కరోనావైరస్ నుంచి కోలుకున్న వాళ్లందరూ ప్లాస్మా దానం చేయట్లేదు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 బారిన పడిన వారు కోలుకోవడానికి కన్వల్సెంట్ ప్లాస్మా చికిత్స కొంత వరకు పని చేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్లాస్మా దానానికి, సేకరణకు ఇటీవల కాలంలో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ సోకిన కొంత మంది సెలెబ్రిటీలు కూడా తాము కోవిడ్ నుంచి కోలుకోగానే ప్లాస్మాని దానం చేస్తామని ప్రకటనలు చేశారు. కానీ, కోవిడ్-19 సోకిన వారెవరైనా ప్లాస్మా దానం చేయవచ్చా? దీనికున్న నిబంధనలు ఏమిటి? ప్లాస్మా కావాలంటే ఎక్కడకి వెళ్ళాలి? ఇది సాధారణ బ్లడ్ బ్యాంకులలో లభ్యమవుతుందా?
ప్లాస్మా అంటే ఏమిటి?
రక్తంలో ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా లాంటి పదార్ధాలు ఉంటాయి. ప్లాస్మా అనేది రక్తంలో ఉండే ఒక ద్రవ పదార్ధం. రోగి ఒక తీవ్రమైన రోగం బారిన పడిన తర్వాత శరీరం ఆ రోగం నుంచి కోలుకోవడానికి పట్టే దశను కన్వల్సెంట్ అంటారు. ఈ దశలో రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై, రోగి అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కన్వల్సెంట్ ప్లాస్మాని కోవిడ్-19 చికిత్సలో వాడుతున్నారు.
దాత నుంచి రక్తం తీసుకుని అందులో ఉండే ప్లాస్మా అనే ద్రవ పదార్ధాన్ని మొదట సేకరిస్తారు. ఈ కన్వల్సెంట్ ప్లాస్మాతో చేసే చికిత్సను ప్లాస్మా థెరపీ లేదా కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటారు.
కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీని 1898లో ఎమిల్ ఒన్ బెహెరింగ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టినట్లు కుముద్ లతా దాస్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది ప్లాస్మా థెరపీ గురించి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్వల్సెంట్ ప్లాస్మా చికిత్స చేయడం పట్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని హెచ్చరించింది. ఈ థెరపీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్లాస్మాని ఎవరి నుంచి సేకరించవచ్చు?
సెప్టెంబరు 2 నాటికి భారతదేశంలో 38,48,968 మంది కోవిడ్-19 బారిన పడగా, 29,67,396 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4,55,539 మంది కోవిడ్-19 బారిన పడగా 3,48,330 మంది కోలుకున్నారు. తెలంగాణలో 1,30,589 మంది కోవిడ్-19 బారిన పడగా, 97,402 మంది కోలుకున్నారు. సెప్టెంబరు 2 నాటికి దేశ వ్యాప్తంగా రికవరీ 77. 09 శాతం ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కోవిడ్-19 బారిన పడి కోలుకున్నవారందరూ వైద్య నిబంధనల ప్రకారం ప్లాస్మా దానం చేసేందుకు అర్హులు కాదు.
ప్లాస్మాని ఎవరు దానం చేయవచ్చు?
కరోనావైరస్ బారిన పడి ఆక్సీజన్ సహాయం తీసుకుని, కోలుకున్నవారు ప్లాస్మా దానానికి అనువుగా ఉంటారని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్-19 వార్డులో పనిచేస్తున్న వైద్యులు కిరణ్ బీబీసీకి వివరించారు.
కోవిడ్-19 బారిన పడి కోలుకున్న 28వ రోజు నుంచి 3 నెలల లోపు ప్లాస్మాని సేకరించాలి.
ప్లాస్మా దాతలు 18 - 50 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. ఈ వయసులో ఉన్న దాతలు దొరకని పక్షంలో 60 సంవత్సరాల లోపు వారి ప్లాస్మాని తీసుకుంటారు.
కన్వల్సెంట్ ప్లాస్మాని 400 ఎంఎల్ సేకరిస్తారు. రోగికి ముందు 200 ఎం ఎల్ మాత్రమే ఇస్తారు. రోగి పరిస్థితిని బట్టి మిగిలిన ప్లాస్మా ని ఎక్కిస్తారని ఆయన చెప్పారు.
