కంజర్ భట్ ముఠా: కంటెయినర్ల నుంచి సెల్‌ఫోన్లు దోచుకుని బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్న ఏపీ పోలీసులు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫ్యాక్టరీ తయారయ్యే ఖరీదైన సెల్‌ఫోన్లు అక్కడి నుంచి కంటెయినర్లలో తరలిస్తున్న సమయంలో దార్లో అదను చూసి వేల సంఖ్యలో సెల్‌ఫోన్లను కాజేసే కరడుగట్టిన దొంగల ముఠాను ఏపీలోని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.
వివిధ రాష్ట్రాల్లో పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ ముఠాను పట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది కొన్ని నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు.
ఆ కరడుగట్టిన ముఠా ఫోన్లను కొల్లగొట్టేది ఇలా..
చెన్నై-కోల్‌కతా హైవే.. 2019 ఫిబ్రవరి.. ఓ తెల్లవారుజామున శ్రీసిటీ నుంచి బయల్దేరింది ఒక కంటైనర్ లారీ. అందులో వేల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ లారీని కొందరు బండ్లలో వెంబడించారు. అదును చూసి చుట్టుముట్టారు. నట్టడవిలో డ్రైవర్‌ను కిందకి దింపి కొట్టిపడేశారు. లారీలోని 5 వేల స్మార్ట్ ఫోన్లు మాయం చేశారు.
2020 ఆగస్టు 25.. శ్రీపెరుంబుదూరు నుంచి ముంబైకి లారీ వెళ్తోంది. చిత్తూరు జిల్లాలో నగరి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని దొంగలు చుట్టుముట్టారు. డ్రైవర్‌ని కొట్టి రోడ్డు పక్కన వదిలేశారు. లారీ తీసుకుపోయారు. మొత్తం 8 బాక్సుల్లో ఉన్న 7,500 ఫోన్లు దోపిడీ అయ్యాయి.
2020 సెప్టెంబరు నెల.. మెదక్ జిల్లా మూసాపేట. మళ్లీ అదే దృశ్యం.. చెన్నై నుంచి దిల్లీ వెళ్తోంది లారీ. డ్రైవర్ భోజనం కోసం ఒక పక్క ఆగి, తిరిగి బయల్దేరబోయాడు. లారీ చుట్టూ ఓ రౌండ్ తిరిగి చూశాడు. అప్పటికే రెండున్నర కోట్ల విలువైన 2,400 ఫోన్లు మాయమయ్యాయి.
గుంటూరులో హైవేపై లారీ వెళ్తోంది. వెనుక తలుపు తెరిచి ఉన్నట్లు, ఓ కారు వాళ్లు లారీ డ్రైవరుకు చెప్పారు. దిగి చూసేసరికి, 80 లక్షల విలువైన 980 ఫోన్లు కనిపించలేదు.
వరుసగా జరుగుతున్న ఈ సెల్ ఫోన్ల దోపిడీ ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎక్కడా కేసుకు చిన్న క్లూ కూడా వదల్లేదు నిందితులు. నెల్లూరు కేసు ఛేదించడానికి దాదాపు 9 నెలలు పట్టింది.
నెల్లూరులో ఎలా జరిగింది?
చుట్టూ చీకటి. హైవే. లారీలో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. క్లీనర్, రెండో డ్రైవర్ లేరు. సరిగ్గా అప్పుడే ఆ లారీని చుట్టు ముట్టాయి మూడు బండ్లు. ఆ లారీ ముందుకూ వెనక్కూ వెళ్లకుండా అడ్డం వచ్చాయి.
వాటిల్లోంచి దిగిన కొందరు చకచకా ఈ లారీ ఎక్కారు. డ్రైవర్‌ను గట్టిగా కొట్టి కట్టేశారు. లారీని హైవే నుంచి మారుమూల దారిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆపి లారీలోని సరుకును తమ వాహనాల్లోకి ఎక్కించారు.
తాళం పగలగొట్టడం, సరుకు దించడం, తమ బండిలో ఎక్కించడం.. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. డ్రైవర్‌ని పక్కనే అడవిలోపడేశారు. తెల్లవారింది. డ్రైవర్ లేచి మెల్లిగా హైవే వైపు వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు అందింది.
నిజానికి ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అదే మొదటిసారి. ఆమాటకొస్తే పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసు చేధించిన ఉదాహరణలు లేవు. పోలీసులకు ఏ క్లూ దొరకలేదు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకపోయింది.
పోయిన 5 వేల ఫోన్ల ఐఎంఈఐ నంబర్లనూ ట్రాక్ చేయడం ప్రారంభించారు పోలీసులు. ప్చ్.. ఏ లాభమూ లేదు. ఆ ఫోన్లు ఏవీ ఆన్ అయినట్లు చూపించడం లేదు.
దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులకు చెందిన దొంగల ముఠాల గురించి విచారించడం మొదలుపెట్టారు. పెద్దగా లాభం లేదు కానీ, తవ్వే కొద్దీ ఇదే తరహాలో, ఒకే బృందం చేసిన మరో మూడు నేరాలు బయటపడ్డాయి.
చిత్తూరు జిల్లాలో రెండు, అనంతపురంలో ఒకటి, తమిళనాడులో ఒకటి ఇలానే జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గరలో ఒక లారీ డ్రైవర్‌ను చంపి, బావిలో పారేశారు. కానీ అక్కడ వారికి పెద్దగా సరుకు దొరకలేదు. మరో చోట డ్రైవర్‌ను కొట్టి దోపిడీ చేసేలోపు స్థానికులు చూసి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు.
తరువాత తమిళనాడు వెళ్లారు. అక్కడ కూడ ఓ లారీ డ్రైవర్‌ని కొట్టారు. కానీ సామాగ్రి ఎక్కువ బరువు ఉండడంతో సరుకు మార్చలేక వదిలేశారు. ఇవన్నీ 2018 డిసెంబరు 2019 జనవరిల మధ్యే జరిగాయి.
వారు చేసిన నాలుగో దోపిడీ మాత్రం సూపర్ సక్సెస్. అదే నెల్లూరు జిల్లాలో జరిగింది.

నెల్లూరు పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ అయింది. క్లూ లేదు. కేసు కొత్తగా ఉంది. తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. ఒక దశలో 12 పోలీసు బృందాలు ఈ కేసుపై పని చేశాయి. వేల గంటల సీసీ టీవీ ఫుటేజ్ విశ్లేషించారు. ఎన్నో గంటల పాటు టెక్నికల్ ఎనాలసిస్ చేశారు.
''ఆ క్రమంలో దొరికిన ప్రతి చిన్న క్లూనీ పట్టుకున్నాం. వాటి ఆధారంగా తిరిగి సీసీటీవీ ఫుటేజీని బ్యాక్ ట్రాక్ చేశాం. రకరకాల టోల్ గేట్ల దగ్గర ఫుటేజ్ విశ్లేషించాం. మధ్యప్రదేశ్ వరకూ ట్రాకింగ్ సాగింది. సరిగా మధ్య ప్రదేశ్‌లో ఆగిపోయింది. అంటే, ఆ చుట్టుపక్కలే ఎక్కడో నిందితులు ఉండుండాలని అనుమానం వచ్చింది.'' అన్నారు అప్పటి నెల్లూరు ఎస్పీ, ప్రస్తుతం విశాఖలో డీసీపీగా ఉన్న ఐశ్వర్య రస్తోగి.
ఇలాంటి తరహా నేరాలు చేస్తారన్న పేరున్న కంజర్ భట్ ముఠా మీద పోలీసులు దృష్టి పెట్టారు. కొన్ని రోజులు కాదు.. కొన్ని నెలల పాటు నెల్లూరు పోలీసులు మధ్యప్రదేశ్ రెవా జిల్లాలో మకాం వేశారు.
మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఎన్నికలు వచ్చాయి. తిరిగి డ్యూటీకి రావాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో ఎన్నికలు పూర్తవగానే తిరిగి మధ్యప్రదేశ్ వెళ్లారు.
అక్కడి భాష, అక్కడి పోలీసులు, అక్కడి ఇన్ఫార్మర్లు, అక్కడి సామాజిక పరిస్థితులూ అన్నీ వారికి ఒక సవాల్. మొత్తానికి అన్నీ సర్దుకునో, చక్కదిద్దుకునో, అనకున్నది సాధించారు.
దొంగల్ని పట్టేశారు. బండి కూడా దొరికింది. ఆ ముఠాకు సంబంధించిన ఇద్దరిని పట్టకున్నారు. వారు సరుకు ఇండోర్‌లోని ఒక వ్యక్తికి అమ్మినట్లు తెలిసింది. ఇండోర్‌లో ఆ వ్యక్తితో పాటు మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇండోర్ వ్యక్తి సరుకును బెంగాల్‌లో అమ్మారు. బెంగాల్ నుంచి సరకు దేశం దాటి బంగ్లాదేశ్ చేరింది.
కొన్ని నెలలపాటు శ్రమించి దొంగల్ని దాదాపుగా పట్టుకోగలిగారు పోలీసులు. కానీ, వారు అప్పటికే ఫోన్లను దేశ సరిహద్దు దాటించేయడంతో వాటి రికవరీ సాధ్యపడలేదు.
ఈ కేసు ఛేదించేశామని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో ఘటన జరిగింది.

