ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతీక్ జఖర్
- హోదా, బీబీసీ మానిటరింగ్ ప్రతినిధి
పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ఉత్తర కొరియా ఎప్పుడూ లేనంత శ్రద్ధ పెడుతోంది. కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఈ దేశంలో గత కొంతకాలంగా పెద్దఎత్తున రిసార్టులు, షాపింగ్ మాల్స్, పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల ప్రతిష్టాత్మక యాంగ్‌డాక్ రిసార్టును ప్రారంభించారు.
ఈ ఏర్పాట్లపై ఉత్తర కొరియా పాలకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్థమవుతోంది. 2019లో ఒక్క యాంగ్‌డాక్ రిసార్టునే ఆయన ఐదు సార్లు సందర్శించారు. అక్కడికి వెళ్లినప్పుడల్లా కిమ్ తన అధికారులతో గుడ్లు ఉడకబెట్టించుకుని ఆరగించినట్లు కథనాలు వచ్చాయి.
గత నెలలో సామ్జియాన్ ప్రాంతంలో కొత్త మౌంటెయిన్ స్పా, స్కై రిసార్టులను ప్రారంభించారు. కిమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో ప్రాజెక్టు వోన్‌సాన్-కల్మా టూరిస్టు జోన్. అది త్వరలోనే ప్రారంభం కానుంది.
మరి, ఇలాంటి ప్రదేశాల అభివృద్ధిపై ఉత్తర కొరియా ఇంతగా దృష్టిపెట్టడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
మరో స్విట్జర్లాండ్?
విదేశీ పర్యటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఉత్తర కొరియా ఈ ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ టూరిస్టుల ద్వారా కరెన్సీని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశానికి అది ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది.
బొగ్గు, ఆయుధాలు, ఖనిజాల ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఉత్తర కొరియా ఆర్జించడంపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. కానీ, పర్యాటకానికి మినహాయింపు ఉంది.
విదేశీ మారకద్రవ్యాన్ని రాబట్టుకునేందుకు ఉత్తర కొరియాకు ఉన్న అతికొద్ది మార్గాల్లో పర్యాటకం ఒకటని ఎన్‌కే న్యూస్ ప్రతినిధి జియాంగ్‌మిన్ కిమ్ బీబీసీ మానిటరింగ్‌తో చెప్పారు.


2019లో 3,50,000 మంది చైనీస్ పర్యటకులు ఉత్తర కొరియాను సందర్శించారని, వారి ద్వారా 175 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని ఎన్‌కే న్యూస్ అంచనా వేసింది.
ఉత్తర కొరియాతో బంధాలను పునరుద్ధరించే దిశగా ఆలోచిస్తున్న దక్షిణ కొరియా కూడా... ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే తమ పౌరులకు అనుమతిస్తామని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ పర్యటకుల విషయంలో ఉత్తర కొరియాకు కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఈ దేశానికి డబ్బు కావాలి కానీ, విదేశీయుల ప్రభావం తమ పౌరుల మీద పడటాన్ని భరించలేదు. విదేశీ భావజాలం తమ సమాజంలో వ్యాప్తి చెందుతుందేమో అన్నది ఉత్తర కొరియా భయం.
"అందుకే, కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు మాత్రమే విదేశీ యాత్రికులు వచ్చి వెళ్లేలా చూడాలన్నది ఉత్తర కొరియా ఉపాయం. అలా చేస్తే తమ పౌరుల మీద విదేశీయుల ప్రభావం పెద్దగా పడదన్నది ఆలోచన" అని జియాంగ్‌మిన్ చెప్పారు.
అయితే, విదేశీ పర్యటకులను ఆకర్షించడం ద్వారా ఉత్తర కొరియా ధనిక దేశం అయిపోతుందని కిమ్ జోంగ్ ఉన్ ఊహించుకుంటే, ఆయన చేపడుతున్న ప్రాజెక్టులు విజయవంతం కావని దక్షిణ కొరియాలోని కూక్‌మిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రేయి లాంకో అంటున్నారు.