“ప్లాస్మాని నిర్ణీత ఉష్ణోగ్రతల్లో ఒక సంవత్సరం వరకు నిల్వ చేసి ఉంచవచ్చు. కానీ, కోవిడ్-19 చికిత్సలో ప్లాస్మా ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది”అని ఆయన చెప్పారు.
అయితే, కోవిడ్-19 బారిన తీవ్రంగా పడి శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ప్లాస్మా దానం చేసే పరిస్థితుల్లో ఉండరని రాజమండ్రికి చెందిన కిఫి హాస్పిటల్ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం బీబీసీకి చెప్పారు. తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలతో కోలుకున్న వారెవరి నుంచైనా ప్లాస్మాని సేకరించవచ్చని వివరించారు.
‘‘కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీ టైట్రస్ 1:160 ఉన్నవారెవరైనా ప్లాస్మా దానం చేయవచ్చు. దీనికి ముందుగా రక్త పరీక్ష చేసి పరిశీలించాలి. ఇది దొరకని పక్షంలో 1:80 ఉంటే చేయవచ్చు’’ అని ఆయన చెప్పారు.
పురుషులు, బాలింతలు మినహా మహిళలు ప్లాస్మా దానం చేయగలరు. తల్లులు ప్లాస్మా దానం చేయాలంటే హ్యూమన్ లైకోసైట్ యాంటిజెన్ (ఎచ్ ఎల్ ఏ) పరీక్ష చేసి అది రోగి ఎచ్ఎల్‌ఏతో మ్యాచ్ అయితే ప్లాస్మాని సేకరించవచ్చు.
ప్లాస్మా దాత ఆరోగ్యంగా ఉండటంతో పాటు కనీసం 50 కిలోల బరువు ఉండాలి.
డయాబెటిస్ లాంటి ఇతర లక్షణాలు లేకుండా ఉండాలి.
ప్రతి రెండు వారాలకి ఒకసారి శరీరం యాంటీబాడీలను తయారు చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. అందకే ప్లాస్మా దానం చేయడానికి సంశయించాల్సిన పని లేదని సుబ్రహ్మణ్యం చెప్పారు.
ప్లాస్మా థెరపీ ఎప్పుడు మొదలుపెట్టాలి?
‘‘కోవిడ్-19 సోకిన 7 రోజులలోగానే ప్లాస్మా థెరపీ చేయాలి. ఒక సారి శరీరంలో అవయవాలు దెబ్బ తిన్న తర్వాత ప్లాస్మా థెరపీ చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదు”అని సుబ్రహ్మణ్యం చెప్పారు.
ప్లాస్మాని దానం చేసిన తర్వాత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తూ, అన్ని రకాల పళ్ళు, ఆకు కూరలు, జీడిపప్పు, బాదంపప్పు, వాల్నట్, వేరుసెనగ లాంటి పదార్ధాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే కనీసం ఒక గంట పాటు నడక కానీ, వ్యాయామం కానీ చేయాలని చెప్పారు
ప్లాస్మా సేకరణ ఎలా చేస్తారు?
ప్లాస్మా సేకరించాలనుకునే బ్లడ్ బ్యాంకులు ఐసీఎంఆర్ నిబంధనలను అనుసరించి అధికారికంగా నమోదు చేసుకోవాలని డాక్టర్ కిరణ్ తెలిపారు. ఐసీఎంఆర్ అనుమతి లేనిదే ప్లాస్మా సేకరణ సాధ్యపడదని చెప్పారు.
ప్లాస్మా దానం కూడా రక్త దానంలానే వలె స్వచ్ఛందంగా జరుగుతుంది.
ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన వారి వివరాలతో ప్లాస్మా దానం కోసం డేటా బేస్ తయారు చేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. కోవిడ్-19 నుంచి కోలుకున్నవారిని హాస్పిటల్ వర్గాలే సంప్రదించి ప్లాస్మా దానం గురించి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్-19 నయం చేయవచ్చని కచ్చితంగా చెప్పలేమని ఐసీఎంఆర్ చెప్పినప్పటికీ ప్రస్తుతానికి చాలా మంది రోగుల్లో ఈ చికిత్స పని చేస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్లాస్మా దానం చేయాలనుకునే వారు ఎక్కడకు వెళ్ళాలి?
