సింహాచలం అప్పన్న బంగారం వేలం అంటూ రూ. 1.40 కోట్లకు టోకరా

ఫొటో సోర్స్, simhachalam devasthanam
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన సింహాచలం దేవస్థానంలో ఓ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
అప్పన్న ఆలయానికి సంబంధించిన బంగారం అమ్ముతామంటూ ఏకంగా ఈవో పేరుతో నోటీసు కూడా సృష్టించటం విస్తుగొలుపుతోంది.
దీనిపై కొత్తగా కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన త్రినాధరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారం అమ్మకాలు పేరుతో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆలయ బంగారం అమ్మకాలంటూ కొంతకాలంగా ప్రయత్నాలు
సింహాచలం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా అధికారులు చెబుతున్నారు.
దేవస్థానానికి సంబంధించిన బంగారం అమ్మకాలు చేస్తున్నట్టు ఓ నోటీసుని కూడా సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.
నిన్నటి వరకూ ఈవోగా పనిచేసిన భ్రమరాంబ అనే అధికారిణి పేరుతో ఈ నోటీసు సిద్ధం చేయడంతో నెల్లూరు జిల్లాకి చెందిన శ్రావణి అనే మహిళ దానిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.

ఈవో సంతకంతో పాటుగా స్టాంప్ కూడా ఉండడంతో దానిని వాస్తవమని విశ్వసించి హైమావతికి రూ. 1.40 కోట్లకు గానూ కొంత మొత్తం బ్యాంకు ద్వారా ట్రాన్ఫర్ చేసినట్టు బాధిత మహిళ శ్రావణి చెప్తున్నారు.
ఈ విషయంపై గోపాలపట్నం ఎస్‌ఐ సత్యన్నారాయణ బీబీసీకి వివరాలు తెలిపారు.
''దేవస్థానం వేలంలో తాము బంగారం కొనుగోలు చేసి ఇస్తామంటూ హైమావతి చెప్పడంతో శ్రావణి ఆమెకు డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత దేవస్థానం నుంచి వేలంలో బంగారం కొనుగోలు చేసినట్టు రశీదు పంపించారు. కానీ బంగారం రాలేదు. దీంతో శ్రావణి దేవస్థానం వారిని ఆశ్రయించారు. అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది'' అని వివరించారు.
హైమావతి ఎవరు అనేదానిపై ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేశాం. దర్యాప్తు ప్రారంభించాం. త్వరలోనే నిందితులను గుర్తిస్తాం'' అని చెప్పారు.
కరోనావైరస్ కారణంగా బంగారం వేలం గురించి ప్రచారం చేయడం లేదని కూడా చెప్పడంతో అదే నిజమనుకుని తాము కొనుగోలుకి ముందుకు వచ్చినట్టు బాధితురాలు చెప్తున్నారు. తనకు ఇచ్చిన నోటీసును కూడా ఆలయ అధికారులకు అందించారు. ఆలయ అధికారులు అది ఫోర్జరీ పత్రమంటున్నారు.
‘‘బంగారం అమ్మకాలకు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది’’
కొందరు స్థానికులు నెల్లూరుకి చెందిన వారిని మోసం చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని ఈవో త్రినాధరావు బీబీసీకి చెప్పారు.
ఈవో సంతకం ఫోర్జరీ చేసినట్టు తేలిందని.. ఈ విషయంలో నిందితులెవరో తేల్చేందుకు విచారణ కోసం గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
''సింహచలం దేవస్థానానికి సంబంధించి ఎటువంటి అమ్మకాలు లేవు. బంగారం గానీ వెండి గానీ అమ్మే ఆలోచన కూడా లేదు. అలా చేయాలంటే దానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆలయంలో పనికిరాని వస్తువులు అమ్మేందుకు కూడా ఈ-టెండర్‌లు పిలుస్తాం. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో బంగారం అమ్మాలంటే చాలా విస్తృతంగా ప్రచారం చేస్తాం'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- బంగారం ధరలు ఏ రోజుకి ఆరోజు కాదు.. ఏ పూటకి ఆ పూటే మారిపోతున్నాయా?
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వాళ్లందరూ ప్లాస్మా దానం చేయట్లేదు ఎందుకు?
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








