ఉత్తర కొరియా: సైబర్ దాడులు చేసి 200 కోట్ల డాలర్లు కొట్టేసింది.. ఆయుధాల కోసం: ఐరాస రహస్య నివేదిక

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా తన ఆయుధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు సైబర్ దాడులు చేసి 200 కోట్ల డాలర్లు కొల్లగొట్టిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది.
బ్యాంకులు, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లను లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా ఇలాంటి దాడులు చేస్తుందని ఈ రహస్య నివేదిక వెల్లడించింది.
ఉత్తరకొరియా చేసినట్లుగా చెబుతున్న 35 సైబర్ దాడులపై ఐరాస దర్యాప్తు చేస్తోంది.
ఉత్తరకొరియా వాదన ఇదీ..
ఉత్తర కొరియా మంగళవారం రెండు క్షిపణులను పరీక్షించింది. పదిహేను రోజుల వ్యవధిలో క్షిపణి పరీక్షలు చేయడం ఇది నాలుగోసారి.
అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాల నేపథ్యంలో హెచ్చరించేందుకే తామీ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సైనిక విన్యాసాలు శాంతి ఒప్పందాలకు విరుద్ధమని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది.
టార్గెట్ క్రిప్టో కరెన్సీ
కాగా ఉత్తర కొరియా సైబర్ దాడుల ద్వారా కోట్లు కొల్లగొడుతున్నట్లుగా చెబుతున్న నివేదికను ఐరాస భద్రతామండలికి చెందిన ఉత్తర కొరియా ఆంక్షల కమిటీకి చేరింది.
విదేశీ ద్రవ్యం సంపాదించే క్రమంలో ఉత్తర కొరియా శక్తిమంతమైన కంప్యూటర్లను ఉపయోగిస్తూ సైబర్ మైనింగ్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపడుతుందన్న అనుమానాలతో నిపుణులూ దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకులపై సైబర్ దాడుల కంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లపై సైబర్ దాడులు చేయడం వల్ల పసిగట్టడం కూడా కష్టమవుతుందని.. ప్రభుత్వాల దృష్టి కూడా పెద్దగా ఉండకపోవడం వల్ల ఉత్తర కొరియా పని సులభమవుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆయుధాల కోసమే..
ఉత్తర కొరియా ఐరాస ఆంక్షలను ఉల్లంఘిస్తూ సామూహిక వినాశనానికి కారణం కాగల ఆయుధ తయారీకి పనికొచ్చే పరికరాలనూ సంపాదిస్తోందని కూడా ఈ నివేదిక వెల్లడించింది.
బొగ్గు, ఇనుము, వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేయకుండా ఉత్తర కొరియాపై 2006 నుంచి ఆంక్షలున్నాయి. ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనా పరిమితులున్నాయి.
అయితే.. ఉత్తర కొరియా సముద్ర మార్గంలో నౌకల మధ్య మార్పిడి ద్వారా ఆంక్షలను దాటుకుని తన అవసరాలు తీర్చుకుంటున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఈ ఏడాది హనోయిలో జరిగిన రెండో సమావేశంలోనూ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఇకపై పరీక్షించబోమని కిమ్ జోంగ్ చెప్పారు. అయితే.. ఆ సమావేశం అర్ధంతరంగా ముగియడంతో ఒప్పందం కుదరలేదు.
ఐరాస నివేదిక నేపథ్యంలో అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ''ఉత్తర కొరియా చట్టవిరుద్ధ క్షిపణి కార్యక్రమానికి డబ్బు సమకూర్చేలా చేపడుతున్న అనుమానాస్పద సైబర్ కార్యకలాపాల విషయంలో చర్యలు తీసుకోవాలని బాధ్యతాయుత దేశాలన్నిటినీ కోరుతాం'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
- 'ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దమ్ము, ధైర్యమే కాదు, కృతనిశ్చయం కావాలి'
- జమ్మూకశ్మీర్ LIVE: జమ్ము-కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








