నేపాల్: ఉందో లేదో తెలియని యతి ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది

ఖట్మండులో నేపాల్ సర్కారు ఏర్పాటు చేసిన యతి మస్కట్
ఫొటో క్యాప్షన్, నేపాల్ పర్యటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం కొత్తగా డిజైన్ చేసిన యతి రూపం వివాదాస్పదంగా మారింది.
    • రచయిత, కమల్ పరియార్
    • హోదా, బీబీసీ నేపాలీ

హిమాలయాల్లో వేల ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన యతి కాన్సెప్ట్‌తో దేశంలో పర్యటక రంగాన్ని అమాంతం హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్దామనుకున్న నేపాల్ ప్రభుత్వం ఆశలపై నీళ్లు పడ్డట్టే కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాటు చేసిన సుమారు ఏడు అడుగుల పొడవున్న మస్కట్ రూపు రేఖలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

"ఇది సరైనది కాదు... ప్రభుత్వం తమకు ఎలా కావాలంటే అలా యతి మస్కట్ తయారు చేయించడం ఎంత మాత్రం సరికాదు" అన్నారు ఆ ఏడు అడుగుల యతి విగ్రహాన్ని చూసిన స్థానికురాలు రేష్మ శ్రేష్ఠ. "అంతే కాదు... మీరు చెప్పేంత వరకు ఆ మస్కట్ యతి అన్న సంగతి కూడా నాకు తెలీదు" అని ఆమె అన్నారు.

యతి

ఫొటో సోర్స్, ANDREW HOLT/ALAMY

ఫొటో క్యాప్షన్, యతి ఊహా చిత్రం

'యతి కాదు... మల్లయోధుడు'

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20లక్షల మంది పర్యటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నేపాల్ ప్రభుత్వం 'విజిట్ నేపాల్ 2020' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే యతి విగ్రహాన్ని అధికారిక మస్కట్‌గా ప్రకటించింది. అక్కడితో ఊరుకోలేదు మొత్తం 108 మస్కట్‌లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం కొన్నింటిని ఏర్పాటు చేసింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా ప్రముఖ పర్యటక ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, విమానాశ్రయాలు, హిమాలయ పర్వతసానువులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లోను వాటిని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ యతి రూపురేఖల విషయంలోనే చిక్కొచ్చి పడింది.

ఆగస్టు 14, 2015లో డిస్నీ డీ 23 ఎక్స్ పో 2015 కాస్ట్యూమ్స్ పోటీలో విజేతగా నిలిచిన యతి డిజైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వానరాకారంలో భయంకరంగా ఉంటుందంటూ యతి రూపంపై ఎన్నో ప్రచారాలు

"సాధారణంగా మనం విన్న కథల్లో యతి అంటే ఓ పెద్ద వానరంలా ఉంటుందని భావిస్తాం.. కానీ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన యతిని చూస్తుంటే ఓ మల్ల యోధుడిలా ఉన్నాడు. నేను విన్నదానికి ఇక్కడ కనిపిస్తున్న రూపానికి అస్సలు పోలికే లేదు" - ఇది ప్రముఖ సాహితీ వేత్త, జియోగ్రాఫర్‌ రామ్ కుమార్ పాండే మాట.

ఇది కేవలం రామ్ కుమార్ పాండే అభిప్రాయం మాత్రమే కాదు... స్థానిక చరిత్ర కారులు, ఇతర నేపాలీల మాట కూడా అదే.

Presentational grey line
News image
Presentational grey line

అయితే విజిట్ నేపాల్ 2020 సెక్రటేరియట్‌లో భాగమైన యతి ఆర్ట్ కమిటీ మాత్రం తాము రూపొందించిన మస్కట్ డిజైన్‌ను సమర్ధించుకుంటోంది. నిజానికి యతి ఓ కల్పిత పాత్ర అని, అలాంటప్పుడు దాన్ని రూపొందించడంలో కాస్త స్వేచ్ఛ, సృజనాత్మకత ఉండటం తప్పు లేదని అన్నారు యతి ఆర్ట్ కమిటీ సమన్వయకర్త ప్రేమ్ ప్రభాత్ గురుంగ్.

"శాంతికి చిహ్నంగా యతిని రూపొందించాలన్నది మా లక్ష్యం. మేం రూపొందించిన రూపం ఐకమత్యానికి, మానవత్వానికి ప్రతీకగా ఉండాలే తప్ప.. భయాన్ని కల్గించకూడదు. నేపాల్ అనగానే ప్రపంచమంతటికీ ఎవరెస్ట్ పర్వతం, బుద్ధుడు మాత్రమే గుర్తొస్తారు. ఇప్పుడు యతి కూడా మా ప్రత్యేకతకు ప్రతిరూపం" అంటూ ప్రేమ్ ప్రభాత్ చెప్పుకొచ్చారు.

