ఉత్తర కొరియా: మళ్లీ గుర్రమెక్కిన కిమ్... అమెరికాకు 'క్రిస్టమస్ కానుక'గా ఏమివ్వబోతున్నారు?

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ న్యూస్, సోల్

కిమ్ జోంగ్ ఉన్ చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

డోనల్డ్ ట్రంప్‌తో చర్చలు అనుకున్నట్లుగా సాగలేదు. కఠినమైన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. అణు సమస్య పరిష్కారానికి ఈ ఏడాది చివరికల్లా మరొక ఒప్పందంతో ముందుకు వస్తామని ఉత్తర కొరియా పట్టుపడుతున్నా.. అమెరికా తలొగ్గేలా కనిపించటం లేదు.

డొనాల్డ్ ట్రంప్ కూడా వేసారిపోయినట్లు కనిపిస్తోంది. ఉత్తర కొరియా నాయకుడితో తనకు ''మంచి సంబంధం'' ఉందని గట్టిగా చెప్తున్నప్పటికీ.. అవసరమైతే ఉత్తర కొరియా మీద సైనిక చర్య చేపట్టే అవకాశం గురించి ఆయన మరోసారి సంకేతాలిచ్చారు.

రాబోయే కొన్ని వారాలు అమెరికా - ఉత్తర కొరియాల మధ్య దౌత్యానికి కీలకం కావచ్చు.

''మనకు బాగా తెలిసిన సంక్షోభంంలోకి మళ్లీ 2020లో తిరిగి వెళ్లే పరిస్థితి కనిపిస్తోందని అనుకుంటున్నా'' అని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌లో ఉత్తర కొరియా నిపుణుడు అంకిత్ పాండా బీబీసీతో చెప్పారు.

''ఈ దౌత్యం ఆరంభం నుంచీ మనలో చాలా మంది అనుమానిస్తున్న ఒక పరిస్థితి ఇప్పుడు కనిపించటం మొదలైంది. అది... చపలచిత్తుడు, చిరుబురులాడే ట్రంప్ ఉత్తర కొరియాతో తన రియాలిటీ-టీవీషో దౌత్యం వాస్తవికతను అర్థం చేసుకోవటం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు గత జూన్‌లో ఉభయ కొరియాల సరిహద్దులోని నిస్సైనిక మండలిలో కరచాలనం చేశారు

‘క్రిస్టమస్’ హెచ్చరికలు

ట్రంప్, కిమ్‌ల శిఖరాగ్ర సదస్సు నిర్వహణ, జూన్‌లో ఉత్తర-దక్షిణ కొరియాల సరిహద్దు ఆశ్చర్యకర పర్యటనలో కరచాలనాల 'రియాలిటీ టీవీ' స్వభావాన్ని పక్కనపెడితే, కిమ్ జోంగ్-ఉన్‌తో చర్చలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం 'సాహసోపేతం' అని దక్షిణ కొరియా అభివర్ణించింది.

ఆయన వైఖరి సంప్రదాయ విరుద్ధంగా ఉందని ఆ దేశం పేర్కొంది. అయితే.. ఈసారి పరిస్థితులు మారతాయన్న ఆశాభావం కూడా ఉంది.

కేవలం 15 నెలల కిందట ఉత్తర, దక్షిణ కొరియాల నాయకులు పేక్తూ పర్వతం మీద చేతులు కలిపారు. కొరియా యుద్ధాన్ని ఎట్టకేలకు ముగించటానికి ఏదో విధమైన ఒప్పందానికి రాగలమని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఆ ఆశ ఇప్పుడు ఆవిరైపోయింది.

దక్షిణ కొరియాతో చర్చలు జరపటానికి ఉత్తర కొరియా నిరాకరిస్తోంది. ఉత్తర కొరియా గత వారంలో కిమ్ జోంగ్ ఉన్ విజ్ఞప్తితో దక్షిణ కొరియాతో గల సముద్ర సరిహద్దు వద్ద సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇది ఈ రెండు దేశాల మధ్య గత ఏడాది చేసుకున్న సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించటమే.

