కరోనావైరస్‌తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు

వుహాన్‌లోని స్విమ్మింగ్ పూల్ - 15 ఆగస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వూహాన్ నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్టివల్‌

వేలమంది ఒక్కచోట గుమిగూడారు. వాళ్ల ముఖాలకు మాస్కులు కూడా కనిపించడం లేదు. రబ్బరు ట్యూబులను ధరించి, భుజం భుజం కలిపి ఓ వాటర్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు.

ఇది 2020లో కనిపించాల్సిన దృశ్యం కాదు. ఎందుకంటే ఈ ఉత్సవం జరుగుతున్నది ఎక్కడో కాదు. కోవిడ్‌-19కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరంలో. అది ఓ వీకెండ్‌ ఫెస్ట్‌.

వూహాన్‌లోని మయా వాటర్‌పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోవిడ్‌-19 వైరస్‌ గురించి ఏమాత్రం భయపడుతున్నట్లు కనిపించ లేదు. ప్రపంచం వైరస్‌తో పోరాడుతున్న సమయంలో ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి.

వుహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్టీలో పాల్గొన్నవారికి మాస్కులు లేవు, భౌతికదూరం పాటించలేదు

ఈ ఏడాది జనవరిలో వూహాన్‌లో కనిపించిన దృశ్యాలకు, ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలకు పొంతనే లేదు. అప్పట్లో లాక్‌డౌన్‌కు నర మానవుడుగానీ, వాహనాలుగానీ రోడ్ల మీద కనిపించ లేదు.

ఏప్రిల్‌లో అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. మే నెల నుంచి వూహాన్‌లోగానీ, ఈ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోగానీ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

క్రమక్రమంగా సాధారణ స్థాయికి

జనవరి 23 నుంచి వూహాన్‌ నగరం నిరవధిక లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఆ నగరంలో 400 మందికి సోకిన వైరస్‌ 17మందిని బలి తీసుకుంది.

మనుషుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతోందని చైనా ప్రభుత్వం ప్రకటించి అప్పటికి వారం రోజులైంది. అప్పటివరకూ ఆ సంగతి నిరూపణ కాలేదు.

వుహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌ సందర్భంగా వూహాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి.

కోటిమందికి పైగా జనాభా ఉన్న ఈ నగరానికి మిగిలిన చైనాతో సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి. ఆ తర్వాత కొన్నినెలలపాటు వేలమందికి టెస్టులు నిర్వహించి అనుమానం ఉన్న వారిని క్వారంటైన్‌లో పెట్టారు. సభలు, సమావేశాలు, ఉత్సవాలు అన్నింటినీ నిషేధించారు.

మార్చి నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం మొదలు పెట్టారు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కో వ్యక్తి రెండు గంటలపాటు బైటికి రావడానికి అనుమతించారు.

షాపింగ్‌ మాళ్లు తెరుచుకోవడం ప్రారంభించాయి. ప్రజారవాణా వ్యవస్థలు పని చేయడం మొదలు పెట్టాయి. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం నిబంధనలు పాటించడం ఇప్పటి వరకు కఠినంగా అమలవుతూ వచ్చాయి.

వూహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌ సడలించడంలో యువకులు పెళ్లిళ్లు చేసుకోడానికి ఎగబడ్డారు

ఏప్రిల్‌ 8న వూహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ను అధికారికంగా ఎత్తివేశారు. అప్పటి వరకు వాయిదా పడిన పెళ్లిళ్లు జరిగాయి. స్కూళ్లు తెరుచుకున్నాయి. వ్యాపారాలు యథావిధిగా సాగడం ప్రారంభించాయి. సామాన్య జీవనం గాడిన పడింది.

మేలో తిరిగి స్కూళ్లకు రావడం మొదలుపెట్టిన విద్యార్ధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేలో తిరిగి స్కూళ్లకు రావడం మొదలుపెట్టిన విద్యార్ధులు

కానీ మే 12న కొత్తగా ఆరు వైరస్‌ కేసులు బైటపడ్డాయి. దీంతో నగరంలోని కోటీ 10లక్షల మందికి టెస్టులు నిర్వహించాలన్న ప్రణాళికలను అధికారులు బైటికి తీశారు.కొద్దిరోజులకే ఈ మహమ్మారి మళ్లీ అదుపులోకి వచ్చింది.

జూన్‌ నాటికి రాత్రిపూట మార్కెట్లు తెరవడానికి అనుమతించారు. వీధుల వెంట చిన్నషాపులు తెరుచుకున్నాయి.

