవసరం, బూటకమని వేణుగోపాల్ రావు అభిప్రాయపడ్డారు.

''దిశ అత్యాచారం, హత్య కేసులో ఈ నలుగురే నిందితులుగా ఉన్నారు. వాళ్లు నేరం అంగీకరించారని, కెమెరా ముందు కూడా ఆ వివరాలు వెల్లడించారని వారం క్రితం పోలీసులే మీడియాకు తెలిపారు. లిఖితపూర్వకంగా కూడా వాళ్లు నేరం చేసినట్లు అంగీకరించాక, ఘటన స్థలానికి తీసుకువెళ్లి విచారించడం అవసరమా? అది కూడా చీకట్లో..'' అని ఆయన అన్నారు.

దిశ, ఎన్‌కౌంటర్, తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

2. బేడీలు ఎందుకు వేయలేదు?

నవంబర్ 30న ఈ నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

నిందితులు డిసెంబర్ 4న పోలీసుల కస్టడీలోకి వచ్చారని సజ్జనార్ చెప్పారు. 4న, 5న అంటే రెండ్రోజులపాటు పోలీసులు వారిని ప్రశ్నించారు.

''దిశ ఫోన్‌ను, పవర్ బ్యాంకును ఘటనా ప్రదేశంలో దాచామని నిందితులు విచారణలో చెప్పారు. వాటిని గాలించేందుకు అక్కడికి వెళ్లాం. పది మందితో కూడిన ఓ పోలీసు బృందం నిందితుల చుట్టూ ఉంది. వాళ్ల చేతులకు బేడీలు లేవు'' అని సజ్జనార్ చెప్పారు.

నిందితుల చేతులకు బేడీలు వేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి.

ఈ ఆదేశాలు ఆచరణ సాధ్యం కానివని మాక్స్‌వెల్ అన్నారు.

''ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆదేశాలు లేవు. దీని ప్రకారం చూస్తే, నిందితుల మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచంలోనే భారత్ ముందున్నట్లు అవుతుంది. బేడీలు వేయకూడదని, నిందితుల చేతులు పట్టుకుని పోలీసులు నడవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, ఈ విషయంలో విచారణ అధికారులకు కూడా కోర్టు చాలా అధికారులు ఇచ్చింది. తాజా కేసులో అధికారులు ఆ అధికారాలను ఉపయోగించుకునేందుకు ఇష్టపడినట్లు లేరు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలీసుల బలం తక్కువగా ఉందని భావించిన పక్షంలో నిందితులకు బేడీలు వేసే అధికారం విచారణ అధికారికి ఉంటుందని ప్రకాశ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కారణం చెప్పి, సీనియర్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. కేసు డైరీలో ఈ విషయం పేర్కొనాల్సి ఉంటుందని అన్నారు.

''ఈ కేసులో నిందితులకు బేడీలు వేసేందుకు అవసరమైన అన్ని కారణాలూ పోలీసుల ముందు ఉన్నాయి. మరి, తెలంగాణ పోలీసులు ఎందుకు అలా చేయలేదు. విచారణలో ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిందితులను కట్టడి చేసేందుకు పోలీసులు సరైన సన్నద్ధతతో లేరని కమిషనర్ వ్యాఖ్యలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఫైరింగ్‌ జరగడానికి, ఎవరు బాధ్యులవుతారు?'' అని అన్నారు.

దిశ, ఎన్‌కౌంటర్, తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

3. నిందితులు పారిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తారు?

నలుగురు నిందితులు పోలీసులపై దాడి చేశారన్న కమిషనర్ సజ్జనార్ వాదనపై మాక్స్‌వెల్ పెరేరా సందేహాలు వ్యక్తం చేశారు.

''పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులకు కర్రలు, రాళ్లు ఎక్కడ దొరకాయి? అక్కడ పది మంది పోలీసులు ఉన్నారు. నలుగురు నిందితులు వారి ఆయుధాలను ఎలా లాక్కోగలిగారు?'' అని ఆయన ప్రశ్నించారు.

పోలీసుల నుంచి ఇద్దరు నిందితులు ఆయుధాలు లాక్కున్నారన్న పోలీసులు వాదన అస్సలు నమ్మశక్యంగా లేదని ప్రకాశ్ సింగ్ అన్నారు.

''వీళ్లు పోలీసులా? లేక తమాషానా? 20 ఏళ్ల కుర్రాళ్లు వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలు ఎలా లాక్కోగలుగుతారు? అలాంటి విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది? ఆయుధాలు లాక్కున్న కుర్రాళ్లు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారన్న విషయం పోలీసులు ఎందుకు వెల్లడించలేదు?'' అని ఆయన అడిగారు.