ఈసారి చిత్తూరులో…
చిత్తూరు పోలీసులు ఘటన జరిగిన రెండు గంటల్లోనే బండ్లను ట్రేస్ చేయడం ప్రారంభించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కంజర్ భట్ ముఠాపై వారికి అనుమానం వచ్చింది. వారు వెళ్లే అవకాశం ఉన్న ప్రతీ దారి వైపు బృందాలను పంపించారు.
శ్రీపెరుంబుదూరు నుంచి వచ్చిన ఆ బండిని కర్ణాటక నాగపూర్‌ల మీదుగా దొంగలు మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు తీసుకెళ్లారు. దీంతో చిత్తూరు పోలీసులు మధ్యప్రదేశ్ వెళ్లారు. అక్కడే రోజుల తరబడి మకాం... మళ్లీ వేట మొదలు. కరోనా సమయంలో కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంటూ వీరు పనిచేశారు.
మొత్తానికి నెల రోజుల్లోనే దొంగల్ని పట్టుకున్నారు. ఈసారి సరకు కూడా రికవరీ చేయగలిగారు. దాదాపు 7 కోట్ల విలువైన 7,600 ఫోన్లు పట్టుకున్నారు.
''ఈ గ్యాంగ్ వాళ్ల మధ్య చాలా ఐకమత్యం ఉంటుంది. ఒకరు దొరికినా, రెండో వారు దొరకరు. ఒకవేళ మనుషులు దొరికినా, సరుకు రికవరీ జరగదు. వీరి నెట్‌వర్క్ చాలా పెద్దది'' అని చెప్పారు చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్.
''వారికి సరుకు అమ్మే సమయం ఇవ్వకుండా వేగంగా విచారణ చేశాం. ముఠాలో ముఖ్యమైన వ్యక్తిని పట్టుకున్నాం. రేవా అటవీ ప్రాంతంలోని గోడౌన్లపై దాడి చేసి సరుకును సీజ్ చేసాం'' అని వివరించారు ఆయన.
ఫోన్లు సరిహద్దు దాటకుండా ముందు జాగ్రత్తగా ముందే బెంగాల్ సరిహద్దుల్లోని మాల్దా పట్టణానికి ఒక పోలీసు బృందాన్ని పంపించారు పోలీసులు. నగరి పోలీసులు బెంగాల్ వెళ్తే, పీలేరు పోలీసులు మధ్యప్రదేశ్ వెళ్లారు. చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల పనిచేసే సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఈ విచారణలో పాల్గొన్నారు.

ఈ ప్రాంతాలే ఎందుకు?
తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు నుంచి నెల్లూరు-చిత్తూరు సరిహద్దులోని శ్రీ సిటీ వరకూ ఉన్నదంతా వివిధ వస్తువులను తయారీ చేసే పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ పరిశ్రమల నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు బయల్దేరే లారీలను ఈ దొంగలు లక్ష్యంంగా చేసుకున్నారు.
తయారీ పరిశ్రమలు తమ సరుకును లారీల్లో దేశమంతా పంపిస్తుంటాయి. సరిగ్గా అలాంటి లారీలే వీరి టార్గెట్. ఆ లారీలు సరుకు తీసుకు బయల్దేరినప్పటి నుంచీ వీరు ఫాలో అవుతారు. సాధారణంగా రెండు మూడు బండ్లతో దాన్ని వెంబడిస్తారు. నిర్మానుష్యంగా ఉన్న చోట తమ వాహనాలతో సరుకు ఉన్న బండిని ముట్టడిస్తారు. డ్రైవర్‌ని కొట్టడం, చంపడం చేస్తారు. ఆ లారీ నుంచి క్షణాల్లో సరుకును తమ బండ్లలోకి మార్చుకుని ఉడాయిస్తారు.
''ఇలా దొంగతనం చేసే చాలా గ్యాంగులు ఉన్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి. ఆఖరికి సిగరెట్ లోడ్లు కూడా దొంగతనం చేసి అమ్ముతారు. అది కూడా కోట్ల రూపాయల వ్యాపారం. సిగరెట్లు ట్రాకింగ్ ఉండదు కదా.. భారతదేశంలోనే అమ్ముకోవచ్చు'' అన్నారు ఐశ్వర్య రస్తోగి.
ఫోన్లు ట్రాక్ చేయలేరా?
ఈ ఫోన్లను భారతదేశంలో అమ్మరు. ఇక్కడ సిమ్ ఆన్ చేస్తే ఫోన్లు ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రాక్ అవుతాయి. లేదా ఆ నంబర్ ఉన్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయొచ్చు. దీంతో వీటిని నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమ్ముతారు. అక్కడకు వెళ్లిన ఫోన్లను భారత అధికారులు ట్రాక్ చేయలేరు.
నెల్లూరు పోలీసులకు అదే మొదటి కేసు కావడంతో ఛేదించడానికి సమయం చాలా పట్టింది.