ఉత్తర కొరియా ఈ సరిహద్దు సమీపంలో ఉన్నపుడు అప్రమత్తంగా ఉండటానికి దక్షణి కొరియాకి అనేక కారణాలు ఉన్నాయి.

కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే-ఇన్ దంపతులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియాలోని పేక్తూ పర్వతం మీద కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే-ఇన్‌లు చేతులు కలిపారు.. వారి పక్కన వారి భార్యలు కూడా ఉన్నారు

ఉత్తర కొరియా బలగాలు 2010 నవంబర్‌లో యాన్‌ప్యాంగ్ దీవి మీదకు 170 ఆర్టిలరీ షెల్స్, రాకెట్లు పేల్చింది. దానివల్ల దక్షిణ కొరియా పౌరులు నలుగురు చనిపోయారు. దాంతో, ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగుతున్నాయనే భయాలు మొదలయ్యాయి.

అమెరికా, దక్షిణ కొరియాలతో తన దౌత్య సంబంధాలు ఏ దిశగా వెళుతున్నాయనే అంశం మీద ఉత్తర కొరియా నుంచి వచ్చిన హెచ్చరిక సంకేతాలకు ఏ మాత్రం కొదవ లేదు.

తాజా సంకేతం ఈ వారం మొదట్లో వచ్చింది. చర్చల విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే, వచ్చే వారంలో తాము దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలను మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందని ఉప విదేశాంగ మంత్రి రి థే సాంగ్ అన్నారు. ''క్రిస్టమస్‌‌కు ఏ కానుకను ఎంచుకోవాలన్నది పూర్తిగా అమెరికా ఇష్టం'' అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వాక్యాన్ని అమెరికా మీడియా అందిపుచ్చుకోవటం కోసమే చెప్పినట్లు స్పష్టమవుతోంది.

ఇక అధినాయకుడు మరోసారి గుర్రమెక్కి పేక్తూ పర్వతాన్ని అధిరోహించారు. ఉత్తర కొరియాలో అత్యంత పవిత్రమైన పర్వతమిది. ప్రభుత్వ మీడియాలో ఆ చిత్రాలు, కథనాలు.. రాజకీయ, సైద్ధాంతిక సందేశాలతో సుసంపన్నంగా ఉన్నాయి.

ఆయన మంచును చీల్చుకుంటూ ''విప్లవాత్మక'' పర్వత శిఖరం మీదకు చేరుకుంటున్న దృశ్యాలతో డజన్ల కొద్దీ ఫొటోలను ప్రచురించారు. ''మన పార్టీ సైద్ధాంతిక, విప్లవాత్మక వర్గ వైఖరులను బలహీనపరచటానికి సామ్రాజ్యవాదులు, వర్గశత్రువులు మరింత ఉన్మత్తంగా ప్రయత్నిస్తున్న'' సమయంలో ఈ సందర్శన చేపట్టినట్లు ఉత్తర కొరియా పాలకుడు చెప్పారని ఆ కథనాలు ఉటంకించాయి. ఆయన తన ప్రజలను ''మన విప్లవానికి ఉన్న కాఠిన్యం, దీర్ఘకాలిక లక్షణాలకు'' సన్నద్ధం చేస్తున్నారని ఆ ప్రకటన పేర్కొంది.

మున్ముందు కష్టకాలం రాబోతోందని ఉత్తర కొరియా ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర కొరియా క్షిపణి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా 2019లో అనేక క్షిపణి పరీక్షలు నిర్వహించింది

రాకెట్ మ్యాన్ పునరాగమనమా?

కిమ్ జోంగ్-ఉన్ తన పార్టీ నాయకులతో ఒక ఆకస్మిక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర కొరియాలో అత్యంత శక్తివంతమైన రాజకీయ కమిటీ ''సంక్లిష్ట అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవటానికి'' డిసెంబర్ చివరిలో సమావేశం అవుతుంది.