''నిందితులు నేరగాళ్లు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, వారిపై చాలా ఒత్తిడి ఉంది. వారి వయసు 20కి అటూఇటుగా ఉంటుంది. వాళ్ల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని డిమాండ్లు వచ్చాయి. రెండు రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పది మంది సాయుధ పోలీసుల ముందు ఆ నిందితులు ఇలాంటి ప్రయత్నం చేయడం దాదాపు అసంభవం'' అని వేణుగోపాల్ అన్నారు.

''పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయినా, జనాలు తమను బతకనివ్వరని నలుగురు నిందితులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాంటిప్పుడు పారిపోయే ప్రయత్నం వాళ్లు ఎందుకు చేస్తారు?'' అని సందేహం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

4. పోలీసులకు తూటాలు తగల్లేదా?

నిందితులను కట్టడి చేసేందుకు దాదాపు పది నిమిషాలు పట్టినట్లు సజ్జనార్ చెప్పారు. అంటే, ఈ సమయంలో పోలీసులు, నిందితుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయని అర్థం.

అవి ముగిసేసరికి నలుగురు నిందితులు తూటా గాయాలతో చనిపోయారు. కానీ, ఒక్క పోలీసుకు కూడా తూటా తగల్లేదు.

కర్రలు, రాళ్లతో నిందితులు చేసిన దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని సజ్జనార్ చెబుతున్నారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

కమిషనర్ ప్రకటన సిగ్గుచేటుగా ఉందని మాక్స్‌వెల్ పెరేరా అన్నారు.

''ఉత్తర్‌ప్రదేశ్ (యూపీ) పోలీసుల తీరు కూడా ఇలానే ఉంటుంది. నేను దిల్లీ పోలీసు శాఖలో ఉన్నప్పుడు, యూపీకి చెందిన నేరగాళ్లు దిల్లీకి వచ్చి పోలీసుల ముందు లొంగిపోతుండేవారు. ఎందుకంటే, లొంగిపోయినవారిని యూపీ పోలీసులు కాల్చేస్తారు. నేరం చేసిన వారికి కూడా తమ వాదనను వినిపించే హక్కును చట్టం కల్పిస్తోంది. దానిని కాలరాయడం సరికాదు'' అని అభిప్రాయపడ్డారు.

దిశ, ఎన్‌కౌంటర్, తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

5. ప్రతిసారీ ఒకే కథ ఎలా?

తెలంగాణలో ఎప్పుడు ఎన్‌కౌంటర్ జరిగినా, పోలీసులు చెప్పే కథ ఒకేలా ఎందుకు ఉంటుందని వేణుగోపాల్ రావు ప్రశ్నించారు.

''ఇలాంటి కథలు 'చెప్పడంలో' తెలంగాణ (గతంలో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు కూడా) పోలీసులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇందులో వాళ్లు నిపుణులు. 1969 నుంచి ఎన్‌కౌంటర్లకు ఒకే అనుమానాస్పద కథను వినిపిస్తూ వస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్లు నక్సల్స్‌తో మొదలయ్యాయి. వీటిని పౌర సమాజం ఎప్పుడూ ప్రశ్నించలేదు. 2008-09 తర్వాత నుంచి సాధారణ కేసుల్లోనూ వీటిని ఉపయోగించడం మొదలైంది'' అని ఆయన అన్నారు.

''తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్‌లోని ఇతర నాయకులు ఇక్కడి పోలీసులపై చాలా ఆరోపణలు చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు తప్పుడు వైఖరికి దిగుతున్నారని అన్నారు. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, 2014లో నల్గొండకు చెందిన నలుగురు ముస్లిం ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ అయ్యారు. అప్పుడు పోలీసులు వినిపించిన కథ కూడా ఇదే'' అని అన్నారు.

''2007లో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు. అప్పుడు కూడా అక్కడ ఓ యాసిడ్ దాడి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసు కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దిశ అత్యాచారం, హత్య ఘటన జరిగాక, ఈ నిందితులను కూడా అప్పటిలాగే చేయాలని సోషల్ మీడియాలో కొందరు కోరడం చూశాం'' అని అన్నారు.

90వ దశకంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక, ఇలాంటి ఎన్‌కౌంటర్లు చేసే అధికారులకు పదోన్నతులు ఇవ్వడం మొదలైందని వేణుగోపాల్ అన్నారు.

1987-88లో ఓ ఎన్‌కౌంటర్ విషయంలో పోలీసుల వాదనలు నిరాధారమైనవని, వారిని శిక్షించాలని నివేదిక ఇచ్చిన ఓ మెజిస్ట్రేట్ బదిలీ అయినట్లు వేణుగోపాల్ చెప్పారు. పోలీసులకు ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్లి, నిష్పక్షపాతమైన విచారణకు సహకరిస్తుందని ఆశించలేమని అన్నారు.

''గత రెండు వారాల్లో హైదరాబాద్‌లో ఇలాంటి అత్యాచార ఘటనలు మరో రెండు జరిగాయి. కానీ, ఆ కేసుల్లో బాధితులు దళితులు. అందుకే వాటి గురించి ఎక్కువ చర్చ జరగలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)