హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

దిశ అత్యాచారం తరువాత ప్రజాగ్రహం

ఫొటో సోర్స్, Reuters

'దిశ' అత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ తరువాత భారత దేశ న్యాయవ్యవస్థపై అందరి దృష్టి పడింది.

2017 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో సగటున రోజుకు 90 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో కొన్నిటిలో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి.

దేశ రాజధాని దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన తరువాత భారత్‌లో అత్యాచారాలు, మహిళలపై నేరాల విషయం మరింత చర్చనీయమైంది.

భారత్‌లో అత్యాచార కేసులు

ఈ ఘటన తరువాత ఇలాంటి నేరాలపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2012లో అత్యాచార కేసులు దేశవ్యాప్తంగా 25 వేల కంటే తక్కువ ఉండగా 2016 నాటికి 38 వేలకు పెరిగింది.

2017లో 32,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విచారణ జరపడం కోర్టులకు కష్టమవుతోంది. 2017 చివరి నాటికి 1,27,800కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

2017లో 18,300 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయి తీర్పులొచ్చాయి.

2012లో 20,660 అత్యాచార కేసుల విచారణ పూర్తయి ఆ ఏడాది చివరి నాటికి 1,13,000 కేసులు పెండింగులో ఉన్నాయి.

శిక్షల రేటు

శిక్షల మాటేమిటి?

ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ సంబంధాలున్నవారు అయినప్పుడు శిక్షల విషయం చర్చనీయమవుతోంది.

ఉదాహరణకు, స్వయంప్రకటిత బాబా ఆశారాం బాపు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన కనీసం 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. 2018లో ఆయనకు శిక్ష విధించారు.

పెండింగులో ఉన్న అత్యాచార కేసుల సత్వర విచారణకు మరో 1000 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది.

సింబాలిక్

ఇతర దేశాలతో పోల్చితే..

భారత్‌లో అత్యాచార దోషులకు శిక్షలు పడడమనేది ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువే. దక్షిణాఫ్రికాలో 2017లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో 8 శాతం మందికి శిక్షలు పడ్డాయి.

మహిళా హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ 2018లో చేసిన సర్వే ప్రకారం బంగ్లాదేశ్‌లో ఇలాంటి కేసుల్లో శిక్షల శాతం అత్యంత తక్కువగా ఉంది.

దోషుల నిర్ధారణ రేటు ఎక్కువగా ఉన్న కొన్ని దేశాల్లోనూ చాలాకేసులు కోర్టులకు వరకు రావడం లేదు.

బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న అత్యాచార కేసులకు, కోర్టుల వరకు వెళ్తున్న కేసులకు మధ్య అంతరం పెరుగుతోంది.

ఇంగ్లండ్, వేల్స్‌లో ఈ ఏడాది కోర్టు విచారణ వరకు వెళ్లిన అత్యాచార కేసుల సంఖ్య గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువగా నమోదయ్యాయి.

60 శాతం కన్విక్షన్ రేట్ కొనసాగించాలన్న ఉద్దేశం దీని వెనుక ఉంది.

కొవ్వొత్తుల ప్రదర్శన

ఫొటో సోర్స్, REUTERS

జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన అంతర్జాతీయ నివేదికల్లో మంచి స్కోరు సాధిస్తున్న స్వీడన్, ఇతర నార్డిక్ దేశాలలో అత్యాచార, లైంగిక హింస కేసుల్లో కన్విక్షన్ రేటు తక్కువగా ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది.

కానీ, దేశానికి దేశానికి మధ్య అత్యాచార నిర్వచనం, నేర నమోదు విధానం, విచారణ ప్రక్రియల్లో వ్యత్యాసాలున్నాయి.

అంతేకాదు, లైంగిక దాడులకు సంబంధించి బాధితులు, వారి కుటుంబాలు, చట్టాలు అమలు చేసే వ్యవస్థ ఎలా స్పందిస్తాయనేదానిపై సాంస్కృతిక వైఖరులూ ప్రభావం చూపుతాయి.

రియాలిటీ చెక్ లోగో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)