ఆంధ్రప్రదేశ్‌: ఆ జ్యోతిష్యుల గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?

పినకడిమి
    • రచయిత, శంకర్ .వి
    • హోదా, బీబీసీ కోసం

అదో కుగ్రామం. సంప్రదాయంగా వారంతా వలస జీవులు. కానీ గడిచిన మూడు దశాబ్దాల్లో పెను మార్పులు సంభవించాయి. అనూహ్యంగా ముంబయి, దిల్లీ లాంటి మహానగరాల వరకూ వారు విస్తరించారు. అంతటితో ఆగలేదు. లండన్ సహా చోట్ల కార్యకలాపాల ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయికి చేరారు. అలాంటి వారి మధ్య ఆధిపత్యపోరు ప్రారంభమయ్యింది. వారు రెండు శిబిరాలుగా విడిపోయారు.

ఓ ప్రేమ వివాహం వారి మధ్య వివాదాన్ని రాజేసింది. దాడులు, ప్రతిదాడులతో పాటుగా హత్యల వరకూ పగలు పెరిగాయి. హత్యాయత్నాలు, కాల్పులు, ఛేజింగుల వంటి సీన్లు వారికి సాధారణంగా మారాయి. హైవే పైనే హత్యలు చేసే స్థాయికి వారు వెళ్లిపోయారు. ఈ చిన్న గ్రామంలో ఇప్పటికే నలుగురు హత్యకి గురయ్యారంటే వారి వివాదాల స్థాయి అర్థమవుతుంది. మరో అరడజను మందిపై హత్యాయత్నాలు జరిగాయి. నేటికీ అనేక మంది బాడీ గార్డులను పెట్టుకుని గడపాల్సి వస్తోంది.

ఇదంతా సినిమా కథ కాదు. అలా అని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల కథ అసలు కాదు. పచ్చని పల్లెలతో ప్రశాంతంగా కనిపించే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పినకడిమి గ్రామంలో సాగుతున్న వ్యవహారం.

ఒకనాడు తగిన జీవనాధారం లేక ఊరూరా తిరుగుతూ సాధారణ జీవనం సాగించిన కుటుంబాలు జ్యోతిష్యంలో ప్రవేశించి అనూహ్యంగా ఎదిగాయి. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామంలో ఇప్పుడు భారీ భవంతులను నిర్మించారు. ఆధునిక హంగులతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఏలూరు నగరంలో పలు వ్యాపార సముదాయాలను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో అంతకంతకూ బలపడడిన కొన్ని కుటుంబాల మధ్య ఆధిపత్యం పోరాటం కూడా ప్రారంభమయ్యింది.

జ్యోతిష్యం

ఫొటో సోర్స్, Getty Images

దేశమంతటా విస్తరించిన సామ్రాజ్యం

పినకడిమి పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆ గ్రామ వాసులు ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో జ్యోతిష్యం కేంద్రాలు నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ముంబయిలో బాలీవుడ్ ప్రముఖులు, దిల్లీలో రాజకీయ నేతలు, కోల్‌కతాలో బడా వ్యాపారులతో పాటుగా చెన్నై, బెంగళూరు నగరాల్లో సాఫ్ట్‌వేర్ నిపుణులకు కూడా జ్యోతిష్యం చెప్పే స్థాయికి చేరారు. తద్వారా వారి ఆర్థిక స్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చింది.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌: ఆ జ్యోతిష్యుల గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?

ఇదంతా 1980ల తర్వాత జరిగిన పరిణామాలతోనేనని ఆ గ్రామానికే చెందిన పేరు వెల్లడించేందుకు అంగీకరించని ఓ వ్యాపారి చెప్పారు.