స్థూలంగా చెప్పాలంటే ఇది శుభ వార్త కాదు. కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే అమెరికాతో చర్చలు ఫలించవని ఒక నిశ్చయానికి వచ్చేసి, కొత్త ఉత్తర్వులు ఇవ్వటానికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.

అంటే, రాకెట్ మ్యాన్ మళ్లీ వస్తున్నాడా?

అసలు ఆయన ఎక్కడికైనా వెళ్లిందే లేదని కొంతమంది వాదిస్తారు. పరీక్షలకు సంబంధించి ఉత్తర కొరియా అత్యధికంగా పనిచేసిన సంవత్సరాల్లో ఈ ఏడాది ఒకటి.

కిమ్ జోంగ్ ఉన్ పాలనలోని ఈ చిన్న, పేద దేశం.. కఠినమైన అంతర్జాతీయ ఆంక్షల కింద కుంటుతూనే మూడు కొత్త క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగింది. ట్రంప్, కిమ్‌ల మధ్య ఫిబ్రవరిలో హనోయిలో జరిగిన చర్చలు కుప్పకూలినప్పటి నుంచీ ఈ మూడు క్షిపణులనూ పరీక్షించింది ఉత్తర కొరియా.

''ఈ క్షిపణులన్నిటికీ ఉమ్మడిగా కొన్ని అంశాలున్నాయి. అవి ఘన ఇంధనంతో పనిచేస్తాయి. ఎక్కడికైనా తరలించొచ్చు. వేగంగా ప్రయాణిస్తాయి. తక్కువ ఎత్తులో ఎగురుతాయి. కనీసం ఆ కేఎన్-23 గాలిలోనే దిశను మార్చుకోగలదు. అది చాలా మెప్పించే అంశం'' మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెక్యూరిటీ స్టడీస్ ప్రొఫెసర్ విపిన్ నారంగ్ ఈ ఏడాది మొదట్లో నాతో చెప్పారు.

''ఈ లక్షణాలున్న ఈ క్షిపణుల్లో ఏ ఒక్కటైనా కానీ.. ప్రాంతీయ, ఆర్ఓకే క్షిపణి రక్షణలకు సవాలు విసురుతుంది. మూడూ కలిస్తే.. ఒక పీడకలగా మారి నిద్రపట్టనివ్వవు'' అని ఆయన అభివర్ణించారు.

కానీ.. 2019లో నిర్వహించిన 13 పరీక్షలనూ ట్రంప్ కొట్టిపారేశారు. ఏదేమైనా.. దీర్ఘ శ్రేణి ఆయుధాలను, ణ్వస్త్రాలను పరీక్షించబోనన్న తన హామీని కిమ్ నిలబెట్టుకున్నారు.

అయితే.. ఈ హామీకి ఒక తుది గడువు ఉందని ఉత్తర కొరియా పాలకుడు సంకేతమిచ్చారు. అమెరికాతో ఎటువంటి ఒప్పందం కుదరకపోతే ఈ పరీక్షల మీద మారటోరియం (నిలిపివేత) డిసెంబర్ 31న ముగుస్తుందని చెప్పారు.

ఉత్తర కొరియా క్షిపణులు

ఉపగ్రహం ప్రయోగిస్తారా?

అమెరికా అధ్యక్షుడి దృష్టిని మళ్లీ ఆకర్షించాలన్నా, మరింత మెరుగైన ఒప్పందం కోసం ఆయన మీద ఒత్తిడి తేవాలన్నా, తాను ఇంకా భారీగా, సాహసోపేత చర్య చేపట్టాల్సి ఉంటుందని కిమ్ జోంగ్ ఉన్ భావించవచ్చు.

ఆయన కొత్త హ్రస్వ-శ్రేణి క్షిపణుల్లో అనేక అంశాలున్నాయి. వాటిని దీర్ఘ శ్రేణి ఆయుధాల్లో పరీక్షించటానికి ఆయన చాలా ఆసక్తిగా ఉండి ఉండొచ్చు.

