కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెరీ హాన్‌సేన్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఆదివాసీ జాతులను, తెగలను అంటువ్యాధులు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కోవిడ్-19 లాంటి ఇన్ఫెక్షన్లు అయితే జాతులతోపాటు దేశాలనే తుడిచిపెట్టేయగలవు.
కరోనావైరస్ లాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌లు దేశ పటం నుంచీ కొన్ని ఆదివాసీ తెగలను అదృశ్యం అయ్యేలా చేయగలవని విక్టోరియా టాలీ కార్పజ్ అభిప్రాయపడ్డారు.
ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా వివిధ దేశాల్లోని ఆదివాసీ హక్కుల మీద పని చేయడానికి ఆమె ఫిబ్రవరిలో జెనీవా వెళ్లారు. అక్కడి నుంచీ ఆమె ఇతర దేశాలకు ప్రయాణం కొనసాగించాల్సి ఉంది. అయితే, అప్పటికే కోవిడ్-19 అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తుండటంతో ఆమె తన స్వదేశమైన ఫిలిప్పీన్స్‌కు తిరిగి వెళ్లిపోయారు.
మిగతావారికన్నా ఈ మహమ్మారి ఆదివాసీ తెగలకు, జాతులకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
2009లో కెనడాలో హెచ్1ఎన్1 మహమ్మారి విజృంభించినప్పుడు.. మొత్తం జనాభాలో 3.4% మాత్రమే ఉన్న ఆదివాసీ కెనడియన్లు 16 శాతం మంది ఈ వైరస్ బారినపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 ఏమీ మిహాయింపు కాదు. యూఎస్ఏలో 3,600 మంది తెల్లజాతి అమెరికన్లలో ఒకరు కరోనావైరస్ కారణంగా చనిపోగా, 2,300 మంది ఆదివాసీ అమెరికన్లలో ఒకరు ఈ వ్యాధి సోకి చనిపోయారు. ఆదివాసీలలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుందనడానికి ఇది ఒక సంకేతం.
అమెరికాలోని నైరుతి ప్రాంతంలో 27,000 చదరపు మైళ్ల (70,000 చ.కిమీ) విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నవాజో నేషన్‌లో కోవిడ్-19 సోకినవారి సంఖ్య, న్యూయార్క్ రాష్ట్రాన్ని దాటిపోయింది.
"ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కావల్సినంత వైద్య సహాయం, ఆస్పత్రులు లేవు. ఆదివాసీలలో పోషకాహార లోపంతో పాటూ ఇంతకుముందే వేరే రకాల వ్యాధులు సోకి ఉండడంతో వ్యాధి సంక్రమణ రేటు ఎక్కువగా ఉంటుంది" అని టాలి-కార్పజ్ అన్నారు.
ముఖ్యంగా అమెజాన్ అటవీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలలో కోవిడ్-19 మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి సరైన సమయంలో వైద్య సహాయం అందడం చాలా కష్టం.
జులై 24 నాటికి అమెజాన్‌లోని 38 ఆదివాసీ ప్రాంతాలల్లో 19,329 మంది మరణించారు. ఇక్కడ మొత్తంగా 6,77,719 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రెడ్ ఎక్లీసియల్ పనమజోనియా తెలిపింది.
"ఇప్పటికే అటవీ నిర్మూలన, కార్చిచ్చులు, ఖనిజాల వెలికితీత, వ్యవసాయ పరిశ్రమ విస్తరణ, వాతావరణ మార్పుల వలన ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కోవిడ్-19 రూపంలో మరో సంక్షోభం వచ్చి ఏర్పడింది. ఆదివాసీ జాతులు అంతరించిపోతాయేమోననే భయం రోజు రోజుకూ పెరుగుతోంది" అని అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లైలా సలజార్-లోపెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మనుగడకోసం పోరాటం
ఆదివాసీలు ఈ వైరస్‌తో అలుపెరగని పోరాటం చేస్తున్నారు.
"ఈ వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆదివాసీలు తమలో తాము సాయం చేసుకోవడం చూస్తుంటే గొప్ప ఆశ్చర్యం కలుగుతోంది. పీపీఈ కిట్లు అందిస్తున్నారు. సొంతంగా మాస్కులు తయారుచేసుకుంటున్నారు. కోవిడ్-19 గురించి సమాచారం స్థానిక భాషలో అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నారు" అని టాలీ-కార్పజ్ అన్నారు.
మరికొందరు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈక్వెడార్‌లోని సికోపాయ్ రాష్ట్రంలో దాదాపు 45 మంది పిల్లలు, పెద్దలు కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు కారడవుల్లోకి వెళ్లిపోయారు అని దేశాధ్యక్షుడు జస్టినో పియాగాజ్ తెలిపారు.
అలాస్కాలో 1918-19ల్లో వచ్చిన ఫ్లూ మహమ్మారి విధ్వంసాన్ని సృష్టించింది. అప్పుడు 200కు పైగా అలాస్కా ఆదివాసీ జాతులు ఇలా దూరంగా వెళిపోయాయి. కొన్ని ద్వీపాలు రాకపోకలను పూర్తిగా నిషేధించాయి.