“మా గ్రామం పేరు దేశమంతా వ్యాపించడానికి కారణం జ్యోతిష్యమే. ఒకప్పుడు చుట్టు పక్కల గ్రామాలు తిరుగుతూ జ్యోతిష్య చెప్పేవారు. కానీ మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కి చెందిన బంధువుల ద్వారా పరిచయం ఏర్పడడంతో కొందరు అక్కడికెళ్లారు. వారి ద్వారా ముంబయి పరిచయాలు ఏర్పడ్డాయి. అంతే మొత్తం మారిపోయింది. స్థాయి పెరిగిపోయింది. సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పడం మొదలయ్యింది. ఒకరి నుంచి ఒకరుగా రెండు మూడు కుటుంబాలకు చెందిన 20 మంది వరకూ ముంబయి వరకూ తమ జ్యోతిష్య సామ్రాజ్యాన్ని విస్తరించారు. హైదరాబాద్‌లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని దేశమంతా తిరిగేందుకు అనుగుణంగా మార్గం సుగమం చేసుకున్నారు. అన్ని ప్రముఖ నగరాల్లోనూ ఇప్పుడు వారికి బ్రాంచీలున్నాయి”అంటూ వివరించారు.

ఏలూరు నగరం
ఫొటో క్యాప్షన్, ఏలూరు నగరం

ఆధిపత్యంతో మొదలయ్యి ప్రేమ పెళ్లితో పెట్రేగిపోయారు..

దేశమంతటా విస్తరించి, ఆర్థికంగా బలపడిన ఈ జ్యోతిష్యుల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు 2010 కి ముందే మొదలయినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా భూతం, తురపాటి అనే రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యం కోసం సాగిన ప్రయత్నాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది.

తురపాటి కుటుంబీకులకు బంధువులుగా ఉన్న గంధం కుటుంబీకులు కూడా తోడయ్యారు. వారి మధ్య దశాబ్ద కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ బీబీసీకి తెలిపారు. ఆ తర్వాత భూతం గోవిందు కుమార్తెను తురపాటి నాగరాజు కుమారుడు ప్రేమించి పెళ్ళి చేసుకోవడంతో వారి విబేధాలు తారస్థాయికి చేరినట్టు తెలిపారు.

"నిజానికి రెండు కుటుంబాల్లోనూ ఈ ప్రేమ పెళ్లికి అంగీకారం లేదు. అయినప్పటికీ పెళ్లి చేసుకున్నారు. కానీ అంతలోనే వారి మధ్య విభేదాలు వచ్చాయి. చివరకు గృహ హింస చట్టం కింద భూతం గోవింద్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో రెండు కుటుంబాల వివాదం ముదిరిపోయింది. ఆ కేసు విచారణ జరుగుతుండగానే వచ్చిన స్థానిక ఎన్నికల్లో కూడా ఇరువురు రెండు పార్టీలకు మద్ధతినివ్వడంతో కొత్త మలుపు తిరిగింది. చివరకు 2014 మార్చిలో ఓరోజు సాయంత్రం భూతం దుర్గారావుని హత్య చేశారు. పినకడిమిలో సాయంత్రం వాకింగ్ చేస్తుండగా కళ్లల్లో స్ప్రే కొట్టి, కత్తులతో నరికి చంపేశారు. ఈ హత్యకు తురపాటి నాగరాజు కుటుంబీకులే కారణమని భూతం కుటుంబం భావించింది. దాంతో ప్రతీకార చర్యలతో గ్రామంలో చిచ్చు రేగింది " అంటూ డీఎస్పీ వివరించారు.

పినకడిమి
ఫొటో క్యాప్షన్, పినకడిమి

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా హత్య

భూతం దుర్గారావు హత్య తర్వాత గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో భూతం దుర్గారావు సోదరుడు లండన్ వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆస్ట్రేలియా, అమెరికాతో పాటుగా వివిధ యూరప్ దేశాల్లో స్థిరపడిన వారికి జ్యోతిష్యం చెబుతూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ తన సోదరుడిని హత్య చేసిన వారిని అంతమొందించాలనే కక్షను మాత్రం చల్లారనివ్వలేదని పోలీసులు చెప్పారు.