ఆ పనిచేయటానికి ఒక మార్గం... ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించటం. అలా చేస్తే సాంకేతికంగా ఆయన హామీని ఉల్లంఘించినట్లు కాదు. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పతాక శీర్షికలకు ఎక్కుతుంది.

''ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉందని అనుమానించటానికి కారణాలు సంక్లిష్టమైనవి'' అని అంకిత్ పాండా పేర్కొన్నారు.

''కానీ అందుకు అనేక సంకేతాలు ఉన్నాయి. కొత్త శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఉపగ్రహ వాహక నౌక) కోసం 2017 నుంచీ పని జరుగుతోందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి. అంతరిక్ష కార్యకలాపాల గురించి ఈ ఏడాది ప్రభుత్వ మీడియాలో ప్రస్తావనలు పెరిగాయి'' అని చెప్పారు.

''ఉత్తర కొరియాలో 2016 నుంచి చక్కగా నిర్వహిస్తున్న అంతరిక్ష కార్యక్రమం ఉన్నా కూడా.. ఇప్పటివరకూ గణనీయమైన అంతరిక్ష కార్యకలాపాలేవీ జరగలేదు. కాబట్టి అదొకటి బాకీ కూడా ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

సోహేలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని పాత్రికేయులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ కేంద్రాన్ని కూల్చివేస్తామని ఉత్తర కొరియా హామీ ఇచ్చింది.

''ఇక్కడ త్వరలో ఒక పరీక్ష జరగబోతోందని సూచించే కార్యక్రమం ఏదీ మాకు కనిపించలేదు'' అని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణురాలు, వన్ ఎర్త్ ఫ్యూచర్ ఫౌండేషన్‌లో డాటాయో ప్రాజెక్ట్ డైరెక్టర్ మెలిసా హన్హామ్ పేర్కొన్నారు.

సోహే ప్రయోగ కేంద్రం

ఫొటో సోర్స్, AFP

''కానీ, ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తున్న కేంద్రం. లాంచ్ ప్యాడ్‌ను కూల్చివేయలేదు. ఇప్పటికీ ఇక్కడి నుంచి క్షిపణులను ప్రయోగించవచ్చు'' అని చెప్పారు.

ఉత్తర కొరియాకు గల మరో ప్రత్యామ్నాయం.. తన కొత్త ఘన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా దీర్ఘ శ్రేణి క్షిపణిలో పరీక్షించటం. ఈ రకం ఇంధనానినిక వ్యూహాత్మక లాభాలున్నాయని, ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి క్షిపణులను మరింత వేగవంతంగా, మరింత శక్తిమంతంగా చేస్తుందని మెలిసా తెలిపారు.

''ఘన ఇంధన క్షిపణులను నిఘా కళ్ల నుంచి, గూఢచర్య శాటిలైట్ల నుంచి దాచిపెట్టటం చాలా సులభం. ఎందుకంటే వాటిలో ఇంధనం నింపటానికి చుట్టూ ఇంధన వాహనాల వరుస అవసరం లేదు. అలాంటి వరుస ఉంటే క్షిపణిని కనిపెట్టటం సులభమవుతుంది. ద్రవ ఇంధన క్షిపణుల కన్నా ఈ ఘన ఇంధన క్షిపణులను నిల్వ చేయటం సులభం. వీటిలో ముందుగానే ఇంధనం నింపి ఉంచుకోవచ్చు. కాబట్టి మరింత వేగంగా ప్రయోగించవచ్చు'' అని వివరించారు.

ఒక దీర్ఘ శ్రేణి క్షిపణిని పరీక్షించినట్లయితే, దానిని అమెరికా తనకు ముప్పుగా పరిగణించవచ్చు. అనూహ్యంగా స్పందించే డోనల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించవచ్చు.