ప్రస్తుతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులలోనే ప్లాస్మా సేకరిస్తున్నారు. ఎవరైనా ప్లాస్మా దానం చేయాలనుకుంటే ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులను సంప్రదించవచ్చు.
ప్లాస్మా సేకరణ, దానం పట్ల ఉన్న అస్పష్టతతో చాలా మంది రోగుల కుటుంబ సభ్యులు ప్లాస్మా కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జులై మధ్య వారంలో వైరల్ అయిన ప్లాస్మా డోనర్ల జాబితా ఫేక్ లిస్ట్ అని క్విన్ట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆ జాబితాలో ఉన్న టెలిఫోన్ నంబర్లు 2015 లో నమోదు చేసుకున్న రక్త దాతల పేర్లని తేల్చింది.
ప్లాస్మా సరఫరా చేస్తామనే పేరుతో కొంత మంది వ్యక్తులు రోగుల బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
సైబరాబాద్ పోలీసు శాఖ ప్లాస్మా సేకరణ, దానం కోసం www.donateplasma.scsc.in అనే వెబ్ సైట్‌ను జూన్ నెలలో ప్రారంభించినట్లు సైబరాబాద్ పోలీసు కమీషనర్ వి సి సజ్జనార్ బీబీసీకి తెలిపారు
ఈ వెబ్ సైటు ద్వారా దాతలు కానీ, ప్లాస్మా అవసరమైన వారు కానీ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని సజ్జనార్ చెప్పారు. ఇలా సేకరించిన వివరాలను అవసరమైనప్పుడు హాస్పిటల్స్‌కు ఇస్తామని, వారు ప్లాస్మాని సంబంధిత వ్య క్తి నుంచి సేకరించి అవసరమైన వారికి చికిత్స చేస్తారని చెప్పారు.
ప్లాస్మా దానం చేసేందుకు అవగాహన కల్పించేందుకు 100 కి పైగా స్వచ్ఛంద సేవకులు ప్రతి రోజు కోవిడ్-19 నుంచి కోలుకున్న వారికి ఫోన్లు చేసి ప్లాస్మా దానం గురించి, మరొక ప్రాణాన్ని కాపాడవచ్చని చెబుతూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది కాస్త శ్రమతో కూడుకున్న పనే అయినప్పటికీ దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు.
ఇలా చేసిన తర్వాత సోషల్ మీడియాలో ప్లాస్మా కోసం వచ్చే అభ్యర్ధనల సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. ఈ వెబ్ సైటులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ తరహాలో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్లాస్మా డేటాబేస్ అధికారికంగా ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో లేదు.
తిరుపతి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్ అనుమతులతో ప్లాస్మా సేకరణ చేసే కేంద్రాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కోవిడ్-19 ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయా జిల్లా కలెక్టర్లు రెడ్‌క్రాస్ సహాయంతో ప్లాస్మా సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.
ప్లాస్మా దాతలను ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయిల ప్రోత్సాహకాన్ని ప్రకటించడంతో పాటు, కోవిడ్-19 కేర్ సెంటర్లో కౌన్సిలర్లు వైరస్ నుంచి కోలుకున్న వారికి ప్లాస్మా దానం గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్లాస్మా దానానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్లాస్మా అవసరం రాగానే కాంటాక్ట్ చేయడానికి అవసరమైన డేటాబేస్‌ను తయారు చేసేందుకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యుడు బివిఎస్ కుమార్ కుమార్ బీబీసీకి తెలిపారు. దీనికి అవసరమైన అనుమతులు తీసుకునేందుకు ఐసీఎంఆర్‌కి దరఖాస్తు చేసినట్లు వివరించారు.
ఎవరైనా దాతలు ప్లాస్మా దానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్‌కి స్వచ్ఛందంగా వస్తే వారి వివరాలు డేటాబేస్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు.
ఆగస్టు 23 వ తేదీన హైదరాబాద్ రోటరీ క్లబ్ తొలి ప్లాస్మా బ్యాంకుని ఏర్పాటు చేసింది. దీనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లడ్ బ్యాంకులలోనే అన్ని గ్రూపుల ప్లాస్మా బ్యాంకుని ఏర్పాటు చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన పని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