2014 సెప్టెంబర్ 24న పట్టపగలే జరిగిన మూడు హత్యలు పెను సంచలనంగా మారాయి. భూతం దుర్గారావు హత్య కేసులో కోర్ట్‌కి హాజరయ్యేందుకు విమానంలో వచ్చి, ఎయిర్ పోర్ట్ నుంచి ఏలూరు బయలుదేరిన వారిపై పెద అవుటపల్లి వద్ద దాడి జరిగింది. టోల్ ప్లాజా వద్ద వారి వాహనం వేగం తగ్గగానే తుపాకులతో కాల్పులు జరపి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో గంధం నాగేశ్వరరావు, ఆయన తనయుడు మారయ్య, బంధువు పగిడి మారయ్య హత్యకు గురయ్యారు.

తమ ఊరిలో జరిగిన హత్యలో సోదరుడిని కోల్పోయిన తర్వాత కూడా భూతం దుర్గారావు సోదరుడు గోవింద్ పాతకక్షలతో ఈ హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు జరిగిన దుర్గారావు హత్యానంతరం గ్రామంలో తమ ఇళ్లపై దాడులు జరగడంతో హైదరాబాద్, ముంబయి వంటి ప్రాంతాల్లో ఉంటూ కోర్టు వాయిదాకి వస్తుండగా ఈహత్యలకు ప్రణాళిక వేసినట్టు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఏకంగా ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లకు ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున సుఫారీ ఇచ్చి హత్యలకు పాల్పడినట్టు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యింది.

జ్యోతిష్యం

ఫొటో సోర్స్, Getty Images

తప్పించుకున్న నిందితులు, పోలీసులపై కూడా చర్యలు

ఈ కేసుల్లో హత్యలు, హత్యాయత్నాల వ్యవహారం సీరియల్ మాదిరిగా సాగుతోంది. చివరకు పోలీసులు కూడా నిందితులతో చేతులు కలిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. పెద్ద మొత్తంలో లంచం తీసుకుని లాకప్‌లో ఉన్న నిందితుడు తురపాటి నాగరాజుని పోలీస్ కస్టడీ నుంచి తప్పించారన్నది నాటి పోలీస్ అధికారుల మీద అభియోగం. అంతర్గత విచారణ జరిపిన పోలీసులు ఏకంగా 2016లో నాటి ఏలూరు డీఎస్పీని విధుల నుంచి తొలగించారు. అంతేగాకుండా ఒక సీఐపై వేటు కూడా పడింది.

భూతం దుర్గారావు హత్య తర్వాత తురపాటి నాగరాజు చాలాకాలం పాటు ఆచూకీ లేకుండా గడిపారు. తురపాటి నాగరాజు, అతడి కుమారులు ఎక్కడున్నారన్న విషయం పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. అయితే కొంతకాలానికి హైదరాబాద్ సరూర్‌నగర్ సమీపంలోని జింకలబావి ప్రాంతంలో ఓ ఇంట్లో ఉన్న నాగరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అతడి ఆచూకీ బయటపడింది. ఈ ఘటనలో నాగరాజు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడినా, కోలుకున్న తర్వాత మాత్రం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో పోలీసుల చెర నుంచి తప్పించుకున్న దుర్గారావుపై తదుపరి పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఈ కక్షలు, దాడులు, హత్యాయత్నాల పరంపర సాగుతున్నట్టుగానే చెప్పవచ్చు.

జ్యోతిష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవలే మర్డర్ ప్లాన్ చేధించిన పోలీసులు

గత 15 ఏళ్లుగా సాగుతున్న దాడులు, ప్రతిదాడుల పరంపరలో కొద్దిరోజుల క్రితం కూడా ఓ మర్డర్ ప్లాన్‌ని పోలీసులు చేధించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో పోలీసులు కోడిపుంజుల శంకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

2016 లోనే హత్య కోసం తనకు తురపాటి నాగరాజు డబ్బులు ఇచ్చారని నిందితుడు పోలీసులుకు వెల్లడించడం కలకలం రేపింది. భూతం కుటుంబీకులిద్దరినీ చంపేందుకు తనకు డబ్బులిచ్చారని నిందితుడు అంగీకరించినట్టు ఏలూరు డీఎస్పీ దిలీప్ బీబీసీకి తెలిపారు.

