కింబర్లీ కప్పల్లో ప్రాణం తీసే విషం... ఆ విషాన్ని మాత్రం వదిలేసి వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఫొటో సోర్స్, Getty Images
అనేక జీవజాతులను నాశనం చేస్తున్న విషపూరితమైన, ప్రమాదకరమైన గోదురుకప్పలను చంపి వాటి గుండెను మాత్రమే తినడంలో ఎలుకలు విజయవంతం అయ్యాయి.
ప్రమాదకరమైన ఆ కప్పల వృద్ధిని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
'రకాలి' అని పిలిచే ఈ ఎలుకలు అందులో విజయవంతం అయ్యాయి.
ఈ గోదురుకప్పల్లో గుండె, కాలేయం తప్పించి మిగతా శరీరం అంతా విషపూరితమై ఉంటుంది. దాంతో, వాటిని చంపి తినడం వల్ల అనేక జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఈ ఎలుకలు మాత్రం వాటిని అత్యంత చాకచక్యంగా చంపేసి, వాటి శరీరాలను జాగ్రత్తగా చీల్చేసి... లోపల ఉండే గుండెను, కాలేయాన్ని మాత్రమే ఎలా తినాలో నేర్చుకున్నాయి.
ఈ ఎలుకలు ఎలా జాగ్రత్తపడుతున్నాయన్న వివరాలను ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో పరిశోధకులు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఆ కప్పలను జాగ్రత్తగా చంపగలిగేది ఈ ఎలుకలు మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాటిని తింటే ఉడుములు కూడా చనిపోతాయి
చెరకు మొదళ్లను తినేస్తున్న కీటకాలను చంపేందుకు మొట్టమొదట 1935లో 101 గోదురు కప్పలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈశాన్య ఆస్ట్రేలియా ప్రాంతంలో వదిలారు.
ఈ కప్పలు ఎలాంటి వాతావరణ పరిస్థితులకైనా సులువుగా అలవాటు పడతాయి. భారీ సంఖ్యలో పిల్లలను పెడతాయి. ఒక ఏడాదిలో 60 కిలోమీటర్ల దూరం వరకూ వలస వెళ్తాయి.
అలా ఈ కప్పలు 2011, 2012 నాటికి ఈశాన్య ఆస్ట్రేలియా నుంచి పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతానికి చేరుకున్నాయి. అంటే, 74 ఏళ్లలో 2000 కిలోమీటర్లకు పైగా దూరం విస్తరించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కప్పల సంఖ్య 150 కోట్లకు పైనే ఉంటుందని జీవశాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడెనిమిది ఏళ్లలో ఈ కప్పలను తినడం వల్ల కింబర్లీ ప్రాంతంలో అనేక జంతువులు చనిపోయాయి. ఉడుములతో పాటు ఇతర బల్లిజాతి జీవులు, మొసళ్లు, ముంగీసల లాంటివి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కప్పల లాలాజల గ్రంథుల్లో విషం ఉంటుంది. దానిన్ని కొద్దిగా మింగినా అడవి జంతువులైనా, పెంపుడు జంతువులైనా తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ కప్పలను తినడం ప్రమాదకరమన్న విషయాన్ని గుర్తించేలా శాస్త్రవేత్తలు కొన్ని జంతువులకు పలు విధాలుగా శిక్షణ ఇచ్చారు. అయినా, పెద్దగా ఫలితం కనిపించలేదు.
రకాలి అనే నీటి ఎలుకలు మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండానే స్వయంగా ఆ కప్పలను ఎలా చంపి తినాలో నేర్చుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధన ఎలా జరిగింది?
గోదురు కప్పల వృద్ధిని అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2014లో ఒకరోజు కొన్ని కంప్పల మీద ఏదో జంతువు దాడి చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత రోజూ నాలుగైదు కప్పలు పొట్టపై చిన్నచిన్న గాయాలతో చనిపోయి కనిపిస్తుండేవి.
ఆ గాయాలు ఎలా అవుతున్నాయి? వాటిని చంపుతున్న జంతువు ఏది? అన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని రిమోట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కప్పల మీద ఉన్న గాయాలను విశ్లేషించారు. ఆఖరికి, ఆ కప్పల 'హంతకులు' ఎలుకలే అని వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
"పెద్ద కప్పల శరీరాలను ఈ ఎలుకలు చాలా జాగ్రత్తగా చీల్చుతాయి. గుండెను, కాలేయాన్ని వేరు చేస్తాయి. విషం ఎక్కువగా ఉండే గాల్‌బ్లాడర్‌ను కప్ప శరీరం నుంచి అత్యంత చాకచక్యంగా తొలగిస్తాయి" అని శాస్త్రవేత్తలు తెలిపారు.
చిన్న కప్పల కంటే పెద్ద వాటినే ఈ ఎలుకలు ఎక్కువగా తింటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఎలుకల సంఖ్య మరింత వృద్ధి చెందితే, అనేక జీవజాతులను నాశనం చేస్తున్న ప్రమాదకర గోదురు కప్పల వృద్ధిని నిలువరించేందుకు వీలవుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్లో లక్షలాది మంది ఫాలోవర్లున్న పిల్లి మరణం
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- పోర్న్ హబ్: రివెంజ్ పోర్న్ వీడియోల మీద డబ్బులు సంపాదిస్తున్న పోర్న్ సైట్ యజమానులు
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