జులై నాటికి వూహాన్‌తోపాటు చైనాలోని పలు ప్రాంతాలలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. చాలాచోట్ల సినిమా హాళ్లు తెరుచుకున్నాయి.

కొన్ని పార్కులు, లైబ్రరీలు, మ్యూజియంలను సగంమందిని అనుమతిస్తూ తెరవడానికి అనుమతులు వచ్చాయి. ఉత్సవాలకు, పండగలు కూడా మొదలయ్యాయి.

మే నెలలో వూహాన్‌లోని ఓ సినిమా హాల్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మే నెలలో వూహాన్‌లోని ఓ సినిమా హాల్‌

ఈరోజు వూహాన్‌ నగరంలో పరిస్థితులు వైరస్‌కు ముందునాటి పరిస్థితుల్లాగా మారిపోయాయి. వీకెండ్స్‌లో జరిగే హోహా వాటర్‌ ఎలక్ట్రికల్ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్న వారి చిత్రాలను చూస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. ఎక్కువమంది ఆకర్షించడానికి నిర్వాహకులు మహిళలకు సగం ధరకే టిక్కెట్‌లను ఆఫర్‌ చేశారు.

మయా వాటర్‌ పార్క్‌ను నిర్వహిస్తున్న వూహాన్‌ హ్యాపీవ్యాలీ అనే సంస్థ ఈపార్క్‌ను జూన్‌ 25 నుంచే తెరిచింది. ఆగస్టు మొదటి వారం నుంచి జనం పెరగడం ప్రారంభించారని సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ పుట్టిల్లు వూహాన్‌ నగరంలో అంబరాన్నంటుతున్న సంబరాలు

వీకెండ్స్‌లో ఈ పార్కుకు సుమారు 15,000మంది సందర్శకులు వస్తున్నారు. అయితే గత సంవత్సరం ఇదే రోజుల్లో ఇందులో సగంమంది మాత్రమే వచ్చారని యాజమాన్యం తెలిపింది.

వూహాన్‌ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో జనం చేరి ఇలా ఉత్సవాలు జరుపుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేకమంది యూజర్లు చైనా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కూడా ఇలాంటి కామెంట్లు కనిపించాయి.

వూహాన్

ఫొటో సోర్స్, Getty Images

వూహాన్‌ నగరంలో మే మూడో వారం నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. నగరంలోని దాదాపు 99 లక్షలమందికి టెస్టులు పూర్తి చేశారు. పండగలు, ఉత్సవాలు జరుగుతున్నాయి.

"నగరంలోని మెజారిటీ ప్రజలకు టెస్టులు చేసినప్పటికీ వైరస్‌వ్యాప్తి ప్రమాదం ఇంకా ఉంది'' అని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలోని అంటువ్యాధుల విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంజయ సేనా నాయకే అన్నారు.

"మనం ఇంకా కోవిడ్‌-19 మహమ్మారిని పారదోలలేదు. అది జరగడానికి చాలాకాలం పడుతుంది. విదేశాల నుంచైనా, మరెక్కడి నుంచైనా ఇది మళ్లీ మళ్లీ రావడానికి అవకాశం ఉంది'' అని సేనానాయకే బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్ తర్వాత వూహాన్ ఎలా కోలుకుందంటే...

ఇందుకు న్యూజీలాండ్‌ను ఆయన ఉదాహరణగా చూపించారు. గతవారం కొత్త కేసులు నమోదు కావడానికి ముందు మూడు నెలలపాటు ఆ దేశంలో ఒక్కకేసు కూడా నమోదు కాలేదని సేనానాయకే గుర్తు చేశారు. "10-20% మంది వ్యక్తులు 80%మందిలో వ్యాధి వ్యాప్తికి కారణమవుతారని లండన్‌లో తయారైన ఒక పరిశోధన తేల్చింది'' అని ఆయన అన్నారు.

"ఇలా ఎక్కువమంది ఒక్కచోట గుంపుగుంపులుగా చేరినప్పుడు చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక్కరికి వైరస్‌ ఉన్నా అంతా ఇబ్బందుల్లో పడినట్లే'' అని అన్నారాయన.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 2కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కొరియాలాంటి దేశాలలో కూడా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి.

ఇలా గుంపులుగా చేరి పండగలు చేసుకోడానికి మిగిలిన దేశాలకు చాలా సమయం పట్టేలా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)