"ఉత్తర కొరియ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పర్యాటక రంగం కొంతమేర ఉపయోగపడుతుంది. కానీ, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉత్తర కొరియా స్విట్జర్లాండ్ కాదు కదా!" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ఉత్తర కొరియాలోని పర్యటక కేంద్రాలపై కూడా పడుతోంది. ఇప్పటికే విదేశీ పర్యటకుల సందర్శనను కిమ్ తాత్కాలికంగా రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి.
పర్యాటకాన్ని పక్కన పెడితే, ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెందుతోందని తమ పౌరులకు తెలియజేసేందుకే కిమ్ ఇలాంటి పనులు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఉత్తర కొరియా అధికారిక మీడియలో ఈ ప్రాజెక్టుల గురించి విస్తృతంగా చూపిస్తున్నారు.
కిమ్ ప్రతిష్టాత్మకంగా భావించి అభివృద్ధి చేస్తున్న యాంగ్‌డాక్ రిసార్టు, సామ్జియాన్ పట్టణాల నిర్మాణలపై ఆ దేశ ప్రభుత్వ టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది.
ఆ ప్రాంతాల్లోని రోడ్లు, వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసింది.
"యాంగ్‌డాక్ రిసార్టు నిర్మాణంపై కిమ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశ ప్రజలకు మెరుగైన సంప్రదాయ జీవితం అందించడమే తన ప్రధాన ఆశయమని చెప్పేందుకు ఆయన అలా చేస్తున్నారు" అంటూ కేసీఎన్‌ఏ వార్తా సంస్థకు చెందిన అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, KCNA
1990ల నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు ఉత్తర కొరియా ప్రజల డిమాండ్లు పెరిగాయని ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ తీరుపై విశ్లేషణాత్మక కథనాలు రాసే పత్రిక సహ సంపాదకుడు బెంజమిన్ కాట్జెఫ్ సిల్బర్‌స్టెయిన్ అంటున్నారు.
"ఇప్పటికీ ఉత్తర కొరియాలోని చాలా పట్టణాల్లో అనేక మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయినా, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, ఖర్చుపెట్టే స్తోమత ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా దేశంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సామాన్య ప్రజలకు చూపించాలని కిమ్ అనుకుంటున్నారు" అని ఆయన బీబీసీ మానిటరింగ్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, KCNA
నిర్మాణ రంగం పరుగులు
ఉత్తర కొరియా కూడా ఆధునిక దేశమని ప్రపంచానికి చాటుకోవాలన్నది కిమ్ అభిలాష. అందుకోసం ఆయన భారీ నిర్మాణ ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు.
తూర్పు తీరంలో వోన్‌సాన్- కల్మా టూరిస్టు జోన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ సముద్రం అంచున భారీ హోటళ్లు, క్రీడా సముదాయాలు, నీటి ఫౌంటెయిన్లు సహా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు.
వాటిని 2019 అక్టోబర్‌లోనే ప్రారంభించాల్సి ఉండగా, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా నిర్మాణ సామాగ్రికి కొరత ఏర్పడటంతో పనులు ఆలస్యమయ్యాయి.
అంతర్జాతీయ స్థాయి వసతులను అభివృద్ధి చేసే మరికొన్ని భారీ ప్రాజెక్టులను చేపడతామని కిమ్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, KCNA
కానీ, తన ఆడంబరాన్ని ప్రదర్శించుకునేందుకు చేపడుతున్న అలాంటి ప్రాజెక్టులతో పెద్దగా ప్రయోజనం ఉండదని విమర్శకులు అంటున్నారు.
ఈ ప్రాజెక్టుల్లో కార్మికులతో నిర్బంధంగా పనిచేయించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
భారీ నిర్మాణ పనులు జరుగుతున్న సామిజ్‌యాన్ ప్రాంతంలో అత్యంత కఠిన పరిస్థితుల్లో కార్మికులు పనిచేయాల్సి వస్తోందని ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఒక వ్యక్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: విదేశీయులు ఈ దేశానికి ఎందుకు వెళతారు? ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు?
- ఉత్తర కొరియా: ఆకలితో అలమటిస్తున్న ఈ దేశాన్ని ఆదుకుంటున్నది ఎవరు?
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
- CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