యూఎస్ఏలో నవాజో లాంటి ప్రాంతాలన్నీ కర్ఫ్యూ విధించాయి. రాకపోకలను నిషేధిస్తూ లాక్‌డౌన్ పాటించాయి. 40,000 మంది నవాజో ప్రజలకు కోవిడ్-19 పరీక్షలు జరిపారు. అమెరికాలోని మిగతా రాష్ట్రాలకన్నా భారీ స్థాయిలో మేము టెస్టులు నిర్వహించాము అని నవాజో అధ్యక్షుడు జోనాథన్ నెజ్ తెలిపారు.
యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ మే 15న గ్రాండ్ కాన్యన్‌ను తిరిగి తెరిచింది. దీనిలో కొంతభాగం నవాజో ప్రాంత పరిధిలో ఉంది. కాన్యాన్ దిగువున ఉండే హవాసులో ఆదివాసీలు నివసిస్తారు. వీరిలో 15% మంది వృద్ధులు, మధుమేహం, ఆస్థమా లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. వీరందరికీ కోవిడ్-19 త్వరగా సోకే అవకాశం ఉంది. వీరంతా పర్యటకంపై ఆధారపడి జీవిస్తున్నవారు. లాక్‌డౌన్ వల్ల వీరికి పూట గడవడం కష్టమైంది. ఆన్‌లైన్‌లో నిధులు సమీకరించే గో ఫండ్ మీ ద్వారా కొందరికి సాయం అందింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికాలో పరిస్థితి?
ఆఫ్రికాలో ఆదివాసీలది కూడా ఇదే పరిస్థితి. పోషకాహార లోపం, సరైన వైద్య సదుపాయాలు, పరిశుభ్రత లేకపోవడంతో వీరు ఎక్కువగా వైరస్ బారిన పడే ముప్పుంది.
లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూతపడుతున్నాయి. దీంతో వీరు తయారుచేసే ఉత్పత్తులు అమ్ముకోవడానికి, కావాల్సిన వస్తువులు కొనక్కోవడానికి వీలు పడట్లేదు.
"వారి ఉత్పత్తులు అమ్ముడుకాకపోతే..ఆరోజుకి ఇక భోజనం లేనట్టే! ఇప్పటికే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వలన వ్యవసాయం దెబ్బతింది. ఇప్పుడు ఈ మహమ్మారి వల్ల వారు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు" అని హిండౌ ఔమరౌ ఇబ్రహీం అన్నారు.
అసోసియేషన్ ఆఫ్ పెయూల్ వుమెన్ అండ్ అటాక్తనస్ పీపుల్స్ ఆఫ్ చాద్ కోఆర్డినేటర్‌గా ఆమె పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హక్కులకు భంగం
వీటన్నింటికి తోడు ఆదివాసీ తెగల్లో లాక్‌డౌన్ విధానాల గురించి ప్రచారం చెయ్యడం, వాటిని అమలు చేయడం పెద్ద సవాల్‌గా మారింది.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో లాక్‌డౌన్ సమయంలో బయటికి వస్తే 11,000 వేల ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధించారు. నిషేధాలను ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా ఆదివాసీ ప్రజలకు మిగతావారికన్నా 33% తక్కువ ఆదాయం ఉంటుంది. వీరు ఈ జరిమానాను భరించలేరు. వీరు ముఖ్య పట్టణాలకు, నగరాలకు దూరంగా నివసిస్తూ ఉండటంతో లాక్‌డౌన్ నియమాల గురించి తెలిసే అవకాశం కూడా తక్కువే!

ఫొటో సోర్స్, Amazon Frontiles y Alianza Ceibo via Reuters
"ఆదివాసీలు తాము నివసిస్తున్న భూమిపై చట్టబద్ధంగా హక్కులు పొందినప్పుడు ఇలాంటి మహమ్మారి బారి నుంచీ తమని తాము రక్షించుకోగలుగుతారు. ఇలాంటి వైరస్‌ను ఎదుర్కోవడానికి తగిన వనరులు, సదుపాయాలు సమకూర్చుకోగలుగుతారు. తగిన లాక్‌డౌన్ విధానాలు రూపొందించుకోగలుగుతారు" అని టాలీ-కార్పజ్ అన్నారు.
“అయితే ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టార్లు ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని ఆదివాసీల భూములు చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఆదివాసీ హక్కులకు భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇండోనేషియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో పర్యావరణ నిబంధనలు ఎత్తివేశారు. కెన్యా, ఉగాండా లాంటి దేశాల్లో భూములు లాక్కున్నారు" అని టాలీ-కార్పజ్ తెలిపారు.
జాతులు అంతరించే ముప్పు
ఆదివాసీల్లో ఆరోగ్య సమస్యలకు మూలికా వైద్యం, చెట్ల నుంచి సేకరించిన ఔషధాలు వాడతారు. వీరి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర మౌఖికంగా వృద్ధుల నుంచి పిల్లలకు చేరుతాయి. కరోనావైరస్ లాంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉంటుంది. వృద్ధులు ఎక్కువగా చనిపోతుంటే జ్ఞానం, సంస్కృతి తరువాతి తరానికి చేరే అవకాశాలు తగ్గిపోతాయి. వారి చరిత్ర వారికి తెలియకుండా పోతుంది. ఈ విధంగా జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే ఉన్న సమస్యలతోపాటు, కోవిడ్-19లాంటి వ్యాధులు సృష్టించే సంక్షోభంతో ఆదివాసీ తెగలు, జాతులు పూర్తిగా తుడుచిపెట్టుకు పోతాయేమోనని సలజార్-లోపెజ్ లాంటివారు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