అటు యతి డిజైన్ రూపకర్త ఆంగ్ షెహిరిన్ షెర్పాది కూడా అదే మాట.

"ఏ పుస్తకాన్నో చదివి యతి రూపాన్ని డిజైన్ చెయ్యలేదు.. నేను చిన్నప్పుడు విన్న కథలతో పాటు బుద్ధుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ఈ డిజైన్ రూపొందిచాను" అని షెర్పా చెప్పారు.

ఈ కాలపు డిజైనర్ల ఊహల్లోంచి పుట్టుకొచ్చిన యతి రూపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యతి రూపు రేఖల్ని ఆకర్షణీయంగా ఊహించిన నేటి రూపకర్తలు

అసలు ఏంటి ఈ యతి ?

యతి రూపంపై, ఉనికిపై ఎన్నో వాదనలున్నాయి. హిమాలయ పర్వతసానువుల్లో చూడ్డానికి భయం గొలిపేలా ఈ యతి ఉంటుందని ఓ వాదన. హిమాలయాలకు ఇరువైపులా ఉన్న ఇండియా, భూటాన్, టిబెట్, నేపాల్ దేశాలకు చెందిన పురాణాలు, కథల్లోనూ యతి ప్రస్తావన ఉంది. తూర్పు నేపాల్లోని సుమారు 12 వేల అడుగుల ఎత్తులో నివసించే పురాతన తెగకు చెందిన వారి లక్షణాలు కూడా యతిలో ఉంటాయని చెబుతుంటారు. ఎత్తైన హిమాలయాల్లో ఉంటూ సాధారణ మనుషుల కన్నా ఎత్తుగా, పొడవైన జుట్టుతో శరీరం మొత్తాన్ని కప్పుకొని ఒట్టి కాళ్లతో నడుస్తారని కూడా కొందరు చెబుతుంటారు.

ప్రచారంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం.. అవి మనుషులతో సఖ్యంగా ఉండకపోవడం. ఆ విషయంలో కూడా రకరకాల కథనాలున్నాయి. ఓసారి ఓ గ్రామంలోకి ప్రవేశించిన యతి అన్ని మార్గాలను మూసేయడంతో ఆ ఊళ్లో పురుషులంతా పారిపోయారన్నది ఒక కథనం. అలాగే మనుషులు మోసపూరితంగా వ్యవహరించి ఓ యతి ఇంకో యతిని నాశనం చేసేలా కుట్రలు చేశారని, కానీ అది సాధ్యం కాకపోగా... అప్పటి నుంచి మనుషులపై అవి పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది మరో కథనం.

ఖట్మండులో నేపాల్ సర్కారు ఏర్పాటు చేసిన యతి మస్కట్
ఫొటో క్యాప్షన్, యతికి ప్రతి రూపమంటూ ఇలా మస్కట్‌ను రూపొందించడంపై పెదవి విరుస్తున్న జనం

మహిళా యతి కూడా ఉందా?

ఓసారి ఓ పురుషుణ్ణి పట్టుకున్న యతి ఆయనతో కలిసి ఇద్దరు బిడ్డల్ని కన్న తర్వాత అతడు కొడుకుతో కలిసి పారిపోయాడని, ఆ తర్వాత యతి తన సొంత కూతుర్నే చంపి తినేసిందని మరో కథనం కూడా ఉంది.

"అయితే నిజానికి పిల్లల్ని కొన్నిసార్లు హెచ్చరించేందుకు.. మరి కొన్నిసార్లు బుజ్జగించేందుకు, జాగ్రత్తలు చెప్పేందుకు ఇలాంటి కథల్ని స్థానికులు చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల పిల్లలు ఎటూ వెళ్లిపోకుండా ఎప్పుడూ తమతోనే ఉంటారన్నది వారి నమ్మకం" అని శివ ధకల్ 2015లో బీబీసీ ఎర్త్‌కు వివరించారు.

అయితే ఈ కాలం యతి గురించి మాత్రం అప్పటితో పోలిస్తే కాస్త అందంగానే ఊహిస్తున్నారు. గత ఏడాది డ్రీమ్ వర్క్స్ నిర్మించిన అబామినబుల్ చిత్రంలో కాస్త క్యూట్‌గా, తెల్లగా ఉండేలా యతిని డిజైన్ చేశారు. ఆ చిత్రంలో ఓ చిన్నారితో స్నేహం చేసే యతి వాళ్ల ఇంటి పైకప్పుపై దర్శనమిస్తుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)