''మాకు మధ్యలో ఎన్నికలు, ఇతరత్రా సమస్యలూ కలుపుకుని 9 నెలలు పట్టింది ఈ కేసు చేధించడానికి. ఈ ఒక్క కేసు కోసం సుమారు లక్ష పని గంటలు వెచ్చించాం'' అని అన్నారు ఐశ్వర్య రస్తోగి. ఇప్పుడిది ఒక కేస్ స్టడీలా అయింది.
అటు చిత్తూరు పోలీసులకు కరోనా సమస్య ఎదురైంది. ''దర్యాప్తు మధ్యలో బృందంలో ముగ్గురికి కరోనా సోకింది. మళ్లీ వారిని మధ్యలో పిలిపించి, చికిత్స ఇప్పించాం. ఇప్పుడు కోలుకున్నారు'' అని వివరించారు సెంథిల్ కుమార్.
రెండు కేసుల్లోనూ సీఐ, స్పై, కానిస్టేబుల్ స్థాయి అధికారులు ఎంతో కష్టపడ్డారంటూ ప్రశంసించారు ఈ ఇద్దరు ఎస్పీలు.

ఎవరీ కంజర్ భట్ ముఠా?
మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా కేంద్రంగా పనిచేస్తుంది కంజర్ భట్ ముఠా. దారిదోపిడీలు వీరి వృత్తి. దారి దోపిడీలు అంటే పాత కథల్లోలా.... ప్రయాణికులను దారి కాచి దోపిడీ చేయడం కాదు. ఈ ముఠా స్టైల్ మోడర్న్‌గా ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తులే వీరి టార్గెట్.
''ఇలాంటి వారు సరుకు అమ్మడానికి ఎక్కువ సమయం తీసుకోరు. తాము తీసుకురాబోయే సరుకుని కొని తరలించేవారితో ముందే మాట్లాడుకుంటారు. అందుకని ఎంత వేగంగా వీరిని పట్టుకోగలమనేది చాలా ముఖ్యం. వీరు సరుకు అమ్మేసి తమ దగ్గర ఏమీ లేకుండా చూసుకుంటారు'' అని వివరించారు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్.
''ఈ కంజర్ భట్ ముఠా మోడస్ ఆపరెండీ (నేరం చేసే పద్ధతి) ఇలానే ఉంటుంది. వారు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహిస్తారు. ఆ తరువాత ఎక్కడా దొరక్కుండా సాంకేతిక పరిజ్ఞానం వాడతారు. దొంగ సిమ్ కార్డులు వాడతారు. పలు ఫోన్లు మారుస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు ఫోన్లే వాడరు'' అని వివరించారు అప్పటి నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. ఆయన ఇప్పుడు విశాఖలో డీసీపీగా ఉన్నారు.

గుంటూరు పోలీసులకు చిక్కిన కంజర్‌భట్ ముఠా
కంటెయినర్‌లలోని సెల్‌ఫోన్లు కొల్లగొట్టిన కంజర్‌భట్ గ్యాంగ్ ని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
''సెప్టెంబరు 15న చిత్తూరు జిల్లా వేదాయపాలెం శ్రీసిటీలోని రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి 13,760 మొబైల్స్ ప్యాలెట్లు లోడ్ చేసుకొని కంటెయినర్ కలకత్తాలోని జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి బయల్దేరింది.
కంటెయినరును వెంబడించిన కంజర్‌భట్ గ్యాంగ్ గుంటూరు సమీపంలోని ఓ దాబా దగ్గర డ్రైవర్ టీ తాగుతున్న సమయంలో కంటైయినర్ తెరిచి 960 రెడ్‌మి నోట్ ఆర్కిటిక్ 4జిబి/6జిబి ఫోన్లను దొంగిలించారు.
వెనుక వస్తున్న వాహనచోదకులు చోరీ జరుగుతున్నట్లు డ్రైవర్‌కి చెప్పడంతో డ్రైవర్ వారిని ఆపే ప్రయత్నం చేయగా కత్తులతో బెదిరించి ఉడాయించారు.
గుంటూరు అర్బన్ పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గడిచిన 15 రోజులుగా సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తూ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 913 సెల్ ఫోన్ లు, రూ. 4,50,000 నగదుతో పాటూ నిందితులు వినియోగించిన కట్టర్స్, వాహనం, ఒక లారీ స్వాధీనం చేసుకున్నారు’’ అని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- చైనా దూకుడుకు కళ్లెం వేయడం ఎలా? ఆ దేశ అసమ్మతివాది ఏమంటున్నారు?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లాడు.. ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రూ. 2.4 కోట్లకు ఐపీఎల్లో ఆడుతున్నాడు
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