ఉత్తర కొరియాతో ఘర్షణ 'దాదాపు పరిష్కారమైనట్లే' అని అమెరికా అధ్యక్షుడు గత ఏడాది ప్రకటించారు. అయితే.. లాస్ ఏంజెలెస్‌ను తాక గల సామర్థ్యం ఉన్న క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షిస్తున్నట్లయితే.. సంక్షోభం సమసిపోయిందని తను చేసిన ప్రకటనను వచ్చే ఏడాది జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో సమర్థించుకోవటం ట్రంప్‌కి కష్టమవుతుంది.

''అత్యంత ఆశావహకంగా చూస్తే.. ప్రజల ఒత్తిడిని, అత్యవసరతను పెంచటం ద్వారా అమెరికా తను కోరుకున్న విధంగా చర్చలు జరిపేలా చేయటానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తుండవచ్చు. అత్యంత నిరాశాజనకంగా చూస్తే.. అసలు చర్చలు జరిపే ఉద్దేశం ఉత్తర కొరియాకు లేకపోవచ్చు. ఉద్రిక్తతలు పెరగటానికి కారణమంటూ అమెరికాను నిందించటానికి ప్రజల్లో భూమికను రూపొందిస్తుండవచ్చు'' అని అమెరికా విదేశాంగ విభాగంలో మాజీ కొరియా డెస్క్ అధికారి మింటారో ఒబా విశ్లేషించారు.

''ఎటు చూసినా, కార్యాచరణ భారాన్ని, నిందా భారాన్ని అమెరికా మీద మోపటానికి ప్రజా మార్గాన్ని ఉపయోగించుకోగల నైపుణ్యం ఉత్తర కొరియాకు ఉంది'' అని వ్యాఖ్యానించారు.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, EPA

''ఇది ఎలాంటిదంటే, మీకు లభించే కానుకలు ఎలా ఉంటాయనేది మీ ప్రవర్తనా మంచిగా ఉందా, దుడుకుగా ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుందని సాంటా క్లాజ్ చెప్పడం లాంటిది. అతడు నిజంగా కానుకలు ఇచ్చే నేపథ్యాన్ని బట్టి... అతడు ఇప్పటికే మిమ్మల్ని దుడుకు పిల్లల జాబితాలో పెట్టి ఉంటాడు'' అని ఆయన అభివర్ణించారు.

అమెరికాతో చర్చలు ఫలించవని ఉత్తర కొరియా ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసిందని ఎన్‌కే న్యూస్‌లో విశ్లేషకురాలు రాచెల్ మిన్‌యంగ్ లీ కూడా భావిస్తున్నారు.

''నిజానికి, అక్టోబర్‌లో స్టాక్‌హోమ్ చర్చలు జరగటానికి ముందు కూడా అమెరికాతో దౌత్యం ఫలితాలపై ఉత్తర కొరియాకు విశ్వాసం ఉందా అనే దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.

అయితే, ఉత్తర కొరియా ఈ సంవత్సరాంతానికి విధించిన తుది గడువుకు ఎటువంటి ప్రాధాన్యం లేదని అమెరికా కొట్టిపారేసింది. అది ''కృత్రిమం'' అని ఉత్తర కొరియాకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్ బీగన్ అభివర్ణించారు. ఉత్తర కొరియా ఏవైనా రెచ్చగొట్టే చర్యలు చేపడితే ''అది పెద్ద తప్పు. కోల్పోయిన అవకాశం'' అవుతుందని హెచ్చరించారు.

కిమ్ జోంగ్ ఉన్ ప్రణాళికలు ఇంకా స్పష్టంగా అర్థం కాలేదన్నది నిజం. కానీ.. ఈ కాల పరిమితి విషయంలో ఉత్తర కొరియా చాలా సీరియస్‌గా ఉందని అక్కడి నుంచి వస్తున్న సంకేతాలన్నీ సూచిస్తున్నాయి.

దక్షిణ కొరియాలోని యోన్సీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ డెల్యూరీ రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పినట్లు, ''దౌత్యం తలుపులు ఇప్పటికే మూసుకుపోనట్లయితే, ఇప్పుడు వేగంగా మూసుకుపోతున్నాయని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)