"తొలుత పాలపాటి గోపారాజు అనే వ్యక్తిని హత్య చేసి ప్రస్తుతం దూరంగా ఉంటున్న భూతం కుటుంబీకులను బయటకు రప్పించాలని ప్రణాళిక వేశారు. ఈ విషయం మా విచారణలో తేలడంతో వెంటనే అప్రమత్తమయ్యాం. ప్రత్యేక పోలీస్ బృందం ముంబయి వెళ్లింది. తురపాటి శ్రీదేవి, గంధం లక్ష్మి, తురపాటి నాగరాజు, తురపాటి శివ కృష్ణలను అరెస్ట్ చేశాం. ఈ హత్యా ప్రణాళికలో వారంతా భాగస్వాములుగా తేలింది. గతంలో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే ఈ పనికి పూనుకున్నట్టు భావిస్తున్నాం. వారిని కోర్టులో హాజరుపరిచాం. రిమాండ్‌కి తరలించాం"అంటూ వెల్లడించారు.

జ్యోతిష్యం

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గ్రామం

క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా పినకడిమిలో సాగుతున్న వరుస ఘటనలకు ఇప్పటికీ ముగింపు పడలేదని తాజాగా పోలీసులు తురపాటి కుటుంబీకులను అరెస్ట్ చేసిన వ్యవహారం చాటి చెబుతోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన బీబీసీకి ఆసక్తికర పరిస్థితి ఎదురయ్యింది.

సుమారు 3వేల మంది జనాభా కలిగిన గ్రామంలో 2వేల మందికి పైగా జంగా కులస్థులే ఉన్నారు. వారి నివాస ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనిపించగానే అందరినీ అనుమానించే పరిస్థితి వచ్చింది. ఎవరితోనూ మాట్లాడేందుకు వారు అంగీకరించడంలేదు. గత అనుభవాల నేపథ్యంలో సుదీర్ఘ సమయం తర్వాత అన్నీ నిర్ధరించుకుని మాత్రమే కొందరు కులపెద్దలు బీబీసీతో మాట్లాడేందుకు ముందుకొచ్చారు.

గ్రామానికి చెందిన కొండయ్య బీబీసీతో మాట్లాడారు."మేమంతా వివిధ ప్రాంతాలకు వెళ్లి జ్యోతిష్యం చెప్పి జీవనం సాగిస్తాం. ఏడాదిలో 11 నెలలు బయట ప్రాంతాల్లో ఉంటాం. ఎక్కువ మంది సామాన్యులే ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు రావడం లేదు. అవి వస్తే చదువుకుని జీవితాలు మార్చుకుంటారు. గతంలో మేము చేసిన ప్రయత్నాలతో కొన్ని ఆదేశాలు ఇచ్చారు గానీ మా పిల్లలకు వాటిని ఇవ్వడం లేదు. తెలంగాణాలో ఎస్సీలుగా ఉన్నాం. ఏపీ లో మాత్రం ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చివరకు మా ఆడవారికి డ్వాక్రా రాయితీలు కూడా దక్కలేదు. ప్రభుత్వం ఆలోచించాలి. మా కులస్థుల్లో చదువు లేకపోవడం వల్ల దుందుడుకు స్వభావం పెరుగుతోంది. అలాంటివి అరికట్టేందుకు సహకరించాల్సి ఉంది"అని ఆయన అభిప్రాయపడ్డారు.

2006లో మొదలయిన ఈ వివాదం నేటికీ సీరియల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే గ్రామంలో గతంలో జరిగిన దాడుల ఆనవాళ్లున్నాయి. ఎక్కడ ఎలాంటి పరిణామం ఎదురయినా గ్రామంలో పోలీసులు పహారా కాయాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడి, అన్ని రకాలుగా పరిస్థితులు మార్చుకున్నా.. పాత కక్షలను వీడకుండా సాగుతున్న వారి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. పగ, ప్రతీకారాలతో రగులుతున్న వారిలో పరివర్తన కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మళ్లీ పూర్వపు శాంతిపూర్వక వాతావరణం వస్తుందని ఆశిస్తున్నట్టు ఏలూరు డీఎస్పీ అంటున్నారు. అలాంటి పరిస్థితి కోసం గ్రామంలో అత్యధికులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)