గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు

మహిళ

ఫొటో సోర్స్, ELISA PILARSKI/FACEBOOK

అడవిలో వేటకు వెళ్లిన ఓ గర్భిణిని కుక్కలు దాడి చంపేశాయి. ఉత్తర ఫ్రాన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనను అక్కడి పోలీసులు ధ్రువీకరించారు.

29 ఏళ్ల ఎలిసా పిలార్స్కీ కొన్ని కుక్కలను వెంట తీసుకుని జింకలను వేటాడేందుకు ఈ నెల 16న రెట్జ్ ఫారెస్టులోకి వెళ్లారు. అడవిలో కొంత దూరం వెళ్లాక వేరే కుక్కల గుంపు వచ్చి ఆమె మీద దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఆమె మృతదేహాన్ని విల్లర్స్-కాటెరెట్స్ అనే పట్టణానికి సమీపంలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

మృతురాలు ఆరు నెలల గర్భవతి అని తెలిసింది.

"కాళ్లు, చేతులు, పొట్ట, తలపై అనేక కుక్కలు తీవ్రంగా కరిచిన తరువాత ఆమె మరణించారు" అని ప్రాసిక్యూటర్ ఫ్రెడెరిక్ ట్రిన్ చెప్పారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరానికి ఈశాన్యం వైపున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కుక్కలకు పరీక్షలు

ఆమెను కరచిన కుక్కలేవి? అవి ఎవరివి? అన్నది గుర్తించేందుకు 93 కుక్కలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అందులో అయిదు మృతురాలికి చెందిన కుక్కలు కూడా ఉన్నాయి.

మృతురాలి నుంచి సేకరించిన తాజా డీఎన్‌ఏ నమూనాలతో ఆ కుక్కల డీఎన్‌ఏలను పోల్చి చూస్తామని పోలీసులు చెప్పారు.

ఆమె తల, మొండెం, చేతులకు పెద్దగా గాట్లు పడటంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యిందని శవ పరీక్షలో వెల్లడైంది.

మహిళ

ఫొటో సోర్స్, ELISA PILARSKI/FACEBOOK

స్థానిక కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు.

ఆ ఘటనకు ముందు ఆమె తన భాగస్వామి క్రిస్టఫర్‌కు ఫోన్ చేసి 30 కుక్కలు తన మీద దాడి చేసేందుకు వస్తున్నాయని చెప్పారు.

ఈ ఘటన తర్వాత ఈ సీజన్‌లో అన్ని రకాల వేటను నిలిపివేయాలంటూ జంతు సంరక్షణ సంస్థ అధ్యక్షుడు, నటుడు బ్రిగిట్టే బార్డోట్ ఫ్రెంచ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అయితే, ఈ మహిళ మరణంలో వేట కుక్కల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని ఫ్రెంచ్ హంటింగ్ అసోసియేషన్ అంటోంది.

రెట్జ్ అటవీ ప్రాంతం విల్లర్స్-కోటెర్ట్స్ అనే చిన్న పట్టణం చుట్టూ దాదాపు 32,000 ఎకరాలలో విస్తరించి ఉంది. వివిధ రకాల జింకలు, నక్కలతో పాటు అనేక వన్యప్రాణులకు ఇది నిలయంగా ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)